భద్రత, బాధ్యత!
23-09-2016 01:23:28
అప్రమత్తతనూ రక్షణ పాటవాన్ని పటిష్ఠం చేసుకోవడం, నిఘాను కట్టుదిట్టం చేయడం ముందుగా జరగాలి. తక్షణ విస్తృత సంప్రదింపులతో కాశ్మీర్ యువత విశ్వాసం పొందగలిగితే గానీ సరిహద్దుల్లో పూర్తి భద్రత లభించదు. ఆ బాధ్యత పూర్తిగా మోదీ ప్రభుత్వానిదే.
ఉరీలోని భారత సైనిక కేంద్రంపై దాడి చేసి నిద్రలో వున్న పద్దెనిమిది మంది వీరజవాన్లను బలిగొన్న పాకిస్థాన్ ప్రేరిత వుగ్రవ్యూహం క్షంతవ్యం గాని నేరం. దీనికి సంజాయిషీ ఇవ్వాల్సిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి వేదికపై షరామామూలుగా భారతదేశాన్నే నిందితురాలుగా చూపించేందుకు ప్రయత్నించడం మరింత దారుణం. ఉరీ దురంతం నేపథ్యంలో ఈ సమావేశాల వరకైనా షరీఫ్ మరో విధంగా మాట్లాడతారన్న మీడియా అంచనాలు తప్పిపోయాయి. పాకిస్థాన్ పాలకులు భారత వ్యతిరేక విద్రోహశక్తులకు వత్తాసునిస్తున్న తీరును భారత ప్రతినిధి శ్రీమతి ఈనమ్ గంభీర్ శక్తిమంతంగా వినిపించడం కూడా ఆహ్వానించదగింది. నేరుగా ఒక కీలక సైనిక కేంద్రంపై దాడి అంటే ప్రత్యక్ష కవ్వింపు గనక ఇండియా సముచిత వ్యూహం అనుసరించాలనే అందరూ కోరుకుంటారు.
ఉరీలోని భారత సైనిక కేంద్రంపై దాడి చేసి నిద్రలో వున్న పద్దెనిమిది మంది వీరజవాన్లను బలిగొన్న పాకిస్థాన్ ప్రేరిత వుగ్రవ్యూహం క్షంతవ్యం గాని నేరం. దీనికి సంజాయిషీ ఇవ్వాల్సిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి వేదికపై షరామామూలుగా భారతదేశాన్నే నిందితురాలుగా చూపించేందుకు ప్రయత్నించడం మరింత దారుణం. ఉరీ దురంతం నేపథ్యంలో ఈ సమావేశాల వరకైనా షరీఫ్ మరో విధంగా మాట్లాడతారన్న మీడియా అంచనాలు తప్పిపోయాయి. పాకిస్థాన్ పాలకులు భారత వ్యతిరేక విద్రోహశక్తులకు వత్తాసునిస్తున్న తీరును భారత ప్రతినిధి శ్రీమతి ఈనమ్ గంభీర్ శక్తిమంతంగా వినిపించడం కూడా ఆహ్వానించదగింది. నేరుగా ఒక కీలక సైనిక కేంద్రంపై దాడి అంటే ప్రత్యక్ష కవ్వింపు గనక ఇండియా సముచిత వ్యూహం అనుసరించాలనే అందరూ కోరుకుంటారు.
నిజానికి చాలా పెద్దదైన బారాముల్లా జిల్లా ఉరీ సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి గుడారాలకు నిప్పు పెట్టిన ఫలితంగా సైనికులు బలికావడం దేశాన్ని కలచివేసింది. కాశ్మీర్ ప్రజలు నిత్య నిర్బంధాజ్ఞల్లో ఉంటున్న నేపథ్యంలో ఈ దారుణమైన దాడి ఉద్రిక్తతను మరింత పెంచింది. జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ సైన్యం సహాయంతో దాడి చేశారని భారతదేశం చెబుతున్నది దాదాపు యథార్థమే. అయితే ముందస్తు సమాచారం వుండి కూడా ఈ పరిస్థితికి అవకాశమిచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వ అలక్ష్యం అభిశంసనీయం. ఆ భావన ప్రజల్లోనూ వచ్చింది. అందుకే కేంద్రం పాక్‌పై ప్రతీకార దాడి చేయడమే పరిష్కారమన్న సంకేతాలతో ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. సమీక్షా సమావేశాలు జరుపుతూ సరిహద్దులు దాటి వెళ్లి పరిమిత దాడి చేయడం, లేదంటే పూర్తిస్థాయి యుద్ధం చేయడం వంటి ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్టు కథనాలు వదిలింది. దాడి చేసిన దుండగులను అప్పుడే వెంటాడి చంపడంతో పాటు మరుసటి రోజునే సరిహద్దులలో పదిమంది చొరబాటుదార్లను కాల్చివేశారు. వీటన్నిటినీ చూపిస్తూ తామూ దూకుడుగా వెళ్లనున్న భావన కల్పించింది. అయితే వాస్తవాలు తెలుసు గనక అంతలోనే యుద్ధం అవకాశాలు లేవన్న వాదనలనూ ప్రచారంలో పెట్టింది. జరిగిన దారుణం చాలదన్నట్టు భవిష్యత్ కార్యాచరణ గురించిన ఈ విరుద్ధ సంకేతాలు అభద్రతను పెంచుతున్నాయి.
మోదీ కేంద్రబిందువుగా నయా హిందూత్వ జాతీయవాదంతో స్వచ్ఛభారత్, నైపుణ్య భారత్ అంటూ అనేక నినాదాలతో హోరెత్తిస్తున్న ప్రభుత్వం వాస్తవంగా దేశభద్రత విషయంలో ఎందుకింత అలసత్వం చూపిస్తున్నది? 2016 జనవరిలో పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడి జరిగింది. దానికిముందు ఇదే ఉరీ సైనిక కేంద్రం పరిసరాల్లో 2014 డిసెంబరులోనూ దాడి జరిగింది. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో 2001లో పార్లమెంటుపై జరిగిన దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ పరాక్రమ్ పేరిట హడావుడి చేస్తున్న సమయంలోనే 2002లో కోల్చాక్ సైనిక శిబిరంపై జరిగిన దాడిలోనూ 31 మంది మరణించారు. అప్పటి నుంచి ఉరీ పరిసరాలపై కూడా దాడులు జరుగుతూ వచ్చాయి. సెప్టెంబర్ 8న లెఫ్టినెంట్ జనరల్ ఉన్ హసన్ నిర్దిష్టంగా ఉరీ సైనిక కేంద్రంపైనే దాడి జరగనున్నట్టు హెచ్చరిక పంపించిన పది రోజులకే ఈ ఘోరం జరిగింది. రోజూ 90శాతం చొరబాట్లను నిరోధిస్తుంటామని, పదిశాతం మాత్రమే అనుకున్నట్టు జరుగుతాయని అటు నిఘా అధికారులు ఇటు సైనికాధికారులు, ప్రభుత్వం కూడా చెప్పడం సమర్థనకే పనికి వస్తుంది. 12వేల మంది సైనికులున్న కేంద్రంలోకే విద్రోహులు చొరబడగలగడం దేశ భద్రతకే పెనుసవాలు. సైనిక పటాలాలు మారుతున్న సందర్భంలోనే ఇలాటి దాడులకు అవకాశం వస్తుందన్న వాదన కూడా సంజాయిషీగా పనికి రాదు. ఎందుకంటే సైన్యంలో అది నిరంతర ప్రక్రియ.
పఠాన్‌కోట దాడి ముందు, తర్వాత కూడా పాకిస్థాన్ పట్ల మనం అనుసరించే విధానంలో ఒక స్థిరత్వం స్పష్టత రాలేదు. సైనిక మత ఛాందస అవినీతి కూటమి ఆధిపత్యంలో అమెరికా కనుసన్నల్లో నడిచే పాకిస్థాన్ కుటిల వ్యూహాలు భారత్ వ్యతిరేక చర్యలు నిత్యకృత్యాలే. వాటిని ఎలా ఎదుర్కొవాలనే దానిలో మనకు స్పష్టత వుండాలి. కేవలం కవ్వింపు వ్యాఖ్యానాలు లేక కృత్రిమ దేశభక్తి ప్రచారాలు పరిష్కారం చూపించలేవు. జమ్మూ కాశ్మీర్‌లోనూ పీడీపీతో కలసి అధికారం చేస్తున్న బీజేపీ అక్కడ పరిస్థితి ఉద్రిక్తం కావడానికి ఒక ముఖ్య కారకురాలు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా బక్రీద్ పండుగ రోజున కూడా మసీదులకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించే పరిస్థితి ఏర్పడింది. అఖిలపక్ష సమావేశంలో అందరితో మాట్లాడి పరిష్కారం కనుగొంటానని ఇచ్చిన హామీని కూడా వుల్లంఘించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఫలితంగా అక్కడి యువతలో తీవ్ర నిరసన పెరగడమే గాక పీడీపీ ముఖ్యనేతలే నిష్క్రమణ ప్రకటించారు. పాకిస్థాన్ కుట్రలకు కాశ్మీర్ పెద్ద కేంద్రంగా మారే పరిస్థితి దాపురించింది. కాశ్మీర్లో సాధారణ వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజల విశ్వాసం పొందకుండా సరిహద్దులలో చొరబాట్లను లేదా ఉగ్రవాద దాడులను అరికట్టడం కుదిరేపని కాదు. ఒక వేళ సరిహద్దులు దాటివెళ్లి దాడి చేస్తే అప్పుడు పాకిస్థాన్ మనపైనే నెపం పెట్టే అవకాశం ఇచ్చినట్టవుతుంది. పైగా ఇరువైపులా ప్రాణనష్టం వాటిల్లుతుంది. కనుక చాలా సంయమనంతోనూ చాకచక్యంగానూ ఈ సవాలును ఎదుర్కొవలసి వుంటుంది. ఆ క్రమంలో సైనికుల పౌరుల ప్రాణాల పరిరక్షణ కీలకంగా పరిగణించాలి తప్ప రాజకీయప్రయోజనాల లెక్కలు కాదు.
దౌత్యపరంగా మద్దతు కూడగట్టడం మంచిదే గానీ ఇందుకోసం అమెరికాపై ఆధారపడటం ఆశలు పెంచడం పెద్ద పొరబాటు. అమెరికా రష్యా ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఇప్పటికే మనవాదనకు మద్దతు వచ్చేసినట్టే భావించడం అవాస్తవికత. ఇండియా వాదనతో అందరూ ఏకీభవించి ఐరాస పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే పని జరిగేది కాదు. అవన్నీ సాధారణ ఖండనలే. ఎప్పటికైనా పాకిస్థాన్ పాలక కూటమికి ప్రధాన ప్రాపు అమెరికానే. చైనాను మాత్రం ఎప్పుడూ పాకిస్థాన్‌తో కలిపి చూస్తూ దానికి వ్యతిరేకంగా అమెరికాతో కలసి మాట్లాడ్డం కూడా పొరబాటే. భారత చైనాల నియంత్రణ కోసమే గాక అప్ఘానిస్తాన్‌లో తన ఆధిపత్య ప్రయోజనాల కోసం కూడా అమెరికా ఎన్నటికీ పాకిస్థాన్‌ను తన పావుగా వాడుతుంటుంది. అమెరికా ఉపాంగంగా పాక్ స్థానం మనకు వచ్చిందనే అంచనా తప్పు. రావాలని కోరుకోవడం ఇంకా ప్రమాదం. ఉరీ దాడిపై విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఖండన కూడా అనేక మినహాయింపులతో వుంది. వీహెచ్‌పీ నాయకులు లేదా కొందరు సంఘ్‌పరివార్ ప్రతినిధులు చెబుతున్నట్టు దుందుడుకుగా దాడులకు పాల్పడితే అప్పుడు మనం నిందితులుగా నిలబడతాము. ముందు అప్రమత్తతనూ రక్షణ పాటవాన్ని పటిష్ఠం చేసుకోవడం నిఘాను కట్టుదిట్టం చేయడం జరగాలి. తక్షణ విస్తృత సంప్రదింపులతో కాశ్మీర్ యువత విశ్వాసం పొందగలిగితే గానీ సరిహద్దుల్లో పూర్తి భద్రత లభించదు. ఆ బాధ్యత పూర్తిగా మోదీ ప్రభుత్వానిదే.
No comments:
Post a Comment