Tuesday, July 28, 2015

Sampadakeeyam. Prajasakti

సలామ్‌

Posted On Tue 28 Jul 22:19:40.040265 2015
                  మాజీ రాష్ట్రపతి, రాకెట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ మృతి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆయన మృతికి సంతాప సూచికంగా భారత ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంటు ఉభయ సభలు ఆయనకు ఘనంగా నివాళులర్పించి మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. కలామ్‌ మృతితో దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను, దార్శనికుణ్ణి, స్వాప్నికుణ్ణి కోల్పోయింది. ఆయన యువతకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు ప్రేరణనిచ్చే గొప్ప మోటివేటర్‌. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కించాలని, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రపంచంలో దీటైన శక్తిగా నిలపాలనేది ఆయన తపన. చివరి క్షణం వరకు ఆ లక్ష్యంతోనే పనిచేశారు. రాష్ట్రపతిగా ఉన్నా అవకాశం వచ్చినప్పుడల్లా విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక యువ శాస్త్రవేత్తలతో గడిపేందుకు ఎక్కువ మక్కువ చూపేవారు. వారు చేసే పరిశోధనలను, ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిని అధిష్టించినా, భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నా ఆయనలో దర్పం కానీ, భేషజం కానీ ఇసుమంతైనా కనిపించేది కాదు. 1931 అక్టోబరు15న తమిళ నాడులోని రామేశ్వరంలో ఓ పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన కలామ్‌ మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనా టిక్స్‌లో ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. ఆ తరువాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరి తొలి దేశీయ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వి-3) రూపకల్పన ప్రాజెక్టు డైరెక్టర్‌గా విజయవంతంగా రాణించారు. 1980లో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశెపెట్టి ఇస్రోకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు. 1963లో ఎడ్లబండ్లపై రాకెట్‌ను లాంచింగ్‌ ప్రదేశానికి తీసుకెళ్లే స్థితి నుంచి నేడు చంద్రయాన్‌కు సన్నాహాలు చేసే స్థాయికి ఇస్రో ఎదిగిందంటే అందులో ఈ రాకెట్‌ శాస్త్రవేత్త కృషి మరువలేనిది. 1974లోనూ, 1998లోనూ పోఖ్రాన్‌ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్‌పై అమెరికా తీవ్ర ఆంక్షలు విధిస్తే రష్యాతో కలిసి దేశీయంగా క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో కలామ్‌ ముఖ్య భూమిక వహించారు. ప్రధాని ఇందిర, రక్షణమంత్రులు ఆర్‌ వెంకట్రామన్‌, అరుణాచలం వంటి వారికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేయడం ద్వారా ఆయనను రాజకీయ పావుగా వాడుకోవాలని బిజెపి ప్రయత్నించినా, ఆయన చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటూ హుందాగా వ్యవహరి ంచారు. రెండవ పర్యాయం రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టేందుకు బిజెపి చేసిన యత్నాలను సున్నితంగా తిరస్కరించారు. పేదరికం, అవిద్య పోవాలని, దేశం స్వావలంబన దిశగా పయనించాలని కలామ్‌ కలలుగన్నారు. ఆ కలను సాకారం చేయడమే ఆయనకు జాతి అర్పించే నిజమైన నివాళి.
Taags :

No comments:

Post a Comment