సౌదీ-మధ్యప్రాచ్యం-ఇరాన్ అణు ఒప్పందం
Posted On Mon 20 Jul 23:26:11.906896 2015
ప్రపంచంలో 22 శాతం చమురు నిల్వలతో ద్వితీయ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా అంతర్జాతీయ రాజకీ యాలలో అమెరికా స్నేహితునిగా ఇప్పటి వరకు కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ సమీకరణల నేపథ్యంలో సౌదీ అరేబియాపై మూడు ప్రధాన అంశాలు ప్రభావం చూపుతున్నాయి. అవి, అంతర్జాతీయ చమురు నిల్వల ధరలు సగటున 58 డాలర్లకు పడిపోవటం, ఎమెన్‌పై యుద్ధం, సిరియా, ఇరాక్ యుద్ధాల ప్రభావం, ఇటీవల ఇరాన్‌తో కుదిరిన 5+1 అణు దేశాల ఒప్పందం. వీటన్నిటి వల్ల సౌదీ అరేబియాలో రాజకీయ, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా విదేశీ మారక నిల్వలు 73,700 కోట్ల డాలర్ల నుంచి 67,200 కోట్ల డాలర్లకు పడిపోవటం సౌదీని కలవరపెడుతున్నది. సౌదీ అరేబియా మానిటరీ ఫండ్ ఏజెన్సీ గవర్నర్ అయిన ఫహాడ్ అల్ ముబారక్ ''ఈ సంవత్సరం కావలసిన 3,870 కోట్ల డాలర్ల లోటును విదేశీ నిల్వల నుంచి వాడుకోనున్నాము. తద్వారా ఇప్పటి వరకు 13,000 కోట్ల డాలర్ల వరకు నిల్వలు వాడుకోవటం జరిగింది. యుద్ధాల కారణంగా జరుగుతున్న ఖర్చు, చమురు ధర పతనంతో ఏర్పడిన లోటును విదేశీమారక నిల్వలను వాడుకోవటం ద్వారా భర్తీ చేయవలసి వస్తోంది'' అని అన్నారు.
భారమవుతున్న సౌదీ యుద్ధ వ్యయం
ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా జిడిపిలో 10 శాతం పైగా యుద్ధ సామాగ్రికి ఖర్చుచేస్తున్న సౌదీ అరేబియాకు మోయలేని భారంగా ఉంది. గడచిన సంవత్సరంలో చేసిన 81 వందల కోట్ల డాలర్ల మిలిటరీ బడ్జెట్ మిక్కిలి భారమైంది. ప్రత్యామ్నాయ ఆదాయం పొందటానికిగానూ ప్రభుత్వపరంగా బాండ్లను విడుదలచేయవలసిన అవసరం ప్రస్తుతం ఏర్పడినట్లు తెలుస్తున్నది. ఎమెన్‌పై దాడికి ఉపయోగిస్తున్న 100 యుద్ధ విమానాల ఖర్చు నెలకు 17.5 లక్షల డాలర్లు అవుతుంది. తాజాగా అమెరికాతో జరుగుతున్న ఒప్పందాల ప్రకారం 30 వేల దళాలను ప్రత్యక్షంగా దింపితే సంవత్సరానికి 15 లక్షల కోట్ల డాలర్లు సౌదీకి భారంకానుంది. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను భరించాలంటే బారెల్ చమురు ధర 105 డాలర్ల స్థాయికి పెరిగితేనేగానీ వీలుకాదు. కానీ ప్రస్తుత తరుణంలో ఇది సాధ్యంకాదని అర్థమవుతోంది. దీనికి తోడు ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా తొందరలోనే ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా, వాణిజ్యరంగంలో ఇరాన్ తన చమురు నిల్వలను ప్రవేశపెట్టడం వలన ఈ సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనబడుతున్నాయి. 10 శాతం ప్రపంచ చమురు నిల్వలతో ఇరాన్ ప్రపంచంలో నాలుగో స్థానం ఆక్రమించింది.
కీలకమైన బాబ్-ఎల్-మనడెబ్ జలసంధి
అంతర్జాతీయంగా స్తంభించిన ఇరాన్ విదేశీ నిల్వలు 10,000 కోట్ల డాలర్లు రానున్న కాలంలో చలనంలోకి రావటం ద్వారా ఆ మొత్తాన్ని ఇరాన్ సిరియా, ఎమెన్, ఇరాక్‌లకు అందించి ప్రత్యామ్నాయ యుద్ధాన్ని ప్రోత్సహిస్తే, సౌదీ అరేబియాకు మరింత యుద్ధ ఖర్చులు పెరగగలవని అంచనా వేస్తున్నది. కనుక ''తాజా వ్యూహం ప్రకారం ఇరాన్ కోలుకునే లోగా తన యుద్ధ వ్యూహాన్ని వేగవంతం చేసి, ముందు ఎమెన్‌పై దాడిని మరింత ఉధృతంచేసి, ఎమెన్ ఆక్రమణ తరువాత సిరియాపై యుద్ధం చేయాలనే తపనలో సౌదీ ఉన్నట్లు అర్థమవుతుంది'' అని క్రిస్టియన్ సైన్స్ మోనిటర్ రక్షణ రంగ నిపుణుడు ముస్తాఫా అలానీ తెలియజేశారు. మధ్యప్రాచ్యంలో అతి ధనవంత దేశమైన సౌదీ అరేబియా అతి పేదరిక దేశం ఎమెన్‌పై చేస్తున్న యుద్ధానికి గల ప్రధానకారణం, కీలకమైన బాబ్-ఎల్-మనడెబ్ జలసంధిపై ఆధిపత్యం సంపాదించి మధ్యదరా సముద్రం, సూయజ్ కెనాల్ గుండా నౌకా రవాణాను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించడానికే. కానీ ఇదే ఆధిపత్యాన్ని ఇరాన్ కూడా కోరుకోవటం తథ్యం కనుక రానున్న కాలంలో మధ్యప్రాచ్యం మరలా విశిష్ట (యుద్ధ) ప్రాధాన్యత గైకొననుంది.
ప్రమాదం కానున్న సౌదీ-ఇజ్రాయిల్ బంధం
అణు ఒప్పందం, ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో ఇప్పటికే చాలాకాలం నుంచి సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ మధ్య రహస్య సమావేశాలు జరిగి కొన్ని ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. దాని ప్రకారం ఇరాన్‌పై ఇజ్రాయిల్ వాయుదాడిని జరపటానికి అనుకూలంగా సౌదీ అరేబియా మీదుగా గగనతలంలో యుద్ధ విమానాలు వెళ్లడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాలస్తీనా సమస్య మరింత జటిలమవుతూ మరుగున పడే ప్రమాదం ఉంది. మరొకవైపు ఇరాన్‌పై కుదిరిన ఒప్పందానికి వ్యతిరేకంగా అమెరికన్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ల వ్యతిరేకతను అధ్యక్షుడు ఒబామా చవిచూడాల్సి వస్తుంది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు బాహాటంగా వ్యతిరేకించారు.
అమెరికా రహస్య ఎజెండా?
అణు ఒప్పందం, ఆంక్షల ఎత్తివేతల వెనుక అమెరికా రహస్య ఎజెండా దాగి ఉండవచ్చు. 1) ఒకవైపు సౌదీ సున్నీలను మచ్చిక చేసుకుని అరబ్బు షియాలకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతూనే, ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ షియాలను బుజ్జగిస్తూ తన వైపుకు చేరదీసి సున్నీలకు వ్యతిరేకంగా ఉసిగొల్పే ద్వంద్వ నీతికి పాల్పడటం అమెరికాకు కొత్తేమీకాదు. 2) భౌగోళికంగా ఇరాన్‌తో స్నేహం వల్ల ఇరాన్, రష్యాల స్నేహ సంబంధాలను దూరం చేయించి రష్యాకు వ్యతిరేకంగా మధ్య ఆసియాలో అమెరికా స్థావరాల ఏర్పాటుకు వ్యూహ రచన చేయటం. 3) ఇప్పటికే సౌదీని యుద్ధ కూపంలోకి దింపిన అమెరికా ఇరాన్‌ను కూడా అదే తోవలోకి దింపి మధ్య ఆసియాలో రగులుతున్న రావణకాష్టం ద్వారా తన పబ్బం గడుపుకోవటం. 4) అమెరికా, యూరప్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌లో మిగులు విలువ ద్వారా పేరుకుపోయిన పెట్టుబడిని ఐఎంఎఫ్, యూరప్ సెంట్రల్ బ్యాంకుల ద్వారా విస్తరించేందుకు ఇరాన్‌లో చకచకా పావులు కదిపి, చౌకగా ముడిచమురును దిగుమతి చేసుకుని అధిక ధరలకు చమురు యంత్రాలను విక్రయించే వ్యూహం. ప్రస్తుతం జర్మన్ డిప్యూటీ ఛాన్సలర్, ఆర్థికమంత్రి సిగ్మర్ గాబ్రియెల్ ఆరుగురితో కూడిన అగ్ర మంత్రిత్వశాఖలతో జర్మనీ బ్యాంకుల ఛైర్మన్‌లు, పారిశ్రామికవేత్తల బృందంతో ఇరాన్ పర్యటనలో ఉండటం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఏదిఏమైనా చారిత్రాత్మక అమెరికన్ వ్యతిరేకతను ఇరాన్ ఏవిధంగా ముందుకు తీసుకుపోతుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ''రానున్న కాలంలో అమెరికా వ్యతిరేకతను కొనసాగిస్తాం'' అని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ ఇప్పటికే చెప్పకనే చెప్పారు. తద్వారా రష్యా, చైనా, ఇరాన్‌ల స్నేహం మరింత బలపడుతుందో, లేదో వేచి చూడాలి. ఈ తరుణంలో సౌదీ అరేబియా తీసుకునే నిర్ణయాల వల్ల మధ్యప్రాచ్యంలో కొత్తకొత్త కూటములు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
- బుడ్డిగ జమిందార్
(వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు)

Taags :
No comments:
Post a Comment