నేను ఎందుకు నాస్తికుడనయ్యాను?
(తెలకపల్లి రవిగారు సంకలనం చేసిన 'భగత్‌సింగ్' పుస్తకంలోని
ఈ వ్యాసాన్ని మార్క్సిస్టు పాఠకులకు అందిస్తున్నాం)
ఒక సరికొత్త ప్రశ్న ఉదయించింది. సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడూ అయిన దేవుడు ఉన్నాడని నేను విశ్వసించకపోవడం కేవలం నా అహంకారం వల్లనేనా? ఇలాంటి ప్రశ్న నేను ఎదుర్కోవలసి వస్తుందని నేనెన్నడూ ఊహించి ఉండలేదు. కాని కొంతమంది మిత్రు లతో సంభాషించినప్పుడు దేవుడున్నాడనే విష యాన్ని నిరాకరించడం నాకు తగని విషయమని వారు భావించుతున్నట్లు అనిపించింది. ఈ రకంగా దేవుని పట్ల ఆ విశ్వాసాన్ని వెల్లడించడం నాలో ఉన్న ఒక రకమైన అహంకార భావమే నన్నట్లు వారు తలుస్తున్నారు. నిజమే. సమస్య చాలా తీవ్రమైనదే. నేను మామూలు మానవుల కంటే అతీతుడనని గొప్పలు చెప్పుకోవడం లేదు. నేనూ ఒక మానవుణ్ణే. అంతకంటే ఎక్కువేమీ కాదు. మామూలు మానవుల కంటే నేను అతీతు డనని ఎవరూ భావించరాదు. నా సహచరులలో కొంతమంది నన్ను నిరంకుశుడినని కూడా అంటారు. నాలో కూడా బలహీనతలు లేకపో లేదు. కానీ డాంబికంగా వ్యవహరించడం నా స్వభావ లక్షణాలలో ఒకటి కాదు. అయితే నా మిత్రుడు బి.కె.దత్ కూడా అప్పుడప్పుడు నన్ను నిరంకుశుడని అంటాడు. కొన్ని సందర్భాల్లో నన్ను నిరంకుశుడిగా నిందించిన వారు కూడా లేకపో లేదు. అనుకోకుండానే నా అభిప్రాయాలను ఇతరు లపై రుద్దుతానని, ఆ విధంగా నా ప్రతిపాదనలు ఆమోదించబడేటట్లుగాయత్నిస్తానని కొంతమంది మిత్రులు తీవ్రంగానే ఫిర్యాదులు చేసిన ఉదాహరణలున్నాయి. కొంతవరకు అది నిజమే. దాన్ని నేను కాదనను. ఇది అహంభావం కిందకు రావచ్చు. ఇతర సిద్ధాంతాలకన్నా మన సిద్ధాం తం ఉత్తమమైనదనీ, దానిని అనుసరించు తున్నందుకు నాలో ఒక రకమైన గర్వభావం ఉండవచ్చు. అందులో వ్యక్తిగతమైన విషయమేమీ లేదు. ఇది సహేతుకంగా ఉండవలసిన గర్వమే. అది అహంభావం కిందకు రాదు. ఈ అహం భావం వలనా? లేక తీవ్రంగా అధ్యయనం చేసిన తరువాత, గాఢంగా పరిశీలనానంతరమే నాకు దేవుని యందు విశ్వాసం లేకుండా పోయిందా? అన్న విషయాన్నే ఇక్కడ నేను చర్చించదలిచాను. ముందుగా నేనొక విషయాన్ని స్పష్టం చేయదలిచాను. అది ఏమిటంటే అహం భావం, డాంబికంగా వ్యవహరించడమూ - రెండూ ఒకటి కాదు.
మొదటి విషయం : మితిమీరిన గర్వం లేదా డాంబిక ప్రవృత్తి ఒక వ్యక్తి దేవుడిని విశ్వసించడానికి ఎలా అవరోధం కాగలదో నాకు అర్థం కావడం లేదు. అర్హత లేకపోయినప్పటికీ ఎంతో కొంత ప్రజాభిమానాన్ని చూరగొనగలిగి ఉంటే అప్పుడు నిజంగానే ఒక గొప్పతనాన్ని నేను గుర్తించడానికి నిరాకరించి ఉండవచ్చు. అలాంటిది కొంతవరకు నమ్మదగినదిగానే ఉంటుంది. కాని కేవలం వ్యక్తిగత అహంకారంతో దేవుడిని విశ్వసించకుండా ఎవరైనా ఎలా ఉండగలడు? తనే దేవుడికి పోటీదారుడననీ, లేదా తాను దేవుడినని విశ్వసించే వ్యక్తి నిజానికి ఎలా నాస్తికుడు కాగలడు? మొదటి సందర్భంలో తనకు పోటీగా ఒక దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నిరా కరించడం జరగదు. ఇక రెండో సందర్భంలో ఈ ప్రకృతికి సంబంధించిన అన్ని వ్యవహారా లకు సారథ్యం వహించే ఒక అతీతశక్తి ఉన్నదా?
అలా అంగీకరించేవాడు నాస్తికుడు కాజా లాడు. సర్వాంతర్యామి అయిన దేవుడొకడున్నాడనే విషయాన్నే నేను నిరాకరించుతున్నాను. ఎందు కలా నిరాకరిస్తున్నానో తర్వాత వివరిస్తాను. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలి చాను. నాస్తికత్వాన్ని నేను అంగీకరించడానికి అహంకారం కాని, డాంబిక ప్రవృత్తిగాని ఉండడం కారణం కానేకాదు. అందువలన కొంత మంది మిత్రులు ఆలోచించుతున్నట్లు రెండు కేసుల్లో, ఢిల్లీ బాంబుకేసులో నా తల తిరిగి నేను అహంకారిని కాలేదు.
వాస్తవం చెప్పుకోవాలంటే నా నాస్తికత్వం ఇటీవలిది కాదు. నేను ఎవరికీ తెలియని అనామకుడైన ఒక యువకుడుగా ఉన్న రోజుల్లోనే దైవాన్ని విశ్వసించడం మానివేశాను. నా మిత్రు లకు ఈ విషయం తెలియదు. ఒక కాలేజీ విద్యా ర్థిగా ఉన్న వాడు ఏదో గర్వంతోనో, అహం భావంతోనో, నాస్తికత్వాన్ని చేపట్టడన్న విషయాన్ని గ్రహించడం అవసరం. కొంతమంది ప్రొఫెసర్లకు అభిమానపాత్రుడైన విద్యార్థిగాను, మరి కొందరిచే నిరసించబడే విద్యార్థినైనప్పటికీ నేను బాగా కష్టపడి చదివి ప్రముఖ విద్యార్థిగా పేరు పొందిన వాడిని కాదు. కాబట్టి నాకు గర్వం ఉండటానికి, అహంభావిని కావటానికి అవకాశం లేదు. నేను కొంత వరకు సిగ్గుతో ఉండే స్వభావంకల యువ కుడిని. భవిష్యత్ జీవితాన్ని గురించి నిరాశాజ నకంగా ఉండే స్వభావం నాది. ఆ రోజుల్లో నేను ఖచ్ఛితమైన నాస్తికవాదిని కాదు. మా తాత పలుకుబడిలో సనాతన ఆర్యసమాజవాదిగా పెరిగిన వాడిని. సనాతన ఆర్యసమాజవాది ఏదైనా కావచ్చు గాని నాస్తికుడు మాత్రం కాడు. నా ప్రాథమిక విద్య ముగిసిన తరువాత లాహోరులోని డి.ఎ.వి. స్కూల్‌లో చేరాను. అక్కడ బోర్డింగ్ హౌస్‌లో ఒక సంవత్సర కాలం ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఉదయం, సాయం త్రం ప్రార్థనలు చేయడంతో పాటు 'గాయత్రి మంత్రాన్ని' గంటల తరబడి పఠించేవాడిని, ఆ రోజుల్లో నేను దైవభక్తుడుగా ఉండేవాడిని. ఆ తరువాత నేను నా తండ్రితో కలిసి ఉన్నాను. మా తండ్రిగారు సనాతనులకు సంబంధించి ఉదారవాదిగా ఉండేవారు. ఆయన బోధనల ఫలి తంగానే నా జీవితాన్ని దేశ స్వాతంత్య్ర సాధనకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. కాని ఆయన నాస్తికుడు కాదు. దైవంలో పూర్తిగా విశ్వసమున్నవాడు. రోజూ ప్రార్థనలు చేయాలని ఆయన నన్ను ప్రోత్సహించుతూ ఉండేవారు. ఈ విధంగానే నేను పెరిగాను. సహాయ నిరాకరణోద్యమ రోజుల్లో నేను నేషనల్ కాలేజీలో చేరాను. అక్కడ నేను ఉదారబుద్ధితో ఆలోచనలు జరుపుతూ అన్ని మతాలను, చివరకు దేవుడినీ విమర్శించుతూ ఉండేవాడిని. అయినప్పటికీ అప్పటి వరకూ నేను దైవభక్తుడనే. అప్పటి వరకూ గడ్డాన్ని, తలజుట్టునూ పెంచుతూనే ఉండేవాడిని. కాని సిక్కు మతం లేదా ఇతర మతాలు చెప్పే సూత్రాలను మాత్రం నేను నమ్మేవాడిని కాదు. కాని దేవుడున్నాడనే విషయంలో మాత్రం నాకు ధృడ విశ్వాసం ఉండేది.
ఆ తరువాత నేను విప్లవ పార్టీలో చేరాను. నేను మొట్టమొదట కాంటాక్ట్‌లోకి వచ్చిన నాయకుడికి అంత నమ్మకం లేకపోయినా దేవుడున్నాడన్న విషయాన్ని నిరాకరించే ధైర్యం లేదు. దేవుడిని గురించి నేను అదే పనిగా ఆయ నను ప్రశ్నించుతూ ఉంటే ''నీకు అవసరమను కున్నప్పుడల్లా దేవుడిని ప్రార్థించు'' అని మాత్రం చెప్పేవాడు. నేను కాంటాక్ట్‌లోకి వచ్చిన రెండో నాయకుడు దేవుడి మీద గట్టి విశ్వాసం ఉన్న వ్యక్తి. ఆయన పేరు శచీంద్రనాథ్ సన్యాల్. అం దరూ గౌరవించే కామ్రేడ్ ఆయన. ఆయనిప్పుడు కకోరి కుట్రకేసు సందర్భంగా ద్వీపాంతరవాస శిక్షను అనుభవించుతున్నారు. ఆయన 'బందీ జీవన్' అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రచించారు. ఆ పుస్తకంలోని మొదటి పేజీ నుండి కూడా దేవుడిని అత్యంత గొప్పగా శ్లాఘించుతూ ఉండటం గమనించదగిన విషయం. నేనిక్కడ చెప్పదలచుకున్నదేమిటంటే విప్లవపార్టీలో దేవుడి మీద అవిశ్వాసమనే భావమే జనించలేదు.
ప్రఖ్యాతి గాంచిన కకోరి కుట్రకేసులోని నలుగురు కూడా దేవుడ్ని ప్రార్థించుతూనే ప్రాణా లను విడిచారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్ సనాతన ఆర్యసమాజవాది. సోషలిజాన్ని గురించి, కమ్యూనిజాన్ని గురించి రాజెన్‌లహిరీ లోతుగా అధ్యయనం చేసినప్పటికీ ఉపనిషత్తులలోని మంత్రాలను, గీతను ఆలాపించాలనే ఆకాంక్షను ఆయన తగ్గించుకోలేక పోయారు. ఈ విప్లవకారుల్లో ఎన్నడూ ప్రార్థన చేయని వారిని ఒక్కరినే నేను చూడగలిగాను. ''మానవుని బలహీనత ఫలితమే వేదాంతం'' అని ఆయన అనేవారు. మన విజ్ఞానానికి పరిమితి ఉండటం వల్లనే వేదాంతాన్ని నమ్ముతున్నామని కూడా ఆయన అనేవారు. ఆయన కూడా యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్షను అనుభవించారు. కాని ఆయన కూడా దేవుడు లేడని చెప్పడానికి ఎన్నడూ సాహసించేవారు కాదు.
ఆ దశ వరకూ నేను ఒక స్వాప్నిక ఆదర్శ విప్లవవాదిగా మాత్రమే ఉండేవాడిని. అప్పటి వరకూ నాయకులను అనుసరించడమే మా పని. ఇంక ఆ తరువాత మొత్తం బాధ్యతలను నెత్తిమీద వేసుకొనే సమయమాసన్నమైనది. అనివార్య కారణాల వలన అసలు పార్టీ ఉనికే అసాధ్య మన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్సాహవంతమైన కామ్రేడ్స్ మమ్ములను ఎగతాళి పట్టించడం ప్రారంభించారు. కొంత కాలానికి నేను కూడా భయపడ్డాను. మా కార్యక్రమం ఏ విధంగానూ ఫలించబోదనే అనుమానం ఏర్పడింది. అప్పుడే నా విప్లవ జీవితంలో ఒక మూలమలుపు ఏర్పడింది. ''అధ్యయనం'' అవసరమన్న ఆవేశం నా మనస్సులో ప్రతిధ్వనించడం ఆరంభించింది. ప్రతికూలురు తెచ్చే వాదనలను ఎదుర్కొనాలంటే అధ్యయనం ఒక్కటే మార్గమనిపించింది. సిద్ధాంతం సరియైనదని నిరూపించుకోవాలంటే అధ్యయనం ఒక్కటే మార్గమనిపించింది. సిద్ధాంతం సరియైనదని నిరూపించుకోవాలంటే అధ్యయనం చేసి వాదనలకు అవసరమైన పరిపుష్ఠిని చేజిక్కించుకోవడం అవసరం. అందుకని గ్రంథాలను అధ్యయనం చేయడం ఆరంభించాను. దీనితో అంతకు ముందు నాలో ఉన్న విశ్వాసాల్లో తీవ్రమైన మార్పులు వచ్చాయి. మా ముందు తరం విప్లవకారుల కార్యక్రమంలో హింసాపూరితమైన పద్ధతులకే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో కొన్ని తీవ్రమైన భావాలకు స్థానం ఏర్పడింది. అద్భుతాలను విశ్వసించడం గాని, గుడ్డిగా నమ్మడంగాని వదిలివేశాం. వాటి స్థానంలో వాస్తవికత చోటు చేసుకున్నది. తప్పనిసరి పరిస్థితుల్లోనే హింసా చర్యలను చేపట్టడం అవసరమనుకున్నాం. ప్రజా ఉద్యమాలన్నిటికీ అహింసా పద్ధతులే తప్పనిసరి అని భావించడం మొదలైంది. పద్ధతులకు సంబంధించి ఆ నిర్ణయం జరిగింది. అన్నింటి కంటే ముఖ్యమైన దేమంటే మనం ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నామనే విషయంలో స్పష్టత ఏర్పడింది. కార్యాచరణకు సంబంధించి నిర్వ హించవలసిన ముఖ్య కార్యకలాపాలు లేనందు వలన, ప్రపంచ విప్లవానికి సంబంధించి నిర్వ హించవలసిన ముఖ్య కార్యకలాపాలు లేనందు వలన, ప్రపంచ విప్లవానికి సంబంధించి వివిధ రకాల భావాలను గురించి అధ్యయనం చేయటా నికి బాగా అవకాశం దొరికింది. ఆరాచకవాద నాయకుడైన బకునిన్‌ను నేను అధ్యయనం చేశాను. కమ్యూనిజానికి మూల పురుషుడైన మార్క్స్‌ను గురించి కొంత చదివాను. తమ దేశంలో విప్లవాన్ని జయప్రదంగా నిర్వహించిన అను భవం గల లెనిన్, ట్రాట్‌స్కీ తదితరుల రచనలను గురించి హెచ్చుగా అధ్యయనం చేశాను. వారంతా నాస్తికులే. 'దేవుడు - రాజ్యం' అన్న బకునిన్ రచన పైపైనే ఉన్నప్పటికీ చదవడానికి ఎంతో ఆసక్తిదాయకమైన విధంగా తోచింది. ఆ తరువాత నిర్మలానంద స్వామి రచించిన 'ఇంగిత జ్ఞానం' అన్న గ్రంథం చదవడం సంభవించింది. అది ఒక రకమైన కాల్పనిక నాస్తికత్వాన్ని గురించిన రచన. నాస్తికత్వం నాకు అత్యంత ఆసక్తిదాయకంగా పరిణమించింది. 1926 సంవత్సరం ముగిసేటప్పటికీ ఈ జగత్తును సృష్టించి నడుపుతున్న సర్వంతర్యామి ఒకడున్నా డన్న విషయానికి ప్రాతిపదికలేదని నేను విశ్వసిం చడం ఆరంభించాను. ఈ విషయాన్ని గురించి నా మిత్రులతో చర్చించడం మొదలుపెట్టాను. దానితో నేనే ఖచ్చితమైన నాస్తికుడనయ్యాను. అయితే అదంటే ఏమిటో ఇప్పుడు చర్చించు కుందాం. 1927 మేలో నేను లాహోర్‌లో అరెస్టు అయ్యాను. ఆ అరెస్టు ఏమాత్రం ఊహించని అకస్మిక సంఘటన. పోలీసులు నన్ను వేటాడుతు న్నారన్న విషయమే నాకు ఎరుక లేదు. నేనొక తోటలో నుండి వెళుతుండగా అకస్మాత్తుగా పోలీసులు నన్ను చుట్టుముట్టారు. ఆ సమయంలో నేను ఏ మాత్రం ఉద్రేకపడకుండా ప్రశాంతంగానే ఉండగలగడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను పోలీసు కస్టడీలో ఉంచారు. మరునాడు రైల్వే పోలీసు లాకప్‌కు తీసుకుని వెళ్లి పూర్తిగా నన్ను ఒక నెల రోజుల పాటు అక్కడ బంధిం చారు. కొన్ని రోజుల పాటు పోలీసు ఆఫీసర్లతో సంభాషణలు జరిపిన ఫలితంగా కకోరి పార్టీతోనూ, విప్లవోద్యమానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలతోనూ నాకేదో సంబంధం ఉన్నట్లు వాళ్లకు సమాచారం అందినట్లు నేను ఊహించాను. కకోరి కుట్ర కేసు విచారణ జరుగుతున్న సమయంలో నేను లక్నో వెళ్లానని, వారిని తప్పించడానికి ఏదో పథకాన్ని గురించి మేము ఆలోచించామని, దానికి వారి ఆమోదాన్ని పొందిన తరువాత మేము కొన్ని బాంబులను సేకరించామని, వాటిని పరీక్షించేందుకు 1926 దసరా పండుగ నాడు ఒక గుంపు మీద ఒక బాంబు విసిరామని వారు నాతో చెప్పారు. విప్ల వ పార్టీ కార్యకలాపాలను గురించి మరికొంత సమాచారాన్ని తెలుపుతూ నేను ఒక ప్రకటన చేసే పక్షంలో నన్ను జైలులో ఉంచబోమని, ఇదంతా నామేలు కోసమే చెబుతున్నామని వారు చెప్పారు. వారి ప్రతిపాదన విని నేను ఫక్కున నవ్వాను. అదంతా అబద్ధమన్నాను. కొన్ని ఉన్నత భావాలు కలిగిన నాలాంటి వాళ్లు అమాయ కులైన ప్రజలపైన బాంబులు వేయరు. ఒకరోజు ఉదయం పూట అప్పటి సి.ఐ.డి సీనియర్ సూపరింటెండెంట్ నా వద్దకు వచ్చాడు. చాలా సేపు నాతో ఎంతో అభిమానపూర్వకంగా మాట్లా డిన తరువాత తాము కోరినట్లుగా స్టేట్‌మెంట్ ఇవ్వని పక్షంలో చక్రవర్తిపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నిన కకోరి కేసులో నన్ను కూడా ఒక ముద్దాయిగా చేరుస్తామనీ, దసరా సందర్భంగా బాంబులు వేసి క్రూరంగా హత్యలకు తలపడి నట్లు ఆరోపించుతూ కేసు పెడతామని ఆయన తెలిపారు. ఇలా తెలుపుతున్నందున తాను ఎంతో విచారపడుతున్నట్లు నటించాడు. ఈ సందర్భంగా నాపై తగినంత సాక్ష్యం తన వద్ద గలదనీ, దానితో ఉరిశిక్షపడేటట్లు చేయగలనని కూడా ఆయన నన్ను బెదిరించాడు. ఈ విషయం లో నాకు అంతగా తెలియనప్పటికీ పోలీసులు కావాలనుకుంటే అంతపనీ చేయగలరని నేను విశ్వసించాను. నేను ఎలాగూ ఉరిశిక్షకు ఆహుతి కాక తప్పదు కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు ప్రార్థనలు జరుపుకోవలసిందని పోలీసు ఆఫీసర్లు నాకు సలహా ఇచ్చారు. అప్పటికే నేను నాస్తి కుడను. శాంతిగాను, సరాదాగాను ఉన్నప్పుడు నేను నాస్తికుడనని గర్వంగా చెప్పుకోవచ్చు. కాని కష్ట సమయంలో కూడా ఆ సూత్రానికి కట్టుబడి ఉండగలనా అనేదే కీలక సమస్య. ఈ సమస్యను గురించి బాగా ఆలోచించుకున్న తరువాత దేవుడిని ప్రార్థించరాదనే నిర్ణయానికి వచ్చాను. అది నిజానికి పరీక్షా సమయం. ఆ పరీక్షలో నేను ధృఢంగా నిలవగలిగాను. ఇతర కారణా లతో నేను ఉరి నుండి తప్పించుకోవాలనే ఆలో చన నాలో ఏ మాత్రం రాలేదు. ఆ విధంగా నేను ఖచ్చితంగా దేవుడిపై నమ్మకం లేనివాడిని. అప్పటి నుండి అలాగే కొనసాగాను. ఆ పరీక్షలో నిలబడి నెగ్గడం అంత సులభమైన విషయమేమీ కాదు. దేవుడి మీద ''నమ్మకం'' అనేది కష్టాలను కొంతవరకు మరిచిపోయేలా చేయగలదు. ఒక విధంగా సంతోషాన్ని కూడా కలుగజేయగలదు. దేవునిపై గల నమ్మకంతో మానవుడు ఎంతో ఓదార్పును, ఆత్మస్థయిర్యాన్ని పొందగలడు.
దేవుడు కనుక లేకపోతే మానవుడు కేవలం తనపైననే ఆధారపడవలసి వస్తుంది. విపరీత మైన కష్టాల మధ్య, పెను తుపాన్ల మధ్య ఎవరి కాళ్ళపై వాళ్లు నిలబడగలగడం ఏ మాత్రం చిన్న విషయం కాదు. అలాంటి సమయంలో అహంకారం అంటూ ఏమైనా ఉంటే అది ఎగిరి పోతుంది. అందరూ నమ్మేదానిని కాదనడానికి ఎవ్వరూ సాహిసించలేరు. అలా కాదనగలిగితే అహంకారానికి మించి మరో శక్తి అతనిలో ఉన్నదనే అభిప్రాయానికి రావలసి వస్తుంది. ఇదీ అనాటి పరిస్థితి. నా కేసుపై తీర్పు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అది మరో వారం లోపల ప్రకటించబడుతుంది. ఒక ఆశయం కోసం నా జీవితాన్ని త్యాగం చేయబోతున్నాననే సంతృప్తి మినహా మరొకటేమి ఉంటుంది? దేవుడి మీద నమ్మకం ఉన్న హిందువైతే వచ్చే జన్మలో ఒక రాజుగా పునర్జన్మ ఉంటుందని ఆశించుతాడు. ముస్లిం లేదా క్రైస్తవుడైతే ఇలా త్యాగం చేసినందుకు స్వర్గంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చునని ఆశించ వచ్చు. కాని నాకు ఏమి ఆశ ఉంది? నాకు తెలుసు. నా మెడకు ఉరిత్రాడు బిగించడంతో అదే నా జీవితంలో ఆఖరి క్షణం కాగలదని. ఇంకా ఆ తర్వాత ఏమీ ఉండదు. ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తి జీవితం ఆ విధంగా ముగించడం మినహా మరేమీ లేదు. ఎలాంటి స్వార్థం లేకుండా లేదా ఎలాంటి పారితోషికం ఇప్పుడు గాని, ఆ తరువాత గాని పొందకుండా నా జీవితాన్ని దేశస్వాతంత్య్ర సాధన కోసం వినియోగించాననే సంతృప్తి, ఆనందం మాత్రమే మిగులుతుంది. మామూలుగా అయితే విజయ మో, వీర స్వర్గమో అన్న ఆశతో యుద్ధంలో వీరులు తమ ప్రాణాల నర్పించడానికి సిద్ధపడతారు. కాని అలాంటిదేమీ లేకుండా మానవాళికి సేవ చేయడానికి, పీడితులకు విముక్తిని సాధించడా నికి నిస్వార్థంగా, అధికారికంగా స్రీ,్త పురుషులు ముందుకొచ్చినపుడు విముక్తి యుగానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది.
ఇక్కడ రాజు కావడమో లేదా ఇతరంగా లాభడపడడమో లేదు. మరణించిన అనంతరం ఉంటుందనుకునే స్వరంలోకి వెడతామనే ఆశలేకుండా కేవలం దోపిడీదార్లను, పీడకులను, నిరంకుశులను సవాలు చేసి, మానవ జాతిని బానిసత్వాన్నుండి విముక్తి చేసి, మానవులకు స్వాతంత్య్రాన్ని, శాంతిని ప్రసాదించే లక్ష్యం కోసం ప్రాణాలర్పించడంలో అహంకారం ఏముంటుంది? అహంకారంతో దేవుడిపై అవిశ్వాసాన్ని నేను ప్రకటించాననే అపవాదు వేయడానికి ఎవరికి సాహసం ఉంటుంది? అలాంటి వారు తెలివితక్కువ వారో, దుర్బుద్ధి గలవారో అయివుంటారు. అలాంటి వారిని క్షమించుదాం. ఆ తరువాత అయినా అలాంటి మహోన్నతమైన త్యాగానికి ప్రేరేపించడానికి ఏ మహోన్నత లక్ష్యాలు కారణమైనాయో వారు గుర్తించగలరు. ఎవరి కాళ్ళపై వాళ్లు నిలవటాన్ని అహంకారంగా పరిగణించడం అత్యంత శోచనీయమైన విషయం
ఆనాడు ప్రజల్లో బలంగా ఉన్న విశ్వాసాల ను మీరు వ్యతిరేకించితే, అందరిచే విమర్శకు అతీతుడనుకున్న ఒక గొప్ప వ్యక్తిని లేదా ఒక వీరుడిని మీరు విమర్శించితే అందుకోసం మీరు చేసే వాదనలన్నీ అహంకారయుతమైనవని జనం మిమ్ములను తెగనాడటం కద్దు. ఇందుకు కారణం మానసికంగా స్తబ్ధత ఏర్పడడమే. విమర్శ, స్వతం త్ర ఆలోచన, ఇవి రెండూ ఏ విప్లవకారునికైనా తప్పనిసరిగా ఉండవలసిన మంచి లక్షణాలు. మహాత్మాజీ గొప్పవాడు కాబట్టి ఆయనను ఎవ్వరూ విమర్శించలేదు. ఆయన చాలా పెద్ద వాడైనాడు గాబట్టి రాజకీయాల్లో, మత వ్యవ హారాల్లో, ఆర్థిక రంగంలో లేదా నైతిక సూత్రాల విషయంలో ఆయన ఏమి చెప్పినా సరియైనదే. ఆయన చెప్పే తీరాలి. ఈ రకమైన మనస్తత్వం ప్రగతి వైపుకు దారి తీయదు. పైపెచ్చు అది అభివృద్ధి నిరోధకమైనది కాగలదు.
మన తాత ముత్తాతలు సర్వశక్తివంతుడైన దేవుడిపై నమ్మకం కలిగిన వారు కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎవరైనా సవాల్ చేయడానికి సాహ సించితే అతణ్ణి విద్రోహి కింద నిందించుతారు. అతని వాదనలు సహేతుకంగా ఉండి, నిరాకరించడానికి వీలులేనివైతే అతణ్ణి అహంకారి అని ప్రకటిస్తారు. అలాంటి వారితో వాదించి ఫలితం ఉండదు. ఈ సమస్య ప్రజల ముందు బహిరంగ చర్చకు మొదటిసారిగా వస్తుంది. కాబట్టి దీనిని గురించి మొత్తంగానే వాదించుతాను.
మొట్టమొదటి సమస్య : నేను నాస్తికుడను కావడానికి దారి తీసింది అహంభావం కాదనేది ఇప్పటికే నేను స్పష్టం చేయగలిగానని భావించుతు న్నాను. నేను వాదన చేసిన తీరు నచ్చిందీ లేనిదీ తీర్పు చెప్పవలసింది నేను కాదు పాఠకులే. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడిపై నమ్మకం ఉంటే నా జీవితం మరింత సులభతరమై ఉండేది. నా భారం కూడా తగ్గేది. కాని దేవుడిపై నాకు నమ్మకం లేకపోవడం వలన పరిస్థితి నాకు కష్టతరంగా పరిణమించింది. దైవత్వంపైనా, పరలోకంలోని సుఖభోగాలపైనా నమ్మకం ఉండివుంటే మరణం ఆనందకరంగానే ఉండేది. కాని ఆ మైకంలో నేను ఉండదలచలేదు. నేను వాస్తవికవాదిని. హేతువాదం సహాయం పైననే నేను నిలబడదలిచాను. ఈ లక్ష్యసాధనలో నేనెప్పుడూ జయప్రదం కాలేను. కాని అందుకోసం ప్రయత్నించడం మానవ ధర్మం. విజయం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఇంక రెండో ప్రశ్న ఉదయించుతుంది. ఇది అహంభావం వలన కాకపోతే ప్రాచీన కాలం నుండి వస్తూ నేటికీ ప్రబలంగా ఉన్న దేవునిపై విశ్వాసం లేకపోవడానికి మరొక కార ణం ఉండి తీరాలి. దాని విషయానికే ఇప్పుడు వస్తున్నాను. అందుకు మరో కారణం లేకపో లేదు. నా ఉద్దేశ్యంలో ఏ వ్యక్తికైనా ఏమాత్రం వాదనాశక్తి ఉన్నా తాను ఉన్న పరిస్థితుల్లో ఏది ఏమిటన్న విషయాన్ని గురించి తర్కించుతాడు. ఎప్పుడైతే సరియైన, ప్రత్యక్షమైన ఆధారాలు దొరకవో అప్పుడు విశ్వాసమనేది ప్రధాన స్థానమాక్రమించుతుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్లు మానవుని బలహీనత ఫలితమే మత విశ్వాసమని ఒక విప్లవమిత్రుడు నాతో అంటూ ఉండేవాడు. మన పూర్వీకులకు ఈ ప్రపంచ రహస్యాన్ని, దాని గతం, వర్తమానం, భవిష్యత్తును గురించి పరిశోధించి తెలుసుకోవడానికి తగి నంత సమయం ఉండేది. ఈ ప్రపంచం ఎక్కడ నుండి పుట్టింది? ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? మొదలైన విషయాలను ఆలోచించినప్పుడు వారి వద్ద సూటిగా ఆధారాలు కొరవడేవి. ప్రతి ఒక్కరూ తమకిష్టం వచ్చిన రీతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించేవారు. అందు వల్లనే వివిధ మతాలు సిద్ధాంతాల మధ్య విపరీ తమైన భేదాలు మనకు కనిపించుతాయి. ఆ సిద్ధాంతాలు ఒక్కోసారి పరస్పర విరుద్ధంగా ఉండి ఘర్షణకు సిద్ధపడే ధోరణిలో ఉంటాయి.
ప్రాక్ పశ్చిమ వేదాంతాలు విభిన్నమైనవి. తిరిగి ప్రాచ్య దేశాల్లోని మతాల్లోనే ముస్లిం మతం హిందూ మతానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. భారతదేశంలోనే బౌద్ధమతమూ, జైనమతమూ, బ్రాహ్మణత్వానికి భిన్నంగా ఉంటాయి. మళ్ళీ పరస్పర విరుద్ధమైన ఆర్య సమా జం, సనాతన ధర్మమూ వేరుగా ఉంటాయి. చార్వాకుడు గత యుగాలకు సంబంధించిన మరో స్వతంత్ర ఆలోచనాపరుడు. గత యుగం లోనే ఆయన దేవుడి అస్తిత్వాన్ని సవాలు చేశారు. మౌలిక సమస్యలపైన ఈ మతాలన్నీ ఒక దానితో మరొకటి విభేదించుతాయి. అజ్ఞానాన్ని అధిగమించి ఈ నిగూఢమైన సమస్యకు పరిష్కా రాన్ని కనుగొనడానికి బదులుగా వాటినే గ్రుడ్డిగా విశ్వసించుతూ మానవ ప్రగతికి అడ్డుపడుతుంటారు.
అభ్యుదయం కోసం నిలబడే ప్రతి వ్యక్తీ పాత విశ్వాసాలలోని ప్రతి ఒక్క అంశాన్ని మూ ఢంగా నమ్మకుండా ఒక దాని తరువాత మరొక దానిని సవాలు చేయాలి. దానిపై వాదోపవా దాలకు సిద్ధపడాలి. వాదనల అనంతరం ఆ సిద్ధాంతాన్ని గాని, ఆ మత విశ్వాసాన్ని గాని అంగీకరించితే మనం ఆహ్వానించవలసిందే. ఆ వ్యక్తి వాదన పొరపాటు కావచ్చు. కొన్ని సందర్భా ల్లో తప్పుకావచ్చు. కాని ఆ తరువాత సరిదిద్దు కోవచ్చు. ఎందువల్లనంటే ఆ వ్యక్తి జీవితంలో హేతువాదం మార్గదర్శకం కావాలి. కాని కేవ లం విశ్వసించడం, గ్రుడ్డిగా నమ్మడం ప్రమాద కరం. అది మేధస్సును పనిచేయకుండా చేస్తుంది. వ్యక్తిని అభివృద్ధి నిరోధకంగా మార్చివేస్తుంది. వాస్తవికవాదినని చెప్పుకునే ప్రతి వ్యక్తీ పాత విశ్వాసాలను సవాలు చేయాలి. అవి వాదనకు నిలబడలేకపోతే సహజంగానే కుప్పకూలి పోతాయి. అప్పుడు పాత విశ్వాసాలను త్రోసి పుచ్చి నూతన తత్వశాస్త్రం కోసం అన్వేషించాలి. ఇందుకోసం పాత విశ్వాసాలను సంబంధించి నంత వరకూ ఈ అంశంపై నేను పెద్దగా అధ్యయనం చేయలేదని ఒప్పుకొంటాను.
ప్రాచ్యదేశాలకు సంబంధించిన మతా లను గురించి అధ్యయనం చేయాలని నాకు ఎంతో ఆసక్తి ఉంది. కాని అందుకు నాకు అవకా శం లభించలేదు. కాని ఈ ప్రకృతి నంతటినీ శాసించే ఒక అతీతశక్తి లేదనే విషయంలో మాత్రం నేను గట్టిగానే ఉన్నాను. మేము ప్రకృతిని విశ్వసించుతాం. ప్రకృతిని తన కోసం ఉపయోగించుకోవడానికి దానిపై అధిపత్యాన్ని సాధించడానికి మానవుడు ఎల్లప్పుడూ ప్రయత్నిం చాలి. మొత్తం ఉద్యమం ఇందుకే కృషి చేస్తుంది.
ఇంక అతీతశక్తిపై నమ్మకం ఉండేవారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం.
ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఒక సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, భగవం తుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు. అలా అయితే దానిని ఆయన ఎందుకు సృష్టించాడో చెప్పగలరా? ఈ ప్రపంచంలో ప్రజలు పేదరి కంతో, రకరకాల కష్టాలతో, బాధలతో అనేక అత్యాచారాలకు గురవుతూ జీవించుతున్నారు. ఎవ్వరూ తృప్తిగా జీవించడం లేదు.
దయచేసి ఆయనకున్న శాసనాలకు లోబడి చేస్తున్నాడని అనబోకండి. ఆయనే గనుక కొన్ని శాసనాలకు కట్టుబడి ఉండవలసినవాడైతే ఆయన కూడా ఒదిగి ఒదిగి ఉండవలసిన బానిస మాత్రమే కాగలడు. ఇలా జనాన్ని బాధపెట్టడం ఆయనకు సరదా అని అనబోకండి.
నీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని తగుల బెట్టించాడు. నీరో పరిమిత సంఖ్యలోనే ప్రజలను హతమార్చాడు. అనేక విషాదాలను తన చిద్విలాసం కోసమే ఆయన జరిపించాడు. మరి అలాంటి నీరో చక్రవర్తి స్థానం చరిత్రలో ఏమిటి? చరిత్రకారులు ఆయనను ఏ పేరుతో పిలుస్తారు? నీరో చక్రవర్తిని ఎన్ని రకాల విషభరితమైన, అపభ్రంశమైన పేర్లను పెట్టి పిలవాలో అన్నీ పెట్టి మరీ పిలుస్తారు. నీరో చక్రవర్తి పరమ నిరంకుశుడు, కఠిన హృదయుడు పరమ క్రూరుడు అని చరిత్ర పుటలన్నింటా వర్ణించబడ్డాడు.
ఇక చెంఘిజ్ ఖాన్ తన క్రూరమైన సంతోషం కోసం వేలమందిని హతమార్చాడు. చెంఘిజ్ ఖాన్ పేరు చెబితేనే మనకు వళ్ళు మండుతుంది. అత్యంత ద్వేషం, అసహ్యం కలుగుతుంది. అలాంటప్పుడు ప్రపంచంలోని అశేష ప్రజల జీవితాలను దుఃఖభాజనం చేసే దేవుణ్ణి, ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం కష్టాలతో, విషాదాలతో వారి జీవితాలను అధోగతి పాల్జేసే దేవుణ్ని, ఈనాటికి వారిని కష్ట సముద్రాల్లో నిత్యమూ ముంచుతున్న దేవుణ్ని మనం ఏమనాలి? చెంఘిజ్‌ఖాన్, నీరోచక్రవర్తి ఎప్పుడో ఒకసారి చేసిన దానికంటే దేవుడు ఈ ప్రపంచంలోని ప్రజలను నిత్యమూ కష్టాలకు, బాధలకు, అత్యాచారాలకు గురి చేస్తున్నప్పుడు ఆయనను ఎలా పూజించాలి? ఎలా కొలవాలి?
మీకు నా సూటి ప్రశ్న ఇది. ఇంచుమించు నరకప్రాయంగా ఉన్న ఈ ప్రపంచాన్ని ఆయన ఇలా ఎందుకు సృషించాలి? ఎల్లప్పుడూ మాన వులకు ఆవేదనలనూ, అశాంతినీ కలుగజేసే విధంగా ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాలి? దేవుడు సర్వశక్తి సమన్వితుడు కదా? ఏదైనా సరే చేయటానికి లేదా చేయకుండా ఉండటానికి ఆయనకు శక్తివుంది కదా? అటువంటప్పుడు ఇన్ని దుఃఖాలు, బాధలుపడే మానవుల్ని ఆయన ఎందుకు సృష్టించాలి? ఆయన చేసిన పనిని మనం ఎలా సమర్థించగలం?
పూర్వం ఒక రకం మృత్యు క్రీడలు జరిపి ఆనందించేవారు ఉండేవారట. (గ్లాడియే టరు సంస్థ నిర్వాహకులు వారు) ఆకలితో ఆరాట పడే సింహాలు, పులుల ముందు మనుషులను నెట్టేవారు. ఆ సింహాలకు, పులులకు ఆహారమై పోకుండా ఎవరైనా ఒక అభాగ్యుడు బయటపడితే వాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెడతాం, సర్వసౌఖ్యాలు, సంపదలు ఇచ్చి సత్కరిస్తాం అనే వారట. సరిగ్గా అలాగే ఉంది దేవుడి సంగతి. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వచైతన్యమూర్తి అయిన భగవంతుడు ఈ దుఃఖమయ ప్రపం చాన్ని, అందులో అష్టకష్టాలు పడే మానవుడ్ని ఎందుకు సృష్టించాలి అని నేను అడుగుతున్నాను.
హిందూ వేదాంతం మరో వాదన కూడా తీసుకురావడానికి పెనుగులాడుతుంది. కానీ మహమ్మదీయులూ, క్రైస్తవ మతావలంబులారా పై ప్రశ్నలకు మీరిచ్చే సమాధానమేమిటి? హిందు వుల్లా మీరు పునర్జన్మను అంగీకరించరు. అలాం టి పునర్జన్మ సిద్ధాంతాన్ని మీరు విశ్వసించరు. పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాన్ని, దుష్కృ త్యాల ఫలితాలను మానవులు ఈ జన్మలో అను భవిస్తారని మీరు హిందువులవలె వాదించరు. అయితే మీరు చెప్పేదేమిటి? మీ విశ్వాసాలు ఏమిటి? ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి భగవంతుడు వారంలో ఆరు రోజులు పని చేస్తూ ఉంటాడట. సృష్టి ఆరు రోజులు చేసేవాడు ఏడో రోజున తను సృష్టించిన ప్రపంచంలో లోటు పాట్లను ఎందుకు తెలుసుకోడు? అనుభవాన్నుండి ఎందుకు నేర్చుకోడు? అలాకాక సృష్టి చేసిన ప్రతి రోజూ ఆఖరున 'అంతా సవ్యంగా ఉంది. అంతా సక్రమంగానే జరిగింది'. అని ఎలా అనుకుంటాడు?
చెరసాలలో మగ్గేవాళ్లు, ఆకలిమంటలతో అలమటించేవాళ్లు లక్షలాది కోట్లాది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు. దోపిడీ చేయబడు తున్న కష్టజీవులు, కార్మికులు, అభాగ్యులు, దీనులు, హీనులూ ఉన్నారు. వీరంతా తమ రక్తాన్ని స్వేదంగా మారుస్తున్నారు. ఈ రక్తాన్ని పిండి పెట్టుబడిదారీ వర్గాలు రాబందులవలె, జలగలవలె వీరిని పీలుస్తూ సంపన్నులవు తున్నారు. లక్షలాది మందిని నిరుద్యోగులుగా, నిరర్థకులుగా చేస్తున్నారు. అంతేకాదు, అవసర మైతే తమ లాభాల రక్షణ కోసం, అధికోత్పత్తి చేసి నిల్వపడి ఉన్న సరుకులను, ఆహార ధాన్యా లను సముద్రం పాలు చేస్తున్నారు. (పెట్టు బడిదారీ విధానంలో సంక్షోభం ఏర్పడినప్పుడు, ధరల మాంద్యం వచ్చినప్పుడు లక్షల కోట్ల టన్నుల పాల డబ్బాలను ఇతర ఆహార పదార్థా లను పెట్టుబడిదారీ వర్గాలు సముద్రం పాలు చేస్తాయి. అనువాదకుడు) ఆకలితో మలమల మాడే కోటాను కోట్ల ప్రజలకు ఈ ఆహార ధాన్యా లను పాలడబ్బాలను, బట్టలను తదితర జీవితా వసర వస్తువులను పంచిపెట్టరు. తమ చెమటను, రక్తాన్ని ధారపోసి శ్రామిక ప్రజలు పంటలు పండిస్తారు. తమ ఎముకలను సున్నంగా చేసి మహా భవనాలను కార్మికులు నిర్మిస్తారు.
వారందరూ దారిద్య్రంతో కడుపునిండా తిండిలేక, బట్టలేక, ఇల్లులేక ఎందుకు అలమటిం చాలి? దీనికి భగవంతుడు ఏమి సమాధానం చెపుతాడు? ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇలా ఒకవైపున జరుగుతూ ఉంటే నా సృష్టి అంతా సవ్యంగానే ఉన్నదని భగవంతుడు ఎలా అనగలడు? దీనికి ఆయన ఏమైనా సమాధానం చెప్పగలడా? మౌనమే సమాధానమా?
ఇంక పూర్వజన్మల, పాపపుణ్యాల సిద్ధాం తాలు ఎంతవరకు నిజమో కొంచెం పరిశీలించు కుందాం. నేరస్తుణ్ణి సంస్కరించి సన్మార్గంలోకి, సమాజంలోకి తీసుకుని వచ్చేటట్లు శిక్షలుండా లనేది సర్వత్రా అంగీకరిస్తున్న విషయం. మానవ పురోభివృద్ధికి ఈ సృష్టి అవసరం. కాని తప్పు చేసిన వాళ్లను దేవుడు ఎలా శిక్షించాలి? ఎలా శిక్షించుతున్నట్లు నేడు చెపుతున్నారు? పాపం చేసిన వారిని కుక్కగానో, పిల్లిగానో, ఆవుగానో, చెట్టు చేమలుగానో పుట్టమని దేవుడు శాసిస్తున్నాడా లేదా శపించుతున్నాడా! ఇలాంటి శిక్షలు 84 లక్షలున్నాయట.
నేను అడుగుతున్నాను. దేవుడు విధించు తున్న ఈ శిక్షలు తప్పుచేసిన వారిని సంస్కరించే శిక్షలేనా అని, మీలో ఎప్పుడైనా, ఎవరైనా నేను పూర్వజన్మలో గాడిదగా పుట్టాను. నేను చేసిన పాపానికి నాకు దేవుడు అలాంటి శిక్షను విధిం చాడని అని అన్నారా? అలా చెప్పినవాళ్లు ఎవరై నా ఉన్నారా? ఉండరు. పురాణాల సంగతినలా ఉంచండి. అందు లోకి నేను వెళ్లదలచలేదు. కాని ఒక్క సంగతి మాత్రం చెప్పగలను. అన్ని పాపాలకంటే మహా పాపం దరిద్రుడుగా ఉండడమే. దరిద్రం కంటే పాపం మరొకటి లేదు. అంతకంటే శిక్ష మరొకటి లేదు.
న్యాయవేత్త లేదా న్యాయాధిపతి లేదా నేర శిక్షానిపుణుడు ఎవరైనా ఇలాంటి శిక్షను విధించినట్లయితే అటువంటి శిక్షను ప్రశంసించు తారా? సమర్థిస్తారా? ఈ దారిద్య్రమనే శిక్ష ఇంకా అనేక నేరాలు చేయడానికి దారితీయదా? దోహదపడదా?
ఉదాహరణకు ఒకరు దారిద్య్రంలో, నిరక్షరాస్యతతో ఉండే కుటుంబంలో లేదా పాకీ పనిచేసే కుటుంబంలోనో జన్మించాడనుకొందాం. అతడు దారిద్య్రంలో ఉన్నాడు. కాబట్టి చదువు కొనే అవకాశం లేదు. కడజాతికి చెందిన నిర్భా గ్యుడు కాబట్టి అతణ్ణి ఎవ్వరూ దగ్గరకు చేరని వ్వరు. పైపెచ్చు చేసే వృత్తిరీత్యా చూస్తేనే అస్యహించుకుంటారు. ఛీ కొడతారు. తాము అధికులమని అనుకుంటారు. దారిద్య్రంలో పుట్టిన వ్యక్తి యొక్క అ విద్యా, అ విజ్ఞానం ఇతరులు అతనిపట్ల చూపే చిన్నచూపు ఇవన్నీ అతనిలో ఈ సమాజం పట్ల ఒక విధమైన కసిని, అసహ నాన్ని కలుగజేస్తాయి. అతని మనస్సు కరుడు గట్టేట్లు చేస్తాయి. ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఏదైనా అ కార్యం లేదా చేయరాని పనిని చేశాడనుకుందాం. ఇందుకు బాధ్యత ఎవరిది? ఎవరు దీని ఫలితాన్ని, పర్యవసానాన్ని అనుభవి స్తారు? దేవుడు బాధ్యత వహిస్తాడా లేక ఆ వ్యక్తి బాధ్యత వహిస్తాడా లేక ఈ సమాజాన్ని నడిపిస్తున్న పండితులు వహిస్తారా? అహం భావం, అధిక్యభావం కలిగిన బ్రాహ్మణ వర్గం సంఘంలో కొందరిని అజ్ఞానంలోనూ, అమాయ కత్వంలోనూ ఉంచుతున్నారు. ఈ విధంగా అజ్ఞా నంలో ఉంచబడటం కూడా వారికి పూర్వజన్మ పాపఫలితంగా వచ్చిన శిక్షేనా?
వేదాలు చదువుతూ ఉంటే వినకూడని వాళ్లు ఈ సమాజంలో ఉన్నారట. వేదంలో ఒక ముక్క విన్నప్పటికీ వాళ్ల చెవుల్లో సీసం కరిగించి పోయాలంటా? అది వారికి శిక్షట? ఈ శిక్షలకు కూడా పూర్వజన్మలో చేసుకున్న పాపఫలమే కారణమా? ఈ పాపం చేయడానికి కారకులు, బాధ్యులు ఎవరు? ఫలితాన్ని అనుభ వించేది ఎవరు?
ప్రియ మిత్రులరా? ఈ సిద్ధాంతాలన్నీ సమాజంలో కడుపు నిండిన వారు, అన్ని హంగు లూ, అధికారాలు కలిగిన వారు సృష్టించినవే తప్ప మరొకటి కాదు. తాము చేజిక్కించుకున్న అధికారాన్నీ, సకల సంపదలను, అధిక్యతలను కాపాడుకునేందుకు ఈ సిద్ధాంతాలన్నింటినీ వారు కనిపెట్టారు. వాటి సహాయంతోనే తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.
ఆప్టన్ సింక్లర్ అనుకొంటాను. ఒకచోట ఇలా చెప్పాడు. 'మానవుడు అమరుడు అనే విశ్వాసాన్ని కలిగించు. నీకు ఎన్నటికీ మరణం లేదు అని చెప్పు. అతని వద్దనున్న సకల సంప దలు, వస్తు వాహానాలు అన్నీ లాగేసుకో, నీవు అడిగినదంతా ఇస్తాడు'. నమ్మకం అటువంటిది, విశ్వాసం అటువంటిది. ఒక రకంగా చెప్పా లంటే మతాధిపతులకు, రాజ్యాధికారం చెలా యించేవారికి మధ్య సమన్వయం ఉంది. ఈ సమన్వయం ఫలితంగానే జైళ్లు, ఉరికంబాలు, విద్యాస్థానాలు, ఈ పూర్వజన్మల పుణ్యంతో పాటు సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు.
ఒక మనిషి ఏదైనా పాపకార్యం చేస్తున్న పుడు అది చేయకుండా దేవుడు... ఈ సర్వశక్తి వంతుడైన భగవంతుడు ఆ పాప కార్యము చేయకుండా ఎందుకు ఆపు చేయకూడదు? యుద్ధ బీభత్సాలను, మానవ మారణహోమాన్ని సాగించే రాజులను, ప్రభువులను ఎందుకు హతమా ర్చడు? ఇలాంటి దుర్మార్గులను ముందుగానే ఎందుకు శిక్షించకూడదు? మానవజాతిని మారణహోమం చేసే భయంకరమైన ప్రపంచ యుద్ధాన్ని రాకుండా దేవుడు ఆపు చేయలేడా?
మరొక ప్రశ్న అడుగుతాను. భారతదేశాన్ని బానిసత్వంలో ముంచిన బ్రిటీష్ వారి మనసును మార్చి భారతదేశాన్ని బానిసత్వాన్నుండి విముక్తి అయ్యేటట్టు ఎందుకు చేయకూడదు? పెద్ద పెద్ద ధనవంతులు, పెట్టుబడిదారులు తమ వద్దనున్న ధనాన్ని, ఉత్పత్తి సాధనాలను ప్రజల పరం చేసేటట్లు భగవంతుడు వారికి హృదయపరివర్తన ఎందుకు తీసుకురాకూడదు? ఆ విధంగా కష్టజీవులందరినీ ఉద్దరించేటట్లు చేయరాదా? పరమ కిరాతకమైనా ఈ దోపిడీ విధానం నుండి, బానిసత్వం నుండి యావత్ సమాజాన్ని దేవుడే స్వయంగా విముక్తి చేస్తే బాగుంటుంది కదా?
అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు లేని సోషలిస్టు సమాజం ఏర్పడితే ఎంతో బాగుండు నని మనం అనుకొంటున్నాం. అలాంటి సమా జాన్ని ఎలా సాధించుకుందాం అని చర్చించు కుంటాం. అందుకోసం పోరాడే మార్గాలను అన్వేషించుదాం. కొందరు అది ఆచరణ సాధ్యం కాదని వాదిస్తారు. అయితే అలాంటి సోషలిస్టు సమాజాన్ని మనకు బాదరబందీ లేకుండా సర్వశక్తివంతుడైన దేవుడే సృష్టించవచ్చు కదా? భగవంతుడే స్వయంగా రంగంలోకి దిగి సమా జాన్ని అంతటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి సవ్యంగా నడిపించవచ్చును కదా?
భగవదేచ్ఛ అలా ఉంది గాబట్టే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇక్కడికి వచ్చి భారతదేశంలో తిష్టవేసి కూర్చోలేదు. భగవంతుడు అలా రాసి పెట్టలేదు. బ్రిటిష్ వాళ్ల చేతుల్లో అధికార బలం ఉంది. మన దగ్గర ఆ బలం లేదు. కాబట్టి మనం వాళ్లను రాకుండా చేయలేకపోయాం. వాళ్లను తిప్పికొట్టగల శక్తి సామర్థ్యాలు మన వద్దలేవు. అంతేకాని భగవంతుని సాయం వలన ఆయన ఇచ్ఛమేరకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకొని తమ అధీనంలో ఉంచుకోలేదు. తుపాకులతో, రైఫిళ్లతో, బాంబు లతో, బుల్లెట్లతో, సైన్యంతో, పోలీసులతో వారు మనలను బానిసలుగా చేసుకోగలిగారు. మన జాతిని బానిసత్వంలో ముంచి ఘోరమైన అన్యా యాన్ని, నేరాన్ని, దారుణమైన దోపిడీని వారు కొనసాగిస్తున్నారు. ఇంత ఘోరాతిఘోరం జరుగుతున్నదంటే భగవంతుడు ఉంటే అతడు ఏమి చేస్తున్నట్లు? మానవకోటి పడుతున్న బాధలను చూస్తూ ఆనందిస్తున్నాడా? దేవుడు నీరో చక్రవర్తి లేదా చంఘీజ్‌ఖాన్ లాంటి కర్కోటకుడా? అయితే అలాంటి భగవంతుడు మనకు ఏమాత్రం అవసరం లేదు.
అయితే, ఈ ప్రపంచానికి మూలం ఏమిటి? మానవునికి ఆది ఏమిటి అని మీరు నన్ను అడుగుతారా? సరే, చెపుతాను వినండి. ఈ సమస్యపై చార్లెస్ డార్విన్ కొంత వెలుగునివ్వ డానికి యత్నించాడు. ఆయన రచనను చదవండి. అలాగే నిర్మలానందస్వామి రాసిన ''ఇంగిత జ్ఞానం'' అన్న గ్రంథం చదవండి. మీ ప్రశ్నలకు కొంతవరకు వారు సమాధానాలు ఇవ్వగలరు. ప్రకృతి స్వభావాన్ని గురించి వారు వివరించారు. యాదృచ్ఛికంగా కొన్ని రకాల పదార్థాలు కలిసిన నెబ్యులా ఈ భూమిని సృష్టించింది. చరిత్రను పరిశీలించండి. ఈ పరిణామక్రమంలో జంతువులు పుట్టాయి. సుదీర్ఘకాలం అనంతరం జంతు వుల నుండి మానవుడు పరిణామం చెందాడు. డార్విన్ రచించిన ''ఆరిజన్ ఆఫ్ స్పిసీస్'' అధ్యయనం చేయండి. ప్రకృతితో నిరంతరం మానవుడు ఘర్షణపడి ప్రకృతిని లోబరుచు కోగలుగు తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది పరిణామక్రమం.
కొంతమంది పిల్లలు గ్రుడ్డిగాను, కుంటి గానూ పుడతారు. ఇదంతా గత జన్మలో వారు చేసిన పాప ఫలితమేనంటారు సనాతనులు. మానవ శాస్త్రవేత్తలు, వైద్యులు దానిని చక్కగా వివరించారు. వారి తల్లిదండ్రులలో గల లోపాల వల్లనే వారలా పుడతారని.
సహజంగానే మీరు నన్ను మరో ప్రశ్న కూడా అడగవచ్చు. అసలు దేవుడే లేకపోతే ఈ ప్రపంచంలో దేవుడిని ఇంతమంది జనం నమ్మటం ఎలా సాధ్యమైందని. ఇందుకు నా సమాధానం క్లుప్తంగాను, స్పష్టంగాను ఇది. లేని దయ్యాలను గురించి మనుష్యులు ఎలా నమ్ముతు న్నారో దేవుణ్ణి గురించి కూడా అంతే. అయితే ఒక్కటే భేదం. దేవుడిని అందరూ నమ్మడం, దాన్ని గురించి ఒక తత్వశాస్త్రాన్ని రూపొందించి చక్కగా ప్రచారంలో పెట్టగలగడం, కొంతమంది తీవ్రవాదులు చెప్పుతున్నట్లు దోపిడీదారులు, పీడకులు తమ స్వప్రయోజనాల కోసం దేవుడిని సృష్టించారని మాత్రం నేను చెప్పదలచలేదు. అయితే మతాన్ని వారు ఉపయోగించుకొన్నారన్న విషయాన్ని నేను కాదనను. రాజు మీద తిరుగు బాటు చేయడం పాపమని అన్ని మతాలు చెబుతాయి.
నా ఉద్దేశ్యంలో మానవుడు తనకున్న పరి మితులను, బలహీనతలను, లోపాలను దృష్టిలో ఉంచుకుని దేవుడనే సర్వశక్తివంతుడిని ఊహలోకి తెచ్చుకున్నాడు. కష్ట సమయంలో ప్రమాదాలను ధైర్యసాహసాలతో ఎదుర్కొనేందుకు దేవుడి మీద విశ్వాసం తోడ్పడుతుందనుకున్నాడు. అలాగే సమాజానికి హాని చేయకుండా మానవుడిని దేవుడు అదుపులో పెట్టగలడనుకొన్నాడు. ఒక తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, మిత్రుడిగా అవసరమైనపుడు దేవుడు ఆదుకోగలడనే విశ్వాసాన్ని మానవుడు తనలో పెంపొందించు కున్నాడు. ఆదిమ సమాజంలో తప్పులు చేయకుండా దేవుడు అనే విశ్వాసం మానవుడికి సహాయపడింది. అలాగే దేవుడనే భావం కష్ట సమయంలో ఓదార్పుగా మానవుడికి ఉండేది.
ఆ తరువాత కాలంలో పూజలు చేస్తే దేవుడు రక్షించుతాడనే భావనకి వ్యతిరేకంగానూ, సంకుచిత మత విశ్వాసాలకు వ్యతిరేకంగానూ, ఇతర మూఢవిశ్వాసాలకు ప్రతికూలంగా సమాజంలో పోరాడవలసి వచ్చింది. అలాగే మానవుడు తన కాళ్లపై తాను నిలబడటానికి ప్రయత్నించుతూ వాస్తవికవాది అయినప్పుడు ఈ దేవుడనే విశ్వాసాన్ని త్రోసిపుచ్చుతాడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో అధిగమించ డానికి దేవుడిని తిరస్కరించడం లేదు. పైన వివరించిన ఆలోచనా విధానమే నన్ను నాస్తికుడిగా చేసింది. దేవుడిని నమ్మడం, ఆయ నను నిత్యం ప్రార్థించ డమూ అత్యంత స్వార్థ పూరితమైన విషయమని నేను భావించుతాను. ప్రార్థించడం ద్వారా దేవుడి నుండి ప్రయోజనం పొందాలనుకోవడం మాన వుని నైతిక పతనానికి నిదర్శనం. అనేక కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నాస్తికుల జీవితాలను నేను చదివాను. కనుక నేను కూడా ఒక మనిషి వలే చివరి వరకూ నా ఆశయాల కోసం మనోనిబ్బ రంతో నిలబడటానికి, చివరికి ఉరికంబం ఎక్కడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను.
నేను ఎలా వ్యవహరించుతానో చూడండి. ఒక మిత్రుడు నన్ను దైవ ప్రార్థన చేయవల సిందిగా కోరాడు. నేను నాస్తికుడనని చెప్పినా ఆయన ఇలా అన్నాడు. ''ఆఖరి రోజుల్లోనైనా దేవుడిని నమ్మటం నీవు ప్రారంభిస్తావు''. అలాంటిదేమీ లేదని నేనన్నాను. అది ఎన్నటికీ జరిగేదికాదని కూడా అతనికి స్పష్టం చేశాను. కష్ట సమయంలో అలా దేవుడిని నమ్మడమంటే నేను నైతికంగా దిగజారిపోవడమే కాగలదు. నా స్వార్థం కోసం నేను ప్రార్థించదలచలేదు. పాఠకులారా, మిత్రులారా ఇది అహంభావం అనిపించుకుంటుందా? ఒకవేళ అదే అయితే అందుకే నేను నిలబడతాను.
- భగత్‌సింగ్

No comments:
Post a Comment