Tuesday, July 21, 2015

news.prakasakti

రాజధానిలో అలజడి

Posted On 4 hours 11 mins ago
రాజధానిలో అలజడి
-  గజం కూడా వదులుకోం : మూడు గ్రామాల ప్రజలు
-  ఇతర పల్లెలకూ విస్తరిస్తున్న ఆందోళన 
-  నిరాశ్రయులుగా మారనున్న దళితులు 
-  సిపిఎం ఆధ్వర్యాన పెద్దఎత్తున ఆందోళన
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
           రాజధాని గ్రామాల్లో మాస్టర్‌ప్లాను అలజడి మొదలైంది. ఒక్క గ్రామాన్నీ తరలించబోమని ఇప్పటి వరకూ చెబుతున్న పాలకులు ప్లాను రాగానే సీడ్‌ క్యాపిటల్‌ నిర్మించాలంటే మూడు గ్రామాలను తరలించాల్సి ఉంటుందని ప్రకటించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఈ ప్రకటన చేయడంతో రాజధాని వ్యవహారంలో తొలినుండీ వ్యూహాత్మకంగా వ్యవహ రిస్తున్న ప్రభుత్వ పన్నాగాలు ఒక్కొక్కటిగా బయట కొస్తున్నాయి. ప్రజలు సహనం కోల్పోతు న్నారు. లింగాయపాలెం, ఉద్దండ్రాయుని పాలెం గ్రామాల్లో ధర్నాలకు దిగారు. పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. 'డబ్బున్నోళ్లు ఎక్కడన్నా బతుకుతారు. హైదరాబాద్‌, అమెరికాలో ఇళ్లు కట్టుకుంటారు ఏమీలేని మేమెక్కడికి వెళ్లాలి' అని ఆవేదన వ్యక్తం చేశారు. గజం స్థలం కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఇప్పటి వరకూ మంత్రులు పుల్లారావు, నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ గ్రామాలనుగానీ, దాని చుట్టుపక్కల స్థలాలను గానీ పట్టుకోబోమని చెప్పి నమ్మించారనీ, ఇక ముందు ఊరుకునేది లేదని చెప్పారు. మంగళ వారం మూడు గ్రామాల్లో ఆందోళన మొదలైనప్పటికీ అన్ని గ్రామాల్లో ప్రజల్లోనూ ఆందోళన తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకూ నమ్మించి స్థలాలిప్పించిన తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ తీవ్ర ఆందోళన మొదలైంది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆయా గ్రామాల ప్రజలు ఉన్న కొద్దిపాటి పనులకూ పోకుండా ఇంట్లోనే కూర్చుండి పోయారు. ఉద్దండ్రాయునిపాలానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఉపసర్పంచ్‌ సంసోను కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
తొలి ప్రభావం దళితులపైనే తొలిదశలో సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణానికి సంబంధించి తరలించే మూడు గ్రామాల్లో ఎక్కువమంది దళితులే ఉన్నారు. వారే నష్టపోనున్నారు. ఇతర సామాజికవర్గాలకు చెందినవారున్నప్పటికీ వారందరూ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నివాసాలేర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం చెబుతున్నదొకటి చేస్తున్నదొకటని ఆగ్రహం అన్ని గ్రామాల్లోనూ ఉంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్న లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెంలో దళితులకు సంబంధించి అసైన్డ్‌ భూముల వ్యవహారం ఇంకా తేల్చలేదు. సీడ్‌ క్యాపిటల్‌ ప్లాను రావడంతో అక్కడి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. తమకు ఎటువంటి పరిహారమూ ఇవ్వకుండా ఇక్కడ నుండి పంపించే ప్రక్రియ చేస్తున్నారని ఉద్దండ్రాయునిపాలెం లంక గ్రామానికి చెందిన ప్రకాశరావు తెలిపారు. మొత్తం రాజధానిలో తమ ప్రాంతమే కీలకమవుతుందని, తమ భూములు తీసుకోవాలని తొలి నుండీ చెబుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు తమను తరిమేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. వాస్తవంగా నెలరోజుల క్రితమే వారిని లంకల నుండి వెళ్లిపోవాల్సిందిగా క్రిడా అధికారులు ఆదేశించారు. అయినా వారు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఈ క్రమంలో ఆ మూడు గ్రామాలను తరలించడం వల్ల నిరాశ్రయులుగా మారే వారిలో ఎక్కువమంది దళితులే ఉన్నారు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్లానుప్రకారం నిర్మాణాలు చేపట్టడం మొదలుపెడితే మిగిలిన గ్రామాలూ పోతాయనే భయం జరీబు గ్రామాల రైతులకూ పట్టుకుంది. తమ గ్రామాన్ని తరలించడం అంత తేలికయ్యేపనికాదని, అలా జరిగితే ఊరుకోబోమని లింగాయపాలానికి చెందిన రైతు, తెలుగుదేశం నాయకులు అనుమోలు సత్యం తెలిపారు.
నేడు గ్రామాలు, రేపు ప్రజలు
సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు
మాస్టర్‌ప్లాను నివేదిక ప్రకారం ప్రసుత్తం గ్రామాలు తరలిస్తామంటున్నారని, రేపు ఉన్న ప్రజలనూ తరలించేస్తారని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు అన్నారు. ఇలాగే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మంగళవారం ఆయా గ్రామాల్లో రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్‌తో కలిసి పర్యటించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళనకు దిగడంతో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. వరదలొచ్చినా తాము ఇక్కడే ఉన్నామని, నష్టపోయామని, ఇప్పుడు కొద్దిమంది లాభం కోసం తరిమేస్తామంటే ఎలా వెళతామని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలను, ముఖ్యంగా దళితులను ఇక్కడ నుండి తరిమేసే ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు. పొమ్మనకుండా పొగబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను తరలించబోమని ఇప్పటి వరకూ చెప్పిన మంత్రులు, ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గ్రామాల తరలింపు వీటితోనే ఆగదని, అన్ని గ్రామాలనూ తరలించే ప్రమాదముందని హెచ్చరించారు. ఇప్పుడు తరలిస్తామని చెబుతున్నారనీ, ఇది సరైంది కాదని తెలిపారు. దీంతో స్థానిక మహిళలూ పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు.

No comments:

Post a Comment