Saturday, July 11, 2015

ppc . nellore

ప్రజావైద్యానికి ఒరవడి దిద్దిన ''డాక్టర్‌ రామ్‌''

Posted On Fri 10 Jul 23:32:50.063557 2015
                        ఆయన ప్రారంభించిన ఆసుప్రతికి ''ప్రజావైద్యశాల'' అని పేరు పెట్టారు. అనతి కాలంలోనే ఆయన రోగుల, ప్రజల మనసులను, హృదయాలను గెలుచుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులలో పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు, అంటువ్యాధులు అధికంగా ఉండేవి. యాంటీ బయోటిక్స్‌ అందుబాటులో లేని రోజుల్లో ఆయన వైద్య వృత్తిని ప్రారంభించారు. ప్రజావైద్యం అంటే ఆధునిక శాస్త్ర విజ్ఞాన వినియోగానికి వ్యతిరేకం అనే భావన ఉంది. కానీ డాక్టర్‌ రామ్‌ యాంటి బయోటిక్స్‌ అందుబాటులోకి వచ్చాక జబ్బులను నయం చేయటానికి వాటిని చాలా మెళకువతో వాడారు.

లోకంలో అనేక మంది పుడుతూ, చనిపోతూ ఉంటారు. ఎక్కువ మందిని మరణించిన కొద్ది కాలానికే మరచిపోతాం. చాలా కొద్దిమందిని మాత్రమే ఎల్ల కాలం గుర్తుంచుకుంటాం. ఎవరిని ఎల్ల కాలం గుర్తుంచుకుంటాం అనేది జీవితంలో వారు చేసిన పనులపై ఆధారపడి ఉంటుంది. అలా ఎల్లకాలం స్మరించుకునే వ్యక్తులతో డాక్టర్‌ రామ్‌ ఒకరు. మిత్రులు, అభిమానులు, అశేష ప్రజానీకం డాక్టర్‌ రామ్‌ అని పిలిచే డాక్టర్‌ పుచ్చలపల్లి వెంకట రామచంద్రారెడ్డి 1915 జనవరి 21న నెల్లూరు జిల్లా అలగానిపాడు అనే మారుమూల గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య తమ్ముడు. డాక్టర్‌ రామ్‌ ధీరోదాత్తమైన జీవితాన్ని గడిపారు. ఆయన సోదరుడు సుందరయ్య సలహా మేరకు మద్రాసులో వైద్య విద్యనభ్యసించారు. ఒక మంచి విద్యార్థిగా రాణించారు. నిపుణుడైన వైద్యుడుగా కళాశాల నుంచి బయటకు వచ్చారు. వ్యాధి నిర్థారణలోనూ, శస్త్ర చికిత్స చేయటంలోనూ ఆయనకు ఆయనే సాటి.
వైద్య విద్య పూర్తయిన తరువాత నెల్లూరు పట్టణంలో వైద్య వృత్తిని 1940లో ప్రారంభించారు. ఆధునిక వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన ప్రారంభించిన ఆసుప్రతికి ''ప్రజావైద్యశాల'' అని పేరు పెట్టారు. అనతి కాలంలోనే ఆయన రోగుల, ప్రజల మనసులను, హృదయాలను గెలుచుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులలో పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు, అంటువ్యాధులు అధికంగా ఉండేవి. యాంటీ బయోటిక్స్‌ అందుబాటులో లేని రోజుల్లో ఆయన వైద్య వృత్తిని ప్రారంభించారు. ప్రజావైద్యం అంటే ఆధునిక శాస్త్ర విజ్ఞాన వినియోగానికి వ్యతిరేకం అనే భావన ఉంది. కానీ డాక్టర్‌ రామ్‌ యాంటి బయోటిక్స్‌ అందుబాటులోకి వచ్చాక జబ్బులను నయం చేయటానికి వాటిని చాలా మెళకువతో వాడారు. అలాగే వ్యాధి నిరోధక టీకాలను విస్తృతంగా ప్రచారం చేసి వాటిపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించారు. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ప్రతి సాంకేతిక పురోభివృద్ధిని రోగుల బాగుకోసం వాడారు. ఆయన దృష్టిలో ప్రజావైద్యం అంటే ఆధునిక వైద్యాన్ని, దానిలో అన్ని రకాలుగా వచ్చే పురోభివృద్ధిని ప్రజలందరికీ అందుబాటులోకి తేవటం. వ్యక్తిగత సంపాదన, ఆస్తులకు ఆయన వ్యతిరేకం కావడం వల్ల 1953లో ప్రజావైద్యశాలను ఒక ట్రస్టు నడిపే ఆసుప్రతిగా మార్చి ఒక కమిటీని ఏర్పరచి దాన్ని రిజిష్టరు చేశారు. ఆయన, ఇతర వైద్యులు, వైద్యేతర సిబ్బంది జీతాలు మాత్రమే తీసుకునేవారు. నెల్లూరు డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల ఇప్పటికీ అలాగే నడుస్తున్నది. ఇది దేశంలోనే ఒక నూతన ప్రయోగమని చెప్పవచ్చు.
ఆ రోజుల్లో కలరా, అతిసార వ్యాధి, మశూచి, తట్టు, అమ్మవారు వంటి అంటువ్యాధులు ఊళ్ళకు ఊళ్ళను కబళించేవి. అలాంటి పరిస్థితులలో డాక్టర్‌ రామ్‌, అంకితభావం గల ఆయన సహచర వైద్యులు, వైద్యేతర సిబ్బంది గ్రామాలకు వెళ్ళి అక్కడే ప్రజలతో పాటే ఉండి వైద్యం, పరిచర్యలు చేసేవారు. కుటుంబ సభ్యులు కూడా వ్యాధి బారినపడిన వారిని వదిలేసి ప్రాణరక్షణకు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్‌ రామ్‌, ఆయన సిబ్బంది ఆ రోగు లతోనే ఉండి, స్థానికంగా అందు బాటులో ఉన్న వనరులతో సెలైన్‌ తయారు చేసి రోగులకు ఎక్కించి వారికి సపర్యలు చేసి వారిని రక్షించి మిగతా ప్రజలకు ధైర్యం కలిగిం చేవారు. ఆయన వైద్యం, వైద్యులు, వైద్యశాస్త్రం చుట్టూ ఉన్న అపోహలను తొలగించారు. ప్రాథ మిక వైద్యం అందించడానికి, ప్రథమచికిత్స చేయడానికి కాలేజీలోనే చదవాల్సిన అవసరం లేదని నిరూపించారు. వందలాది మందికి ప్రథమచికిత్స చేసి తద్వారా ప్రాణ రక్షణ చేయడంలోని మెళకువలు నేర్పించారు. ఎక్కువగా ఉపాధ్యాయులకు, యువకులకు, సాంఘిక కార్యకర్తలకు ఆయన ప్రథమచికిత్స నేర్పించారు. తద్వారా వేలాది ప్రాణాలను రక్షించగలిగారు. ప్రజావైద్యశాలలోని వైద్యేతర సిబ్బందికి కూడా ఆ మెళకువలు నేర్పించేవారు. వారంతా సమాజానికి ఉపయోగపడతారని ఆయన భావన. అదే విధంగా శిక్షణ కోసం ప్రజావైద్యశాలలో చేరిన వైద్యులకు, సిబ్బందికి, సామాజిక కార్యకర్తలకు ఈ అంశాలపై అవగాహన కలిగించేవారు. ఆయన వద్ద తర్ఫీదు పొందిన వైద్యులు, తదనంతరం ప్రజావైద్యశాలలో తర్ఫీదుపొందిన వైద్యులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో డాక్టర్‌ రామ్‌ ఆశయాలతో ప్రజావైద్యశాలలను స్థాపించి ప్రజలకు వైద్యసేవలను అందించటం మనం చూస్తున్నాం. యంబిబియస్‌ పట్టాతో బయటకు వచ్చిన యువ వైద్యులకు శస్త్రచికిత్స, రోగ నిర్థారణ, ప్రసూతి వైద్యం మొదలైన అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చి వారు ధైర్యంగా తమ తమ ప్రాంతాలలో వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేయగలిగేట్లు తయారు చేయటం ప్రజావైద్యశాల ప్రత్యేకత.
ఆయన చిన్న వయస్సులోనే వచ్చిన మధుమేహ వ్యాధి, దానికి సంబంధించిన సమస్యల వల్ల 52 సంవత్సరాల చిన్న వయస్సులోనే 1967లో మరణించారు. ప్రజావైద్యం ఒరవడి ఒక గొప్ప యోధుడిని కోల్పోయింది. కానీ ఆ ఒరవడి కొనసాగుతున్నది. డాక్టర్‌ రామ్‌ మరణానంతరం ప్రజావైద్యశాల పేరును ఆయన గౌరవార్థం ''డాక్టర్‌ పివి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల''గా ఆసుపత్రి ట్రస్టు కమిటీ మార్చింది. 1940లో 20 పడకల ఆస్పత్రిగా డాక్టర్‌ రామ్‌ ప్రారంభించిన ప్రజావైద్యశాల నేడు 250 పడకల ఆస్పత్రిగా ఎదిగింది. సొంత భవనాలు సమకూర్చుకుంది. సాంకేతికంగా కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంకా ఎదగవలసింది చాలా ఉంది. ఆయన మరణం తరువాత డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి, డాక్టర్‌ జెట్టి వింధ్యావళి, డాక్టర్‌ సి రమణారెడ్డి, డాక్టర్‌ జెట్టి ప్రభాకర్‌ రెడ్డి అనుభవజ్ఞమైన నాయకత్వంలో ప్రజావైదశాల కొనసాగింది. 2008లో డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి మరణం తరువాత ప్రజావైద్య ఒరవడిని ప్రస్తుత ఆసుపత్రి కమిటీ కొనసాగిస్తున్నది. దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే కృషిచేస్తున్నది.
2015 సంవత్సరాన్ని డాక్టర్‌ రామచంద్రారెడ్డి శతజయంతి సంవత్సరంగా జరుపుకుంటున్నాము. దాని అర్థం కేవలం ఇది ఏదో ఆయన గొప్పతనాన్ని కీర్తించటానికి కాదు. ఆయన కార్యరూపం ఇచ్చిన ప్రజావైద్య ఒరవడిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన నమ్మిన విలు వలను, సిద్ధాంతాలను, ఆశయాలను స్మరించుకుని మనకు మనం వాటికి అంకితమవ్వడానికి, ఈతరం వైద్యులకు ఆ విషయాలను తెలియజేయడానికి డాక్టర్‌ రామ్‌ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా రేపు (2015 జూలై 12 ఆదివారం నాడు) నెల్లూరులో 'ప్రజారోగ్య పరిరక్షణ' అనే అంశంపై ఒక సెమినార్‌ జరుగుతున్నది. వైద్యం రోజు రోజుకూ కార్పొరేటీకరణ చెంది ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్న నేటి తరుణంలో డాక్టర్‌ రామ్‌ శతజయంతి సంవత్సర ఉత్సవాలకు, ఈ సెమినార్‌కు ఎంతో విలువ ఉంది.
(వ్యాసకర్త నెల్లూరులోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సూపరింటెండెంట్‌, ట్రస్టు కమిటీ కార్యదర్శి) 1915-2015 శత జయంతి సంవత్సరం
డాక్టర్‌ పి అజయ్‌కుమార్‌
Taags :

No comments:

Post a Comment