Friday, August 14, 2015

హక్కులను హరిస్తే సహించం Posted On 21 hours 57 mins ago

హక్కులను హరిస్తే సహించం

Posted On 21 hours 57 mins ago
హక్కులను హరిస్తే సహించం
- మహారాష్ట్రలో ఫాక్స్‌కాన్‌  ఏర్పాటుపై సిపిఎం
ఇండియా న్యూస్‌నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ:
                ఎలాక్ట్రానిక్‌ వస్తువుల తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ సంస్థ భారత్‌లో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయటం సంతోషకరమే అయినప్పటికీ కార్మిక హక్కులను హరిస్తే సహించబోమని సిపిఎం హెచ్చరించింది. ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీతో పాటు కార్మిక హక్కుల హరణంలో కూడా ఫాక్స్‌కాన్‌ పేరొందిందని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్‌ డెమొక్రసీ తాజా సంచికకు రాసిన సంపాదకీయంలో ప్రకాశ్‌ కరత్‌ పేర్కొన్నారు. చైనాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తు తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్‌లో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, తక్కువ వేతనాలు, అధిక పనిగంటలు, బలవంతపు ఓవర్‌టైమ్‌ అమలు వంటి కారణాలతో ఈ సంస్థలో 2010 2013 మధ్య కాలంలో వరుస సమ్మెలు కొనసాగాయని కరత్‌ ఈ సంపాదకీయంలో తెలిపారు. ఈ సంస్థ కొనసాగిస్తున్న శ్రమదోపిడీ కారణంగా కేవలం 2010 ఒక్క సంవత్సరంలోనే షింజెన్‌ నగరంలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో 13 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, మరో 13 మంది ఆత్మహత్యలకు ప్రయత్నించారని ఆయన తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా యువకులేనని ఆయన వివరించారు. సాధారణ కార్మికుల శ్రమను దోపిడీ చేయటంతో పాటు సాంకేతిక విద్యాసంస్థల విద్యార్ధులను 'ఇంటెర్న్స్‌' పేరుతో దాదాపు సగం వేతనాలతో వారి శ్రమను కారుచౌకగా ఫాక్స్‌కాన్‌ దోపిడీ చేస్తున్నదన్నారు. చైనాలో ఫాక్స్‌కాన్‌ సంస్థ కొనసాగిస్తున్న కార్మికుల శ్రమదోపిడీ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలతో పాటు ఇతర సంస్థల కార్మికులు చేసిన సమ్మెలు, పోరాటాల ఫలితంగా పారిశ్రామిక కార్మికులుగా గుర్తింపుపొందినవారి కనీస వేతనాల పెరుగుదలను ప్రభుత్వం నోటిఫై చేసిందని కరత్‌ తన సంపాదకీయంలో వివరించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఫాక్స్‌కాన్‌ ఏర్పాటు చేస్తున్న తయారీ ప్లాంట్‌ భారత్‌లో మొదటిది కాదని, ఇంతకు ముందే చెన్నరు సమీపంలో ఏర్పాటయిన నోకియా మొబైల్‌ ఫోన్ల ఫ్యాక్టరీకి అవసరమైన పరికరాలను తయారు చేసే వ్యవస్థను ఫాక్స్‌కాన్‌ ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో 1,800 మంది శాశ్వత కార్మికులు, 6,200 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఇతర బహుళజాతి కంపెనీల తరహాలోనే ఫాక్స్‌కాన్‌ సంస్థ కూడా కార్మికుల సంఘటిత హక్కులను నిరాకరింస్తోందన్నారు. ఈ సంస్థకుచెందిన కార్మికులు 2010లో సిఐటియులో చేరినపుడు యాజమాన్యం వారిని వేధించటం మొదలు పెట్టిందని, ఇది చివరకు సమ్మెకు దారి తీసిందని ఆయన తెలిపారు. ఆ తరువాత నోకియా తన ఫ్యాక్టరీని మూసివేయటంతో ఫాక్స్‌కాన్‌ కూడా తన ప్లాంట్‌ను మూసివేసిందని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇప్పుడు తిరిగి మహారాష్ట్ర యూనిట్‌తో భారత్‌లో పునఃప్రవేశిస్తున్న ఫాక్స్‌కాన్‌ సంస్థ తనకు అలవాటైన కార్మిక వ్యతిరేక విధానాలను తిరిగి ప్రారంభిస్తుందన్న ఆందోళనలు కార్మిక వర్గంలో వ్యక్తమవుతున్నాయని కరత్‌ ఈ సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాల తరహాలోనే కార్మిక చట్టాలను సవరించటం ద్వారా హక్కుల హననానికి తెరతీసిందన్నారు. పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ద్వారా 300 మంది అంతకు తక్కువ సంఖ్యలో కార్మికులున్న సంస్థల్లో యాజమాన్యాలు ఎటువంటి ముందస్తు క్లియరెన్స్‌లేకుండానే వారికి ఉద్వాసన పలుకవచ్చని, ఈ చట్టం అమలులోకి వస్తే మహారాష్ట్రలోని 95 శాతం పారిశ్రామిక యూనిట్లలో కార్మికులకు ఉద్యోగ భద్రత కొరవడుతుందని కరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గతానుభవాలను దృష్టిలో వుంచుకుని కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఫాక్స్‌కాన్‌ యాజమాన్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు. 'సంఘ'టితం కావటం భారత్‌లో కార్మికులకు లభించిన ప్రాథమిక హక్కు అన్న కరత్‌ కార్మిక వ్యతిరేక విధానాలను ఎవరు అనుసరించినా, వాటిని కార్మికోద్యమాలతో తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
మీడియాపై బలప్రయోగమా?
యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్ష అమలు విషయంలో టీవీ ఛానళ్లకు నోటీసులు జారీ చేయటం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీడియాపై బల ప్రయోగానికి ప్రయత్నిస్తున్నదని కరత్‌ మరో సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలను ప్రసారం చేసిందని ఒక చానెల్‌పైన , ిాంసను రెచ్చగొడుతూ, జాతి వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాయంటూ మరో రెండు ఛానళ్లపైన అభియోగాలు మోపుతూ సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ వాటికి నోటీసులు జారీ చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. మెమన్‌ కేసు విషయంలో ఈ ఛానళ్లు ప్రసారం చేసిన చర్చా కార్యక్రమాలు, వ్యాఖ్యలు ఏ విధంగానూ న్యాయవ్యవస్థను కించపర్చలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా కోర్టు తీర్పును విమర్శించే హక్కు వుంటుందని, తీర్పు వెలువరించిన న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించినపుడు మాత్రమే అది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని కరత్‌ వివరించారు. న్యాయవ్యవస్థను ఎవరు కించపర్చారు అన్న విషయంలో తీర్పునిచ్చే పని సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు ప్రసారం చేసిన సంబంధిత ఛానళ్ల లైసెన్స్‌లు ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయటం మీడియాపై బలప్రయోగానికి పాల్పడటమే అవుతుందన్నారు. బిజెపి, ఆరెస్సెస్‌ వ్యతిరేకులను, ప్రతిపక్షాలను జాతి వ్యతిరేక లేదా జాతీయ భద్రతకు ముప్పుకలిగించే శక్తులుగా ముద్ర వేయటం కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ ఇదే తరహా అసహనాన్ని ప్రదర్శిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే హిందూత్వ శక్తులను జాతి వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ 'జాతీయ భద్రతకు ముప్పు'గామారిందని కరత్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను ఏ విధంగానూ ఉల్లంఘించరాదని, మోడీ ప్రభుత్వం తక్షణమే మీడియా సంస్థలకిచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌చేశారు.

No comments:

Post a Comment