Wednesday, July 15, 2015

vyasam

ప్రాణాంతక నిర్లక్ష్యం

Posted On Tue 14 Jul 22:33:05.206714 2015
                 మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటుచేసుకున్న మహా విషాదం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. సర్కారీ నిర్లక్ష్యానికి రెండు డజన్లకు పైగా నిండు ప్రాణాలు గోదారిలో కలిసిపోయాయి. మృతులలో ఎక్కువ మంది మహిళలే. మరో 30 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సర్కార్‌ అనుసరించిన దారుణ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఈ తొక్కిసలాట. ప్రతి పన్నెండేళ్లకొకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో కనీవిని ఎరుగని ఘోరమిది. చంద్రబాబు ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే ఈ మహా విషాదం నివారించబడేది. క్షతగాత్రుల హాహాకారాలు, మృతుల కుటుంబాల ఆక్రందనలతో గోదారి తీరం ఇలా ఘోషించే పరిస్థితి వచ్చేదే కాదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకమే. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, అధికార గణం, పోలీస్‌ యంత్రాంగం యావత్తూ రాజమండ్రిలో తిష్టవేసినా తొక్కిసలాటను నివారించలేకపోయారు. అయిదు నిమిషాలో, పది నిమిషాలో కాదు, దాదాపు గంటన్నర సేపు తొక్కిసలాట సాగింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రివర్గ ప్రముఖులు పుష్కర స్నానాల కోసం ప్రత్యేకంగా రూ. 10 కోట్లతో నిర్మించిన విఐపి ఘాట్‌ను వదిలి సాధారణ జనానికుద్దేశించిన పుష్కర ఘాట్‌కు ఎందుకు వెళ్లినట్లు? అది కూడా పుష్కర ఘడియలు ప్రారంభ సమయాన జనం పెద్దయెత్తున పోటెత్తే తరుణంలో గంటన్నర సేపు గడపడం ఎంతవరకు భావ్యం? పుష్కర ఘాట్లలో ప్లాస్టిక్‌ నిషేధం అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెట్టిన అధికార గణానికి యాత్రికులకు మంచినీటి సదుపాయం కల్పించాల్సిన బాద్యత లేదా? 2003లో నాసిక్‌లో పుష్కరాల సందర్భంగా పెద్దయెత్తున తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు. 2010లో హరిద్వార్‌, 2013 కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కళ్లెదుట కనిపిస్తున్నా వాటి నుంచి ప్రభుత్వం ఎందుకు గుణపాఠం తీసుకోలేదు? తనది హైటెక్‌ ప్రభుత్వం అని, రాష్ట్రాన్ని మరో సింగపూర్‌గా మారుస్తానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి మంగళవారం నాటి తొక్కిసలాటను నివారించడంలో ఎందుకు విఫలమయ్యారు? విజన్‌-30 గురించి రంగుల కలలు చూపించే చంద్రబాబు ఈ పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళికను ఎందుకు రూపొందించలేకపోయారు? పుష్కరాల సమయంలో ఎలాంటి అత్యయిక పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తొక్కిసలాట నివారణ కమిటీల్లాంటివి ఏర్పాటు చేసి వుంటే ఈ పరిస్థితి వచ్చేదా? పుష్కరాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడానికి ఎవరు అడ్డం వచ్చారు ? పుష్కరాలను పూర్తి అధికారిక కార్యక్రమంగా ఆయన భావించారు. అందుకే ఎక్కడా ప్రజల భాగస్వామ్యానికి కానీ, ప్రతిపక్షాల భాగస్వామ్యానికి కానీ అవకాశం ఇవ్వలేదు. పుష్కరాలు బాగా జరిగితే ఆ క్రెడిట్‌ అంతా తన ఖాతాలో వేసుకోవాలనే యావే అయనను అటువైపు నడిపించింది. చివరికి పుష్కరాల నిర్వహణకు ఇంఛార్జి మంత్రిగా వ్యవహరించాల్సిన దేవాదాయ శాఖ మంత్రిని కూడా డమ్మీని చేసి సర్వం తానై అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరించారు. ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లు ఈ పుష్కర ఏర్పాట్లలో లొసుగులు కోకొల్లలు. ఈ లోటుపాట్లను ముందుగానే ఎత్తి చూపి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన ప్రధాన స్రవంతి మీడియాలో ఒక సెక్షన్‌ తన వంతు బాధ్యతను సరిగా నిర్వర్తించక పోయిందనేది నిష్ఠుర సత్యం.
గోదావరి జన్మ స్థలి అయిన మహారాష్ట్రలోని నాసిక్‌ లోను మహా పుష్కరాలు మంగళవారం నాడే మొదలయ్యాయి. అక్కడ ఎలాంటి తొక్కిసలాటలు లేవు. గత అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని ఈసారి పుష్కర ఘాట్‌ల వెడల్పు, మెట్లు, లోతు, భద్రత వంటి విషయాలపై అక్కడి ప్రభుత్వం పత్యేక శ్రద్ధ పెట్టింది. ఆపాటి శ్రద్ధ కూడా ఇక్కడ పెట్టలేకపోయారు. పుష్కరాల కోసం రూ.1600 కోట్ల ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం యాత్రికులకు కల్పించిన సౌకర్యాలూ పెద్దగా ఏమీ లేవు. రాజమండ్రిలో 27 పుష్కర ఘాట్లు వున్నా జనరం రద్దీని తట్టుకోగలిగే సామర్థ్యం కలిగినవి ఒక్కటీ లేవు. కనీస అవసరాలైన మంచినీరు, ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లు, అంబులెన్స్‌లు తగినన్ని వున్నాయా అంటే అదీ ప్రశ్నార్థకమే. భద్రతా ఏర్పాట్ల కోసం 20 వేలమంది పోలీసులను నియమించినా తొక్కిసలాట జరిగినప్పుడు వారి ఉనికి నామమాత్రమే. మూడు అంబులెన్సులే వుండడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి సకాలంలో తరలించడం చాలా కష్టమైంది. తొక్కిసలాటలో కిందపడి ఊపిరాడక కొందరు చనిపోతే, మరి కొందరు దాహార్తితో చనిపోయారు. వీరికి మంచి నీరు గనుక సకాలంలో అంది వుంటే తప్పకుండా బతికేవారు. మంగళవారం జరిగిన మహా విషాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూసేందుకు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలి. వచ్చే పదకొండు రోజుల్లో పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
Taags :

No comments:

Post a Comment