Monday, July 20, 2015

vyasam. prajasakti

స్వచ్ఛ భారత్‌లో స్కాంల పర్వం

Posted On Mon 20 Jul 23:25:24.303095 2015
                    ఇటీవల వెలుగులోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుంభకోణాలు బిజెపిని బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న భారీ వ్యాపం కుంభకోణం, లలిత్‌మోడీ కుంభకోణం, శృతి ఇరానీ లాంటి వారి విద్యార్హతలకు సంబంధించిన సమస్యలు బిజెపికి గుబులుపుట్టిస్తున్నాయి. బిజెపి నేతలు కుంభకోణాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అవినీతిలేని పాలన అందిస్తామని బిజెపి నాయకులు ఊదరగొట్టారు. కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. వ్యాపం స్కామ్‌లో ఆ పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు భాగస్వామ్యం ఉందంటూ వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్‌ వృత్తి పరీక్షల బోర్డు ద్వారా ప్రభుత్వోద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి, అక్రమాలే వ్యాపం కుంభకోణం. సుమారు 48 మంది నిందితుల, సాక్షుల అనుమానాస్పద మరణాలు అంతుచిక్కని రహస్యంగా మారింది. ఐపిఎస్‌ మాజీ అధిపతి లలిత్‌మోడీ వివాదంలో రాజస్థాన్‌ ముఖ్య మంత్రి వసుందరాజ్‌ మరింతగా కూరుకుపోయారు. మహారాష్ట్ర రాజకీయ రంగంలో ప్రస్తుత రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండేపై రూ.206 కోట్ల అవినీతి ఆరోపణ చర్చినీయాంశమైంది. పంకజా ముండే కుంభకోణం రేపిన దుమారం సద్దుమణగక ముందే విద్యాశాఖ మంత్రి వినోద్‌ తాపడే అవినీతి రొచ్చులో దిగబడినట్లు వార్తలు వస్తున్నాయి. తాప్‌డే రూ.191 కోట్ల కొనుగోలు స్కామ్‌లో ఇరుక్కు పోయారు. అగ్నిమాపక పరికరాల కొనుగోలు కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా తన ఆశ్రితులకు కట్టబెట్టినట్లు తాపెడేపై ఆరోపణలు న్నాయి. హోంశాఖ సహాయ మంత్రి రణజిత్‌ పాటిల్‌కు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న విషయం మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులున్నా యని ఆరోపణ. తన మంత్రి వర్గంలోని మంత్రులపై అభియోగాలు వచ్చినా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ చాలా నిర్లిప్తంగా ఉన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఆయన సమాధానం చెప్పడం లేదు. అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆయన వారిని నిర్దోషులుగా ప్రకటించారు. కేంద్రంలో మోడీ ఎలా ప్రవర్తిస్తున్నారో అదే దారిలో మహారాష్ట్ర సిఎం ప్రవర్తిస్తున్నారు. మరోవైపు బీహార్‌ రాష్ట్రవ్యాప్తంగా పాట్నా న్యాయవాదులు జులై 15న క్రింది స్థాయి న్యాయవ్యవస్థలో అవినీతి విశృంఖలంగా పేరుకుపోవడంతో రాష్ట్ర విజిలెన్స్‌ కమిటీని అనుమ తించాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇటీవల వివా దాల్లో చిక్కుకున్న సిఎంలపైనే పత్రిపక్షాలు గురిపెట్టే అవకాశం కనిపిస్తోంది. జులై 21 నుంచీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌ సిఎం వసుంధరా రాజే, రమణసింగ్‌లపై వచ్చిన అవినీతి ఆరోపణలు, స్కామ్‌లను ఎత్తిచూపుతామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. మోడీ మంత్రివర్గంలో 16 మంది మంత్రులు వివిధ రకాల తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ అవినీతిలో కూరుకు పోయిన ఈ స్వచ్ఛ భారతీయులు ఏ రకమైన స్వచ్ఛ భారత్‌ను నిర్మించగలరు? ఈ స్కామ్‌లు, వివాదాలు, వ్యాపం కుంభకోణంలో ప్రధాని మోడీ మౌనంగా ఉంటున్నారు. ఉలుకూపలుకూ లేదు. ఈ ముఖ్య మంత్రులపై చర్యలు తీసుకుం టామని బిజెపి నుంచి ఎలాంటి సంకేతం వెలువడ లేదు. సిఎంల అంశాలే కాకుండా లలిత్‌మోడీ వీసా వ్యవహారంలో విదేశాంగ మంతి సుష్మాస్వరాజ్‌, విద్యార్హత విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృతి ఇరానీలపై కూడా పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశముంది.
రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందిస్తానని ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఓటుకు నోటు వ్యవహారంలో మనీలాండరింగ్‌ను ప్రోత్సహించడం నీతివంతమైన పాలన ఎలా అవుతుంది. ఆదర్శంగా ఉండాల్సిన పాలకులు స్వార్థ ప్రయోజనాలకు పాల్పడుతున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన నరేంద్రమోడీ, చంద్రబాబు అధికారంలోని వచ్చిన తరువాత వాటిని విస్మరించి కార్పొరేట్‌ కంపెనీలకు సదా మీసేవలో అన్నట్లుగా ఊడిగం చేస్తున్నారు. రాజధాని పేరుతో పేద రైతులు సాగుచేసుకుంటున్న పట్టా భూములతోపాటు అటవీ, బంజరు భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోంది. అవినీతిని రూపుమాపుతామని ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. నిజాయితీ ముసుగు కాస్తా ఏడాది పాలనలోనే తొలగిపోయింది.
- పి చైతన్య
(రచయిత సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు

No comments:

Post a Comment