పాతికేళ్ల ఆర్థిక సంస్కరణలు-అనుభవాలు-ఫలితాలు
Posted On: Tuesday,September 20,2016
- కెయస్ లక్ష్మణరావు
పాతికేళ్ల క్రితం ప్రారం భమైన ఆర్థిక సంస్కరణల ప్రభావంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది. కొంత మంది ఆర్థికవేత్తలు ఆర్థిక సంస్కరణ లు లేకపోతే దేశం పురోగమించేదికాదని, పివి నరసింహారావు, మన్మోహన్‌సింగ్ ద్వయం 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్లనే విదేశీ పెట్టుబడులు, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయని, స్థూల జాతీయోత్పత్తి పురోగమనంలో ఉందని, వినియోగదారు ల వస్తువులు, వినిమయతత్వం పెరిగిందని వాదిస్తున్నారు. మరికొంతమంది ఆర్థికవేత్త లు ముఖ్యంగా ప్రొఫెసర్ ప్రభాత్ పట్నా యక్, వెంకటేష్ ఆత్రేయ, ప్రొఫెసర్ జయతీ ఘోష్, ప్రొఫెసర్ మహేంద్రదేవ్ మొదలగు వారు ఆర్థిక సంస్కరణల అభివృద్ధి కొద్ది మందికే పరిమితమైందని, వ్యవసాయరంగం పూర్తిగా నష్టపోయిందని, ఉత్పత్తిరంగం, ఉపాధిరంగం క్షీణించా యని, విద్య, ఆరోగ్యరంగాలు కార్పొరేటీకరణ చెందాయని, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ఆర్థిక సంస్కరణలు ప్రయోజనం కల్గించలేదని భావిస్తున్నారు.
1948-91 ప్రభుత్వరంగానికి ప్రాధాన్యత
1948, 1956 పారిశ్రామిక తీర్మానాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగానికి ప్రాధాన్యతనిచ్చాయి. ప్రణాళికా సంఘాన్ని 1950లో ఏర్పాటుచేసి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించారు. రైల్వేలు, బొగ్గు, ఉక్కు, నౌకానిర్మాణం, ఖనిజాలు, టెలిఫోన్, చమురు పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉరడాలని ప్రతిపాదించారు. నాటి భారత పెట్టుబడిదారీవర్గానికి భారీ పరిశ్రమలు స్థాపించే స్తోమత లేకపోవటమే దీనికి కారణం. బొకారో, భిలారు, రూర్కెలా, దుర్గాపూర్ వంటి ఉక్కు కర్మాగారాలు, ఆయిల్ కంపెనీలు, బిహెచ్‌ఇఎల్ వంటి భారీ పరిశ్రమలు ప్రభుత్వరంగంలోనే అభివృద్ధి చెందాయి. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. విశ్వవిద్యాల యాలు, ఐఐటిలు, ఐఐఎంలు, జాతీయ పరిశోధనా సంస్థలు స్ధాపించబడ్డాయి. వ్యవసాయరంగంలో హరితవిప్లవం విజయవంతమైంది. ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వరంగ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల కొంత మేరకు సామాజిక వర్గాలకు లబ్ధి జరిగింది. ప్రభుత్వరంగం దేశ స్వాలంబనకు దోహదపడింది.
ఆర్థిక సంస్కరణలు-సారాంశం
989-91 మధ్య భారత దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభం ఏర్పడింది. ఎన్నికల ప్రచారం మధ్యలో రాజీవ్‌గాంధీ హత్య తరువాత పివి నరసింహారావు కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నికై ప్రధానమంత్రి అయ్యారు. బిజెపి ఆ సమయంలో అద్వానీ నాయకత్వంలో రథయాత్ర చేపట్టింది. 1992లో బాబ్రీమసీదు కూల్చివేయటంతో దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థికవ్యవస్థ వద్ద కనీసం 15 రోజులకు కూడా సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలులేవని, తీవ్ర సంక్షోభంలో ఉన్నామనే కారణంతో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. 1991 జులైలో నాటి ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్ ఆర్థిక రంగంలో ''సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ'' లక్ష్యాలకు అనుగు ణంగా పెనుమార్పులు ప్రకటించారు. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి మూడు పరిశ్రమలు మినహా మిగిలిన వాటిలో ప్రయివేట్ రంగాన్ని అనుమతిం చారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ ప్రతక్ష పెట్టుబడులపై ఉన్న అనేక ఆంక్షలను సడలించటమేకాక, ఎగుమతులు, దిగుమతులపై విధించే పన్నులను సరళతరంచేశారు. ప్రభుత్వరంగ పరిశ్రమల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైం ది. యంఆర్‌టిపి చట్టాన్ని అనుసరించి ఉన్న నిబంధనలు, పరిమితులు ఎత్తివేశారు. రెండవతరం ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు ఇంకా వేగంగా ప్రయివేటీకరణ విధానాలు అనుసరించాయి. గత 25 ఏళ్లుగా కేంద్రంలో ఏ పార్టీ/కూటమి అధికారంలో ఉన్నా ఈ విధానాలనే కొనసాగిం చాయి. రాష్ట్రాలలో అధికారంలోకి వస్తున్న ప్రాంతీయ పార్టీలు కూడా ఆర్థిక సంస్కరణలను భిన్నమైన పద్ధతుల్లో అమలుచేస్తున్నాయి. దీనికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి ఉదాహరణ.
ఆర్థిక సంస్కరణలు-వ్యవసాయరంగం
ఆర్థిక సంస్కరణల వల్ల ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నది. స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 15 శాతానికి తగ్గిపోయింది. దేశంలో మిగిలిన రంగాలతో పోల్చితే రైతుల ఆదాయాల్లో ఏమాత్రం పెరుగుదల లేదు. 1998 నుంచి 2015 వరకు సుమారు ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంక్షోభానికి ప్రధానకారణం ప్రభుత్వాలే. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తరువాత వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయి. రైతులకు వ్యవస్థాగత రుణసదుపాయం తగ్గించబడింది. వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు ప్రభుత్వం దాదాపు స్వస్తి చెప్పింది. పండిన పంటలను మార్కెటింగ్ చేయటంలో కూడా ప్రభుత్వ జోక్యం తగ్గింది. పంటల ధరలు గిట్టుబాటు కావటం లేదు. రైతులకిచ్చే వ్యవసాయ సబ్సిడీలు బాగా తగ్గాయి. ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్‌బిఐ 7 శాతం వడ్డీతో కార్లు కొనుక్కోవటానికి రుణాలిచ్చి, రైతుల దగ్గర నుంచి మాత్రం రుణాలపై 16 శాతం వడ్డీ వసూలు చేస్తున్నదని చెప్పారు. ప్రముఖ విశ్లేషకులు దేవీందర్ శర్మ మాటల్లో చెప్పాలంటే ''అన్యాయపు ఆర్థిక సంస్కరణల కోసం రైతులు మూల్యం చెల్లిస్తున్నారు''.
పారిశ్రామిక, ఉత్పత్తి రంగం-ఉపాధి కల్పన
ప్రొఫెసర్ మహేంద్రదేవ్ చెప్పినట్లు పాతికేళ్ల ఆర్థిక సంస్కరణల ప్రస్థానంలో పారిశ్రామిక రంగం వెనుకబడింది. స్థూల జాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం 20 శాతం వాటాను కలిగి ఉన్నది. మొత్తం ఉపాధిలో ఉత్పత్తి రంగం వాటా 11 శాతం నుంచి 13 శాతం మధ్య మాత్రమే ఉన్నది. విదేశీ పరిశ్రమలు, విదేశీ వస్తువుల ధాటికి తట్టుకోలేక అనేక దేశీయ పరిశ్రమలు మూతబడ్డాయి. సేవారంగానికి లభిం చిన ప్రాధాన్యత పారిశ్రామిక రంగానికి లేదు. దీనివల్ల నిరుద్యో గుల సంఖ్య పెరుగుతూ ఉద్యోగితలో వృద్ధి ఒకటి న్నర శాతంగానే ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యో గుల సంఖ్య బాగా పెరుగుతున్నది. భారత ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ విభాగం గణాంకాల ప్రకారం 1999-2012 మధ్య ఉద్యో గాల సృష్టి అతి తక్కువగా జరిగింది. 2012లో ఏడు లక్షలు, 2013లో అయిదున్నర లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా 2014లో 4.9 లక్షలకు, 2015లో కేవలం 1.35 లక్షలకే పరిమితమైంది. ఆర్థిక మాంద్యం ఫలితంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరగకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపో తున్నాయి.
విదేశీ పెట్టుబడులు, విదేశీ మారకద్రవ్య నిల్వలు
దేశంలో విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగటం ఆర్థిక సంస్కరణలు సాధించిన గొప్ప విజయంగా ప్రసార సాధనాలు వర్ణిస్తున్నాయి. 1991 మార్చి నాటికి 220 కోట్ల డాలర్లున్న విదేశీ మారక ద్రవ్యనిల్వలు 2014 మార్చి నాటికి 30,420 కోట్ల డాలర్లకు చేరుకున్నా యని వ్యాసాలలో వివరిస్తున్నాయి. కానీ ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ కంటే అధికంగా ఉండి విదేశీ మారక నిల్వలు పెరిగితే సంతోషించవచ్చు. అయితే 2004-2005 నుంచి నేటి వరకు కరెంట్ ఖాతా లోటులోనే ఉంది. దీనికి ప్రధాన కారణం దిగుమతుల విలువను ఎగుమతుల విలువ అధిగమించలేక పోవడవమే. దేశ స్వాలంబనకు తోడ్పడిన బ్యాంకింగ్, టెలికాం, ఇన్సూరెన్స్ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడమే. నిరంతరం దేశభక్తి గురించి మాట్లాడే మో డీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను కీలక రంగాలలో విచ్చల విడిగా అనుమతించటం ఏవిధమైన దేశభక్తో తెలపాలి.
నూతన మధ్య తరగతి-వినిమయతత్వం
ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశంలో ఒక నూతన మధ్యతరగతి వర్గం రూపుదిద్దుకున్నది. ప్రయివేట్, బహుళ జాతి కంపెనీలు వీరిలో వినిమయతత్వాన్ని పెంచిపోషిస్తు న్నాయి. దేశంలో వంద కోట్ల సెల్‌ఫోన్లు ఉన్నాయని, 40 కోట్ల టీవీ సెట్లతో 900కు పైగా చానళ్లు ప్రసారం చేయగల స్థితికి చేరుకున్నామని వారు చెబుతున్నారు. బహుళజాతి సంస్థలు మధ్యతరగతిని ఆకర్షించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. దేశంలో 50 శాతం పైగా కార్లు, 60 శాతం పైగా ఎయిర్ కండీషనర్లు, 55 శాతం పైగా క్రెడిట్ కార్డులు మధ్యతరగతి చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా స్మార్ట్ సిటీలు, గ్రామాల దత్తత వంటి పేర్లతో మధ్యతరగతిని సంతృప్తి పరచటానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ ఆర్థికవేత్త భరత్ ఝన్ ఝన్‌వాలా చెప్పినట్లు ''ఆర్థిక సంస్కరణలు వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు అవకాశాలను సమకూర్చాయి. మధ్యతరగతికి ఆర్థిక సమృద్ధినిచ్చాయి. కానీ పేదలు, గ్రామీణ ప్రజలను అభివృద్ధికి ఆవలనే వదిలివేశాయి''.
సామాజిక రంగాలు-సామాజిక వర్గాలు-ప్రభావం
1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని పివి నరసింహారావు సామాజిక రంగాలైన విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగానే ఉంటుందని ప్రకటించారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అనేక పుస్తకాలలో విద్య, ఆరోగ్యరంగాలు ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలని ఉద్ఘాటిం చారు. కానీ పాతికేళ్ల అనంతరం పరిశీలిస్తే విద్య, ఆరోగ్యరంగాలు పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ, ప్రయివేటీ కరణ జరిగాయి. విద్యారంగంలో రెండు సమాంతర వ్యవస్థ లు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరానికి రూ.10 వేల కోట్ల విద్యా వ్యాపారం జరుగుతున్నదని ఇటీవల ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యాసంలో పేర్కొన్నారు. సమాజానికి అవసరమైన వారిగా కాకుండా మార్కెట్ అవసరాలను తీర్చే విద్యార్థులు రూపొందుతున్నారు. 2011-12 నాటికి దేశంలో 78 శాతం గ్రామీణ మహిళలు, 56 శాతం గ్రామీణ పురుషులు, 47 శాతం పట్టణ మహిళలు, 30 శాతం పట్టణ పురుషులు నిరక్షరాస్యులుగా కానీ, కేవలం ప్రాథమిక విద్య వరకు చదువుకున్న వారుగా గానీ ఉన్నారు. పాతికేళ్ల ఆర్థిక సంస్కరణల అనంతరం సామాజిక సూచీల విషయంలో వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. మానవాభివృద్ధిలో దేశం 175 దేశాలలో 130 నుంచి 135 స్థానాల మధ్య ఉంటున్నది. 46 శాతం గ్రామీణ మహిళలు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. 20 శాతం పిల్లలు డ్రాపౌట్స్‌గా ఉంటు న్నారని యునెస్కో తాజా నివేదిక వెల్లడించింది. జనాభాలో దాదాపు 24 శాతం దళితులు, గిరిజనులు ఉన్నారు. వీరిలో ఎక్కువ భాగం ఆర్థిక, సామాజిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన మన్యం ప్రాంతంలో గత రెండేళ్లలో విషజ్వరాలతో వందలాది మంది మరణించటం విషాదకరమైన అంశం. కార్పొరేట్ ఆస్పత్రులు రావటంతో ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురైనాయి.
ఆర్థిక సంస్కరణలు-కార్పొరేట్ రాజకీయాలు
ఆర్థిక సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలకు తిలోదకాలి చ్చాయి. ఆదేశిక సూత్రాలలో సంపద వికేంద్రీకరణ జరగాలని, సామాజిక సంపదపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని రాజ్యాంగం పేర్కొన్నది. నేడు 'ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం' పెద్ద ఎత్తున పెరిగింది. అధికారంలో ఉన్న వారు తమ చుట్టూ ఉన్నవారికి సహజ వనరులు, భూములు, ఖనిజాలు విచ్చలవిడిగా చట్టవిరుద్ధంగా పంచుతున్నారు. ఈ విధానాలు కార్పొరేట్ రాజకీయాలకు తెరతీశాయి. 2009లో 300 మంది కోటీశ్వరులు లోక్‌సభకు ఎన్నికయితే, 2014లో 435 మంది ఎన్నికయ్యారు. కార్పొరేట్ శక్తుల ప్రమేయంలో అవినీతి కుంభకోణాలు పెరిగాయి. స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణాలు, గనుల కుంభకోణాలు దీనిలో భాగమే.
సామాజిక సంబంధాలు-విలువలు
ఆర్థిక సంస్కరణలు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, విలువలపై కూడా ప్రభావాన్ని చూపాయి. మనిషిని మిగిలిన సమాజం నుంచి ''పరాధీనత'' చేశాయి. మానవులలో ''సామూహిక'' మనస్తత్వం తగ్గిపోయి వ్యక్తిగత ఆకాంక్షలను పెంచాయి. మానవ సంబంధాలు ఆర్థిక సంబం ధాలుగా మారిపోయాయి. ఆర్థిక సంస్కరణలు దేశ స్వావలం బనను దెబ్బతీస్తున్నాయి. కీలకమైన వ్యవసాయ రంగం క్షీణించి పోతున్నది. ప్రతిరంగంలో కార్పొరేటీకరణ పెరిగిపో తున్నది. ఉపాధి రహిత అభివృద్ధి జరుగుతున్నది. కార్మికుల ఉద్యోగాలకు, వేతనాలకు భద్రత లేదు. వీటిని వ్యతిరేకిస్తూ కార్మికవర్గం చేసే ఆందోళనలలో అందరూ గొంతెత్తాలి, ఉద్యమించాలి.
(వ్యాసకర్త శాసనమండలి మాజీ సభ్యులు)
94402 62072
No comments:
Post a Comment