Tuesday, September 20, 2016

అన్నీ రహస్యమేనా?
Posted On: Tuesday,September 20,2016
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- స్విస్‌ ఛాలెంజ్‌ కేసు నేటికి వాయిదా
ప్రజాశక్తి-హైదరాబాద్‌ 
రాజధాని స్విస్‌ఛాలెంజ్‌పై స్టే ఎత్తివేయాలని హైకోర్టు డివిజన బెంచ్‌లో మంగళవారం కొనసాగిన విచారణలో కూడా బెంజ్‌ ప్రభుత్వాన్ని పలు న్యాయపరమైన అంశాలపై ప్రశ్నించింది. ప్రతిపాదిత ఆదాయ వివరాలు రహస్యంగా ఎందుకు ఉంచాలని, ఆ వివరాలు లేకుండా పోటీ బిడ్స్‌ ఎలా దాఖలవు తాయని, లాభం ఎంత వస్తుందో తెలియకుండా వ్యాపారం చేయరు కదా అని, వివరాలు లేకుండా బిడ్స్‌ దాఖలు చేయమని నోటిఫికేషన్‌ జారీ చేయడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించింది. రోడ్డు-మౌలిక సదుపాయలు కల్పించడమంటే సింగిల్‌ జడ్జి స్టే ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే అవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. ఈ పనులు చేయడానికి సింగపూర్‌ కంపెనీలే ఎందుకు? చాలా కంపెనీలున్నాయి కదా అని వ్యాఖ్యానించిది. అప్పీల్‌ పిటిషన్‌పై మూడోరోజు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌, న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదిస్తూ సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించిన ప్రకారం ఆదాయం తక్కువగా వచ్చినా అదే విధానాన్ని అమలు చేస్తామని హైకోర్టుకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆదాయం రాకపోయినా విదేశీ పెట్టుబడులు రాబట్టడమే ప్రధాన ధ్యేయమని తేల్చేశారు. ఆదాయమనేది చాలా స్వల్ప విషయమని కన్సార్టియం ప్రతిపాదనల వల్ల ఆదాయం ఆశాజనకంగా లేకపోతే రద్దు చేస్తామన్నారని, సింగిల్‌ జడ్జి ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పోల్చారని బెంచ్‌ గుర్తు చేయగా, ఆదాయం ముఖ్యం కాదని, ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమూ కాదని ఏజి పేర్కొన్నారు. కానీ ఈ విధానంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ ప్రాజెక్టులో కీలకమన్నారు. ఆదాయ వివరాలు రహ్యంగా ఉంచడం లేదని, సాంకేతిక అర్హత పొందిన కంపెనీలకు ఆ వివరాలు ఇస్తామని, ఏపిఐడిఇ చట్టంలో ప్రతిపాదిత ఆదాయ వివరాల్ని ప్రాథమిక దశలోనే ఇవ్వాలని లేదని వివరించారు. ఈ విధానం వల్ల లక్షా పాతిక వేల కుటుంబాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. స్టార్టప్‌ ఏరియాలో భూముల్ని అభివృద్ధి చేసి మార్కెటింగ్‌ హక్కుల్ని స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కి ఇస్తారని, భూమిపై యాజమాన్య హక్కులు సిఆర్‌డిఎకే ఉంటాయని ఏజి తెలిపారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కి రాబడిలో ప్రభుత్వానికి వాటా వస్తుందన్నారు. సింగపూర్‌ కన్సార్టియం మూలధనం ఒకేసారి పెట్టదని, అంచనా ఆదాయ వివరాలతో పాటు మూల ధన వివరాలు కూడా గోప్యంగానే ఉంటాయని చెప్పారు. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.

No comments:

Post a Comment