మహాపుష్కరం- మహా విషాదం
Posted On Wed 15 Jul 22:45:35.01743 2015
గోదావరి పుష్కరాల తొలి రోజే రాజమండ్రిలో తొక్కిసలాటలో 31 మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసి పోవడం అత్యంత విషాదకరం. బాధ్యులైవరైనప్పటికీ ఇది మానవ ఉమ్మడి వైఫల్యానికి ఖరీదైన మూల్యం. మన దేశంలో సామూహిక ఉత్సవాలెంత పురాతనమైనవో, సమూహ నిర్వహణలో మన వైఫల్యాలు అంతే ఘనమైనవి. కనుకనే ఒకదాని వెంట మరో విషాదాన్ని లెక్కపెట్టుకొనే పరిస్థితి. ఆపై విషాదాల నుంచి ఏమీ నేర్చుకోని ఉదాసీనత మన సంస్కృతిలో భాగమై కూర్చున్నది. గోదావరి పుష్కరాలకు మంచి ప్రచారం లభించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిధుల్ని బాగా కేటాయించింది. అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నట్టు భరోసా కల్పించింది. పైగా విపత్తు నిర్వహణలో అనుభవమున్న ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తూ మీడియాలో ఆహ్వానించారు. అందుకనే మారుమూల పల్లెల నుంచి కూడా భక్తులు గోదావరికి దారి పట్టారు. అయితే ఏం లాభం? సమూహ నిర్వహణలో మన వారి బేలతనం ప్రమాదకర స్థాయిలో అలాగే ఉంది. ఈ స్థాయిలో ప్రజలు ఒకేచోటకు చేరుతారన్నది అనూహ్యం కాదు. పైగా కేవలం వందల మంది గుమిగూడే చోటనే ఒకటి రెండు ప్రాణాలు పోవడం మనకు కొత్తకాదు. అలాంటప్పుడు లక్షలమంది గుమిగూడే సందర్భానికి తగిన ప్రిపరేషన్, ప్రణాళిక ఏ స్థాయిలో ఉండాలి? ఎంట్రీలోనే జనాల నియంత్రణ, సరైన మార్గదర్శనం చేసే వాలంటీర్ల ఏర్పాటు, వివిధ ఎగ్జిట్ మార్గాలు, గందరగోళ నివారణ పరిస్థితికి తగినట్టు చేసి ఉంటే ఈ విషాదం జరిగేది కాదు. ఇప్పుడు నేర్చుకున్న పాఠాలతో మిగతా 11 రోజులూ సరైన చర్యలు చేపట్టాలి. భక్తుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారకూడదనుకుంటే ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణా యంత్రాంగం సేవల్ని వినియోగించుకోవాలి.
- డాక్టర్ డివిజి శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా.
- డాక్టర్ డివిజి శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా.
No comments:
Post a Comment