మరో 6 నెలల్లో లాంకో ఆస్తుల విక్రయం
26-09-2016 23:36:34
- ప్రాజెక్టులు పూర్తి చేసి అమ్మకం
- రూ. 7,000 కోట్ల రాబడి అంచనా
న్యూఢిల్లీ: రుణ భారం తగ్గించుకునేందుకు లాంకో ఇన్‌ఫ్రాటెక్.. విద్యుత్ రంగంలో ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. మరో ఆరు నెలల్లో విద్యుత్ ఆస్తుల విక్రయ ప్రక్రియను ప్రారంభించనుంది. ఆస్తుల విక్రయం ద్వారా కనీసం 7,000 కోట్ల రూపాయలను సమీకరించనున్నట్టు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ టి ఆదిబాబు బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ముందుగా నిర్మాణం మధ్యలో ఉన్న ప్రాజెక్టులు, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై సంస్థ దృష్టిపెట్టినట్టు ఆదిబాబు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే అసెట్ వాల్యూ కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.
ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న క్రమంలోనే అమ్మకం ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. లాంకో ఇన్‌ఫ్రాటెక్ విద్యుత్, సౌరశక్తి, ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగాల్లో విస్తరించి ఉంది. అయితే సంస్థ రాబడిలో అత్యధిక శాతం విద్యుత్ రంగం నుంచే లభిస్తోంది. లాంకో ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ఉమ్మడి స్థాపిత సామర్ధ్యం 3460 మెగావాట్లు. ఒక్కోటి 1320 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న మూడు విద్యుత్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ఒకటైన చత్తీస్‌గడ్‌లోని అమర్‌కంటక్ 3,4 వ దశ ప్లాంట్ దాదాపు 78 శాతం పూర్తయింది. వచ్చే ఆరు నెలల్లోనే ఇది ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. 576 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న రెండు జల విద్యుత్ కేంద్రాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిని కూడా సంస్థ విక్రయించనుంది. అనుకున్నట్టుగా ఈ విద్యుత్ ప్లాంట్లను విక్రయించి నిధులను సమీకరించగలిగితే లాంకో ఇన్‌ఫ్రా రుణ భారం భారీగా తగ్గుతుంది.
No comments:
Post a Comment