Thursday, August 6, 2015

Sampadakeeyam. Prajasakti

నిలువెత్తు నిర్లక్ష్యం

Posted On Wed 05 Aug 22:37:24.258812 2015
        మధ్యప్రదేశ్‌లో వరుసగా జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలు దిగ్భ్రాంతినీ, రైల్వే శాఖ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో పట్టాలు తప్పడం, 37 మంది దాకా మృతి చెందడం దారుణం. మరో 25 మంది దాకా తీవ్ర గాయాల పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికులు సకాలంలో స్పందించడంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. లేని పక్షంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. వాస్తవానికి రైలు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా ఎప్పుడో మారిపోయాయి. భద్రతకు ఏమాత్రం పూచీ లేని పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఆప్తులను, సన్నిహితులను రైలు ఎక్కించిన తరువాత వారు క్షేమంగా గమ్యం చేరారన్న సమాచారం అందేంత వరకూ ప్రాణాలు అరచేత పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగిన తరువాత హడావిడిగా కమిటీని వేయడం, ఆ తరువాత నివేదికను బుట్టదాఖలు చేయడం షరా మాములుగా మారింది. పార్లమెంటరీ కమిటీలు చేసిన సిఫార్సులూ బుట్టదాఖలయ్యాయి. రైల్వే లైన్ల మరమ్మతుల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచే అంశం వరకూ వివిధ అంశాలపై వివిధ కమిటీలు, రైల్వే ట్రేడ్‌ యూనియన్లు, ప్రజాసంఘాలు ఇచ్చిన సిఫార్సులు ప్రభుత్వం ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. అయితే, వీటిని పట్టించుకునే తీరిక పాలకులకు ఏ కోశానా లేకపోవడం విచారకరం. తాజా సంఘటన అనంతరం కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనకు ముందే భారీ వర్షాలతో పొంగుతున్న మాచక్‌ నది నీళ్లు పట్టాలపై భారీ ఎత్తున నిలవడమే ప్రమాదానికి కారణమని రైల్వేశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనూహ్యంగా వచ్చిన వరదలను అంచనా వేయలేకపోయామన్నది వారి వివరణ. వర్షాకాలంలో వానలు పడటం, వరదలు రావడం కొత్తేమీ కాదు. అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడమూ, ఫలితంగా అనూహ్య వరదలు సంభవించడమూ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే!
ఆ విషయం పక్కన పెట్టినప్పటికీ లైన్లను నిరంతరం కాపలా కాస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యల కోసం హెచ్చరికలు చేసే గ్యాంగ్‌మెన్ల వ్యవస్థ రైల్వేశాఖకు ప్రత్యేకం. కీలకమైన ఈ వ్యవస్థలో నియమకాలు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ఉన్న వారిని కూడా ఏదో రకంగా వదిలించుకోవడానికే రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సమాచార సాంకేతిక విప్లవానికి ఆకాశమే హద్దుగా మారిన ప్రస్తుత రోజుల్లోనూ తాతల కాలం నాటి బూజు పట్టిన విధానాలనే రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఫలితంగా రైలు పట్టాల వెంట నిరంతరం పహరా కాయాల్సిన గ్యాంగ్‌మెన్లపై పని భారం విపరీతంగా పెరుగుతోంది. ఒక్క గ్యాంగ్‌మెన్ల విషయంలోనే కాదు, ప్రయాణీకుల భద్రతతో ముడిబడిన డ్రైవర్లు, గార్డులు, సిగలింగ్‌ సిబ్బంది, తదితర ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి. 2013లో పార్లమెంటుకు అప్పటి రైల్వే శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారమే ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన వివిధ విభాగాల్లో 1,42,311 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తరువాత కూడా ఉద్యోగ విరమణలే తప్ప, కొత్త నియామకాలు లేవు. దీంతో ఈ విభాగాల్లోని అత్యధిక సిబ్బంది రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఫలితంగా రైల్వేశాఖలో ప్రమాదాలు నియంత్రించడం కష్టమైపోతోంది. ప్రయాణీకుల భద్రతపై ఏ మాత్రం ఆలోచించే ప్రభుత్వమైనా మొట్టమొదట ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయమై విమర్శల వర్షం కురిపించిన బిజెపి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వానికన్నా అధికంగా ప్రైవేటీకరణ రాగాన్ని ఆలపిస్తున్నారు. ఉట్టికెగిరే సత్తా లేకపోయినా ఆకాశానికెగిరేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో అట్టహాసంగా ఆవిష్కరించిన బుల్లెట్‌ ట్రైన్‌ విన్యాసమూ ఆ కోవలోనిదే. దేశవ్యాప్తంగా అత్యధిక రైలు ప్రమాదాలు పట్టాలు తప్పడం కారణంగానే జరుగుతున్నాయి. నిర్వహణ, నాణ్యత లోపాలే దీనికి కారణమని వివిధ కమిటీల నివేదికలు ఇప్పటికే నిగ్గు తేల్చాయి. గడిచిన దశాబ్ద కాలంలో సగటున ఏడాదికి 150కి పైగా ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండవ స్థానంలో లెవెల్‌క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు నిలిచాయి. వీటిలో అత్యధిక భాగం ప్రమాదాలకు సిబ్బందినే కారణంగా చూపుతున్న రైల్వేశాఖ వారికి అవసరమైన ఆధునిక సదుపాయాలను, తగిన సంఖ్యలో మానవ వనరులను కల్పించడంపై మాత్రం దృష్టి సారించడంలేదు.
ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అత్యాధునిక ప్రమాద హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి ఊరించినప్పటికీ ఆ దిశలో ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఆధునిక ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని, వెల్డింగ్‌లో నూతన విధానాలను అనుసరించి రైళ్లు పట్టాలు తప్పడాన్ని నిరోధిస్తామని చెప్పిన మాటలకూ ఇంతవరకు అతీగతీ లేకపోవడం విచారకరం. రైల్వే మంత్రిత్వ శాఖే నియమించిన డాక్టర్‌ అనిల్‌ కకోడ్కర్‌ నేతృత్వంలోని హైలెవల్‌ కమిటీ ఐదు సంవత్సరాల కాలంలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని రెండు సంవత్సరాల క్రితం సూచించింది. ఇప్పటి వరకు ఆ దిశలో కేటాయింపులు నామమాత్రమే! భద్రతకు సంబంధించిన మౌలిక వనరుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని, అడ్వాన్స్‌డ్‌ సిగలింగ్‌ వ్యవస్థ కోసం మరో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్న ఆ కమిటీ సిఫార్సులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సిఫార్సులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశలో చేసిన సూచనల అమలుకు మాత్రం తహతహలాడుతోంది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న మంత్రులనే భుజాలకెత్తుకుంటున్న సమయంలో ప్రమాద సంఘటనలకు బాధ్యత వహించే నైతికతను మోడీ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఆశించలేం. వట్టిమాటలను కట్టిపెట్టి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడే చర్యలు చేపడితే అదే పదివేలు!
Taags :

No comments:

Post a Comment