Monday, August 24, 2015

ఆత్మహత్యల భారతం Posted On Mon 24 Aug 23:15:54.271967

ఆత్మహత్యల భారతం

Posted On Mon 24 Aug 23:15:54.271967 2015
          నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు. ఈ రెండు గణాంకాలూ కలిపితే 2014లో రైతు ఆత్మహత్యల సంఖ్య 12,360 అయింది. 2013తో పోలిస్తే 5 శాతం ఎక్కువ. రైతు ఆత్మహత్యల ఈ మృత్యు ఊరేగింపు నిజానికి భయంకరమైన వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనం. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ధారావాహికగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానాలెన్ని కురిపించినా ఈ కీలకమైన రంగం అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. కానీ వ్యవసాయంతోనే జనాభాలో 60 శాతం మంది జీవితం ముడిబడి ఉంది. రైతులను రెండు రాజకీయ ఉద్దేశాల కోసమే వాడుకోవటం జరుగుతోంది. అవి రెండు బ్యాంకులు. ఒకటి ఓటు బ్యాంకు, రెండోది భూమి బ్యాంకు. నేడు ఇక కేవలం విదర్భ లేక మహారాష్ట్రలోనే కాదు, మహమ్మారిలా ఆత్మహత్యల సంఘటనలు ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హర్యానాలకు వ్యాపించాయి. 2014 ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు. అక్కడ ఆత్మహత్యల సంఖ్య 4,004. 1,347 మందితో తెలంగాణ రెండోదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 2011లో ఆత్మహత్యలు సున్నా, 2012లో నలుగురు, 2013లో మరలా సున్నా. గత ఏడాది మాత్రం ఒక్కసారిగా 755కు పెరిగిపోయింది.
ఆత్మహత్యల లెక్కింపు పద్ధతి గురించి చాలా ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు రైతు కుటుంబంలో మహిళల ఆత్మహత్యను లెక్కలోకి తీసుకోవటంలో ఎన్నో సమస్యలున్నాయి. ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో భూమి పట్టా వారి పేర ఉండదు. ఆత్మహత్యల కారణాల్లో అగ్ర స్థానాన ఉన్నది రుణాలు. వాటి బరువుకు రైతులు కుదేలవటం. చండీగఢ్‌ కేంద్రంగా పని చేసున్న రీసెర్చ్‌ ఇన్‌ రూరల్‌ అండ్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌(సిఆర్‌ఆర్‌ఐడి) సంస్థ ఒక సమీక్షలో పంజాబ్‌లో గత దశాబ్దంలో సగటు వ్యవసాయ రుణాలు పెరిగి 22 ఇంతలు అయినాయి. 2004లో ప్రతి కుటుంబం సగటున రూ.25 వేల రుణం కలిగి ఉండగా, 2014లో అది పెరిగి ప్రతి కుటుంబానికీ రూ.5,60,000 అయింది. జాబితాలో అగ్ర స్థానంలో ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ఉంది. అక్కడ సగటు కుటుంబ రుణం రూ.7,54,000. తరువాత రూ.6,48,000లతో కర్ణాటక ఉంది. పంజాబ్‌లో గ్రామీణ కుటుంబాల్లో 98 శాతం రుణ భారంతో చితికి పోయే పరిస్థితిలో ఉన్నట్లు సిఆర్‌ఆర్‌ఐడి ఒక సమీక్షలో పేర్కొంది. వారి సగటు రుణం సగటు కుటుంబ ఆదాయానికి 96 శాతంగా ఉంది.
రోజులు మంచో చెడ్డో. వ్యవసాయ రంగంలోనైతే సంక్షోభం పరుగుపెడుతోంది. స్వాతంత్య్రం తరువాత సాగుకి పనికొచ్చే భూమి విస్తీర్ణం తగ్గడం ఇదే ప్రథమం. సాగు చేసే భూమి పరిమాణం కూడా తగ్గుతున్నది. ఇది ఒక ఆత్మహత్యల ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం ఖర్చు పెరుగుతున్నది. ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారకాలు, ఇతర ఉపకరణాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యుత్తు ఖర్చు పెరుగుతున్నది. సబ్సిడీలు తగ్గుతున్నాయి. అన్నిటి కంటే కనీస మద్దతు ధర పెరుగుదల రేటు చాలా స్వల్పంగా ఉంటోంది. పంట ధర పడిపోతున్నది. రైతులు సాగు మానుకుంటున్నారు. గతి లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవాల్సి వస్తోంది. తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే పోతోంది. అకాల వర్షాల వల్ల 18 కోట్ల హెక్టార్ల భూమిలో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం నిర్వికారంగా ఉంది. జిడిపి మత్తులో మునిగి ఉంది. రైతు పంట పండించటానికి అయ్యే ఖర్చుకు కనీసం 50 శాతం ఎక్కువ ధర ఇవ్వటం జరుగుతుందని మోడీ చెప్పారు. కానీ ఆ వాగ్దానం అంతర్థానమయింది. కార్పొరేటు మోజులో మైమరచి దాన్ని మరిచారు.
- వేదుల రామకృష్ణ
Taags :

No comments:

Post a Comment