Monday, August 31, 2015

ఉద్యమ విజయం

ఉద్యమ విజయం

Posted On Mon 31 Aug 22:41:25.17831 2015
         భూసేకరణ చట్టానికి ప్రతిపాదించిన వివాదాస్పద సవరణలను నరేంద్ర మోడీ ప్రభుత్వం విరమించుకోవడం రైతుల ప్రతిఘటనకు విజయం. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా, పార్లమెంట్‌ ప్రక్రియను కాదని అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌) జారీ చేసి, ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చనుకున్న బిజెపి సర్కారు కుటిల పన్నాగం బెడిసికొట్టింది. సోమవారంతో కాలం తీరిపోతుందన్న ఆర్డినెన్స్‌ స్థానంలో మరో ఆర్డినెన్స్‌ జారీ చేయబోమని ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించిన 'మన్‌కీ బాత్‌'లో ప్రధాని చేసిన ప్రకటన సాదాసీదాగా రాలేదు. రైతుల నుంచి మిన్నంటుతున్న నిరసనలు, ప్రతిపక్షాల ఐక్య ప్రతిఘటనల ఉక్కిరిబిక్కిరికి తాళలేకనే చివరి నిమిషంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేటు పెట్టుబడులకు భూసేకరణ చట్టం ప్రతిబంధకంగా ఉందంటూ కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కార్పొరేట్లకై ఆర్రులు చాస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వంటివి సైతం భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలనడంతో మోడీ సర్కారు దూసుకెళ్లింది. రాజ్యసభలో ఎన్‌డిఎకు మెజార్టీ లేదని తెలిసినా ఎనిమిది మాసాల్లో మూడుసార్లు ఆర్డినెన్స్‌లు జారీ చేసి పార్లమెంట్‌ ప్రతిష్టను మంటగలిపింది. సభ సమావేశం కాని రోజుల్లో ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు జారీ చేస్తాయి. ఆరునెలల్లోపు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందితేనే అవి చట్టాలవుతాయి. లేకపోతే కాలం చెల్లిపోతాయి. ఈ చిన్న విషయం 'వికాస పురుషుడి'కి తెలియకేంకాదు. నయానో భయానో మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను లోబర్చుకొని గట్టెక్కవచ్చనే ఆలోచనతోనే మోడీ సర్కారు ఒకసారి కాదు మూడుసార్లు ఆర్డినెన్స్‌లు ఇచ్చింది. మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ మెజార్టీ లేని రాజ్యసభలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షాలతోపాటు, కొన్ని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు సైతం వ్యతిరేకించడంతో చేసేదిలేక సవరణలకు మోడీ 'రాంరాం' చెప్పారు. అసలు వాస్తవం ఇది తప్ప రైతులపై ప్రేమ ఉండి కాదు.
యుపిఎ హయాంలో నోయిడా సహా దేశంలో పలు చోట్ల బ్రిటిష్‌ కాలంనాటి నిర్భంద భూసేకరణ చట్ట ప్రయోగాన్ని రైతులు, నిర్వాసితులు ప్రతిఘటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందు కాంగ్రెస్‌ సర్కారు 2013-భూసేకరణ చట్టం తెచ్చింది. కొన్ని లొసుగులున్నప్పటికీ రైతుల ప్రయోజనాలను పరిరక్షించే పలు అంశాలు ఆ చట్టంలో ఉన్నాయి. అభివృద్ధి మాటున కార్పొరేట్లకు తేరగా భూములు అప్పగించేందుకు మోడీ సర్కారు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. సులభంగా భూములు లాక్కునేందుకు 2013- భూసేకరణ చట్టానికి 13 సవరణలు ప్రతిపాదించడమే కాకుండా ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. పలు రంగాల కోసం భూసేకరణకు ముందు రైతుల అంగీకారం అవసరం లేదని, సామాజిక ప్రభావ అధ్యయనం చేపట్టాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద మార్పులు ప్రతిపాదించింది. ఈ రెండు ప్రధాన సవరణలూ రైతులు, వ్యవసాయ కార్మికుల మనుగడకు, ఉనికికి అత్యంత ప్రమాదమైనవి. అందుకే బిజెపి సవరణలపై రైతుల్లో నిరసనలు ఎగసిపడ్డాయి. ఆందోళనలకు దడిసే రాష్ట్రాలు సవరణలను వ్యతిరేకించాయి. చివరికి కేంద్రమే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భూసేకరణపై చేయని విన్యాసం లేదు. పైన ఎన్‌డిఎ సర్కారు అండతో రాజధాని ప్రాంతంలో రైతులు ఇష్టపడకున్నా బలవంతంగా వేలాది ఎకరాలను సేకరించేందుకు ఒంటికాలిపై లేచింది. నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. కేంద్రం ఎప్పుడైతే సవరణలపై తోకముడుస్తోందని పసిగట్టిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం మార్చింది. భూసేకరణకు వ్యతిరేకంగా పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి రావడం, ఆయన ఒక వైపు ప్రభుత్వాన్ని పొగుడుతూనే భూసేకరణ ఆపాలని కోరడం, ప్రభుత్వం వెనుకడుగు వేయడం నాటకీయంగా జరిగి పోయాయి. అప్పటి వరకు రైతుల పక్షాన పోరాడుతున్న వైసిపి, వామపక్షాలు, ప్రజాసంఘాలకు పేరు రాకుండా చేయడానికి ప్రభుత్వం చేసిన విన్యాసంగా ఉందిది. కేంద్రం చట్టానికి సవరణలు చేయకుంటే మూడు పంటలు పండే రాజధాని ప్రాంతంలో భూసేకరణ అసాధ్యం కనుక ప్రభుత్వం ఈ విన్యాసాలకు పాల్పడింది. రైతులు భూములివ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదు కనుక అంగుళం కూడా సేకరించేవీలుండదు. ఈ వాస్తవాలకు మసిపూసేందుకు భూసేకరణపై దోబూచులాట మార్గాన్ని ఎంచుకొని గందరగోళపరుస్తోంది. సమీకరణే తమ విధానమని పల్లవి ఎత్తుకుంది. బీహార్‌ ఎన్నికలు, నీతిఆయోగ్‌ సూచన, ప్రతిపక్షాలు, మిత్రపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో మైనార్టీ అన్నీ కలగలవడం వలన చట్ట సవరణలపై బిజెపి సర్కారు వెనుకంజ వేసింది. తాము పూర్తిగా వెనక్కిపోలేదనే వెంకయ్యనాయుడి ప్రకటన, సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామనే ప్రధాని వక్కాణింపు చట్ట సవరణ కత్తి ఇంకా వేలాడుతోందని హెచ్చరిస్తున్నాయి. ఈ సంకేతాలతో రైతులు, కూలీలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు చట్టసవరణపై అప్రమత్తంగా ఉండి ఆ ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలి.
Taags :

No comments:

Post a Comment