Tuesday, September 27, 2016

రూ.5 కోట్లివ్వకపోతే కాంట్రాక్టు ఆపేస్తా

- టిడిపి ఎమ్మెల్యే బెదిరింపు
- వీడియోలో అడ్డంగాదొరికిన కురుగొండ్ల
- ఇలాగైతే పనులు చేయలేం
- రైల్వే మంత్రికి కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు 
ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి
               నెల్లూరు జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న రాపూరు - వెంకటాచలం రైలు మార్గం నిర్మాణ కంపెనీ ప్రతినిధిని.. అదే జిల్లాకు చెందిన టిడిపి ఎమెల్యే రూ.ఐదు కోట్లు లంచంగా ఇవ్వాలని బెదిరింపునకు దిగడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే లంచం అడుగుతూ బెదిరిం పులకు దిగిన సంఘటనకు సంబంధించిన వీడ ియో సీడీలను రైలు మార్గ నిర్మాణ కంపెనీ ప్రతి నిధి నెల్లూరులో జరిగిన విలేకరుల సమా వేశంలో బయటపెట్టారు. ఈ క్లిప్పింగులు సోమవారం పలు ఛానళ్లలోప్రసారమయ్యాయి. రైలుమార్గ నిర్మాణ కంపెనీ 'మౌంటైకార్లో' కార్యదర్శి కల్పేష్‌ దేశారు (గుజరాత్‌) సోమవారం నెల్లూరులో మాట్లాడుతూ.. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ (టిడిపి) రూ.5 కోట్ల లంచం అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. 2014లో రాపూరు-వెంకటాచలం నూతన రైలు మార్గానికి తమ కంపెనీ టెండర్లు వేసి పనులు ప్రారంభించిందన్నారు. 58 కిలోమీటర్ల దూరం ఉండే పనులకు రూ.372 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. పంగలి - పెదరాజుపాళెం వరకు ప్యాకేజీ -1కి రూ.183 కోట్లు, పెదరాజుపాళెం - వెంకటాచలం వరకూ ప్యాకేజీ -2కి రూ.185 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 12.5 శాతం తక్కువకు టెండర్లు వేశామని వివరించారు. ఆరు నెలల నుంచి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆయన అనుచరులు పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. స్థానిక ఇంజినీర్లు, సిబ్బందిని దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచురుల మీద కేసులు పెట్టినా ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. దీనిపై కేంద్ర రైల్వేశాఖ మంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. తమ ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీరాములుకు ఎమ్మెల్యే నేరుగా ఫోను చేసి ఐదు శాతం కమీషన్‌ (5కోట్లు రూపాయలు) ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారని తెలిపారు. అందుకు ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ సీడీలను అందజేశారు. 2017జులై నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. లేని పక్షంలో ప్రభుత్వం తమకు అపరాధ రుసుం విధించే అవకాశం ఉందన్నారు. ఇలా ఆటంకం సృష్టిస్తే పనులు చేయబోమనీ, భవిష్యత్తులోనూ ఎపిలో ఎటువంటి పనులూ చేపట్టబోమని చెప్పారు. ప్రభుత్వం దృష్టి సారించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో ఆ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ భాస్కరరావు, సీనియర్‌ ఇంజినీర్‌ రాధాకృష్ణ, మునీర్‌ పాల్గొన్నారు. దీనిపై ఎమ్మెల్యేను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.

No comments:

Post a Comment