Sunday, September 25, 2016

హిందూత్వ జాతీయవాదం మీడియా

హిందూత్వ జాతీయవాదం మీడియా
                     జాతీయవాదం జాతీయోద్యమానికి పునాదివేసి, భారత పౌరులందరినీ ఒక చోటికి చేర్చిన ఒక విశేష భావన. దీని లక్ష్యం ఒక్కటే. భారతదేశమనే ఈ అందమయిన పూదోట నుండి విదేశీ సామ్రాజ్యవాద పాలకులను తరిమికొట్టడం. భారత జాతీయవాదం తానొక పాకిస్థాన్‌ హిందుత్వ కాకూడదని ఒక స్వప్నాన్ని కని, దానిని సాకారం చేసుకున్నది. ఇది 1950ల నాటిమాట. ఈ నాటి ఆధునిక యూ రప్‌ విభిన్న జాతుల, భాషల, మతాల, వర్గాల, ప్రాంతాల ప్రజలను ఒకటిగా చేసేందుకు అత లాకుతల మవుతున్నది.
కాని ఈనాడు జాతీయ వాదాన్ని అందరినీ కలుపుకు పోయేందుకు కాక విడగొట్టేందుకు ముందుకు తీసుకు వస్తున్నారు. అనేక దేశాలలో పాలకులు తమ పాలనను స్ధిరపరచుకునేందుకు ఈ పద్ధతిని అవలంభిస్తారు, విద్వేషాలు రెచ్చ గొట్టయినా ప్రజాబలాన్ని తమ వైపు కూడగట్టుకు నేందుకు ఉపయోగించుకుంటారు.మానవ నాగరికత చరిత్ర ఇటువంటి ఉదాహరణలతో నిండిపోయివుంది. ప్రస్తుతం భారతదేశంలోని మతోన్మాద శక్తుల నుండి, వారి జాతీయత భావన నుండి మనం ఆ విధమైన దాడిని ఎదుర్కొంటున్నాం. 1947లో భారతదేశం చీలిపోకముందు ఆ విధమైన ప్రయత్నమే చేశారు. ఆనాడు జాతీయోద్యమం దానిని నిర్ద్వందంగా తిరస్కరించింది.
ప్రస్తుత పరిస్థితులలో తరచుగా రాజకీయ పోరాటాలు వివిధ రకాలైన జాతీయవాద దృక్ప ధాలను ముందుకు తీసుకురావటంలో ప్రతిబిం బిస్తుంటాయి. అణగారిన ప్రజల పోరాటాలను అణచివేయటానికి, తమ వర్గపాలనను సుస్థిరం చేసుకోవటానికి వివిధ దేశాలలోని పాలక వర్గాలు ఆ దేశానికి ప్రత్యేకమైన పౌరాణిక కథ లను ప్రత్యేకమైన జాతీయవాద భావనల ద్వారా ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తుంటారు. (సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భారత దేశంలో నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు, ఆర్‌యస్‌యస్‌, బిజెపిల జాతీయవాదం మధ్య నున్న సంబంధాన్ని 2016 జనవరి- మార్చి మార్క్సిస్ట్‌లో 'నేషనలిజం, హిందూత్వ అండ్‌ ది అసాల్ట్‌ ఆన్‌ థాట్‌' వ్యాసంలో ప్రభాత్‌ పట్నాయక్‌ అద్భుతంగా వివరించాడు) స్థాని కంగా ప్రాచుర్యంలో ఉన్న పురాణ గాధలను ప్రజలలో వ్యాపింపజేసి అక్కడి అణగారిన ప్రజలు చేసే పోరాటాలను అణచివేసేందుకు వాటిని ఉపయోగించుకుంటారు.
మానవ నాగరికత పరిణామ క్రమంలో పురాణాలకు చరిత్రకు మధ్య బేధం, వేదాం తానికి తర్కానికి మధ్య తేడా పలచబడి పోతుం టుంది. అందువలననే పౌరాణిక గాధలు చారి త్రక వాస్తవాలుగా ఎంతో సులువుగా ప్రజల లోకి తీసుకుని వెళ్ళి, భిన్నమైన జాతీయ వాదానికి పునాదులుగా చూపగలుగుతున్నారు. ఇటువంటి అనేక అంశాలలో ఒకటైన, ఆధునిక జెరుసలెం రాజ్యస్థాపనకు పునాదులలో ఒకటిగా ఉన్న జెరూసలెం లోని డేవిడ్‌ పట్టణం, గుడి మంచి ఉదాహరణ. ''ఈనాడు ఇజ్రాయిల్‌ తననుతాను సమర్ధించుకునేందుకు ఉపయోగ పడేది కనీసం రెండు వేల ఏళ్ళ క్రిందటిచరిత్రే. ఆ తరువాతి కాలంలో జరిగిన చరిత్ర, ఆ దేశం చేసిన యుద్దాలను, ఇజ్రాయిల్‌ ఆవిర్భా వాన్ని సమర్ధించటానికి ఉపయోగపడవు. కాబట్టి తుడిచి వేయబడ్డాయి. జెరుసలెం యూ దుల మతకేంద్రంగా ఉండేదనే వాదనకు, యూదులకు రాజధానిగా ఉండేదనే వాదనను సమర్ధించుకునేందుకు జెరుసలెంలో యూదుల గుడి ఉందన్న వాస్తవం ఒక ఆధునిక రాజకీయ వాస్తవంగా మలచబడింది. (రోమను సామ్రా జ్యానికి పూర్వం రాజధానుల గురించి మాట్లా డటం అర్ధరహితమన్నది వేరే విషయం) ఏమయి నప్పటికీ ఇది అనేకమంది యూదులు తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవటాన్ని సమర్థించు కోవటానికి ఉపయోగించుకోవటంతో పాటు జెరూసలేంను రాజధానిగా చేసుకోవటాన్ని సమర్థించుకొనేందుకు కూడా ఉపయోగపడింది. (నవశతాబ్దం, ఎరిక్‌హాబ్స్‌బామ్‌, లిటిల్‌, బౌన్‌ అండ్‌ కంపెనీ, 1999).
హాబ్స్‌బామ్‌ ఇంకా ఇలా ''అంటున్నారు'' జాతీయవాద కల్పితగాధలు ప్రజల వాస్తవ అనుభవాల నుండి యధాలాపంగా ఉత్పన్నం కావు. ఇవి ప్రజలు ఇతరుల నుండి, పుస్తకాల నుండి, చరిత్ర నుండి, సినిమాల నుండి, ప్రస్తుతం టెలివిజన్‌ల నుండి కూడా గ్రహిస్తారు. ఇవి సాధారణంగా చారిత్రిక జ్ఞాపకాలలోనూ, జీవన సాంప్రదాయాలలోనూ భాగంగా ఉండవు. కొన్ని ప్రత్యేక అంశాలలో మినహాయింపుగా మాత్రమే జాతీయవాద కల్పిత గాధలు మతం యొక్క ఉద్పాదనగా మారతాయి. ఇజ్రాయిల్‌ నుండి యూదులను బహిష్కరించటం, వారు తిరిగి తమ దేశానికి రావడం వారి మత కార్యకలాపాలలో,సాహిత్యంలో భాగమయింది. కొన్ని పరిమితులలో సెర్బ్‌ల విషయంలో కూడా ఇది కొంతమేరకు నిజమయింది. మధ్యయుగా లలో సెర్బులు రాజ్యాన్ని కోల్పోవటం సనాతన మతసేవలలో భాగమయింది. దాదాపు సెర్బి యన్‌ రాజులందరూ ఆర్థడక్స్‌ విశ్వాసానికి నమూనాలుగా ఉన్నారు. ఇదొక ప్రత్యేకమైన అంశం. అయితే ఇక్కడ కూడా ప్రజలు దీనిని నిరంతరంగా గుర్తుంచుకోరు. కొందరు వారికి నిత్యం గుర్తు చేస్తుంటారు కాబట్టి గుర్తుంచు కుంటారు.
జర్మనీలో ఫాసిజం ఎదుగుతున్న కాలంలో హిట్లర్‌ ప్రత్యేకంగా నాజీ జాతీయవాదాన్ని రూపొందించి, ప్రజామోదం లభించేలా ప్రచా రం చేశాడు. జర్మనీ ఒక పెద్ద ''జాతీయజీవరాసి'' అని, అందులో ప్రజలందరూ కణాలని హిట్లర్‌ భావించాడు. అందువలన జర్మన్‌ ప్రజలం దరినీ ఐక్యం చేయాలన్న హిట్లర్‌ ప్రయత్నం జర్మన్‌ దేశ కణాలన్నింటినీ కలిపి ఒక దృఢమైన ఆకృతిని (రాజకీయ) రూపొందించటానికి చేసిన ప్రయత్నానికి ప్రతిబింబం. జర్మనీ విచ్చిన్నం అవుతుందన్న హిట్లర్‌ ప్రకటన నుండి జాతీయ సోషలిజం పుట్టింది. అతని పోరాటం (మీన్‌ కాంఫ్‌) జర్మన్‌ రాజకీయ నిర్మాణం దృఢంగా- శక్తివంతంగా- జర్మనీని విచ్ఛిన్నం చేయాలన్న ఆంతరంగిక శక్తికి లొంగకుండా ఉండాలన్నది అతని ఆశ.
దీనిని ఏ విధంగా చేయాలి? హిట్లర్‌ ఆతని మీన్‌కాంఫ్‌లో తన ఫాసిస్టు తరహా జాతీయ వాదాన్ని ఈ విధంగా చెప్పుకున్నా డు. ''ఈ ప్రపంచం మొత్తంలో సహజంగానే ఏ జాతికాజాతి ఏమాత్రం కల్తీ లేకుండా కొనసాగాలన్న కోరిక వలన ఒక జాతి వేరొక జాతి నుండి స్పష్టంగా విడివడి ఉంటుంది. వాటి మధ్య తేడాలు బాహాటంగా తెలుస్తాయి. రోజువారి జీవన పోరాటం రోగిష్టిగానూ, నిస్సత్తు వగానూ, ఊగిసలాటతోనూ ఉన్న ప్రతిదానిని వెనక్కునెట్టి వేస్తుంది. ఈ పోరాటం జాతుల ఆరోగ్యాన్ని, పోరాట పటిమను పెంచుతుంది. జాతి శ్రేష్టమయినదిగా అభివృద్ధి చెందటానికి అవసరమైన కారణాలలో ఇదొకటి.
''ఇందుకు భిన్నంగా ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది. అంతేకాదు తిరోగమనం ప్రారంభ మవుతుంది. ఎప్పుడూ హీనులే ఉత్తముల కంటే అధిక సంఖ్యలో ఉంటారు. కాబట్టి హీనులకు, ఉత్తములకు ఒకే రకమయిన సంతాన సామర్ధ్యం ఉండి, ఇద్దరి సంఖ్యా ఒకటిగా ఉంటే పర్యవ సానం ఉత్తముల నాణ్యత బలవంతంగా తగ్గించ బడుతుంది. అందువలన నాణ్యతను సరైన పాళ్ళలో కాపాడేందుకైనా ఉత్తముల తరఫున జోక్యం చేసుకోక తప్పదు.''
దీని పర్యవసానంగానే లక్షలాది యూదు లను తగలబెట్టడం, మానవత్వాన్ని మంట గలిపే దారుణ మారణహోమం, ఘోరనేరాలు జరిగా యి. ఈ అమానవీయ జాతీయవాద నిర్మాణాన్ని ఓడించడానికి, రూపుమాపడానికి భయంకరమైన ప్రపంచ యుద్ధం చేయాల్సివచ్చింది.
భారతదేశానికి సంబంధించినంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి హీనులకు వ్యతిరేకంగా ఉత్తముల పాలనను స్థాపించాలన్న వాదనను గమనించండి (హీనులంటే ముస్లింలు, క్రిస్టియ న్‌లు, మిగిలిన మైనారిటీ మతాలవారు, దళితు లు, మహిళలు, వీరికి తోడు కమ్యునిస్టులు కూడా) రాజకీయశక్తి, సామాజిక నియంత్రణ అధీనంలో ఉన్న అధిపత్య గ్రూపు ఆలోచనలను వ్యతిరేకిం చేవారిని వారు భరించలేరు.
ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ జాతీయవాదమే హిందూరాష్ట్ర స్థాపనకు వారి సైద్ధాంతిక సమర్ధన ( అది హిందుయిజానికి చాలా దూరంగా ఉంటుంది. వాస్తవంగా దీనిని హిందూత్వ రాష్ట్ర అనవచ్చు). దీనికి ఆధారంగా'' విదేశీ జాతులు దండెత్తి రాక ముందు ఎనిమిది వేల సంవత్స రాల నుండి, ఇంకా చెప్పాలంటే పదివేల సంవ త్సరాల నుండీ కూడా అప్రతిహతంగా, అప్రతి ఘటితంగా ఈ భూమి హిందువుల వశంలోనే ఉండింది. అందువలననే ఈ భూమి హిందూ స్థాన్‌గా, హిందువుల భూమిగా పిలవబడు తున్నది'' (ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ యం యస్‌ గోల్వాల్కర్‌).
హిందువుల ఔనత్యాన్ని ఈ విధంగా స్ధిరీకరించి, హిందువులు ఎప్పుడూ ఒక జాతిగా ఉండేవారనీ, ఉంటారన్న ఒక అశాస్త్రీయమైన, చారిత్రిక విశ్లేషణకు నిలబడని వాదనను చేస్తు న్నది ఆర్‌ఎస్‌ఎస్‌. హిందుత్వదేశం అసహనం గానూ, మత ప్రాతిపదికను ఆర్‌ఎస్‌ఎస్‌ ఘంటాపదంగా చెప్తున్నది. ''ఏమాత్రం సందేహా నికి తావులేని ముగింపు మన ముందున్నది... హిందూస్థాన్‌ హిందూదేశంగానే, పురాతన హిందూ దేశంగానే ఉంటుంది. ఈ దేశానికి సంబంధించని వారందరూ అంటే హిందూ జాతి, మతం, సంస్కృతి, భాషకు సంబంధించని వారు సహజంగానే''జాతి'' జీవనానికి వెలుపల గా ఉండిపోతారు.
''ఫలితంగా జాతిని పునర్‌నిర్మించి, పునరు జ్జీవింపజేసి, అధఃపాతాళానికి పడిన జాతి శృంఖలాలను తెంచే ఉద్యమాలే నిజమయిన జాతీయోద్యమాలు. హిందూజాతిని శ్లాఘించే వారు, జాతిని తమ ప్రాణప్రదంగా చూసుకునే వారు మాత్రమే దేశభక్తులు, వారే ఉద్యమించి, శ్రమించి వారి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మిగిలిన వారంతా దేశద్రోహులు. జాతియొక్క లక్ష్యానికి శత్రువులు ఇంకా దయతో చెప్పాలంటే తెలివి తక్కువవారు. (గోల్వాల్కర్‌ 1939 పిపి 43-44)
'జాతీయవాదం' అంటే ఏకశిలా సదృస్యం అనీ అదేసర్వం అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తు న్నారు. అందుకే వారి నినాదాలు ఒకేవిధంగా, భారతదేశం నిరంతరం తిరస్కరిస్తున్న 'హింది, హిందూ, హిందుస్థాన్‌''గా ఉంటున్నాయి.
''హిందువులు కాని వారికి సంబంధించి నంత వరకు వారి తేడాలు అన్నీ వదిలి పెట్టి, ఈ జాతి,మతాన్ని, సంస్కృతిని, బాషని స్వీక రించి, ఈ జాతిలో పూర్తిగా మమేకం కాకపోతే వారికి జాతీయ జీవనంలో ఎటువంటి స్థానం ఉండదు. వారి జాతి, మతం, సంస్కృతుల బేధా లను కాపాడుకున్నంత కాలం వారు విదేశీ యులుగా మాత్రమే ఉంటారు. (గోల్వాల్కర్‌, 1939 పి/45)
''వారికి (ఈ సంస్కృతీ, సాంప్రదాయాలు, మతం) వీటిని స్వీకరించడం తప్ప వేరే మార్గాం తరం లేదు. ఉండకూడదు. మనది అత్యంత పురాతన దేశం. మనదేశంలో ఉండేందుకు వచ్చిన విదేశీయుల పట్ల ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిద్దాం. వ్యవహరించాలి. (గోల్వాల్కర్‌, 1939 పిపి47-48)
పురాతన దేశం ఎలా వ్యవహరించాలి? ఫాసిస్టు జర్మనీని ఇంతకన్నా పొగడడం అసాధ్యం.'' యూరప్‌ అంతా కమ్ముకున్న జర్మన్‌ మూలవాసుల అనాది జాతిసృహ తిరిగి ఆధునిక జర్మనీలో తలెత్తింది. ఫలితంగా పూర్వీకులకు అలవాటైన దోపిడీని అనుసరించాల్సిందిగా తమతోటి వారిపై వత్తిడి చేయడం జరిగింది.'' ఇక్కడా అదే జరిగింది. అతిరధ మహారధులింత మంది వరుసగా ఇక్కడ ఉద్భవించి, ప్రపంచానికి ఆధ్యాత్మికతను అందించారు. మనజాతి ఆధ్యాత్మికత ఈనాడూ వారిని ఉత్తేజపరుస్తున్నది. (గోల్వాల్కర్‌ 1939, పి32)
ఇంకా ''జర్మనులు వారి జాతి పవిత్రతను, సంస్కృతిని కాపాడేందుకు జాతుల (యూదులు) నుండి వారి దేశాన్ని శుద్ధి చేయటం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. జాతీయ ఔన్నత్యం ఇక్కడ స్పష్టంగా కనపడింది. భిన్నమైన ఇతర జాతులను, సంస్కృతులను తమలో ఇముడ్చుకోవడం అన్నది ఎంతకష్ట సాధ్యమో, వారితో పరిపూర్ణంగా కలిసి ఉండడం ఎంత ఇబ్బందికరమో జర్మనీ మనకు చూపించింది. మన హిందుస్థాన్‌ ఈ అనుభవం నుంచి నేర్చు కుని లాభపడాల్సి ఉంది'' (గోల్‌వాల్‌కర్‌ 1939, పి35)
ఈ భావాలకనుగుణంగానే ఆర్‌.ఎస్‌.ఎస్‌ హిందుత్వ జాతీయవాదం అంటే హిందూజాతిని కీర్తిస్తున్న వారు మినహా మిగిలిన వారందరూ ''జాతి ప్రయోజనాలకు శతృవులు ద్రోహులు'' అని చెబుతున్నది. ఈ రోజు ''భారత్‌ మాతాకి జై'' అనమని బలవంతం చేయడం వెనుకున్న అర్ధం ఇదే. (మనం గుర్తుచేసుకుంటే, జైహింద్‌ అని మన సైనికులు, ఇతర కాపలాదారులు సర్వసాధారణంగా పలకరించుకుంటుంటారు. - ఈ పలకరింపు నేతాజీ సుబాష్‌చంద్రబోస్‌ స్థాపించిన ఐ.ఎస్‌.ఎతో మొదలయింది. ప్రతి క్రికెట్‌ మ్యాచ్‌లోనూ భారతదేశ టీమ్‌ను, ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఆడేటప్పుడు, హిందూ స్ధాన్‌ జిందాబాద్‌' అంటూ ప్రేక్షకులు ప్రోత్సహి స్తుంటారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో ఇవేవీ జాతీయ వాదం, దేశభక్తీ కావు).
వారి 'జాతీయత' జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, అందులోని విద్యార్ధి నాయ కుల పైన దాడి చేయడంలో బయటపడింది. వీడియోలను సృష్టించి, సాక్ష్యాలను కల్పించి వాటి ఆధారంగా విద్యార్ధి నాయకులను అరెస్ట్‌ చేసి వారిపై దేశద్రోహం, జాతివ్యతిరేక కార్యకలాపాలలో పాల్గంటున్నట్లు నేరారోపణలు చేశారు. ఇప్పుడివన్నీ కోర్టుల పరిశీలనలో ఉన్నాయి. అయితే స్థూలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ బిజేపి లను వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలను 'జాతివ్యతిరేకులు' గా చిత్రించాలనే పెద్ద పన్నాంగంలో ఇదోభాగం. ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ప్రయత్నం మన రాజ్యాంగంలో చెప్పుకున్న విధంగా లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర భారతదేశాన్ని పచ్చి అసహన, ఫాసిస్టు దేశమైన ''హిందూత్వ రాష్ట్రంగా'' మార్చడమనే పెద్ద రాజకీయ ప్రాజెక్టులో ఇవన్నీ భాగం.
మనకు తెలిసిన స్థిరమయిన, గణతంత్ర భారతదేశ భవిష్యత్తు ఉనికికే తీవ్ర ప్రమాదం ముంచుకొచ్చింది. దీనికి తోడు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిల జాతీయవాదనను హిందూ జాతీయవాదంగా మార్చే ప్రయత్నంతో ఈ ప్రమాదం మరింత తీవ్రమయింది. భారత ప్రజలు తమ వైవిధ్యాలను - కులం, మతం, జాతి, భాష, సంస్కృతి వగైరా అన్నింటిని అధిగమించి భారతజాతిగా కలిసి ఉండేలా ఉన్నత చైతన్యాన్ని పెంపొందించుకున్నారు. ఇప్పుడది ప్రమాదంలో పడింది.
ఈ సవాలుకు ప్రసార సాధనాలు (మీడియా) ఎలా స్పందిస్తున్నాయి? మొట్ట మొదటిగా ఇవి దీనినొక సవాలుగా భావిస్తు న్నాయా? ప్రజాస్వామ్య దేశాలలో నాలుగవ మూలస్థంభంగా భావిస్తున్న ప్రచార సాధనాలు ప్రజలకు,కార్యనిర్వాహక అధికారానికి, అంటే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి. ఆక్రమంలో ప్రజలకు కేవలం సమాచారాన్ని అందిచడమే కాదు. మనం అంగీకరించిన రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలం దరినీ కలిపి ఉంచేలా చూస్తూ, భారత జాతీయ వాద చైతన్యాన్ని బలపరచాలి.
కాని ఈనాటి ప్రసార సాధనాలుగా కొన్ని రాజుకన్నా రాజభక్తి ప్రదర్శిస్తున్నాయి. ప్రసార సాధనాలలో కొంతభాగం జెఎన్‌యు/హెచ్‌సియు విద్యార్ధులపై దేశభక్తి పేర దాడులు చేశాయి. సైద్ధాంతిక సారాంశం రీత్యా బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న విభిన్నమైన ప్రస్తుత జాతీయవాదానికి కొమ్ముకాస్తున్నాయి.
ప్రఖ్యాత పాత్రికేయుడు శశికుమార్‌ మాటల్లో ''ఒక బలమైన రాజ్యం అంటే మన ఉద్దేశం బలహీనులైన పౌరులు కాదు. బలమైన పత్రికారచనంటే పౌరులకు రాజ్యం శక్తిని ఎది రించే బలానివ్వడమే కాని రాజ్యం తైనాతీలుగా మారి పౌరుల స్వేచ్ఛను హరించేలా తోడ్పాటు నందించటం కాదు.''
అయితే మీడియా ఒక వ్యాపారంగా మారి గరిష్ట లాభార్జనే ధ్యేయంగా ఉన్న ఈనాటి ప్రపంచంలో ఇది సాధ్యమా? ఈ రోజు మనం ''పత్రికా రంగాన్ని అమ్ముకుంటున్న ఒక కొత్త యుగంలో'' ఉన్నాం. ప్రచార సాధనాల రంగంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి చెప్పినట్లు రచనా వ్యాసంగాన్ని వాణిజ్యమయం చేస్తున్న పరిస్థితుల మధ్యలో మనమున్నాం. తన మను గడకు ప్రధానంగా ప్రకటనలపైనే ఆధారపడిన మీడియా నేడు ప్రపంచ ఆర్ధికమాంద్యం కాలంలో ఒక నూతన పద్ధతిని ఎంచుకొని ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ మధ్యకాలంలో వెల్లడై తిరస్కారానికి, ఆగ్రహానికి గురైన 'వార్తలు అమ్ముకొనే'( పెయిడ్‌ న్యూస్‌) విధానం దీని ఉప ఉత్పత్తిగా ఈ కాలంలో ముందుకొస్తున్నది. ఈ అంశంపై పార్లమెంటులో జరిగిన చర్చలలో మీడియా 'స్వీయనియంత్రణ' చేసుకోవాలని ఉదారంగా సూచించటంతో ముగిసింది. 2008లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతున్నపుడు స్వీయ నియం త్రణ ఏ మేరకు పని చేసిందో మనం చూశాం.
అంతర్జాతీయంగా ఎంతో పేరున్న పాత్రికేయుడు, ఎన్నో దేశాలలో, యుఎన్‌లోనూ అత్యుత్తమ జర్నలిస్టు అవార్డులు గెలుచుకున్న బాన్‌పిల్‌గర్‌ ఏమన్నాడో ఈ సందర్భంలో గుర్తుచేసుకుందాం. ఆయన ''హిడెన్‌ ఎజెండాస్‌'' అనే ఆలోచనలు రేకేత్తించే ఒక పుస్తకాన్ని వ్రాశారు. దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడమే కాదు అది బాగా అమ్ముడు పోయిన పుస్తకం కూడా డిసెంబర్‌ 5, 2014లో ''మీడియా యుద్ధం, ప్రచారం గెలుపు'' అనే అంశం పై మాట్లాడుతూ అన్న మాటలు ఈ రోజు భారతదేశంలో ఉన్న పరిస్థితికి సరి పోతాయి. నకిలీ లక్ష్యాలకు సంబంధించిన పెద్దపెద్ద వాదనలను సవాలు చేయాలని, ప్రచార సాధనాల ఎజెండాను అర్ధంచేసు కోవాలని యువ పాత్రికేయులకు ఎందుకు నేర్పించడం లేదు? నిష్పాక్షిక దృష్టితో అసలు ఉద్దేశ్యాలను తెలుసుకోవాలని ఎందుకనుకోవడం లేదు? ప్రధాన స్రవంతి వార్తలంటే సారాంశంలో సమా చారం కాదు అధికారం అని వారికి ఎందుకు తెలియజెప్పడం లేదు?
ప్రజలందరి దృష్టిలో మీడియా అంటే ఎడ్‌వార్డ్‌ బెర్నెస్‌ అన్నట్టు కనిపించని ప్రభుత్వం కాదు మీడియా అంటే వికారమయినది. భయం కరమైనది. అదే ప్రభుత్వం. ఏ వైరుధ్యాల భయం లేకుండా ప్రత్యక్షంగా పాలిస్తుంది. దాని లక్ష్యం మనలను గెలవడమే, ప్రపంచం పట్ల మనకున్న జ్ఞానాన్ని గెలవడం, సత్యాసత్యాలకు మధ్య నున్న తేడాను గమనించడంలో మనకున్న విచక్షణను గెలవడం.
''మీడియా యుగం అంటే నిజానికి సమా చార యుగం. మనపై మీడియా యుద్ధం చేస్తున్నది, నియంత్రిస్తున్నది, రాక్షసత్వాన్ని ప్రయోగి స్తున్నది. చేయని నేరాలకూ ప్రతీకారం తీర్చుకుం టున్నది, మార్గాలను మళ్ళిస్తున్నది- కొన్ని అవాస్తవాలను, కల్పనల సమాహారాన్ని మనముం దుంచుతున్నది.''
జర్నలిస్టుల, ప్రచారమాధ్యమాల పాత్ర ఎలా ఉండాలో ఉపదేశాల ద్వారా కాక, ఒక సన్ని వేశం ద్వారా ఆయన మనకు తెలియ చెప్పారు.
''2003 లో ఛార్లెస్‌ లూయిస్‌ అనే ప్రఖ్యాత అమెరికన్‌ పరిశోధక పాత్రికేయుడ్ని కలిసి, అంతకు కొన్ని నెలల క్రితం ఇరాక్‌పై జరిగిన దాడిని గురించి మేం చర్చించాం.'' ప్రపంచం లోనే అత్యంత స్వేచ్ఛయుతమైన మీడియా మొరటు ప్రచారానికి బదులుగా జార్జిబుష్‌ను, డొనాల్డ్‌ రమ్స్‌ఫెల్డ్‌ను సవాల్‌చేసి, వారి వాదనల లోని వాస్తవాల పరిశీలనకు పూనుకొని ఉంటే ఏమై ఉండేది?'' అని అడిగాను. జర్నలిస్టులు గనక తమ పనిని సక్రమంగా చేసి ఉన్నట్టయితే ఇరాక్‌ పై యుద్ధానికి వెళ్ళకుండా ఉండేందుకు ఎంతో, ఎంతోమంచి అవకాశాలు ఉండేవి'' అతను సమాధానం చెప్పాడు.
''ఇదెంతో ఆశ్చర్యకరమయిన విషయం. నేను అనేకమంది పాత్రికేయులను అడిగినా అదే సమాధానం వచ్చింది. ఇదే ప్రశ్నను డాన్‌ రాధో డ్‌ను అడిగినా అదే సమాదానం వచ్చింది. సీని యర్‌ పాత్రికేయుడు, అబ్జర్వర్‌ పత్రికకు సంబం ధించిన డేవిడ్‌ రోస్‌ సమాధానం కూడా అదే. కొందరు పేర్లు బయట పెట్టేందుకు ఇష్ట పడని బిబిసి నిర్మాతలు ఇదే సమాధానం చెప్పారు.''
అంటే పాత్రికేయులు తమ పనిని సక్రమం గా చేసి ఉంటే, ప్రచారానికి బదులు ప్రశ్నించి ఉంటే, పరిశోధించి ఉంటే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు ఈ రోజు ప్రాణాలతో ఉండేవారు. లక్షలాది మంది తమ ఇళ్ళను వదిలి పారిపోయి ఉండేవారు కాదు. సున్నీ,షియాల మధ్య చిచ్చురగి లేది కాదు, అప్రతిష్టాత్మకమయిన ఇస్లామిక్‌ స్టేట్‌ అవిద్భవించి ఉండేది కాదు.
ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చ టంతో పాటు పత్రికా విలేకరులను మేనేజ్‌ చేయటం ద్వారా ప్రభుత్వాలు సమ్మతిని ఎలా తయారుచేస్తాయి? ప్రధాని మోదీ నాయ కత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాటిని గురించి దిగువ అంశాలు మనకు కొంత అవగాహన ఇస్తాయి.
1990లలో ఇరాక్‌పై ఆంక్షలు విధించేం దుకు బాధ్యుడయిన ఒక బ్రిటిష్‌ అధికారి గురించి జూన్‌ ఫిల్‌గర్‌ మాట్లాడుతూ ఈ మధ్యయుగాల తరహా దిగ్బంధం వలన ఇరాక్‌లో 5 లక్షల మంది 5సం|| వయసులోపు పిల్లలు మృత్యువాత పడటాన్ని గురించి యూనిసెఫ్‌ చెప్పిన అంశాన్ని ఉదహరించాడు. ''ఆ అధికారి పేరు క్రేన్‌రోస్‌. లండన్‌లోని విదేశాంగ కార్యాలయంలో ఆయ నను అందరూ మిస్టర్‌. ఇరాక్‌ అనేవారు. ప్రభు త్వాలు ఎలా మోసాలు చేస్తాయో, ప్రసార మాధ్యమాలు వాటినే ఎలా ప్రచారంలో పెడ తాయో వివరించాడు. ''మేం పత్రికలవారికి పడపోసిన రహస్యాలను వాస్తవాలుగా అంది స్తాం లేదా వాటిని బయటకు పొక్కకుండా చూస్తాం.''
ప్రభుత్వ రహస్యాలను బట్టబయలు చేసిన( విజిల్‌బ్లోయర్‌) డెనిస్‌ హాలిడేకు సంబంధించిన మరో సంఘటన గురించి ఫిల్గర్‌ చెప్పాడు. డెన్నిస్‌ హాలిడే ఐక్యరాజ్యసమితిలో అసిస్టెన్ట్‌ జనరల్‌ సెక్రటరీగానూ, ఇరాక్‌లో ఐక్యరాజ్య సమితి సీనియర్‌ అధికారి గానూ ఉన్నారు. ఇరాక్‌పై ఆంక్షలను మారణహోమం సృష్టించే ఆంక్షలను వ్యతిరేకించి ఆయన రాజీనామా చేసారు. ఆయన లెక్క ప్రకారం ఆంక్షల మూ లంగా చనిపోయిన వారిసంఖ్య పదిలక్షలు దాటుతుంది. అలా నిరాకరించినందుకు హాలిడేకి ఏమయిందో తెలుసుకోవాలి. బిబిసి రాత్రి వార్తల ప్రోగ్రామ్‌లో జెరిమె ఫాక్స్‌మన్‌ ఆయనపై ఇలా అరిచాడు'' మీరు సద్దామ్‌హుస్సేన్‌ను సమర్ధించే వారిలా ఉన్నారు? దీనినే ఈ మధ్యన గార్డియన్‌ పత్రిక, ఫాక్స్‌మన్‌ జ్ఞాపకాలుగా ప్రచురించింది. క్రితం వారం ఫాక్స్‌మన్‌ తన పుస్తకానికి సంబంధించి మిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.''
ప్రధాన సమయాలలో టివిలో జరిగే చర్చా కార్యక్రమాలలో పాల్గొనే మీకు ఈ ఏంకర్ల అరుపులు సర్వసాధారణాలు. సిఐఏ కోసం 400 మంది జర్నలిస్టులు, న్యూస్‌ ఎక్జిక్యూటివ్స్‌ పనిచేసినటు 1977లో 'వాటర్‌గేట్‌' కుంభ కోణంలో భాగస్వామిగా ఉన్న కార్ల్‌ బెర్న్‌స్టిన్‌ తెలిపారు. అందులో నూయార్క్‌ టైమ్స్‌,దిటైమ్‌, టివి నెట్‌వర్క్‌లలో పనిచేసే వారూ ఉన్నారు. 1991 లో రిఛార్డ్‌ నోర్‌టన్‌టేలర్‌ కూడా బ్రిటన్‌లో గార్డియన్‌కు సంబంధించి ఇటువంటి కథనాన్నే వెల్లడించారు.
''ఈ రోజు ఇవేం అవసరం లేదు. స్నోడెన్‌ ఉగ్రవాదానికి సహాయ పడుతున్నట్టు ఆరోపించేందుకు వాషింగ్‌టన్‌ పోస్టుతో సహా ఏ మీడియాకు ఎవరూ నిధులిచ్చారని నేననుకోను జులియస్‌ అసాంజేకి మసిపూసేందుకు ఎవరైనా సొమ్ములిచ్చారని నేననుకోను. వేరే రకంగా వారికి ప్రయోజనాలు కల్పిస్తున్నప్పటికీ జూలియన్‌ అసాంజేను గురించి రోజూ ఈ విధంగానే చెప్పేవారికి ఏమైనా ముట్ట చెపుతున్నారా అనేది నాకు సందేహంగానే ఉంది.
''18 వ శతాబ్దంలో ఎడీమండ్‌ బర్క్‌ ప్రసార మాధ్యమాల పాత్రను నాల్గవ స్థంభంగా, శక్తివంతమయిన వారికి అడ్డుకట్టగా వర్ణించారు. అది ఎప్పుడయినా నిజమా? ఇప్పుడయితే అంతులో ఏ మాత్రం నిజంలేదు. ఇప్పుడు మనకు కావల్సింది ఐదోస్ధంభం. పర్యవేక్షించే జర్నలిజం, ప్రచారాన్ని ఆపేది అడ్డుకట్టవేసేది కావాలి. అధికారానికి కాదు ప్రజలకు ఏజెం ట్లుగా ఉండాలని యువకులకు నేర్పించేది, జ్ఞాన దాస్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తిరుగు బావుటా ఎగురవేసేది కావాలి. ఇదే నిజమయిన జర్నలిజం.
మొదటి ప్రపంచ యుద్ధం మొదలయి ఇప్పటికి వందేళ్ళు, ఆనాడు రిపోర్టర్లు మాట్లాడకుండా ఉన్నందుకు, కుమ్మక్కయినందుకు వారిని నైట్‌హుడ్‌ బిరుదుతో సత్కరించేవారు. ఇందుకు పరాకాష్టగా అప్పటి బ్రిటిష్‌ ప్రధాని డేవిడ్‌ లాయిడ్‌ జార్జి సిపిస్కాట్‌ అనే మాంచెస్టర్‌ గార్డియన్‌ పత్రిక ఎడిటర్‌ తో ఇలా అన్నారు.
''వాస్తవాలేమిటో ప్రజలకు తెలిస్తే యుద్ధం రేపే ఆగిపో తుంది. కాని ప్రజలకు వాస్తవాలు తెలియదు. తెలిసే అవకాశమే లేదు. '' ''ఇప్పుడు ప్రజలు తెలుసుకోవలసిన అవసరం వచ్చింది''
మన దేశంలోని జర్నలిస్టులలో కొందరు నిజాయితీపరులను చూసి నేను గర్వపడుతున్నాను. వారంతా పిల్‌గార్‌ అన్నట్టు పత్రికా రంగాన్ని ఐదవ స్థంభంగా, లేదా అందుకు అనుగుణంగా తీర్చి దిద్దటానికి వారంతా ముందుకురావాలి.
జాతీయతను గురించి ప్రజల సామాజిక చైతన్నాన్ని కుచింప జేసే ప్రమాదకరయిన జాతీయవాదానికి మద్దత్తివ్వటాన్ని, దాని సైద్ధాంతిక పునాదులను బలపరచటాన్ని ప్రచార సాధనాలు తప్పని సరిగా ఆపాలి. అందుకు బదులుగా నిజమయిన భారతీయ చైతన్యాన్ని బలపరచాలి. ప్రజాతంఉన్న భారతదేశం రూపు రేఖలు మారిపోకుండా ఉండేందుకు ఇది అత్య వసరం - ఒక లౌకిక, ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా ఉన్న భారతదేశం మితవాద అస హన ఫాసిస్టు ''హిందూత్వ రాష్ట్రంగా మారకుండ ఉండటం కోసం దీనిని తక్షణమే చేయాలి.
అనువాదం: కె. ఉషారాణి

- సీతారాం ఏచూరి
రచయిత సిపిఐ (ఎం)
ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment