Sunday, July 19, 2015

news. mbl

Home » District » Nellor

అనుపల్లిపాడులో సమస్యల జాతర

Posted On Sun 19 Jul 23:21:51.845415 2015
అనుపల్లిపాడులో సమస్యల జాతర
          రోడ్డు లేదు..బస్సు రాదు..విద్యుత్‌ సరఫరా ఉండదుప్రభుత్వాలు మారినా అనుపల్లి పాడు గ్రామస్తుల తలరాతలు మారడం లేదు.. అభివృద్ధికి దూరంగా సమస్యల తో కొట్టు మిట్టాడు తోంది..అసలు ఈ గ్రామం ఒకటి ఉందనే విషయం చాలా మంది అధికారులకే తెలియదు.. దాంతో సమస్యలు పరిష్కారం కావడంలేదు..
ప్రజాశక్తి-మనుబోలు
              మండలం లోని అనుపల్లి పాడు గ్రామంలో 30 కుటుంబా లున్నాయి. గ్రామంలో సరైన వసతులు లేవు. పొలం డొంకలా ప్రధాన రోడ్డు ఉంది. వర్షం వస్తే ఆ రోడ్డు బురదగుంటగా మారిపోతుంది. నడవాలన్నా కష్టంగా ఉంటుంది. బస్సు వసతి లేదు, ఆటోలు రావు. ఎక్కడికైనా వెళ్లాలంటే మూడు కి.మి దూరం పొలంలో అడ్డంగా నడిచి వెళ్లి హైవే పైకి చేరుకోవాలి. అక్కడి నుంచి గూడూరు, నెల్లూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. చిన్నపాటి వర్షం వచ్చినా వీధుల్లో నడవలేం. బురదతో నిండిపోతుంది. 2014 ఫిబ్రవరి 18 న అప్పటి సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఐదు లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశారు. ఆయన పదవీ కాలం ముగిసింది. రోడ్డు మాత్రం వేయలేదు. ఇప్పటికీ ఆయన వేసిన శిలా ఫలకం మాత్రం గ్రామస్తులను వెక్కిరిస్తూనే ఉంది. విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండదు. ఇటీవల సర్పంచ్‌ మన్నెమాల వసుధమ్మ మంచినీటి వసతి కల్పించారు. ఆ ప్రాంత వాసులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో రేషన్‌ షాపు లేదు. సరుకులు కావాలంటే 5 కి.మి దూరంలోని గురువిందుపూడి గ్రామం వెళ్లాలి. అంత దూరం వెళ్లాలంటే ఆటో గాని, బస్సు కాని ఉండదు. పొలాల్లో అడ్డంగా నడిచి వెళ్లాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు.
ఎటు చూసినా బురదే- వై. శ్రీనయ్య
సైడు కాలువలు లేవు. ఎటు చూసినా బురదమయమే. వీధుల్లో నడవలేం. నేతలు సిమెంటు రోడ్డు వేయిస్తామని మొండి చేయి చూపించారు. ఇప్పుడు ఆ ఊసే లేదు.
రేషన్‌ షాపుకు వెళ్లాలంటే కష్టమే- చిన్నబ్బయ్య
గ్రామంలో రేషన్‌ షాపు లేదు. గురువిందు పూడికి వెళ్లాలంటే అవస్థలు పడుతున్నాం. బస్సు వసతి కూడా లేదు.

No comments:

Post a Comment