గ్రామీణ ఉపాధితో తగ్గిన పేదరికం
ted On 5 hours 15 mins ago
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేసిన తర్వాత దేశంలో పేదరికం స్థాయి తగ్గి, మహిళా సాధికారత పెరిగిందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. సర్వే ప్రకారం ఎమ్‌జిఎన్‌ఆర్‌ఇజిఎస్ అమలు తర్వాత దేశంలో మూడో వంతు పేదరికం తగ్గి, మహిళలు ఎక్కువగా డబ్బు సంపాదన కోసం దీనిపై ఆధారపడుతున్నారని తెలిపింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్, యూనివర్సిటి ఆఫ్ మారీల్యాండ్ వారు సంయుక్తంగా ఈ సర్వేని నిర్వహించారు. దేశవ్యాప్తంగా 26వేల గ్రామీణ కుటుంబాల్లో అధ్యయనం కొనసాగించినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. 2004-05 నుంచి 2011-12 మధ్య జరిపిన భారత మానవాభివృద్ధి సర్వే రెండు రౌండ్లను ఈ సర్వేకి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఉపాధి హామీ అమలు తర్వాత గ్రామీణ పేదరికశాతం 32 శాతం నుంచి 14 శాతంకు తగ్గినట్లు సర్వే వివరాలు వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ఆర్థికాభివృద్ధిలో ఎమ్‌జిఎన్‌ఆర్‌ఇజిఎస్ కీలక పాత్ర పోషించిందని సర్వే అధిపతి సోనాల్ దేశారు తెలిపారు. 2004 నుంచి 2012 మధ్యకాలంలో ఎమ్‌జిఎన్‌ఆర్‌ఇజిఎస్ కారణంగానే రోజువారీ వేతన రేట్లు పెరిగి, జీవన ప్రమాణాలు పెరిగినట్లు సర్వే వివరించింది.
No comments:
Post a Comment