Tuesday, August 18, 2015

Home / Editorial / Neti Vyasam జర్మనీ ద్రవ్య పెట్టుబడులు-యూరో జోన్‌ ఆర్థిక సంక్షోభాలు Posted On Mon 17 Aug 23:36:57.411165 2015

జర్మనీ ద్రవ్య పెట్టుబడులు-యూరో జోన్‌ ఆర్థిక సంక్షోభాలు

Posted On Mon 17 Aug 23:36:57.411165 2015
                     అమెరికా ప్రముఖ ఆర్థికవేత్త పాట్రిక్‌ చొవానిక్‌ ''పెరుగుతున్న జర్మనీ విదేశీ వాణిజ్య ఎగుమతుల మిగులు యూరోజోన్‌లో ఆర్థిక అసమాన తలకు కారణమైంది'' అని అమెరి కన్‌ ఫారెన్‌ పాలసీ ప్రతికలో విశ్లేషించారు. 2014లో జర్మనీ 21,700 కోట్ల యూరోల వాణిజ్య మిగులును పొంది, చైనా తరువాత ప్రపంచంలో రెండవ స్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. ప్రస్తుతం యూరోజోన్‌లో సంభవిస్తున్న సంక్షోభాలను ఎప్పడూ రుణ సంక్షోభాలుగా పిలుస్తున్నాం. కానీ యూరోజోన్‌ను ఒక్కటిగా చూస్తే, ఇది ఐరోపా దేశాల బాహ్య సంక్షోభాల వల్లనే కాకుండా అంతర్గత సంక్షోభాలుగా అర్థంచేసుకోవాలి. యూరోజోన్‌లో ఒకవైపు పెరుగుతున్న జర్మనీ ఆర్థిక, వాణిజ్య ఆధిపత్యానికీ, వాణిజ్య ఎగుమతులకూ, మరో వైపు ఐరోపా కైవార దేశాల రుణాలకూ అవివాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఈ రెండూ ఒకే నాణానికి సంబంధించిన బొమ్మా, బొరుసుల వంటివి. చొవానిక్‌ ప్రకారం జర్మన్లు ఐశ్వర్యవంతులుగా భావిస్తూ, చాలా వరకు ఊహల ప్రపంచంలో తేలియాడుతున్నారు. కానీ వీరు కైవార దేశాల్లో పెట్టినపెట్టుబడులు తిరిగి వస్తాయో, రావో అని డోలాయమాన పరిస్థితుల్లో ఇరుక్కుంటున్నారు. కనుక జర్మన్లు సాధ్యమైనంత వరకూ యూరోజోన్‌ నుంచి ఉపసంహరించుకుని ఇప్పటికే మిగులులో ఉన్న ఎగుమతుల ద్వారా చేకూర్చబడిన ద్రవ్యపెట్టుబడిని స్వదేశంలో పెట్టుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. అది జర్మనీకే మేలనీ, కనుక 'యూరో' నుంచి 'జర్మన్‌ మార్క్‌'కు రావడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఇటు జర్మనీకి, అటు గ్రీసు వంటి దేశాలకూ శ్రేయస్కరమని అంటున్నారు.
యూరో నుంచి నిష్క్రమణకు జర్మనీపై ఒత్తిడి పెరుగుతున్నది. ''యూరో ఎప్పుడో మరణించింది. ఇప్పటికైనా కళ్లుతెరవండి'' అంటూ మాజీ జర్మన్‌ సోషలిస్టు పార్టీ ఛైర్మన్‌ ఓస్కార్‌ లఫెంటేన్‌ యూరప్‌ దశాలన్నీ ఐక్యంగా ఆర్థిక ప్రభుత్వాన్ని నడపనంత వరకూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు గ్రీసు వంటి దేశాల్లో వస్తుంటాయని అంటున్నారు. మరోవైపు ఫ్రెంచి ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారుడు, మాజీ యూరప్‌ యూనియన్‌ అధ్యక్షుడైన షలిన్‌వెలే న్యూయార్కు టైమ్స్‌ పత్రికలో ''ప్రస్తుతం యూరోలో ఉన్న సమస్య జర్మనీ తనంతటతాను యూరో సింగిల్‌ కరెన్సీ నుంచి తప్పుకుంటుందా లేకకియు దేశాలు తమంతటతామే బైటకి వెళ్లిపోతాయా అనేదే ప్రధానమైనది'' అన్నారు. యూరో కరెన్సీని ఆమోదించని చాలా దేశాలకు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనటానికి అనేక పరిష్కార మార్గాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వారి ద్రవ్య మారక విలువలను, వడ్డీరేట్లను తగ్గించుకోవటం. సొంత కరెన్సీ విలువ పడిపోతే విదేశాలకు ఎగుమతులు పెరిగి స్వదేశంలోనే పరిశ్రమల ఉత్పత్తులు వికసించేందుకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది.
సంక్షోభాలకు మూలం కోర్‌ దేశాల పేరుకుపోతున్న అదనపు విలువ. కానీ పెట్టుబడీదారీ దేశాల్లో సంక్షోభాలకు మూలకారణం రెడ్‌ రోజాగా పిలవబడే జర్మన్‌ కమ్యూనిస్టు నాయకురాలు రోజా లక్సెమ్‌బర్గ్‌ 1913లో రచించిన ''కోర్‌ పెరిఫరీ దేశాల ఆర్థిక సంబంధాలు'' వర్తమాన కాలంలో జరుగుతున్న దేశాల ఆర్థిక సంబంధాలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ముఖ్యంగా నేటి గ్రీసు పరిణామాలు అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ దేశాలు(కోర్‌ దేశాలు), అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశాల (పెరిఫరీ దేశాలు) మధ్య దోపిడీ సంబంధాలను తెలియజేస్తూ, కమ్యూనిస్టు సిద్ధాంతాలు అజేయమైనవని గుర్తుకు తెస్తున్నాయి. కార్ల్‌మార్క్స్‌ ప్రతిపాదించిన అదనపు విలువను మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణ్యంగా అభివృద్ది చేసి, అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కేంద్రీకృతమవుతున్న పెట్టుబడితో సంక్షోభం నుంచి బయటపడటానికి, అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశాలు ఏవిధంగా షరతులను విధించి, తమతమ సెంట్రల్‌ బ్యాంకుల ద్వారా ద్రవ్య రుణాలు ఇస్తారో రెడ్‌ రోజా వివరంగా ప్రతిపాదించారు. పెట్టుబడులను బయటి దేశాలకు విస్తరింపజేసి కోర్‌ దేశాల ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తారని 'ఎర్రరోజా' అంటారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలైన జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌, అమెరికా ఈ సూత్రాన్ని గ్రీసులో అమలుజేసినట్లు సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ గ్లోబల్‌ జస్టిస్‌, నోటింగ్‌హామ్‌ యూనివర్శిటీ సెప్టెంబరు 2014లో వారి నివేదికలో తెలియపరచి కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని, అదనపు విలువ దోపిడీని బలపరచారు.
ద్రవ్య పెట్టుబడులతో నూతనదోపిడీ
జర్మనీ స్వదేశంలో పెట్టుబడులకు బదులు, జర్మనీ ఉత్పత్తులను కొనుగోలు చేసుకునేందుకు వీలుగా, ఆ మిగులు ద్రవ్యపెట్టుబడిని గ్రీసు వంటి దేశాలలో రుణ రూపంలో జర్మన్‌ డాయిష్‌ బ్యాంకు ద్వారా పెట్టుబడిగా పెడుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఎ) యూరోజోన్‌ అంతా కుటుంబం అంటూనే, జర్మనీ సెంట్రల్‌ బ్యాంకు దేశ ప్రజలకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీకి పెరిఫరీ దేశాలలో రుణాలుగా ఇచ్చి అధిక వడ్డీ రూపంలో లాభార్జన పొందుతుంది. జర్మన్‌ బ్యాంకు వడ్డీరేట్లు 2.6 శాతం ఉండగా, 2010లో 1,517 కోట్ల యూరోలు గ్రీసుకు రుణంగా ఇచ్చి 4.5 శాతం వరకు వడ్డీ వసూలు చేసింది. ఒక్క 2010 సంవత్సర కాలంలో 50.2 కోట్ల డాలర్లను అదనంగా ఆర్జించింది. బి) ఈ దేశాలకు సరఫరాచేసే యంత్రాలకు బేరసారాలు లేని అధిక ధరలను నిర్ణయించి అధిక లాభార్జన చేస్తుంది. సి) అనవసరమైన యుద్ధ సామాగ్రిని అత్యధిక లాభాలతో విక్రయించడం, గ్రీసు జిడిపిలో ఇందుకోసం 4 శాతం పైగా ఖర్చు చేయించటం గమనార్హం. డి) రుణగ్రహీతల దేశాల్లో సామాజిక అవసరాలకు కాకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థలోని కోర్‌ దేశాలలో అధిక లాభాల కోసం ఉత్పత్తికాబడే వస్తువులనూ విక్రయించడం. 2010లో 11,000 కోట్ల యూరోల అప్పుతో 130 శాతం జిడిపి కంటే రుణాలు అధికం కాగా, 2014లో 31,000 కోట్ల యూరోలతో 175 శాతానికి, ప్రస్తుతం కుదరబోతున్న మూడవ బెయిలవుట్‌ షరతులతో 2015లో 40,000 కోట్ల యూరోలతో 200 శాతం పరిపూర్ణం చేసుకోనుంది. గ్రీసు యూరోజోన్‌ నుంచి తప్పుకుని, తన స్వంత కరెన్సీ డ్రాచ్మాకు తిరిగి వచ్చే వరకూ భవిష్యత్తులో బెయిలవుట్లు పునరావృతం అవుతూనే ఉంటాయి.
ప్రస్తుతం ఐరోపాలోని గ్రీసు వంటి పెరిఫరీ (అభివృద్ధిచెందుతున్న) దేశాలు డాలర్‌ ఆధిపత్యానికి వ్యతిరేకంగా 60, 70 దశకాల్లో ఫ్రాన్సు, జర్మనీలు పోరాడినట్లుగానే ఇప్పుడు మారినకాలంలో యూరోకు, జర్మనీకి వ్యతిరేకంగా సొంత కరెన్సీలతో ఆర్థికవ్యవస్థను నడుపుకున్నప్పుడే కొంతవరకైనా యూరో ఆధిపత్యం నుంచి, ద్రవ్య పెట్టుబడి దోపిడీ నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచీ బైటపడగలవు.

- బుడ్డిగ జమిందార్‌ (వ్యాసకర్త ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు)

No comments:

Post a Comment