Friday, August 14, 2015

ప్రమాదకర పట్టణ సంస్కరణలు Posted On Thu 13 Aug 22:50:53.406543 2015

ప్రమాదకర పట్టణ సంస్కరణలు

Posted On Thu 13 Aug 22:50:53.406543 2015
               కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పట్టణాలకు ర్యాంకులు ఇస్తోంది. పరిశుభ్రతలో మన రాష్ట్రంలోని నగరాలు దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే వెనుకంజలో ఉన్నాయని ప్రకటించారు. కేంద్ర పథకాలలో ఎంపిక చేయడానికి మన రాష్ట్రంలోని నగరాల మధ్య పోటీపెట్టి స్మార్ట్‌ నగరాలను గుర్తించారు. ఏ పట్టణాలలో దోమల సైజు ఎక్కువగా ఉంది?(దోమలు ఈగల సైజుకు మారుతున్నాయి). చెత్తకుప్పలు ఏ నగరంలో ఎక్కువగా పేరుకుని ఉన్నాయి? మంచినీరు ఎన్ని రోజులకొకసారి ఇస్తున్నారు? పన్నులు ఏ పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి? పై అర్హతలు పెడితే మన పట్టణాలు మొదటి ర్యాంకుల్లో ఉంటాయి. తెలుగుదేశం, బిజెపి పాలనలో ఏ పట్టణం చూసినా ఏమున్నది గర్వకారణం?
రాష్ట్రంలోని 111 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాష్ట్ర జనాభాలో 30 శాతం ప్రజలు నివసిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపల్‌ ఎన్నికలు జరిగి 14 నెలలు గడిచిపోయాయి. టిడిపి, బిజెపిలు ఎన్నికలలో హామీల వర్షం కురిపించాయి. కానీ నేడు పట్టణాలు మురికి కంపు కొడుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, అతిసార వంటి జబ్బులు సర్వసాధారణమయ్యాయి. అక్కడక్కడ స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడుతున్నాయి. మాయదారి రోగాలు పట్టిపీడిస్తున్నాయి. డంపింగ్‌ యార్డులు లేవు. చెత్త ఎత్తే వాహనాలు సరిగా లేవు. సిబ్బంది తగినంత మంది లేరు. దోమలు చెండాడుకు తింటున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమవుతున్నాయి. మురికివాడలు మునిగి పోతున్నాయి. స్వచ్ఛమైన మంచినీరు దొరకక ప్రైవేట్‌ కంపెనీల వద్ద కొనుక్కుని తాగుతున్నారు. వర్షాకాలంలోనూ రెండు, మూడు రోజులకొకసారి మంచినీరు ఇచ్చే పట్టణాలు రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటు. ట్రాఫిక్‌ నరకం చూపిస్తోంది. రోడ్లపై ప్రయాణించాలంటే భయమేస్తోంది. వీధి లైట్ల నిర్వహణ అధ్వానమే. పార్కులు, రీడింగ్‌ రూముల నిర్వహణ సరేసరి. ప్రజా ఫిర్యాదులు పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
నీరుగారుతున్న గృహ నిర్మాణం
ఇళ్ళ అద్దెలకు అడ్డూ అదుపూ లేదు. సగం సంపాదన అద్దెలు, కరెంటు బిల్లులకే పోతోంది. స్వంత ఇల్లు కలగానే మిగిలింది. 3 సెంట్లు (144 చదరపు గజాలు) ఇల్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ కాలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్ళు సగంలోనే ఆగిపోయాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కృష్ణాజిల్లాలో 29 వేల మందికి ఇళ్ళు ఇస్తామని పట్టాలు ఇచ్చి సంవత్సరాలు గడిచినా స్థలం చూపలేదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 86 ఎకరాలు, పాలకొల్లులో 72 ఎకరాలు సేకరించి ఏళ్ళు గడిచాయి. మెరక చేయకుండా, ఇళ్ళు కట్టకుండా ఖాళీగా ఉంచారు. విశాఖలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ళు కట్టినా లబ్ధిదారుల ఎంపిక సరిగా చేయలేదు. ఒకే ఇల్లు నలుగురికి ఇచ్చి రికార్డు సృష్టించారు. గృహనిర్మాణ పథకాలన్నీ నీరుగారిపోతున్నాయి. బిజెపి ప్రభుత్వం 2022 నాటికి అందరికీ ఇళ్ళు అని కొత్త పథకం పెట్టినా జరిగింది శూన్యం. పథకాల పేర్లు మార్పే తప్ప ఫలితం లేదు. పేదలు ఆక్రమణ స్థలాలో దశాబ్దాల నుంచి జీవిస్తున్నారు. పట్టాలు లేవు. పట్టాలు లేవని సౌకర్యాలు కల్పించడం లేదు. వారంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 14 నెలల తరువాత పట్టాలు ఇస్తామని, క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. గతంలో బి-ఫారమ్‌ పట్టాలు ఇచ్చినా రిజిస్ట్రేషన్లు లేవు. వాటికి రిజిస్ట్రేషన్ల ప్రస్తావన లేదు. అమలు ఎలా ఉంటుందో చూడాల్సిందే. పట్టాల సంగతేమిటో గానీ ఉన్న మురికివాడలను పీకేస్తున్నారు. నెల్లూరులోనే నాలుగు వేల ఇళ్ళకు ఎసరు పెట్టారు. రాష్ట్రంలో రైల్వే, చెరువు, కాలువ కట్టల స్థలాలని చెప్పి పేదల గుడిసెలు కూల్చేస్తున్నారు. గతంలోనే పట్టణాలలో సీలింగ్‌ చట్టం(పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం) రద్దు చేసి పెద్దలకు భూములు కట్టబెట్టారు. ఇప్పుడు ఇళ్ళు కట్టడానికి భూములు లేవని కన్నీరు కార్చుతున్నారు. బడా రిలయల్‌ ఎస్టేట్‌, బిల్డర్లకు గృహ నిర్మాణాన్ని కట్టబెట్టారు. ఈ విధానాలే పట్టణాలలో ఇళ్ళ సమస్యకు మూలం.
భారాల మోత
పట్టణాలలో పన్నుల మోత మోగుతోంది. తాజాగా చెత్తపై కూడా పన్ను వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు. మున్సిపాలిటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా వ్యాపార సంస్థలుగా మార్చేస్తున్నాయి. ప్రతి పనికీ రేటు కట్టి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని షరతులు పెట్టి మరీ అమలు చేస్తున్నాయి. ఎక్కువ పన్నులు వేస్తే ఎక్కువ రాయితీలు ఇస్తామని నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. భిన్నమైన పాలన అందిస్తామని చెప్పిన తెలుగుదేశం, బిజెపిలు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన పన్నులను కొనసాగిస్తున్నాయి. అంతటితో ఆగకుండా మరిన్ని భారాలు మోపుతున్నాయి. బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ పేరుతో నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తామని ఆశపెట్టి కోట్లు గుంజుతున్నారు. అక్టోబర్‌ నుంచి ఆస్తిపన్ను(ఇంటిపన్ను) రాష్ట్రం మొత్తం పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దొడ్డిదారిన ప్రజల కళ్ళుగప్పి ట్రేడ్‌ లైసెన్స్‌లు, బిల్డింగ్‌ లెసెన్స్‌లు, ఫీజులు, ఆశీళ్ళు (చిరువ్యాపారుల నుంచి వసూలు చేసే పన్ను) ఇలా ఎన్నో రూపాల్లో దండుకుంటున్నారు. అద్దె విలువ ఆధారంగా వేసే ఇంటి పన్నును భవిష్యత్‌లో ఆస్తి విలువ (భూమి+కట్టడం) ఆధారంగా విధించడానికి నిబంధనలు మార్చుతున్నారు.
ప్రైవేట్‌ జపం
ప్రభుత్వాలు ప్రైవేట్‌ జపం చేస్తున్నాయి. స్మార్ట్‌ నగరాల పేరుతో హోల్‌సేల్‌గా నగర పాలనను ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలోని లైట్లు తీసేసి ఎల్‌ఇడి లైట్లు వేసే బృహత్తర పనిలో ప్రభుత్వం ఉంది. ఈ కాంట్రాక్టు మొత్తం ఒకే కంపెనీకి ఇస్తూ ఏకపక్షంగా ప్రభుత్వం జీవో 74 జారీ చేసింది. కోట్ల రూపాయలు దిగమింగే భారీ కుంభకోణం ఇది. కౌన్సిళ్ళ తీర్మానాలు లేకుండానే అధికారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్‌ అనే పేరుతో కంపెనీల చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసి చెత్త నుంచి విద్యుత్‌ తయారీ పేరుతో పారిశుధ్య నిర్వహణ మొత్తం విదేశీ, స్వదేశీ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు గోప్యంగా సాగుతున్నాయి. దీనిపై శిక్షణకు సింగపూర్‌ కంపెనీతో ఒప్పందాలు జరిగాయి. గ్రీనరి అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ అనే మరో కంపెనీని ప్రభుత్వం రిజిష్టర్‌ చేసింది. దీని ద్వారా పట్టణాలలో ఖాళీ స్థలాలను అభివృద్ధి పేరుతో ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. మున్సిపల్‌ ఆస్తులను తెగనమ్ము తున్నారు. లీజు పేరుతో ప్రైవేట్‌ వారికి ధారాదత్తం చేస్తున్నారు. ఈ రీతిలో పౌర సదుపాయాల ప్రైవేటీకరణ జోరుగా సోగుతోంది. ప్రభుత్వం, మున్సిపాలిటీలు చేతులు దులుపు కుంటూ ప్రైవేట్‌ వారి దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నాయి.
ఆలనా, పాలనా లేని మున్సిపాలిటీలు
మున్సిపాలిటీలలో పాలన అస్తవ్యస్థంగా ఉంది. మున్సిపల్‌ మంత్రి నారాయణ ఈ శాఖను గాలికొదిలేశారు. రాజధానిలో భూములు లాక్కునే పనిలో బిజీగా ఉన్నారు. మున్సిపాలిటీలలో అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీలలో కమిషనర్లే లేరు. సంవత్సరం క్రితం ఎన్నికైన కౌన్సిళ్లు, ఛైర్మన్‌లు, మేయర్ల పనితీరు నిరాశాజనకంగా ఉంది. అవినీతి అన్ని స్థాయిలలో పెచ్చరిల్లింది. కౌన్సిల్‌ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. ప్రజాసమస్యలపై చర్చలేదు. చాలా చోట్ల ప్రధాన పార్టీలు కుమ్మక్కయి పంచుకుంటున్నాయి. కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంవత్సరాల నుంచి ఎన్నికలే లేవు. స్పెషలాఫీసర్ల పాలన పేరుతో ప్రభుత్వ పెత్తనం సాగుతోంది.
మున్సిపాలిటీలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ప్రభుత్వ గ్రాంట్లలో కోత పడింది. నిధుల లేమి అడ్డం పెట్టి స్థానిక సంస్థలు పన్నుల భారాలు మోపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 39 శాతం నిధులు స్థానిక సంస్థలకు బదలాయించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సి) సిఫార్సులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు స్థానిక సంస్థలకు పన్నులు కట్టడం లేదు. రిలయన్స్‌, టాటా, తదితర బడా కంపెనీల భూగర్భ కేబుల్స్‌కు ఏ రకమైన పన్ను లేకుండా మినహాయించారు. ఇటీవలనే రిలయన్స్‌ 4జి కేబుల్స్‌, టవర్లకు 30 రోజులలో అనుమతివ్వాలని, సకాలంలో ఇవ్వకపోతే ఇచ్చినట్లే భావించి కేబుల్స్‌ వేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి తమ ప్రభు భక్తిని ప్రదర్శించుకొంది. ఇటువంటి స్థితిలో పట్టణ ప్రజలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. భారాలతో క్రుంగిపోతున్నారు. చిన్న మున్సిపాలిటీలు, కొత్త మున్సిపాలిటీలు, విలీన పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మురికివాడలపై చిన్నచూపు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నెలల సమయం ప్రజలు వేచి చూశారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అందుకే సమస్యల పరిష్కారానికై ఉద్యమించాలి. విధానాల మార్పుకు పోరాడాలి. పట్టణ సంస్కరణల ప్రమాదంపై సమరశంఖం పూరించాలి. సిపిఎం ఆధ్వర్యంలో ఆగస్టు14న జరిగే ఆందోళనలో భాగస్వాములు కండి.
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
సిహెచ్‌ బాబూరావు
Taags :

No comments:

Post a Comment