Friday, August 14, 2015

మోడీ, సచిన్‌ ఔర్‌ శ్రీమంతుడు

మోడీ, సచిన్‌ ఔర్‌ శ్రీమంతుడు

Posted On Thu 13 Aug 22:49:47.935588 2015
            ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్‌ స్టార్‌ సచిన్‌ టెండూల్కర్‌ తెలుగు సినిమా ''శ్రీమంతుడు'' చూడాలి. వాళ్లిద్దరే కాదు ఏదో ఒక ఊరిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రజాప్రతినిధులు, కార్పొరేట్‌ కంపెనీల అధినేతలు కూడా చూడాల్సిందే. దత్తత తీసుకోవడమంటే తమ నియోజక వర్గ అభివృద్ధి నిధుల నుంచో, ఎవరి చేతనో ఇప్పించో లేదా స్వంత పర్సును కాస్త వదులు చేసుకొనో కొన్ని డబ్బులు సమకూర్చడం కాదు. ఒక పుణ్య ముహూర్తాన దత్తత తీసుకొన్న గ్రామాన్ని సందర్శించి చీపుర్లు, పారలు పట్టుకొని కెమెరాలకు ఫోజులివ్వడం కాదు. దత్తత తీసుకున్న గ్రామాల్లో తాము ఏం చేయాలని జనం కోరుకొంటారో చేయాల్సింది అని వారికి అర్థమవుతుంది. తాము చేస్తున్నది సముద్రంలో కాకి రెట్టంత అని తెలిసొస్తుంది. ''శ్రీమంతుడు'' సూపర్‌ డూపర్‌ సక్సెస్‌, కలెక్షన్ల్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. అంతగా నచ్చడానికి మహేశ్‌ బాబుకు యువతీ యువకుల్లో ఉన్న క్రేజ్‌ ఒక్కటే కారణం అనుకుంటే సరిపోదు. యువతీ యువకులే కాదు అన్ని వయస్సుల వారూ ఆ సినిమాకు వెళ్తున్నారు. నటీనటులపై ఉన్న క్రేజే విజయానికి కారణమని నిర్ధారిస్తే అదే నటీనటులు నటించినవీ ఘోరంగా ఫెయిలవుతున్న సినిమాల మాటేమిటి? క్రేజ్‌కు తోడు అనేక అంశాలు సినిమా విజయానికి బాట వేస్తాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ప్రేక్షకులు కనెక్ట్‌ కాగల అంశాలే సినిమాకు విజయం సాధించి పెడ్తాయి. అలా చూస్తే శ్రీమంతుడు విజయంలో కన్పించేది అభివృద్ధి పట్ల ప్రజల్లో ఉన్న తపన, ఆ అభివృద్ధి కేవలం ఒకటి రెండు కుటుంబాలకు కాదు అందరూ అభివృద్ధి చెందాలన్న భావన గుండె మూలాల్లోనయినా దాగి ఉండటం. ఆ మూలాన్నే పట్టుకొని శ్రీమంతుడి దర్శకుడు జయప్రదం అయినట్లు కన్పిస్తుంది.
ఎన్నికల్లో ఓడిన వారికి ప్రజలు తెలివిమాలిన వాళ్లు అన్పిస్తుంది. గెల్చిన వాడికేమో తెలివి మీరిపోయారన్పిస్తుంది ఇప్పుడు. ''శ్రీమంతుడు''లో రాజకీయాల ప్రస్తావన లేదు. ఉన్నదల్లా గ్రామాలను దత్తత తీసుకోవాలంటూ ప్రధాని చేసిన విజ్ఞప్తి మాత్రమే. మన్‌ కీ బాత్‌లోనూ, వివిధ సమావేశాల్లోనూ ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఆయనే కాదు ప్రజాసంపదను ప్రైవేట్‌ పరం చేయదల్చిన ప్రభుత్వాధినేతలు చాలా కాలం నుంచి కార్పొరేట్‌ కంపెనీలకు కూడా ఇలాంటి విన్నపాలే చేస్తున్నారు. ఎంపీలకు, కార్పొరేట్‌ కంపెనీలకు ఆ విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకోనవసరం లేదని తెలుసు. ప్రజలు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నారు. ప్రధాని విజ్ఞప్తి ఆచరణ రూపం ధరించాలని, మేలు జరగాలని వారు ఆశించారు. వారి ఆశలు భౌతికంగా నెరవేర లేదు. కానీ వెండితెరపై నెరవేరాయి. ఇంకేముంది క్యూ కట్టారు. ఏ సినిమాకైనా ఓ సందేశం తప్పనిసరి. శ్రీమంతుడికీ బలమైన సమకాలీన సందేశముంది. గ్రామాన్ని దత్తత తీసుకున్నవాడు ఆ జనం మధ్యే నివసించాలి. ఊరు సమస్యలేమిటో తెలుసుకోవాలి. విద్య, వైద్యం, సాగునీరు, రోడ్లు కల్పించడం, మేలైన వ్యవసాయ పద్ధతులు నేర్పడం వంటివేకాదు, స్వయంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి. దానితో ఆగకుండా మద్యం అమ్మకాలను అరికట్టాలి. పారిశ్రామిక కాంప్లెక్సుల పేర పేదలను వారి భూముల నుంచి మెడబట్టి నెట్టేసే దుర్మార్గాలను ఎదిరించి నిలబడాలి. ఇది మంచి సందేశమే. ఇక్కడే సినిమావాళ్లకు, ప్రభుత్వాధిపతులకు, రాజకీయ నేతలకు తేడా ఉండాలి. మేము కూడా సినిమా వాళ్లలా ఈస్టుమన్‌ కలర్‌ సినిమానే చూపెడ్తాం. మా మాటలు కూడా నీటి మీది రాతల్లా కన్పించక ముందే చెదిరిపోతాయి. అయినా ప్రశ్నించరాదన్నది మన ప్రభుత్వాధినేతల భావన.
గ్రామాల దత్తతపై ప్రజలు ఏమి ఆశిస్తారో, ఆశిస్తున్నారో తెలుస్తూనే ఉంది. మరి తీసుకొన్న వారు ఏం చేస్తున్నారో చూద్దాం. అందుకు మంచి ఉదాహరణ భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌. నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుత్తమరాజు కండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధాని పిలుపుపై, నెల్లూరు జిల్లా అధికారుల చొరవ కారణంగా సచిన్‌ ఆ గ్రామం దత్తత తీసుకున్నారట. తాను దత్తత తీసుకున్నట్లు ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆ గ్రామం వెళ్లాడు. పొలోమని ఉరుకులు పరుగుల మీద మీడియా వెళ్లింది. పొల్లు పోకుండా రాసింది, చూపెట్టింది. దేశదేశాల్లో ప్రచారం దొరికింది. భారతరత్న బిరుదు అందుకున్నాక కూడా ముంబయి ఇండియా టీం తరపున అంబానీ సేవలో తరించే సచిన్‌ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని కాస్త సమయం వెచ్చించాడంటే అది అంతర్జాతీయ వార్తే గదా! ఇంతకీ సచిన్‌ ఆ గ్రామానికి చేసిందేమిటి? రాజ్యసభ సభ్యుడిగా తనకు లభించే ఎంపి లాడ్స్‌ నిధుల నుంచి ఓ రూ.3 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్‌ మరో రూ.3 కోట్ల చిలుకు సర్దారు. ఆ ఊరికి రోడ్లు, కమ్యూనిటీ హాలు, ఇంటర్నెట్‌ సౌకర్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, అన్ని ఇళ్లకూ మంచినీటి కనెక్షన్‌ వగైరాలు కల్పించాలని నిర్ణయించారు. సంపన్న సచిన్‌ ఖజానా నుంచి పైసా కూడా కండ్రికకు కదల్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, అంటే ప్రజాధనంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ అధికారంలో ఉన్నవారు ప్రజల కోసం చేయాల్సిన పనులే. ఇందులో సచిన్‌ ప్రత్యేకత ఏముంది, సొమ్మొకడిది సోకొకడిది తప్ప. ఆయన చేత దత్తతకు ఓకే అన్పించిన అధికారులు లేదా రాజకీయ నాయకులెవరైనా ఉంటే వారి గొప్పదనం మాత్రం ఏముంది, పబ్లిసిటీ పొందడం తప్ప.
''శ్రీమంతుడు''లో చూపినట్లు సచిన్‌ తన స్వంత ఖర్చు పెట్టడం లేదు. జనం మధ్య ఉండి వారి సమస్యలను పరిశీలించలేదు. పరిష్కరించలేడు కూడా.. స్వయంగా పరిష్కరించకున్నా అధికారుల చేతనైనా చేయించే తీరికా ఆయనకు ఉండదు. అదేవిధంగా విద్యారంగ ప్రైవేటీకరణను అడ్డుకోగలడా, పరిశ్రమల పేర భూములను పోగొట్టుకునే రైతులకు అండగా నిలబడగలడా? ప్రైవేటీకరణను అడ్డుకొని వాటి స్థానంలో ప్రభుత్వ సౌకర్యాలను ఏర్పాటు చేయలేడు, పునరుద్ధరించనూలేడు. బ్రతికున్న భారతరత్నాల్లో ఒకరు కనుక, ఏదో ఒక సమయంలో సమీక్షించే అవకాశముంది కనుక అధికారులు కాస్త అదనపు శ్రద్ధ చూపి కేటాయించిన నిధులను ఖర్చుచేసే అవకాశం ఉంది. మిగతా ఎంపీలు ఈ మాత్రమైనా చేశారా? లాడ్స్‌ నిధులను మురగబెట్టేశారా? ఎక్కడికక్కడ పరిశీలించాల్సిందే. ప్రజాప్రతినిధులు ఇలా ఉండగా, అధికారులూ తక్కువేం తినలేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో హైదరాబాదు ప్రధాన బస్టాండ్‌లో మంచినీరు ఏర్పాటు చేయాలని రాతపూర్వకంగా తెలియచేసినా అధికారులు అమలు చేయలేదంటూ ఎమ్మెల్సీగా ఉండగా డాక్టర్‌ కె నాగేశ్వర్‌ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కంటే నీళ్ల బాటిళ్ల కంపెనీల పవరెక్కువ కదా!
శ్రీమంతుడికి హిట్‌ ఇచ్చిన జనం గ్రామాలను దత్తత తీసుకున్నవారు ఆ గ్రామాల్లో చేస్తున్నదేమిటో పరిశీలించే చైతన్యం ప్రదర్శిస్తే, జరుగుతున్నదేమిటో గమనిస్తుంటే అవకాశం వచ్చినప్పుడు అలా చేయని వారికి ఫట్‌మని చెప్పే అవకాశం వస్తుంది. సినిమా చూసి ఉల్లాసంగా ఇంటికెళ్లిన జనం ఇలా కూడా ఆలోచించాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త ప్రజాశక్తి పూర్వ సంపాదకులు)
ఎస్‌ వినయకుమార్‌

No comments:

Post a Comment