Sunday, September 25, 2016

నేతన్నల కనురెప్ప 'కస్తూరి' కుటుంబరావు

నేతన్నల కనురెప్ప 'కస్తూరి' కుటుంబరావు
                    ''అన్నా! నాటి బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన అమర వీరులకు భార్యాబిడ్డలు లేరా?! ఆ ఆదర్శ మూర్తులను ఎప్పటికీ ఆరాధిస్తాం కదా! మేమూ బడుగు, బలహీన వర్గాల భవితవ్యం కోసం ఆరాట పడుతున్నాం. సమ సమాజ స్థాపనే మా ధ్యేయం. ఆ ధ్యేయం మా రదు. కుటుంబం కోసం ఉద్యమాలను వీడేది లేదు. ఏనాటికైనా అంతిమ విజయం పోరా టానిదే. జై తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం... వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ'' అని నినదించాడా వీరుడు!
పోలీసు తూటాలకు బలవుతానని తెలిసిన సమయంలోనూ ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఆ వీరుడే కస్తూరి కుటుంబరావు! గుంటూరు జిల్లా పాలపర్తిలో మలబారు పోలీసు క్యాంపులో చిత్రహింసలకు గురవుతూనే ఆయన ఆ విప్లవ నినాదం చేశారు. పోలీసులకు లొంగిపొమ్మన్న తన సోదరులకు సర్ధిచెబుతూ ఆదర్శాల బాట వీడనని, ఉద్యమాన్ని ఆపేదిలేదని తేల్చి చెప్పా రు. ప్రజల కోసం మృత్యువునైనా ఆనందంగా ఆహ్వానిస్తానన్న ఆయన చేనేత కార్మికుల కనురెప్పగా నిలిచారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాడు.1906లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కనగాల గ్రామంలో పున్నయ్య, పున్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లల్లో ఆయన నాల్గవ సంతానం. కుల కట్టుబాట్లు సంప్రదా యాలు ఎక్కువగా ఆచరించే సనాతన బ్రాహ్మణ కుటుంబం అది. చిన్నతనం నుంచే చదువులో తెలివైన విద్యార్థిగా కుటుంబరావు మన్నన పొందారు. చదువు పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఉపాధ్యాయ ఉద్యమ బాట పట్టారు. రాత్రి పాఠశాలల్లో ఆయన ప్రజలను చైతన్య పరిచేవారు. దళితులు, యాదవులు, చేనేత కార్మికులు వంటి నిరుపేదలుండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని పని చేశారు. రోజుకొక ప్రాంతానికి లాంతరు తీసుకుని వెళ్లేవారు. వెంట తీసుకెళ్లిన పత్రికలు చదివి వినిపించే వారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆయన గాంధేయవాదిగా గుర్తింపు పొందారు. గుంటూరు జిల్లాలో పలు గ్రామాల్లో గ్రంథాల యాల ఏర్పాటుకు కృషి చేశారు. రాష్ట్రంలోనే గ్రంథాలయ ఉద్యమ నిర్మాతల్లో ఆయన ఒకరు.
అంటరానితనం నిర్మూలన కోసం కుటుంబరావు నిత్యం తపించేవారు. రేపల్లె తాలూకా ఇసుక పల్లి, రేపల్లె, భట్టిప్రోలు, ఐలవరం, రాజోలు, కనగాల, చెరుకుపల్లి గ్రామాల్లో చేనేత కార్మికులే ఎక్కువ. వారి వృత్తి మనుగడకు జరిగే ఉద్యమాలకు కస్తూరి వేగుచుక్క అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. కష్టజీవుల భవితవ్యాన్ని తీర్చిదిద్దాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే సరైన మార్గమని నమ్మారు. ఆనాటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలకు సారథ్యం వహించసాగారు. ఉద్యోగం వదలి పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా మారారు. తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన పని ప్రారంభించారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని చీరాల, వేటపాలెం ప్రాంత పార్టీ ఆర్గనైజరుగా రాష్ట్ర పార్టీ ఆయనను నియమిం చింది. అప్పటి నుండి ఈ ప్రాంతంలో ఆయన ఉద్యమ ప్రస్ధానం మొదలైంది. భార్య హైమవతి, నలుగురు పిల్లలతో 1944లో తన నివాసాన్ని పందిళ్ళపల్లికి మార్చారు. ఆ తర్వాత జాండ్ర పేటలోనూ కొంతకాలం నివసించారు. తదు పరి వేటపాలెంలో స్థిరనివాసం ఏర్పరుచు కొన్నారు. అదే ఆయన కేంద్ర కార్యస్థానమైంది. కుటుంబరావు నేతృత్వంలోనే 1946 జూన్‌ 19వ తేదీన రాష్ట్ర చేనేత మహాసభను పందిళ్ళపల్లిలో నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వృత్తిదారులు, నాయకు లు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఈ సభకు వచ్చారు. రాష్ట్ర కేంద్రం నుండి పుచ్చల సత్యనారా యణ, కడుపు రాములు హాజరయ్యారు. సంగీత దర్శకులు బి.గోపాలం, సినీనటి వసంత (జూ పూడి) పాల్గొన్నారు. 'నాజర్‌ దళం' బుర్రకథ ప్రజలను ఉర్రూత లూగించింది. ఆ సభలు విజయవంతం కావడంతో కుటుంబరావు మంచి కార్యదీక్షా పరుడుగా గుర్తింపు పొందారు.
చేనేత రంగంలో కృషి చేస్తూనే బంజరు భూముల సమస్యపైనా ఆయన ఆందోళనలు నిర్వహించారు. బీడీ కార్మికుల హక్కుల సాధనకు ప్రజా ఉద్యమాలు నిర్మించారు. చీరాల ప్రాం తంలో పార్టీ విస్తరణకు కృషి చేశారు. చేనేత కార్మిక కుటుంబాల నుండి మాణిక్యాల వంటి కార్యకర్తలను తయారు చేశారు. అలాంటి వారిలో సజ్జా సూర్య బాలానందం, బండారు వెంకటేశ్వర్లు వంటి వారు ముఖ్యులు. వారిని మగ్గం గుంటల నుండి వెలికితీసి విప్లవ యోధు లుగా తీర్చిదిద్దారు. వేటపాలెంలో బలమైన ప్రజా పునాదిగల కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు.
1936లో ఏర్పడిన వేటపాలెం చేనేత సొసైటీ ఆది నుండి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే సాగింది. కుటుంబరావు ఆ ప్రాంతానికి వచ్చేనాటికి సొసైటీ అప్పుల్లో మునిగి ఉంది. బండ్ల గరటయ్యను కలుపుకొని అప్పుల నుంచి బయట పడేందుకు కుటుంబరావు కృషి చేశారు. వేటపాలెంలో సజ్జా భాస్కరరావు మేడ మీదగల చేనేత సంఘం కార్యాలయమే కేంద్రంగా కుటుంబరావు పనిచేసే వారు. ఆయనకు సజ్జా పిచ్చయ్య అన్ని విధాలా అండగా నిలిచారు. సజ్జా భాస్కరరావు ఇంటి వద్దే పార్టీ సమావే శాలు జరిగేవి. అక్కడే రాజకీయ పాఠశాల నడిపే వారు. రైలుకట్టకు పడమర తోటల్లో జరిపే పార్టీ రహస్య సమావేశాల్లో కుటుంబ రావు, బండారు వెంకటేశ్వర్లు, సూర్య బాలానం దం తదితరులు పాల్గొనే వారు. అప్పటికే పార్టీ బాపట్ల తాలూకా కమిటీలో కుటుంబరావు నాయకులు.
ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు ప్రగడ కోటయ్య కమ్యూనిస్టు పార్టీ, చేనేత కార్మిక సంఘమంటేనే మండిపడేవారు. 1948లో ప్రకాశం మంత్రివర్గం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. కమ్యూనిస్టు నాయకులను కనిపిస్తే కాల్చి వేయమని ఆర్డరు జారీ చేసింది. ఆ సమయంలో గుర్తింపు కలిగిన కార్యకర్తలం దరూ రహస్య జీవితానికి వెళ్ళారు. జాండ్రపేట మునసబు పార్టీ హిట్‌ లిస్టులో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు తమ వేటను ముమ్మరం చేశారు. రహస్య స్థావరాల్లో తలదాచుకుంటూ కూడా రహస్య సమావేశాల ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు కస్తూరి ప్రయత్నిం చారు. నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్ని కార్యకర్తల్లో కలిగించారు. పోలీసులు పెట్టే హింసలకు కుంగిపోకుండా ముందుకు సాగే మనోధైర్యాన్ని నూరిపోశారు. ప్రలోభాలకు లొంగక తమ నాయకుల శ్రేయస్సే ధ్యేయంగా భావించిన స్థానిక పేదలు వారిని రక్షించారు. కుటుంబరావుకు కొరియర్‌గా బండారు సుబ్బా రావు పని చేశారు. చీరాల, బాపట్ల నాయక త్వంతో కుటుంబరావు నిరంతరం చర్చలు జరిపేవారు.
ఆ రోజుల్లో ఎవరైనా దళాల్లోకి ఎంపికయితే కొత్తపట్నం వద్ద శిక్షణ ఇచ్చే వారు. ఆ తర్వాత నల్లమల అడవులకు పంపేవారు. ఆ సమ యంలో కుటుంబరావు వేటపాలెం దళంతో కలిశారు. దళాలపై పోలీస్‌ నిఘా పెరిగింది. అహార సరఫరా మార్గాలను మూసేశారు. చివరకు దళాలు స్థావరాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కుటుంబరావు కూడా దళంతోనే ముందుకు సాగాల్సి వచ్చింది. వారితో కలసి కొత్తపట్నం బయలు దేరాడు. చినగంజాం వరకూ వెళ్ళిన తరువాత కొత్త పట్నం రావద్దని కబురు చేరింది.
ఆ దళం చినగంజాం నుండి వెనక్కిమళ్లాక పందిళ్ళపల్లి చేరింది. అక్కడికి పడమర దిక్కు నున్న ఆకు తోటల్లో తలదాచుకున్నారు. ఓ కొరియర్‌ అన్నం మూట తెచ్చారు. అది ఒక్క రోజుకే సరిపోయింది. 1950మే ఒకటో తేదీన కుటుంబరావు, బాలానందం, బండారు సుబ్బా రావు (కొరియర్‌) రైలు కట్ట పడమరకు స్థావరాన్ని మార్చారు. తోటల్లో గుండా స్వర్ణ వైపు వెళ్ళారు. అక్కడ మాగాణుల్లోని వరి కుప్పల కాపలా కోసం వేసిన చిన్న గుడిసెలోకి దళం చేరింది. ఆ రోజంతా వారికి తిండి లేదు. రెండోతేదీ ఉదయం జాండ్రపేట వెళ్ళి అన్నం తెస్తానని కొరియర్‌ సుబ్బారావు బయలు దేరాడు. కాని మధ్యలోనే మనసు మార్చుకొన్నాడు. భయంతో పోలీసులకు లొంగిపోయాడు. సా యంత్రం వరకూ అతని కోసం ఎదురు చూసిన దళ సభ్యులు ఏదో జరిగి ఉంటుందని అనుమా నించారు. వెంటనే వేషాలు మార్చుకున్నారు.నొస టి వెంట్రుకలు తీసేశారు. తలకి గుడ్డలు చుట్టు కున్నారు. రైలుకట్ట సమీపంలోని తోటల్లో చేరారు.
మూడో తేదీ కూడా బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు ఏర్పడలేదు. మే నెల ఎండలు మండి పోతున్నారు. హోరున వడగాలి వీస్తోంది. రెండు రోజులుగా ఆహారం లేదు. దళ సభ్యులంతా నీరసించి పోయారు. భయానక వాతావరణం. నర సంచారం లేదు. చిన్న చిన్న గుంటల్లో ఇంకి పోవడానికి సిద్ధంగా వున్న బురద నీటిని తాగి దాహార్తి తీర్చుకున్నారు. ఆ రాత్రికి రైలు కట్టదాటి రామక్రిష్ణాపురం, హస్తినా పురం మధ్యనున్న సిపాయి పేట తోటల గుండా కుందేరు ఒడ్డుకు చేరారు. కుందేరులోనూ నీరు లేదు. ఆ ఏరులోని జమ్ము గుబురులు దాటి తూర్పు ఒడ్డునున్న పొదల్లో రక్షణ తీసుకున్నారు.
నాలుగో తేదీ తెల్లవారుతుండగా అక్కాయి పాలెం నుండి పెరుగు అమ్ముకునేందుకు వెళ్ళుతున్న ఒక సోదరి కనిపించింది. ఆమెను పల కరించిన బాలానందం ఓ చీటీ రాసి ఇచ్చారు. దాన్ని ఆమోదగిరి పట్నం (నేటి నూలుమిల్లు ప్రాంతం)లోని పన్నెం సుబ్బారావుకు చేర్చమని కోరాడు. ఆమె విషయం అర్థం చేసుకుంది. చీటీని భద్రంగా దాచుకుంది. ఆ చీటీ చేరగానే సుబ్బారావు తమకు ఆహారం తెస్తాడని ఎదురు చూశారు. ఆ ప్రయత్నం ఫలించ లేదు. సాయం త్రం అయింది. ప్రొద్దుగుంకుతుంది. అకస్మా త్తుగా పొదల్లో నుండి తుపాకి పేలిన శబ్దం వినిపించింది. పోలీసులే కాల్పులు ప్రారంభిం చారని అనుమానించారు. ఎవరిలోనూ పరుగెత్తే ఓపిక లేదు. శరీరాలు చచ్చుబడి పోయాయి. అలానే నేలపై పాక్కుంటూ పొదల మాటు నుండి ఇద్దరూ బయటకు వచ్చారు. సమీపంలోని సరివి తోటల్లోకి పరుగెడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు.
తుపాకీతో పిట్టల వేట కోసం వచ్చినజాండ్ర పేటకు చెందిన బీరక మల్లయ్య బాలానందాన్ని గుర్తుపట్టాడు. ''నందిగాడు (సూర్య బాలా నందం)లా ఉన్నాడు'' అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటలను సమీపంలోని జనం విన్నారు. వెంటనే గ్రామంలోకి కబురు వెళ్లింది. క్షణాల్లో మునసబు మనుషులు వచ్చి వారిద్దరిని పట్టు కున్నారు. సూర్య బాలానందం ధృఢకాయుడు. కుటుంబరావు చిన్న మనిషి. ఎప్పుడూ ఎదో ఆయుధాన్ని వెంటే వుంచుకునే సూర్యబాలా నందం వద్ద ఆ రోజు ఎటువంటి ఆయుధమూ లేదు. ప్రతిఘటించే శక్తీ లేదు. కస్తూరి కుటుంబ రావు, సజ్జా బాలానందాన్ని జాండ్రపేట మునసబు వద్ద హాజరు పరిచారు. ఈ దుర్వార్త క్షణాల్లో ఆ ప్రాంతం అంతా పాకింది. హఠాత్‌ పరిణామంతో మగ్గాల శబ్ధం ఆగిపోయింది. నేతన్నల గుండెలు అవిసి పోయాయి. అందరి లోనూ కన్నీరుబికింది.
అదే సమయంలో పందిళ్ళపల్లి కామ్రేడ్‌ బండారు వెంకటేశ్వర్లు రైలుకట్ట పడమర నాగవరపమ్మ దేవాలయం ప్రాంతంలోని ఆకు తోటలో జ్వరంతో బాధపడుతుండగా పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. ముగ్గురినీ గుంటూరు జిల్లాలోని పాలపర్తి మలబారు పోలీసు క్యాంపు కు తీసుకు వెళ్లి చిత్రహింసలకు గురిచేశారు.
కనగాల గ్రామంలో కరణాలుగా ఉంటున్న కుటుంబరావు పెదనాన్న కుమారులు పోలీసు లకు లొంగిపోతే కేసులన్నీ రద్దు చేయిస్తామని కస్తూరికి హితవు చెప్పారు. ప్రాణాలు కోల్పోవద్దని, భార్యాబిడ్డలను అనాధల్ని చేయ వద్దని అభ్యర్థించారు. ఉపాధ్యాయ వృత్తిలో భేషు గ్గా బతకొచ్చని ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వారి మాటలకు కస్తూరి చిరునవ్వు నవ్వారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన అమర వీరులకూ భార్యాబిడ్డలున్నారని అన్నారు. తాను ఉద్యమాలను వీడేది లేదని తేల్చి చెప్పాడు. అతని పట్టుదల తెలిసిన సోదరులు నిరాశగా వెనుదిరిగారు.
1950 మే 12వతేదీన అమరుల రక్తంతో పాలపర్తి పోలీసు క్యాంపు తడిసింది. రెచ్చి పోయిన పోలీసులు వీరులపై తుపాకులు ఎక్కుపెట్టారు. అరెస్టుచేసిన అందరినీ పాలపర్తి ఊరు వెలుపలకు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అక్కడే చింత చెట్లకు కట్టేశారు. కర్కశంగా తుపా కులతో కాల్చి చంపారు. కస్తూరి కుటుంబరావు, సజ్జా సూర్య బాలానందం, బండారు వెంకటే శ్వర్లుతో పాటు,చివుకుల శేషశాస్త్రి, గుంటూరు జిల్లా ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కార్యదర్శి ముక్తినూతలపాటి లక్ష్మినారాయణ రక్తంతో ఆ ప్రాంతం రుధిర క్షేత్రమైంది. తుపాకుల శబ్ధాలు విన్న పరిసర ప్రాంతాల ప్రజలు పరుగు పరుగున అక్కడకు వచ్చారు. రక్తం మడుగులో నిర్జీవులైన పడివున్న తమ ప్రియతమ నాయ కులను చూసి అవాక్కయ్యారు. అశ్రుతర్పణ చేశారు. కన్నీటి ధారలతో జోహారులు అర్పిం చారు. వారి ఆశయబాటను మరువలేమంటూ ప్రతిన బూనారు. వారి స్మృతి చిహ్నంగా పాల పర్తిలో స్తూపం నిర్మించారు. ఇటీవలే వేటపాలెం సెంటర్‌లోనూ ఆ ముగ్గురు అమరవీరుల పేర స్థూపం నిర్మించారు. జాండ్రపేటలో కస్తూరి కుటుంబరావు స్మారక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబరావు మరణం తర్వాత ఆయన భార్య హైమావతి అనేక కష్టాలు అను భవించారు. వేటపాలెంలో చిన్నచిన్న వ్యాపా రాలు చేస్తూ పిల్లల్ని పోషించారు. తర్వాత తెనాలి, విజయవాడలో ఏదో ఒక పని చేస్తూ వారిని చదివించారు. రెండో కుమారుడు రాజే శ్వరరావు ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. అప్పట్లోనే పెద్ద కుమారుడు జితేంద్ర నాథ్‌కు విజయవాడ విశాలాంధ్ర దినపత్రికలో పార్టీ ఉపాధి కల్పించింది. హైమావతి 1989లో మరణించారు. రాజేశ్వరరావు రాజమండ్రి రైల్వే పాఠశాలలో పని చేసి 2005లో రిటైరయ్యారు. ఆయన భార్య సువర్ణ రాజమండ్రిలోనే చిన్న పాఠశాల ప్రారంభించారు. దాన్ని ప్రస్తుతం వారి కుమారుడు పవన్‌కుమార్‌ నడుపుతున్నారు. జితేంద్రనాథ్‌ 2001లో మరణించారు. కుటుంబరావు స్మారక స్థూపం రేపల్లె సమీపం లోని ఇసుకపల్లెలోనూ ఉంది.
(కుటుంబరావు సహచరులు కామ్రేడ్స్‌ పత్తిపాటి ఆదినారాయణ, పింజల వెంకట సుబ్బారావు, గొర్రె నాగలింగేశ్వరరావు, రాజమండ్రికి చెందిన ప్రకాష్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా) 
- వై. సిద్దయ్య

No comments:

Post a Comment