Wednesday, July 15, 2015

vyasam


ఇసుక మాఫియాల గుప్పెట్లో చంద్రబాబు సర్కారు

Posted On Wed 15 Jul 21:54:15.678824 2015
             ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులపై, అందులోనూ తాసీల్దా రులైన వనజాక్షి, నారాయణమ్మపై పోలీసుల సమక్షంలోనే దాడికి దిగడం, తన పార్టీ ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి వెనకేసుకురావడం, అక్కడికి ఎందుకెళ్ళావని వనజాక్షినే తిరిగి ప్రశ్నించడం వంటి ఇటీవల పరిణామాలు మనం చూశాం. ఇసుక కోసం ముఖ్యమంత్రే స్వయానా జోక్యం చేసుకోవడం, అది కూడా రాజధాని అమరావతి నిర్మాణంలో. నిత్యం బిజీగా ఉంటూ జపాన్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇసుక వ్యవహారం చక్కదిద్దడానికి పునుకోవడం వంటివి చూస్తే, ఇసుకకు ఏమిటింత ప్రాధాన్యత? అనే సందేహం సహజంగానే వస్తుంది.
ఇడియట్‌ సినిమాలో ఆలీ ద్విచక్ర వాహనంపై మూటను కట్టుకొని వెళ్తూ ఉంటాడు. చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసులు ఆపి, ఏమిటి తీసుకెళ్తున్నావు, ఆ మూటలో ఏముందో చూపించమంటాడు. అది చూశాక ఇసుకే కదాని పొలీసులు వదిలేస్తారు. అయితే తరువాత తెలుస్తుంది ఏమిటంటే విలువ లేని ఇసుకను చూపించి, విలువైన ద్విచక్రవాహనాలను దొంగలించి పట్టుకుపోతున్నాడని. ఇది వేరే కథ అనుకోండి. ఈ సినిమా కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ముందెన్నడూ అంత విలువలేని ఇసుకకు అమాంతం నేడు అంత ప్రాధాన్యత వచ్చి పడిందని తెలపడానికే.
ఇసుకకు ఇంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది
ఇక్కడ రెండు కారణాలు కనబడతాయి. ఒకటి వాడుక పెరగడం. రెండవది దీని పర్యవసానంగా ఇసుక వ్యాపార సరుకుగా మారడం. వాడుక ఎందుకు పెరిగింది? గతంలో ఇళ్ళ నిర్మాణాలకు మట్టి ఇటుకలు వాడేవారు. నేడు బహుళ అంతస్తుల భవనాలు రావడంతో వాటి నిర్మాణానికి మట్టి ఇటుకల స్థానంలో కాంక్రీట్‌ ఇటుకలను వాడుతున్నారు. ఈ కాంక్రీట్‌ ఇటుకలకు ప్రధానంగా కావాల్సినవి సిమెంటు, ఇసుక. సిమెంటును ఉత్పత్తి చేయాలి. అదే ఇసుకైతే సహజ సిద్ధంగా దొరుకుతుంది. ఇసుకకు పెరిగిన డిమాండ్‌తో వ్యాపారం జోరందుకుంది. ఇసుక వ్యాపార సరుకుగా ఎలా మారింది? గతంలో గ్రామస్తులు ముఖ్యంగా పారలతో తవ్వుకొని, ఎడ్లబండిపై తోలుకొచ్చి ఇసుకను అమ్ముకునేవారు. ఇదే ఆ పేదలకు ప్రధాన జీవనాధారంగా ఉండేది. అయితే 1991 తరువాత పెద్ద మార్పులు వచ్చాయి. నయా ఉదారవాద విధానాలు ప్రారంభమైన తరువాత ప్రకృతి వనరులను ప్రైవేట్‌ వ్యాపారులకు ధారాదత్తం చేయడం ప్రారంభమైంది. ఖనిజాలు, గనులు, నీరు, చమురు నిక్షేపాలు ఇలా సర్వం ప్రైవేట్‌ వ్యక్తుల పరం అవుతున్నాయి. ఆ జాబితాలో ఇసుక కూడా చేరిపోయింది.
ఇక్కడ మార్క్స్‌ మహానీయుడు చెప్పిన గొప్ప విషయాన్ని మనం మననం చేసుకోవాలి. ఆయన ''పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతిదీ వ్యాపార సరుకుగా మారుతుంది. ఆఖరుకు శవపేటిక కూడా'' అన్నారు. ఆ వ్యాపారంలో భాగమే ఇసుక వ్యాపారం.
ఇసుక మాఫీయాలు
అయితే ఇక్కడ నేడు జరుగుతున్నది కేవలం ఇసుక వ్యాపారం మాత్రమే కాదు. నయా ఉదారవాద విధానాలంటే ప్రకృతి వనరులను కొల్లగొట్టుకుపోవడం. అది కూడా ప్రభుత్వ వత్తాసు, ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నలలోనే ఈ కార్యక్రమం జరగడం ప్రత్యేకత. దీనికి అడ్డువచ్చినవారందరినీ భయపెట్టడమో, బాదెయ్యడమో లేదా లేపెయ్యడమో. దేనికైనా వ్యాపారులు తెగిస్తారు. దీనినే ''మాఫియా'' అంటారు. భూ మాఫియా, రియల్‌ఎస్టేట్‌ మాఫియాల వంటివి మనం చూశాం. నేడు ఇసుక మాఫియా రంగంలోకి వచ్చింది. ఈ మాఫియాల ప్రత్యేకత ఏంటంటే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం కుమ్మక్కవడం. ఈ ఇసుక మాఫియాలు కూడా గత రెండు పుష్కరాల కాలంగా అనేక రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నాయి. విచ్చలవిడిగా నదీ తీర ప్రాంతాలలో ఇసుక తవ్వుకుపోవడంతో పర్యావరణ సమస్యలు తలెత్తాయి. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో అనేక కేసులు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు 2012 ఫిబ్రవరి 27న ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర గనుల మంత్రిత్వశాఖను ఆదేశించింది. పర్యావరణ అనుమతి తీసుకోవడం కూడా తప్పనిసరి అని పేర్కొంది.
కొండనాలుకకు మందేసిన
చందంగా రాష్ట్ర ప్రభుత్వ జీవో
సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా మన రాష్ట్ర ప్రభుత్వం 2012 అక్టోబర్‌ 13న 142 జీవో జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనికి అదనంగా 2014 ఆగస్టు 28న 94 జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఇసుక దిబ్బల నిర్వహణ బాధ్యత డ్వాక్రా గ్రూపులకు కేటాయించింది. 25 శాతం వరకు నికర లాభాలను డ్వాక్రా సంఘాలకు కేటాయించాలని జీవోలో పేర్కొంది. బయటకు చూడటానికి ఇది మహిళా సాధికారతగా కనబడుతుంది. కానీ లోతుకు వెళ్ళి పరిశీలిస్తే అసలు నైజం బయటపడుతుంది. మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగిన రెండు ఘటనలు పరిశీలిస్తే డ్వాక్రా సంఘాల నిర్వహణ పరిస్థితి అర్థమవుతుంది.
ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలో తాసీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేసిన ఘటన. ఇక్కడ డ్వాక్రా గ్రూపు సభ్యుల పేరుతో మహిళలచే తనకు మద్దతుగా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రదర్శన నిర్వహింపజేశారు. తమకు ఇష్టం లేకపోయినా డ్వాక్రా మహిళలు ఇలా చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. ప్రతిఘటిస్తే ఏం జరుగుతుందో రెండో ఘటన తెలుపుతుంది. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లి ఇసుక రాంప్‌లో అక్రమంగా జరుగుతున్న తవ్వకాలను ఆపడానికి సుమారు 500 మంది డ్వాక్రా మహిళలు అక్కడకు చేరుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు పోలీసులను పురమాయించి ఈ మహిళలపై జూలై 4న విరుచుపడ్డారు. చెప్పడానికి కూడా వీలులేని విధంగా బూతు లు తిట్టారు. చూపించడానికి కూడా వీలులేని ప్రాంతాల్లో చితకబా దారు. సుమారు 50 మంది మహిళలపై కేసులు కూడా పెట్టారు. పోలీసులే ప్రత్యక్షంగా మాఫియాలకు అండగా ఉండడం విశేషం.
ఈ రెండు ఘటనలు చూస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. ఒకటి డ్వాక్రా మహిళలు నోరు మూసుకుని మాఫియాలకు అండగా నిలవాలి లేదా దాడులకు గురికావడానికి సిద్ధపడాలి. దేనికైనా మాఫియాలు రెడీ. తెల్చుకోవల్సింది డ్వాక్రా మహిళలే. ఇందులో సాధికారత ఎక్కడుంది? పరాధీనత తప్ప. అయినా స్వచానా మెజిష్టీరియల్‌ అధికారాలున్న తాసీల్దార్‌లకే రక్షణ లేని రావణ రాజ్యంలో సాధారణ డ్వాక్రా మహిళలు ఏం చేయగలరు? ఈ మాఫియాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవడమే కాక తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు తరువాత వేరుగా పరిశీలిస్తే, ప్రస్తుతానికి పర్యావరణ ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం.
పర్యావరణ ప్రభావాలు
విచ్చలవిడిగా, హద్దులుమీరి ఇసుక తవ్వకాలు నదీ పరీవాహక ప్రాంతాలలో జరగడం వల్ల భూగర్భ నీటి నిల్వలు తగ్గిపోవడం, వ్యవసాయ భూములు నాశనమవడం, రైతులు వ్యవసాయ పనులు కోల్పోవడం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వంటి 15 రకాల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని తమిళనాడు వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త నవీన్‌ సేవియర్‌ తెలిపారు. ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుపోవడం వల్ల వరదలు పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లో ఇసుకను పరిమితికి మించి తవ్వితే, నదులపై నిర్మించిన వంతెనలు, నదులను ఆనుకొని ఉన్న కట్టడాలు దెబ్బతింటాయని కూడా వీరు అంటున్నారు.
నిబంధనలకు తిలోదకాలు-మాఫియాల ఆగడాలు
నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలకు ఎక్కడపడితే అక్కడ అనుమతివ్వకూడదు. ఎక్కడ అనుమతి ఇవ్వాలో కచ్చితంగా నిర్దేశించాలి. అలాగే ఇసుక తవ్వకాలను అదుపులో ఉంచడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచాలి. చిన్న వాహక ప్రాంతాల్లో ఒక మీటరు కంటే ఎక్కువలోతు తవ్వకూడదు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య తవ్వకాలు జరపకూడదు. భారీ యంత్రాలను వాడకూడదు. మూడు యూనిట్లకు(ఒక యూనిట్‌కు 100 ఘనపుటడుగులు) మించి ఒక లారీలో లోడ్‌ చేయకూడదు. ఒక క్వారీ నుంచి 200-300 లోడులకు మించి రోజుకు వెళ్ళకూడదు. వంతెనలు, కట్టడాలు, మంచినీటి సదుపాయాలకు 500 మీటర్ల లోపు మైనింగ్‌ జరపకూడదు. కానీ నిబంధనలేవీ పాటించబడడం లేదు. ఉదాహరణకు కోరుమిల్లి ర్యాంప్‌లో (కపిలేశ్వరపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా) భారీ యంత్రాలను వాడుతున్నారు. ఒక లోడుకు అధికారికంగా అనుమతి చీటీ ఇచ్చి, 10 లోడుల వరకు అనధికారికంగా తరలించుకుపోతున్నారు. రాత్రిళ్ళు కూడా యథేచ్ఛగా మైనింగ్‌ జరుగుతోంది. అనుమతి పొందిన ప్రాంతాలలోనే కాకుండా, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో అక్రమంగా తవ్వకాలు జరుపుకోవడం రివాజుగా మారింది. ప్రభుత్వ మద్దతు, విపరీత అవినీతి వల్ల దీనిని నివారించడం కూడా సాధ్యం కాదు. ఎక్కడైనా నిజాయితీ అధికారులున్నా, వారు చేయగలిగింది స్వల్పమే. తాసీల్దార్‌ వనజాక్షి విషయంలో ఏం జరిగిందో చూశాం. గ్రామ పెద్దలను లొంగదీసుకోవడం, గ్రామాలలో దేవాలయాలు కట్టించడం, గ్రామ సంబరాలకు విరాళాలివ్వడం వంటి చర్యల ద్వారా మాఫియాలు గ్రామాలను తమ గుప్పెట్లో ఉంచుకుంటారు. అధికారులకు భారీగా లంచాలు ఇస్తారు.
నదుల ప్రాధాన్యత
మానవ నాగరికత అభివృద్ధి చెందింది నదీ తీర ప్రాంతాల్లోనే. నైలునది, సింధునదీ నాగరికతల గురించి చరిత్రలో గొప్పగా చెప్పుకుంటాం. నాగరికతకు చిహ్నంగానే ప్రఖ్యాత నదులకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కూడా మన దేశంలో జరుగుతాయి. ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. గత గోదావరి పుష్కరాలు 1991లో జరిగాయి. ప్రకృతి వనరులను కొల్లగొట్టుకుపోయే నయా ఉదారవాద విధానాల అమలు కూడా ఆ సంవత్సరంలోనే ప్రారంభమయ్యింది. ఈ రెండు పుష్కరాల కాలంలోనూ నదీ ప్రవాహలకు తీవ్ర హాని చేసే ఇసుక మాఫియాలు కేవలం వ్యాపారం చేయడమే కాదు, బలమైన గూండా మాఫియాలుగా రూపాంతరం చెంది, అడ్డువచ్చిన వాళ్ళందరిపై గోదావరి సాక్షిగా భౌతిక దాడులు కూడా చేసే ప్రమాద స్థాయికి ఎదిగారు. పరిస్థితిని ఇలాగే కొనసాగనిస్తే గోదావరిని వచ్చే పుష్కరాలకు గోదాట్లో కలపడమా? లేక మన గోదావరిని కాపాడుకుంటామా? రాష్ట్ర ముఖ్యమంత్రే తెలపాలి.
పుష్కరాల సాక్షిగా...
గోదావరి తల్లికి నిత్యం పూజలు నిర్వహిస్తామని ఈ మధ్య పుష్కరాల పనులను పరిశీలిస్తూ ముఖ్యమంత్రి రాజమండ్రిలో ప్రకటించారు. ఈ పూజలు చేసేది గోదావరి తల్లి పర్యావరణాన్ని, నాగరికతను కాపాడాలనా లేదా ఇసుక మాఫీయాలకు సేవ చేయ మనా? పుష్కరాల సాక్షిగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజల భవిష్యత్తుపైనా, పర్యావర ణంపైనా ఇసుమంత ప్రేమ ప్రభు త్వానికి ఉన్నా తక్షణం ఇసుక మాఫియాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. నిజాయితీ అధికారుల నోరునొక్కడం కాక వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. డ్వాక్రా మహిళలపై దాడులు చేస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. మాఫియాలకు కొమ్ముకాస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే అరెస్ట్‌ చేయాలి.
- ఎ. అజరుశర్మ

No comments:

Post a Comment