Tuesday, September 13, 2016

|| సాకులొద్దు..హోదా ఇవ్వాల్సిందే ||
- ప్యాకేజీతో ప్రయోజనం ఉండదు... సీతారాం ఏచూరి
- పవన్‌ కలిసివస్తానంటే చూద్దాం
సాకులు చెప్పొద్దు...ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్‌లో తాము గట్టిగా పట్టుబట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కాకుండా ఇంకేమిచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం ప్రజలను మభ్యపుచ్చాలని చూస్తోందని ఏచూరి విమర్శించారు. సోమవారం ఢిల్లీలో ఏపికి కేంద్ర సాయంపై సిపిఎం, సిపిఐ జాతీయ నేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌ రెడ్డి స్పందించారు. తొలుత ఏచూరి మీడియాతో మాట్లాడుతూ...ప్యాకేజి వల్ల ఉపయోగమేమీ లేదన్నారు. గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు అమలుచేయరని వారు కేంద్రాన్ని నిలదీశారు. విభజన సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రస్తావనకు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు తాము అధికారం లోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు మాట మార్చుతున్నారని వారు విమర్శించారు. పవన్‌ వామపక్షాలతో కలిసి పనిచేయలనుకోవడం మంచిదేననీ, ఎంతమంది కలిసొస్తే అంతమంచిదనీ ఏచూరి అభిప్రాయపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ కలిసి వస్తానంటే అప్పుడు దీనిపై రాష్ట్ర కమిటీ చర్చించి, నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రత్యేక హోదాకు ఇతర రాష్ట్రాలను లింకు పెట్టి చూపడం సరి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపి పట్ల అనుసరిస్తున్న ద్రోహాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదు, ఆ మాట చెప్పే ధైర్యం కూడా దానికి లేదన్నారు.

No comments:

Post a Comment