Saturday, July 11, 2015


నిన్నెవరు వెళ్లమన్నారు?

Posted On 4 hours 40 mins ago
నిన్నెవరు వెళ్లమన్నారు?
-  వనజాక్షిపై సిఎం ఆగ్రహం
-  ఎంఎల్‌ఏపై చర్యలు కుదరవని స్పష్టీకరణ
ప్రజాశక్తి, హైదరాబాద్‌ బ్యూరో
                 'అసలు నిన్నక్కడికి ఎవరెళ్లమన్నారు. నీవె వెళ్లినందువల్లే ఇంత రాద్దాంతం జరుగుతోంది. ప్రతి పక్షాలు అవకాశాన్ని తీసుకున్నాయి. అది పోలీసుల పని కదా... పోలీసులకు చెప్పి ఉంటే సరిపోయేది.' అని ముసునూరు తాహిసిల్ధార్‌ వనజాక్షినుద్ధేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి తన నివాసంలో ఎంఎల్‌ఏ దాడి వ్యవహారం సంఘ టనపై పంచాయతీ నిర్వహించారు. ఇరువర్గాలతో విడివిడిగా మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం ఆయన బాధిత మహిళా అధికారి తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె సంఘటన స్థలానికి వెళ్లకుండా ఉంటే బావుండేదని ఒకటికి రెండు సార్లు అన్న ఆయన ఇసుక తవ్వకాలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్లర్‌ పంపిన నివేదికను కూడా ప్రస్తావించారు. ఆ నివేదికలో సంఘటన జరిగిన ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని తహిసిల్ధార్‌ సరిహద్దులు దాటారని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పినట్లు తెలిసింది. 'ఆ నివేదిక ప్రకారం నీ పైనే కేసు పెట్టాల్సి ఉంటుంది... ఏం చేయమంటావు' అని సిఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమ యంలో సంఘటన జరిగిన ప్రాంతం కృష్ణా జిల్లా లోనే ఉందని వనజాక్షి చెప్పడానికి ప్రయత్నిం చడంతో 'సరే ఐఎఎస్‌ అధికారి చేత విచారణ జరిపించి సరిహద్దుల విషయం తేలుస్తాం. అంత వరకు ఎంఎల్‌ఏపై చర్యలు తీసుకోవడానికి కుద రదు' అని చెప్పినట్లు తెలిసింది. సిఎంతో భేటీ అనం తరం వనజాక్షి మీడియా ముందుకు రావడానికి సిద్దపడ లేదు. విలేకరులు పదేపదే అడగడంతో 'ఐఎఎస్‌ అధికారి చేత విచారణకు ఆదేశించారు' అని ఒక మాట మాత్రం చెప్పి ఆమె వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో చక్కదిద్దే బాధ్యతను మంత్రి దేవినేని ఉమా, గన్నవరం ఎంఎల్‌ ఎ వంశీలకు అప్పగిం చినట్లు తెలిసింది. సరిహద్దుల విషయం తేల్చే బాధ్యతను తన వ్యక్తిగత కార్యదర్శి సతీష్‌చందర్‌కు సిఎం అప్పగించారు. సిఎం పిలిపించి మాట్లాడం పట్ల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నుంచి రెవెన్యూ ఉద్యోగుల తలపెట్టిన ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.పుష్కర విధులకు హాజరు కావలసిందిగా తమ శాఖ ఉద్యోగులను కోరారు. శనివారం సిఎం నిర్వహించిన గోదావరి జిల్లాల పర్యటనలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన సిఎం అధికారులే సరిహద్దులు దాటితే ఎలా అని ప్రశ్నించారు. 'వారు తమ హద్దులు కూడా గుర్తించాలి. ఈ వ్యవహారంలో ఎంఆర్‌ఓ సరిహద్దులు దాటినట్లు చెబుతున్నారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి చేత విచారణ జరిపిస్తున్నాం. అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ వ్యవహారంలో అసలు విషయమే లేదు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయి' అని ఆయన అన్నారు.

No comments:

Post a Comment