చతికిలపడుతున్న చిన్న పరిశ్రమల రంగం
Posted On Wed 22 Jul 22:56:00.5383 2015
పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించే చిన్న పరిశ్రమల పరిస్థితి నయా ఉదారవాద విధానాల యుగంలో పరమ అధ్వానంగా తయారైందని ఎంతమంది మొత్తుకున్నా పెడ చెవిన పెట్టిన పాలకులకు సరికొత్త సర్వేలు కళ్ళు తెరిపిస్తాయి అనుకోవాలి. చాలా పరిశ్రమలు ఇప్పటికే దివాళా తీయగా, మరి కొన్ని ఈసురోమంటూ మూతపడే దిశలో వున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా ఆచరణలో సేల్ ఇన్ ఇండియాగా మారిపోయింది. గడచిన ఏడాది కాలంలో దేశంలో 61వేలకు పైగా చిన్న పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడినట్లు కార్పొరేట్ వ్యవహారాలను స్వయంగా చూస్తున్న కేంద్ర ఆర్థికశాఖామాత్యులు జైట్లీ మహాశయుడే మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. ఈ పతనం ఎంత వేగంగా సాగుతోందంటే కేవలం వంద రోజుల్లోనే 7,761 కంపెనీలు మూతపడ్డాయి. దీంతో 'మేక్ ఇన్ ఇండియా'పౖ అసోచామ్, ప్రముఖ పరిశోధనా సంస్థ డూన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ (బిఅండ్‌డి) సంస్థలు సైతం అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. చీటికి మాటికీ చైనా సంస్కరణల గురించి ప్రస్తావించే భారత నాయకమ్మన్యులు వస్తు తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్ రంగం)లో చైనా సాధించిన అసాధారణ పురోగతి వెనుక చిన్న పరిశ్రమల పాత్ర గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు. అక్కడి చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి విధాన పరంగా అందించే ప్రోత్సాహం గురించి మచ్చుకు కూడా ప్రస్తావించరు. భారత్‌లో చిన్న పరిశ్రమలు దేశీయ బడా కంపెనీల ఉత్పత్తులతో పోటీ పడలేక చతికిల పడుతుంటే, చైనాలో చిన్న పరిశ్రమలు గ్లోబల్ మార్కెట్‌తో పోటీ పడేస్థాయికి చేరుకున్నాయి. అక్కడి చిన్న పరిశ్రమలు సాంప్రదాయక టెక్నాలజీ నుంచి అధునాతన టెక్నాలజీవైపు మళ్లుతూ అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు చేస్తూ ఇతర దేశాలకు ఎగుమతులు చేయగలిగే స్థితికి చేరాయంటే అక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత అటువంటిది. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా పేరుతో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహించే ఎలాంటి నిర్దిష్ట చర్యలూ లేవు. విదేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించి, ఇక్కడ సరుకులను ఉత్పత్తి చేసి వాటిని ఎగుమతి చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధించాలన్నది మేక్ ఇన్ ఇండియా ఉద్దేశమన్నారు. ఇది ప్రస్తుత ప్రపంచ వాస్తవికి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకుని రూపొందించిన విధానం కాదని ఆర్థికరంగంలో ఏమాత్రం పరిజ్ఞానం వున్నవారైనా ఇట్టే చెప్పేస్తారు. ప్రపంచ వ్యాపితంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఎగుమతులపై దృష్టిపెట్టడం అవివేకం. ఈ విషయంలో చైనాను చూసి అయినా నేర్చుకోవాలి. చైనా ప్రభుత్వం ఒక వైపు దేశీయ మార్కెట్‌ను పటిష్టపరచుకుంటూ, మరో వైపు ఎగుమతులపై దృష్టి సారించింది. మోడీ ప్రభుత్వ విధానం దీనికి పూర్తి రివర్స్‌లో వుంది. దేశీయ మార్కెట్ పటిష్టపరచుకోవాలన్న స్పృహే మోడీ ప్రభుత్వానికి కొరవడింది. దేశీయమార్కెట్‌ను బలపరచుకోవడమంటే చిన్న తరహా పరిశ్రమలను శక్తిమంతం గావించుకోవడమే. చిన్న పరిశ్రమలను పటిష్టపరచుకోవడమంటే ఉపాధిని పదిలపరచుకోవడమే. ఉపాధి అవకాశాలు ఎంతగా విస్తరిస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి అంతగా పెరుగుతుంది. అప్పుడే ఉత్పత్తి అయిన సరుకులు మార్కెట్‌లో అమ్ముదవుతాయి. సరుకులకు గిరాకీ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. అది మళ్లీ పరిశ్రమల విస్తరణకు, ఉపాధి పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇదంతా ఒక వలయం. మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి విదేశీ పెట్టుబడులొచ్చిందేమీ లేదు. దేశ ఆర్థిక భవిష్యత్తును విదేశీ బహుళజాతి కంపెనీల చేతుల్లో పెట్టేందుకు తప్ప ఈ విధానం మరి దేనికీ ఉపయోగపడదని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ సిపి చంద్రశేఖర్ లాంటివారు చేసిన హెచ్చరిక సరైనదేనని తాజా పరిణామం రుజువు చేసింది. మోడీ ప్రభుత్వం తన మేక్ ఇన్ ఇండియా పాలసీలో తక్షణమే తగు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. చిన్న పరిశ్రమలు అభివృద్ది చెందేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, చైనాలో మాదిరిగా అపారమైన కార్మికశక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, వేతనాలు, జీతాలను హేతుబద్ధీకరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. కుటుంబ యజమాన్యంలో నడిచే సంస్థలు, ఏక వ్యక్తి ఆధిపత్యం కింద నడిచే సంస్థల నిర్వహణ, అకౌంటింగ్‌లపై తనిఖీ వ్యవస్థను పటిష్టపరచాలి. చిన్న పరిశ్రమలు మూతపడడానికి ప్రభుత్వ విధానపరమైన తప్పిదాలు ఒక ముఖ్య కారణమైతే, యాజమాన్యాల అసమర్థ నిర్వాకం, పూర్ అకౌంటింగ్, అవినీతి, బంధుప్రీతి మరో కారణం.
మోడీ ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టడానికి బదులు కార్మిక హక్కులను హరించేందుకు కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తోంది. పారిశ్రామిక ప్రగతి రథం ముందుకు సాగాలంటే మోడీ ప్రభుత్వ తిరోగమన విధానాలను తిప్పికొట్టాలి. సెప్టెంబర్2 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేయాలి.
మోడీ ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టడానికి బదులు కార్మిక హక్కులను హరించేందుకు కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తోంది. పారిశ్రామిక ప్రగతి రథం ముందుకు సాగాలంటే మోడీ ప్రభుత్వ తిరోగమన విధానాలను తిప్పికొట్టాలి. సెప్టెంబర్2 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేయాలి.
Taags :
No comments:
Post a Comment