Tuesday, July 21, 2015

vyasam. prajasakti

విద్యా సంస్థలపై ఆర్‌ఎస్‌ఎస్‌ డేగ కన్ను

Posted On Tue 21 Jul 23:03:17.732567 2015
                   ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ పక్షం బిజెపిని ఎవరైనా విమర్శిస్తే నేరుగా వారికి హిందూ విరోధులనే బిరుదిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించినా, వ్యతిరేకించినా వారిని భారత విరోధులని ముద్ర వేయటం జరుగుతున్నది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి చెందిన ఏ నాయకుడో వెళ్ళగక్కిన విషం కాదు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార పత్రిక ఆర్గనైజర్‌లో అక్షరీకరించబడ్డ సూత్రం.
పూణేలో ఎఫ్‌టిఐఐ(ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌) విద్యార్థినీవిద్యార్థులు అక్కడి ఛైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ని నియమించటాన్ని నిరసిస్తూ నెలా పదిహేను రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో ఆ పత్రిక వారిని హిందూ విరోధులంటూ ఒక వ్యాసంలో రాసింది. ఈ ఉద్యమం పట్ల సంఘ పరివారం చాలా ఆగ్రహంగా, కోపంగా, గుర్రుగా ఉంది. చౌహాన్‌ మహాభారత్‌ సీరియల్లో ధర్మరాజు పాత్ర పోషించా రని, తరువాత ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించారని, ఆయనకున్న ఈ అభినయ దక్షత ఆధారంగానే ప్రభుత్వం ఆయన్ను ఫిల్మ్‌ ఇన్‌స్టి ట్యూట్‌కు ఛైర్మన్‌గా నియమించినట్లు చెబుతున్నారు. నిజానికి విద్యార్థులు ఆయన నటనా దక్షతను సవాలు చేయటం లేదు. చలనచిత్ర జగత్తుకు చెందిన చాలామంది పేరు మోసిన వ్యక్తులు కూడా ఈ నియా మకాన్ని వ్యతిరేకిస్తున్నారు. గిరీశ్‌ కర్నడ్‌, అనుపమ్‌ ఖేర్‌, శశికపూర్‌ లాంటివారు దీన్ని తప్పు పట్టారు. ఇంతకు ముందు చిత్ర సీమకు చెందిన ప్రముఖులు ఈ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. వారి సారథ్యంలో సంస్థ పురోగమించి ప్రపంచంలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ వారితో పోలిస్తే గజేంద్ర చౌహాన్‌కు ఆ స్థాయిలో ప్రజాదరణ, పలుకుబడి, చిత్రసీమకు సంబంధించి వారి ప్రత్యేక నైపుణ్య స్థాయి లేదు. ఆ కారణంగా ఆయనసు ఎఫ్‌టిఐఐని నడప టానికి అర్హుడు కాడని అంతా అభ్యంతరం తెలియజే స్తున్నారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపితో సన్నిహిత సంబం ధాలుం డటం తప్ప వేరే అర్హత లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదర్శాలు, నిర్దేశాలు అమలు జరపటానికే ఆయనను నియమించారన్నది స్పష్టం.
ఒక శ్రేణికి చెందిన చలనచిత్రకారులు చాలా కాలంగా తమ సినిమా కథల్లో హిందువులను, హిందూత్వను కించపరుస్తూ ప్రజల ముందు ఎడగడుతున్నారని, హిందూ మతం, హిందూత్వ ఆదర్శాల కోసం సంఘ పరివారం అలుపెరగకుండా పని చేస్తోందని, కానీ కొంతమంది సంఘ పరివారపు ఈ కృషిని తుడిచి పెట్టటానికి శతథా ప్రయత్నిస్తున్నారని ఆర్గనైజర్‌ అభియోగం. ఉదాహరణగా 'పికె' సినిమాను చెప్పటం జరిగింది. సినిమా నిర్మాత రాజ్‌కుమార్‌ హిరానీ హిందువులను గురించి వ్యతిరేక దృక్పథంతో చూపించారని ఆర్గనైజర్‌ అక్కసు. ఇలాంటి వ్యక్తులు బోర్డులో ఉంటే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నడవదని, దీనివల్ల హిందూత్వకు సర్వనాశనం కొని తెచ్చుకున్నట్టు అవుతుందని, హిరానీనే కాక గతంలో ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వహించిన ఇతరులను కూడా ఓ పట్టు పట్టింది ఆర్గనైజర్‌. ఉదాహర ణకు బెంగాలీ చలన చిత్రకారుడు మృణాల్‌ సేన్‌ను కరుడుగట్టిన మార్క్సిస్టని, కన్నడ సినీ దిగ్గజం గిరీశ్‌ కర్నడ్‌ను పేరుపడ్డ హిందూత్వ విద్వేషని, తెలుగు వాడైన, హిందీ సినీ రంగంలో ఖ్యాతినొందిన శ్యాం బెనెగళ్‌ను బిజెపి విరోధని చెప్పింది. పూణే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ లాంటి సంస్థలో ఇక ఇలాంటి హిందూ వ్యతిరేక పనులకు అనుమతించరాదనేది ఆర్‌ఎస్‌ఎస్‌ అదేశం. దీనికి వ్యతిరేకంగానే విద్యార్థినీవిద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనను శశికపూర్‌, అనుపమ్‌ ఖేర్‌ లాంటి విశిష్ట వ్యక్తులు సమర్థిస్తున్నారు.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని దేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో కాషాయీకరణను తీవ్రతరం చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చురుకుగా కృషి చేస్తోంది. పూణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉదంతం తరువాత ఇప్పుడు ఆర్గనైజర్‌లో ఇంకో వ్యాసంలో దేశంలో సాంకేతిక విద్య అందిస్తున్న అగ్ర సంస్థలైన ఐఐటి(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ల గురించి ప్రస్తావిస్తూ అవి భారత వ్యతిరేకమైనవని, హిందువుల వ్యతిరేకమైనవని పేర్కొంది. ఈ సంస్థలు భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని అభియోగం మోపింది. ఈ సంస్థల బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌, అధ్యాపకులపై దుమ్మెత్తి పోశారు. వీరి ఇటువంటి కార్యకలాపాలను గుర్తించి ప్రభుత్వం వీరిపై చర్యలు చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండు చేస్తోంది.
ఆర్గనైజర్‌ ఇంకా ఈ సంస్థలపై వాటి బోర్డుల ద్వారా కాంగ్రెస్‌, వామపక్షాలు సిద్ధాంతపరంగా అజమాయిషీ చేస్తున్నాయని చెప్పింది. ముంబయి ఐఐటిని తీవ్ర పదజాలంతో విమర్శించింది. దాని మాజీ ఛైర్మన్‌, పేరుగల అణుశాస్త్రజ్ఞుడు అనిల్‌ కాకోద్కర్‌ మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ ఐఐటిల డైరెక్టర్ల నియామకంలో జోక్యంచేసుకుంటున్నారని విమర్శించారు. అందుకు ఆర్గనైజర్‌ ఆయనను తీవ్రంగా ఖండించింది. మోడీ సర్కారు విద్యా సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకోవటానికి ఉద్దేశించి ప్రవేశ పెడుతున్న బిల్లును వ్యతిరేకించినందుకు అహ్మదాబాద్‌ ఐఐఎం(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఛైర్మన్‌ ఎం నాయక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో పడ్డారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ సంస్థలకు స్వయంప్రతిపత్తి అంటూ ఏమీ ఉండదు. అంతా ప్రభుత్వ నియంత్రణే సాగుతుంది. నాయక్‌ ఒకరే కాదు, ఇంకా ఎంతోమంది అగ్ర విద్యా సంస్థలకు చెందిన మాజీ ఉన్నతాధికారులు కూడా ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఆర్గనైజర్‌లో ఇంకా యుపిఎ హాయాంలో 'పవిత్ర హరిద్వార్‌' నగరంలోని ఐఐటి రూర్కీలో మాంసాహారం ప్రవేశ పెట్టటం జరిగిందని, అక్కడి కమ్యూనిటీ హాల్లో విద్యార్థుల 'పూజ' నిషేధించారని, ఇవన్నీ హిందూ వ్యతిరేక పనులని పేర్కొంది. ఈ వ్యాసంలో మరలా పూణే ఫిల్మ్‌ సంస్థలో గజేంద్ర చౌహాన్‌ నియామకాన్ని సమర్థిస్తూ, ఆయన అర్హతను ప్రశ్నించే పనే లేదని, ఆయనను ఆయన సిద్ధాంతాల కారణంగా వ్యతిరేకిస్తున్నారని ఆర్గనైజర్‌ వాదించింది.
ఒకవైపు విద్యా కాషాయీకరణ గురించి వివాదం క్రమంగా పెరుగుతూ ఉంటే మరోవైపు తెలిసిందేమంటే గత జనవరిలో ఢిల్లీ ఐఐటిలో ఒక సమావేశానికి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌ విజరు వాట్కర్‌తో పాటు బాబా రాందేవ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమానికి చెందిన కొంతమంది సభ్యులు హాజరయ్యారు. వారిని ఢిల్లీ ఐఐటి తరపు నుంచి పద్ధతి ప్రకారం ఆహ్వానించటం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నత భారత పథకం గురించి చర్చించారు. అలాగే గ్రామీణ అభివృద్ధిలో గోవు తోడ్పాటు, అందులో ఐఐటి లాంటి విద్యా సంస్థల పాత్రపై కూడా చర్చ జరిగింది. ప్రజల్లో తన ప్రాపకాన్ని పెంచుకోవటానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు యువతను ఆకట్టుకునే పనిలో భాగంగా విద్యా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవటానికి హిందూత్వ అస్త్రాన్ని బాహాటంగానే ఉపయోగించడం మొదలెట్టాయనేది స్పష్టం. కానీ ఇది ప్రజల ఐక్యతకు విఘాతం కలిగించి, నిరంకుశత్వానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ప్రజల అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం.
- వేదుల రామకృష్ణ
Taags :

No comments:

Post a Comment