Saturday, August 1, 2015

Vyasam.prajasakti

మహిళా ప్రాతినిధ్యం

Posted On Sat 01 Aug 00:02:14.270681 2015
          'అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం' అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. కాని అభివృద్ధిలో వారి వెనుకబాటునూ, కట్టుబాట్లమధ్య నలిగిపోతున్న వారి పరిస్థితినీ చూస్తే మనసు దుఖంతో చలించిపోతుంది. బీహార్‌ మహిళలు సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నారు. జనాభా రీత్యా దేశంలోకెల్లా మూడవ అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు ప్రపంచానికి చాటిచెప్పిన వాస్తవమిది. వారు వెలువరించిన తీర్పుపై ఆయా కుటుంబాల్లోని పురుషుల ప్రభావం ఉన్నప్పటికీ పితృస్వామిక భావజాలం వేళ్లూనుకుపోయిన ఆ రాష్ట్రంలో తండ్రి చాటు బిడ్డలు, భర్త చాటు భార్యలు బయటకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం సాధారణ విషయం కాదు. మార్పు కోసం తమను తాము మార్చుకునేందుకు సైతం సిద్ధమైన మహిళల మనోగతానికి నిలువెత్తు నిదర్శనం.2005 ఫిబ్రవరిలో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచేందుకుగాను ఏ ఒక్క పార్టీ పూర్తి ఆధిక్యత సాధించలేకపోయింది. దాంతో బీహార్‌ వాసులకు రాష్ట్రపతి పాలన ప్రాప్తించింది. ఎనిమిది నెలల అనంతరం తిరిగి అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడడంలో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా నిలిచిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అనంతరం 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు (54 శాతం) పురుష ఓటర్లను (51 శాతం) మించి పాల్గొన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో సైతం బీహారీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆర్థిక కార్యకలాపాలలోకే కాకుండా ఎన్నికల రంగంలోకి కూడా మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారనడానికి వెనుకబడిన బీహార్‌ ఒక ఉదాహరణ. ఈ మార్పులు మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి తోడ్పడుతుందన్నది వాస్తవమే అయినా రావలసినంత మార్పు రావడం లేదన్న చేదు నిజాన్ని కూడా ఒప్పుకోక తప్పదు. విచిత్రమేమంటే అక్షరాస్యత లేని మహిళలు ఒకరకమైన ఆధిపత్య ధోరణులను ఎదుర్కొంటూ ఉంటే విద్య నేర్చుకుని ఉద్యోగాల్లో చేరే మహిళలు మరో రకమైన ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్నారు. నిజానికి విద్య, ఉద్యోగం వారి పని భారాన్ని రెండింతలు చేస్తోంది. నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు మహిళలను అనివార్యంగా ఉత్పత్తి రంగంలోకి తెస్తున్నాయి. ఉద్యోగాల్లో వారు పెద్ద ఎత్తున చేరాల్సి వస్తోంది. అదే సమయంలో సమాజంలో వేళ్లూని కుని ఉన్న పురుషాధిక్యత వారిని ఇంటిపని, వంట పనినుండి విముక్తిగానివ్వడం లేదు. మరోవైపు వినిమయదారీ సంస్కృతి మహిళలను సెక్స్‌ సింబల్స్‌గా మారుస్తున్నది. ప్రతినిత్యం లైంగిక వేధింపులకూ, దాడులకూ గురిచేస్తున్నది. సామాజికార్థిక రంగంలోనే కాకుండా ఎన్నికల రంగంలో కూడా మహిళలు ఇటువంటి విచిత్ర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల పెద్ద సంఖ్యలో గ్రామీణ మహిళలు పరిపాలనా రంగంలోకి అడుగిడుతున్నందుకు సంతోషించాల్సిందే. కాని అదే సమయంలో వారి అధికారాన్ని భర్తో, తండ్రో, తనయుడో వెనుకనుండి, కొన్ని సార్లు నేరుగా ఆమె కుర్చీని ఆక్రమించుకుని కూడా చెలాయిస్తుంటే మహిళా సాధికారికత అవహేళనకు గురవుతుంది.
సాధికారికత దృష్ట్యా చూసినప్పుడు మహిళలు ఇప్పటికీ ఓటుబ్యాంకుగానే ఉన్నారు కానీ రాజకీయాల్లో నిర్ణాయక శక్తులుగా లేరు. వీరిలో రాజకీయ చైతన్యం పెరిగినప్పుడు, ఆర్థిక స్వాతంత్య్రం లభించినప్పుడే అనుకున్నది సాధ్యమౌతుంది. కేవలం శుష్క వాగ్దానాలతో కోరుకున్న మార్పులు జరిగిపోవు. లోక్‌సభ అనుమతి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు దీనికి నిదర్శనం. పాలక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఈ బిల్లుపట్ల వ్యవహరిస్తున్నందునే దశాబ్దం దాటినా అది చట్టానికి నోచుకోలేదు. ఒకటి రెండు రాజకీయ పార్టీలు మినహా అన్ని పార్టీలూ మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కావాలంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలన్నీ బిల్లుకు మోకాలడ్డుతాయి. అనేక రకాల కొర్రీలు పెడతాయి. అనేక పరిమితులున్నప్పటికీ స్థానిక సంస్థలకు మహిళలు గెలుపొందడం మహిళా సాధికారికత దిశగా పలు మార్పుకు అంకురం వేసింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించుకోగలిగితే వారి అభ్యున్నతికి అది మరింత దోహదపడుతుందనడంలో సందేహం లేదు. రాజకీయ పార్టీలకు మహిళల పట్ల నిజమైన గౌరవం, అసలైన ప్రేమాభిమానాలు ఉన్నాయా లేదా అనేదానికి రిజర్వేషన్‌ బిల్లుకు అవి మద్దతిస్తున్నాయా లేదా అనేదే అసలైన గీటురాయి. మహిళలు వంటింటికే పరిమితం కావాలన్న తిరోగమన భావజాలం ఒక వైపు, తమ రాజకీయ గుత్తాధిపత్యానికి బీటలు పడతాయన్న భయం మరోవైపు ఆ దిశగా కదలనివ్వటం లేదు. ఇప్పటికైనా పాలక పార్టీలు కపట నాటకాలకు తెరదించి మహిళా సాధికారికతకు చేయూతనివ్వాలి. చట్టసభల్లో రిజర్వేషన్లకు మద్దతివ్వడంద్వారా తమ చిత్తశుద్దిని చాటుకోవాలి.
Taags :

No comments:

Post a Comment