Tuesday, August 11, 2015

ప్రజాశక్త

రైతు ఘోష

Posted On Tue 11 Aug 22:43:00.636687 2015
                  వ్యవసాయం గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలైన రైతుల కుటుంబాలు రాజధానిలో రెండు రోజుల పాటు నిర్వహించిన మహా ధర్నా ఈ దేశంలో రైతులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని ఎత్తి చూపడంతోబాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్య ధోరణిని గట్టిగా ఎండగట్టింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా లేవనెత్తిన డిమాండ్లు అత్యంత సహేతుకమైనవి. రుణాల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాలని, వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా చూడాలని, కనీస మద్దతు ధర పెంచాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని, రుణ సదుపాయాన్ని చిన్న సన్నకారు రైతులకు, కౌల్దార్లందరికీ అందుబాటులో వుండేలా చూడాలని, సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలన్న వారి కోర్కెలన్నీ బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నవే. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మారుస్తానని, రైతులు పండించే పంటకు యాభై శాతం లాభం వచ్చేలా కనీస మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతులను నిలువునా వంచించింది. వారు పండించిన పంటకు యాభై శాతం లాభం కల్సించడం కుదరదని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నివేదించిన విషయం మరచిపోరాదు. వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్న ఆయన మాటలు వట్టి నీటి మూటలేనని తేలిపోయింది. ఆయన ఏడాది పాలనలో వ్యవసాయ వృద్ది రేట్లు 3.7 శాతం నుండి 1.1 శాతానికి పడిపోవడం ఇందుకొక ఉదాహరణ. మొదటి ఆరుమాసాల్లో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. బిజెపి పాలిత రాష్ల్రాలైన మహారాష్ట్ర. మధ్య ప్రదేశ్‌, హర్యానా, చత్తీస్‌గఢ్‌లతోబాటు మన రాష్ట్రంలోనూ రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని వివిధ సర్వేలు ఘోషిస్తుంటే, మోడీ సర్కార్‌ మాత్రం జాతీయ నేర గణాంక నివేదికను పట్టుకుని రైతుల ఆత్మహత్యలు సగానికి సగం తగ్గాయంటోంది. ఇది రైతులతో క్రూర పరిహాసమాడడమే. జాతీయ నేర గణాంకాల బ్యూరో రైతాంగ ఆత్మహత్యలను నమోదు చేసేందుకు ఎంచుకున్న ప్రాతిపదిక దగ్గర నుంచి అనుసరించిన పద్ధతి దాకా ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందీ ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ ఇప్పటికే స్పష్టంగా వెల్లడించారు. పేదరికాన్ని తగ్గించడానికి బదులు పేదరికాన్ని నిర్ధారించే కొలబద్దలను మార్చి పేదరికం తగ్గిపోయినట్లు చూపేందుకు యుపిఏ ప్రభుత్వం ఎలాంటి ప్రహసనం నడిపిందో ఇప్పుడీ రైతాంగ ఆత్మహత్యల విషయంలో ఎన్డీయే ప్రభుత్వం అదే విధమైన ప్రహసనాన్ని నడిపింది. రైతుల బలవన్మరణాలను సాధారణ ఆత్మహత్యల ఖాతాలో జమ చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పడం ప్రభుత్వ దివాళాకోరుతనాన్ని తెలియజేస్తోంది. రైతాంగ ఆత్మహత్యలకు కారణం చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం నుంచి సరైన తోడ్పాటు లభించకపోవడమేనని పలు అధ్యయనాలు చెబుతుంటే, ప్రేమ , నపుంసకత్వమే కారణమని ప్రభుత్వం వాదించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. రుణభారానికి తోడు అకాల వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో ఉత్తరాదిలో ఈ కాలంలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పుట్టెడు కష్టాల్లో వున్న రైతులను ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పరిహారం చెల్లింపు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణ విముక్తి కల్పించడం లాంటి చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఇది తమ బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరించింది. పైగా వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో నిధుల కోత, సబ్సిడీల కుదింపు వంటి చర్యలను వడివడిగా చేపడుతోంది. వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడి పోను రైతుకు యాభై శాతం మిగులు వుండేలా చూస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. గ్లోబల్‌ మార్కెట్‌లో వ్యవసాయోత్పత్తుల ధరల్లో ఎగుడు దిగుడులను తట్టుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీకి నీళ్లొదిలింది. పంటలకు అందించాల్సిన సాగు నీటిని పరిశ్రమలకు మళ్లిస్తోంది. రైతులకు దక్కాల్సిన రుణాలను అగ్రి బిజినెస్‌, పట్టణ ప్రాంతాల్లో వున్న భూ కామందులకు కట్టబెడుతోంది. ఈ పద్నాలుగు మాసాల కాలంలో మన్‌కీ బాత్‌లో అనేక అంశాలపై మాట్లాడిన ప్రధాని మోడీ కనీసం ఒక్కసారి కూడా ఈ రైతాంగ ఆత్మహత్యలపై కానీ, వ్యవసాయంపై కానీ మాట్లాడలేదు. ఇంకోవైపు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రియల్‌ ఎస్టేట్‌, కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు భూ సేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ సంవత్సర వ్యవధిలోనే మూడు ఆర్డినెన్సులు తెచ్చింది. రాజ్యసభలో ప్రభుత్వానికి తగినంత మెజార్టీ లేకపోవడం వల్ల ఈ రైతు వ్యతిరేక భూ బిల్లు ఆగింది. లేకుంటే అది ఈపాటికే చట్టమైపోయేది. ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలను ఒకవైపు అవలంబిస్తూ ఇంకోవైపు డబ్బ్యుటిఓ వంటి వేదికల మీద రైతుల ప్రయోజనాలపై రాజీ పడేది లేదంటూ ప్రగల్భాలు పలుకుతోంది. ఈ కపట వైఖరితో రైతులను కొంత కాలం మోసగించవచ్చేమో కానీ, ఎల్ల కాలం మోసగించలేరు. రైతులు బాంగంటేనే దేశం బాగుంటుంది. రైతుల ప్రయోజనాలను విస్మరించిన ప్రభుత్వాలు మట్టి కొట్టుకుపోతాయి. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల ఘోషను ఆలకించాలి.
Taags :

No comments:

Post a Comment