Sunday, July 26, 2015

vyasam. ap.jyoti

ప్రభుత్వ రంగ సంస్కరణలేవీ? (18-Jul-2015)

‘మొదటి తరం సంస్కరణలు వ్యాపార పారిశ్రామిక రంగాలపై ప్రభుత్వ నియంత్రణలను తొలగించాయి. గణనీయమైన వృద్ధిరేట్లు సాధించాయి. ప్రభుత్వ రంగ సంస్థల నాణ్యత, సామర్థ్యంపై మనం ఇప్పుడు దృష్టిని పెట్టాల్సిన అవసరం ఉన్నది’- 2009లో సార్వత్రక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ ప్రముఖ ఆర్థిక వేత్త రాకేష్‌ మోహన్‌ బెంగళూరులో చేసిన ఒక ప్రసంగం సారాంశమది.
 
2009లో యూపీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ తన మంత్రిమండలిపై ప్రభావశీల నియంత్రణను ఇంకా కలిగివున్నారు. ‘రెండో తరం సంస్కరణల’ గురించి అందరూ మాట్లాడుతున్న తరుణమది. ఆర్థిక సంస్కరణలతో భారత్‌ శీఘ్రగతిన అద్భుతమైన ఆర్థికాభివృద్ధిని సాధించిందని, గతంలో విదేశీ మదుపులకు అనుమతినివ్వని మల్టీబ్రాండ్‌ రిటైల్‌, రక్షణ ఉత్పత్తుల రంగాలలోకి గ్లోబల్‌ పెట్టుబడులను ఆహ్వానించాలని, కార్మిక చట్టాలను సరళీకరించాలని, ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టించాలని పలువురు వాదించారు.
 
అయితే ఈ విధాన సంస్కరణల అమలుకు యూపీఏ ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టలేదు. ఆవశ్యక మలి సంస్కరణల విషయమై ఆశలు క్రమేణా ఆవిరైపోయాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ ఆ ఆశలు చిగురించాయి. గుజరాత్‌లో ఆర్థిక సంస్కరణలను సమర్థంగా అమలుపరిచిన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడంతో రెండో తరం సంస్కరణలు సత్వరమే అమలవుతాయని వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆశించాయి.
 
రెండో తరం సంస్కరణలు ఏమిటి? వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికరంగాలపై ప్రభుత్వ నియంత్రణలను ఎటువంటి మినహాయింపు లేకుండా తొలగించడమేనని 2009లో భావించారు. 2015లోనూ అదేవిధంగా భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు ఇప్పటికీ ఆలంబనగా ఉన్న ప్రభుత్వరంగాన్ని సంస్కరించేందుకు అప్పుడూ, ఇప్పుడూ కూడా ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఈ నేపథ్యంలో రాకేష్‌ మోహన్‌ ప్రసంగ పాఠాన్ని నేను మరో సారి శ్రద్ధగా అధ్యయనంచేశాను. ఆయన వాదనలను క్లుప్తంగా వివరిస్తాను.
 
మొదటితరం సంస్కరణలు ప్రభావశీలమైన ఫలితాలను సాధించాయని అంగీకరిస్తూ రాకేష్‌ మోహన్‌ తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా ఆరు వేర్వేరు ప్రభుత్వాలు ప్రైవేట్‌ రంగంపై ప్రభుత్వ నియంత్రణలను తొలగిస్తూ వచ్చాయి. తత్ఫలితంగా శీఘ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమై పేదరికం తగ్గిందని, విదేశీమారక ద్రవ్య నిల్వల సంక్షోభం గతించిపోయిన విషయమయిందని ఆయన అన్నారు. వృద్ధిరేట్లు మరింతగా పెరిగేందుకు ప్రభుత్వ రంగం పనిచేసే విధానాన్ని ఇతోధికంగా మెరుగుపరచాలని రాకేష్‌ మోహన్‌ అన్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగం ప్రజలకు సమకూర్చని సేవలను అందరికీ అందుబాటులో ఉంచడమే గాక అవి నాణ్యమైనవిగా ఉండేలా శ్రద్ధ చూపవల్సిన అవసరముందని ఆయన అన్నారు. ప్రభుత్వ సేవలు నాణ్యంగాలేని నాలుగు రంగాలను ప్రస్తావిస్తూ ఆ రంగాలలో పరిస్థితులను మెరుగుపరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి మొత్తంగా ఇతోధిక మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ‘తన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రైవేట్‌ రంగానికి మొదటితరం సంస్కరణలు సాధికారత కల్పించాయి. సమాజంలోని అన్ని వర్గాల వారు లబ్ధి పొందేలా ప్రజోపయోగ వస్తువులు, సేవలను అందించడమే రెండో తరం ఆర్థిక సంస్కరణల లక్ష్యంగా ఉండాలని’ రాకేష్‌ మోహన్‌ అన్నారు.
 
ఆయన ప్రస్తావించిన నాలుగు రంగాలలో మొదటిది వ్యవసాయం. గ్రామీణ ఉపాధిహామీ లాంటి పేదరికం నిర్మూలనా కార్యక్రమాల అవసరాన్ని అంగీకరిస్తూనే ద్వితీయ హరిత విప్లవాన్ని సాధించడం చాలా ముఖ్యమని రాకేష్‌ మోహన్‌ నొక్కి చెప్పారు. పాడి పరిశ్రమ, తోటల సాగు, కోళ్ళ పెంపకం, మత్స్య రంగాలలో ఉత్పాదకతను, ఆదాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
 
రెండోరంగం పట్టణాభివృద్ధి. భారత్‌ త్వరలోనే అత్యధిక పట్టణ జనాభా గల దేశంగా రూపొందనున్నది. అయినా చిన్న పట్టణాలు, మహానగరాలలో ప్రజలు గృహవసతి, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం విషయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ రవాణా సేవలు (బహుశా, ఢిల్లీలో మినహా) ఎల్లెడలా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. నగరాలు, పట్టణాల నిర్వహణలో భారతదేశం ఘోరంగా విఫలమయిందని రాకేష్‌ మోహన్‌ అన్నారు. మన నగరాలు, పట్ణణాలు అన్ని విధాల ఆవాసయోగ్యంగా మారాలంటే మునిసిపాలిటీలు నేరుగా ఓటర్లకు బాధ్యత వహించేలా చేయాలని ఆయన అన్నారు. తమకు అవసరమైన ఆర్థిక వనరులను సొంతంగా సమకూర్చుకునే సాధికారతను మునిసిపాలిటీలకు కల్పించడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
 
మూడో రంగం మానవ వనరుల అభివృద్ధి. దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక విద్యా వ్యవస్థలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఎ.ఎస్‌.ఇ.ఆర్‌. నివేదికలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. నిధుల కొరత తీవ్రంగా ఉన్న మన విశ్వవిద్యాలయాలలో రాజకీయాల ప్రమేయం మితిమీరిపోయింది. 8 శాతం వార్షిక వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించాలంటే మన విద్యా వ్యవస్థ-ప్రాథమిక, మాధ్యమిక, వృత్తి విద్య, ఉన్నత విద్య-ను సంపూర్ణంగా పునర్వ్యవస్ఖీకరించుకోవల్సిన అవసరముందని రాకేష్‌ మోహన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించేవారు ఎవరూ ఉండరు.
 
ప్రభుత్వ రంగ నిర్వహణ నాలుగో అంశం. విద్య, విద్యుత్తు, రవాణా, శాంతి భద్రతల పరిరక్షణ మొదలైనవి రాష్ట్ర జాబితా లోని అంశాలు. అయితే విద్యుత్‌ బోర్డులు, బస్‌ కార్పొరేషన్లు, విమానాశ్రయాలు, రైల్వేబోర్డులు, పోలీసు, న్యాయవ్యవస్థలలో పనిచేసేవారు సరైన శిక్షణ లేని వారుగా ఉంటున్నారు. విధుల నిర్వహణా సామర్థ్యం కొరవడిన వీరు ప్రజలకు జవాబుదారీగా మాత్రం ఎలా ఉంటారు? ప్రతిభావంతులు ప్రైవేట్‌రంగంలో పనిచేయడానికే మొగ్గుచూపడం ఎంతైనా దురదృష్టకరమని రాకేష్‌ మోహన్‌ అన్నారు. ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని ఆయన అన్నారు. పాలనా వ్యవస్థ ఉన్నత స్థాయిల్లో వృత్తినిపుణుల ప్రవేశాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాయింట్‌ సెక్రటరీ, ఆ పై స్థాయి పోస్టులను సివిల్‌ సర్వీస్‌ అధికారులతో కాక వృత్తినిపుణులతో భర్తీ చేయడం చాలా ముఖ్యం. యూపీఏ ప్రభుత్వ హయాంలో యూఐడీఏఐ చైర్మన్‌గా నందన్‌ నీలేకని, రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా రఘరామ్‌ రాజన్‌ను నియమించారు. సంప్రదాయక ప్రభుత్వాధికారులు కాని ఈ ప్రతిభావంతులు తమ బాధ్యతలను ఎంత సమర్థంగా నిర్వహిస్తుందీ మనకు తెలుసు. దురదృష్టవశాత్తు అటువంటి నియామకాలు అంతటితోనే నిలిచిపోయాయి.
 
ఈ నాలుగు రంగాలతో పాటు ఐదో రంగాన్ని కూడా రాకేష్‌ మోహన్‌ క్లుప్తంగా ప్రస్తావించారు. అది ఆరోగ్యం. అయితే ఈ రంగంలో తనకు వృత్తి పరమైన నైపుణ్యం కాని, పాలనానుభవం కాని లేకపోవడంతో వివరంగా మాట్లాడలేనని ఆయన అన్నారు. నేను ఆరో రంగం గురించి ప్రస్తావించదలుచుకున్నాను. అది పర్యావరణ సుస్థిరత. నీరు, వాయు కాలుష్యం, భూగర్భ జలాలు, భూసారం తగ్గిపోవడం అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంపై ఇవి విషమ ప్రభావాన్ని చూపుతున్నాయి. వారి జీవనోపాధులను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. దేశ భద్రత, సుస్థిరతకు కూడా ఇవి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. మార్కెట్‌ ఆర్థిక విధానం పర్యావరణ సమస్యలను పరిష్కరించలేదనేది అందరూ అంగీకరించే విషయమే. కనుక పర్యావరణ రక్షణకు పటిష్ఠ, ప్రభావశీల ప్రభుత్వరంగం ఎంతైనా అవసరం. నిపుణులతో కూడిన స్వతంత్ర రెగ్యులేటరీ సంస్థలను ఏర్పాటు చేసినప్పుడే పర్యావరణసుస్థిరతకు దోహదం జరుగుతుంది.
 
రాకేష్‌ మోహన్‌ ఇంకా ఇలా అన్నారు: ‘ప్రభుత్వ పాలనా వ్యవస్థను సంస్కరించడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ సంస్కరణల విషయమై మరింత నిర్మాణాత్మక ఆలోచనలు చేయవలసిన సమయం ఆసన్నమయిందన్నది స్పష్టం’. అవును, ఆయన చెప్పింది పూర్తి నిజం. ఈ విషయమై యూపీఏ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా గానీ, మరే విధంగానైనా గానీ పెద్దగా ఆలోచించనే లేదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమైతే ఆ సంస్కరణల విషయమై అసలు ఆలోచిస్తున్నట్టే లేదు. ప్రైవేట్‌ రంగంపై నియంత్రణలను మరింతగా తొలగించే విషయం గురించి మాత్రమే వారు మాట్లాడుతున్నారు. అవీ ముఖ్యమే గానీ ప్రభుత్వరంగ సంస్కరణలు నిస్సందేహంగా అంతకంటే చాలా ముఖ్యమైనవి.
 
రాకేష్‌ మోహన్‌ ప్రసంగ పాఠం 2011లో ప్రచురితమైన ఆయన గ్రంథం ‘గ్రోత్‌ విత్‌ ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ’లో ఆఖరి అధ్యాయంగా ప్రచురితమయింది. ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారులు, నీతి ఆయోగ్‌ సభ్యులు, కేంద్ర కేబినెట్‌ మంత్రులు తప్పక చదవాలి. గౌర వనీయ మంత్రులు, అధికారులు ఆ వ్యాసాన్ని ఇప్పటికే చదివివుంటే మరొకసారి చదవాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొంటున్న విధాన నిర్ణయాలలో ఆ వ్యాసంలోని భావాలు వేటినీ చేర్చుకున్న దాఖలాలు కన్పించడం లేదు మరి.
 
- రామచంద్ర గుహ

No comments:

Post a Comment