Monday, September 26, 2016

ప్రజా ప్రయోజనాలు ముఖ్యం

- పిటిషన్లలోని అంశాలకే పరిమితం కాబోం 
- ఏపి వాదనతో ఏకీభవించని హెకోర్టు
- స్విస్‌ ఛాలెంజ్‌ కేసు నేటికి వాయిదా 
ప్రజాశక్తి - హైదరాబాద్‌ :
             స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని సవాల్‌ చేసిన కేసు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, పిల్‌ తరహాలో వ్యాజ్యంలో లేని అంశాల జోలికి సింగిల్‌ జడ్జి వెళ్లారన్న ఆంధ్రప్రదేశ్‌ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. పిటిషనర్లు పేర్కొన్న అంశాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని, ప్రజా ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌, న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తేల్చి చెప్పింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని ఎన్వీయన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ కార్తీయనాథన్‌, ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ డైరెక్టర్‌ బి.మల్లికార్జునరావు వేర్వేరుగా దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను విచారించిన సింగిల్‌ జడ్జి 12వ తేదీన టెండర్‌ నోటిఫికేషన్లపై స్టే విధించారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఏపి మున్సిపల్‌ శాఖ, సిఆర్‌డిఎ విడివిడిగా దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్లు పిల్స్‌ దాఖలు చేయలేదని, అయితే సింగిల్‌ జడ్జి పిల్స్‌ మాదిరిగా పిటిషనర్లు పేర్కొనని అంశాల్లోకి వెళ్లి స్టే ఇచ్చారని ఏపి తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించినప్పుడు బెంచ్‌ పైవిధంగా స్పందించింది. ప్రాథమిక దశలోనే సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదిత ఆదాయ వివరాలు బహిర్గతం చేయాలని సింగిల్‌ జడ్జి చెప్పారని, అది కరెక్టు అయినప్పుడు మిగిలిన విషయాలు కూడా కరెక్టే అవుతాయని బెంచ్‌ కదా అని ఏజిని ప్రశ్నించింది. టెండర్‌ నిబంధనలు ఎలా ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని, పిటిషనర్లకు అనుకూలంగా ప్రభుత్వం చేయదని ఏజి వాదించారు. ఈ విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

No comments:

Post a Comment