Friday, August 21, 2015

బాబు వచ్చే జాబు పోయె ! Posted On Thu 20 Aug 22:31:10.869365 2015

బాబు వచ్చే జాబు పోయె !

Posted On Thu 20 Aug 22:31:10.869365 2015
          బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు తెలుగుదేశం కార్యకర్తలు హోరెత్తించారు. ఈ నినాదంతోనే యువత ఆకర్షిం చారు. బాబు అయితే వచ్చాడు కానీ, కొత్తజాబులెవరికీ రాకపోగా ఉన్న జాబులకు తీవ్రమైన ప్రమాదం వచ్చింది. రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లపై ఆయన దృష్టి పడింది. వీరు వైఎస్‌ హయాంలో ఉద్యోగాల్లో చేరారు. మనకు వ్యతిరేకంగా పనిచేశారని ఎవరో తెలుగుదేశం నాయకులు చెబితే వెంటనే దాన్ని నమ్మి చంద్రబాబు మూడో కన్ను తెరిచారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశాఖపట్నంలో జరిగిన మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలో ఈ ఉద్యోగుల తొలగింపును అజెండాలో చేర్చి ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అందరినీ రాష్ట్రవ్యాప్తంగా తొలగించి కొత్త వారిని తీసుకొనేలా కెబినెట్‌ చేత ఆమోదం తీసుకున్నారు. ఏ ఆరోపణలు లేకుండా, నిష్పాక్షిక విచారణ చేయకుండా, ఏ ఒక్క ఉద్యోగిని తొలగించినా అది అక్రమ తొలగింపే అవుతుందని చట్టం చెబుతోంది. అలాంటిది వేలాది మంది ఉద్యోగులను కేవలం తనకు రాజకీయంగా సహకరించలేదనే ఆరోపణపై తొలగించడం సామూహిక వధ లాంటిదే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మంత్రివర్యులు 'దున్నపోతు ఈనిందంటే గాట్లో కట్టేయమన్నట్లు'గా ఈ చట్టవిరుద్ధ ప్రతిపాదనను గుడ్డిగా బలపరిచారు. అయితే ఆచరణలో ఆ రకంగా తొలగించడం కష్టమని తేలిన తర్వాత ఈ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ను తొలగించేందుకు రకరకాల తప్పుడు ఆరోపణలు సృష్టించి గతంలోని ఫిర్యాదులను వెలికి తీసి ఈ కారణంపై సుమారు 2,000 మందిని కనీసమైన విచారణ లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించారు. అప్పటికే 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ తమ కుటుంబాలకు ఈ ఉద్యోగాలే జీవనాధారంగా ఉన్న వారందరూ తమ ఉపాధిని కోల్పోయి వీధులపాలయ్యారు. ఎన్నిసార్లు ఈ ఉద్యోగుల తరపున ప్రభుత్వం చుట్టూ తిరిగినా కనీస స్పందన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో రావడం లేదు. తొలగించిన వారిని తిరిగి నియమించుకొనే ఆలోచన ఎక్కడా కన్పించడం లేదు.
హౌసింగ్‌ కార్పొరేషన్‌లో వేలాది వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు
గత ప్రభుత్వాల హయాంలో భారీగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో పనిచేసేందుకు వేలాదిగా సాంకేతిక అర్హతగల యువతీ యువకులను వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా (అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా) ప్రభుత్వం తీసుకున్నది. పది, పన్నెండు సంవత్సరాలుగా వీరు హౌసింగ్‌ శాఖలో పనిచేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన గృహనిర్మాణాల భారీ టార్గెట్‌లన్నింటినీ అధిగమించి గృహాలను నిర్మించడంలో ఈ ఉద్యోగుల కృషి చాలా ప్రధానమైంది. గత ప్రభుత్వాల కాలంలో వేగంగా సాగిన గృహనిర్మాణ కార్యక్రమం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కొరతతో ఆగిపోయింది. లక్షల గృహ నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటినిఈ రోజుకాకున్నా రేపైనా పూర్తి చేయక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర తక్షణం ఈ పథకానికి భారీగా నిధులు కేటాయించడానికి ఇబ్బందిగా ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ ఆవాస్‌ యోజనల కింద నిధులను సేకరించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండవచ్చు లేదా తెలంగాణలో చేసినట్లుగా తాత్కాలికంగా ఈ శాఖలోని వర్క్‌ఇన్‌స్పెక్టర్లను చెట్టు-నీరు కార్యక్రమానికిగాని, చెరువుల నిర్మాణానికిగాని వాడుకోవచ్చు. అంతేగాక తెలుగుదేశం ప్రభుత్వం కూడా తన ఎన్నికల ప్రణాళికలో ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, డబుల్‌ బెడ్‌రూమ్‌లతో ఇంటిని నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ పని భవిష్యత్‌లో చేయాలన్నా ఈ వర్క్‌ఇన్‌స్పెక్టర్ల అవసరం ఎంతో ఉన్నది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆలోచిస్తే ఎవరినీ తొలగించాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే, చంద్రబాబుకు ఉద్యోగులను కుదిస్తే తప్ప పాలనా వ్యయం తగ్గదనే భావన బలంగా ఉండటం వల్ల సుమారు 2,000 మంది హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను సామూహికంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా 12, 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. వీరికి ఉద్యోగాల్లో చేరే వయో పరిమితి కూడా దాటిపోయింది. ఈ ఉద్యోగాలు చేస్తూ భార్యా పిల్లలతో బతుకుతున్నారు. వీరందరినీ ఒక్కసారిగా తొలగిస్తే వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహ రించడం వల్ల వేలాది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల పాలయ్యారు.

No comments:

Post a Comment