Tuesday, August 11, 2015

Home / Editorial / Neti Vyasam విద్యా శాఖ మంత్రి ఇలాకాలో ఇదీ పాఠశాలల స్థితి Posted On Tue 11 Aug 22:44:27.194226 2015

విద్యా శాఖ మంత్రి ఇలాకాలో ఇదీ పాఠశాలల స్థితి

Posted On Tue 11 Aug 22:44:27.194226 2015
                   రాష్ట్రంలోని పాఠ శాలలను రేషన్‌ లైజేషన్‌ చేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకటి ంచారు. రేషన్‌ లైజేషన్‌ అంటే కొన్ని పాఠశాలలను మూసివేసి, వాటిని మరో పాఠశాలతో కలిపిచేయడం. ఇలా 3,995 పాఠశాలలను మూసివేస్తామని మంత్రి ప్రకటించారు. పాఠశాల విద్య పటిష్టత కోసమే ఈ పని చేస్తున్నట్లు కూడా తెలిపారు. దీనిని ఏరకంగా అర్థం చేసుకోవాలో తెలియాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో అక్షరాస్యత, పాఠశాలల నిర్వహణ పరిస్థితి వంటి విషయాలు తెలుసుకోవాలి.
రాష్ట్రంలో అక్షరాస్యత
అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలో 31వ స్థానంలో ఆంది. దేశంలో మొత్తం 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలుండగా క్రింది నుంచి ఐదవ స్థానం మనది. అంటే 30 రాష్ట్రాలు అక్షరాస్యతలో మన కంటే ముందున్నాయి. 2011లో దేశంలో సరాసరి అక్షరాస్యత 74.04 శాతం ఉండగా, మన రాష్ట్రంలో ఇది 67.66 శాతంగా ఉంది. అంటే దేశ సరాసరి కంటే తక్కువన్నమాట. ఈ వెనుకబాటును అధిగమించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి 2001-11 మధ్య పదేళ్ళలో సాధించిన ప్రగతిని బట్టి అంచనాకు రావచ్చు. 2001లో రాష్ట్రంలో అక్షరాస్యత 60.47 శాతం నుంచి 2011లో 67.66 శాతానికి పెరిగింది. అంటే ఈ పదేళ్ళలో అదనంగా 7.19 శాతం మంది అక్షరాస్యులయ్యారన్నమాట. అదే దేశంలో ఈ కాలంలో సరాసరి 9.21 శాతం పెరిగింది. అంటే అక్షరాస్యత పెరుగుదల కూడా దేశ సగటు కంటే తక్కువగానే ఉంది. అంతేకాక విచిత్రంగా 2001లో దేశంలో 28వ స్థానంలో నిలిచిన రాష్ట్రం పదేళ్ళలో 31వ స్థానానికి దిగజారింది. 2001లో మనకంటే దిగువనున్న జమ్మూకాశ్మీరు, ఉత్తరప్రదేశ్‌, దాద్రానాగర్‌హవేలీ ముందుకు జరిగాయి. 2011లో రాష్ట్రంలోని 13 జిల్లాల సగటు అక్షరాస్యత 65.25 శాతం మాత్రమే. అంటే ఉమ్మడి రాష్ట్రంలోని 67.66 శాతం సగటు కంటే కూడా తక్కువ. ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో అభివృద్ధి సాధించడానికి ఏర చేయాలి? పాఠశాలలను మూసేస్తే అక్షరాస్యత పెరుగుతుందా? కొత్త పాఠశాలలను తెరవడం, ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పెంచడం ద్వారా సాధ్యమవుతుందా?
రాజ్యాంగ లక్ష్యం
సంపూర్ణ అక్షరాస్యత సాధన మన రాజ్యాంగం లక్ష్యం. దీనిని చేరుకోవడానికి 14 సంవత్సరాల వయస్సు వరకూ ''ఉచిత నిర్బంధ విద్య'' విధానం రూపొందించబడింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీలు ఈ దిశలో అనేక సూచనలు చేశాయి. ఉదాహరణకు 1964లో నియమించబడ్డ కొఠారీ కమిషన్‌ విద్యకు స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 6 శాతం నిధులు కేటాయించాలని తెలిపింది. 2009లో కేంద్ర ప్రభుత్వం సెకండరీ విద్య మెరుగుదలకు ''రాష్ట్రీయ మాధ్యమిక్‌ శిక్షా అభియాన్‌'' (ఆర్‌ఎంఎస్‌ఎ) ప్రారంభించింది. దీనిలో 2017 కల్లా అందరికీ విద్య అందుబాటులోకి తేవడం, 2020 కల్లా సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యాలు ఇవ్వబడ్డాయి. దీని ప్రకారం 2017కు అంటే మరో రెండేళ్ళకు విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. ఇది పాఠశాలలు కొత్తగా తెరిస్తే జరుగుతుందా? పాఠశాలలు మూసేస్తే జరుగుతుందా? అలాగే సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణ కూడా విద్య విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ కోణం నుంచి పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళ పరిస్థితిని పరిశీలించాలి.
జాతీయ మిషన్‌ నిబంధనలు
ఆర్‌యంయస్‌ఎ నిబంధనల ప్రకారం ఒక తరగతిలో 25 మంది విద్యార్థులుండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 40కి మించరాదు. తరగతి గది సైజు 710 చదరపు అడుగులుండాలి. ప్రతి పాఠశాలలోనూ కనీసం రెండు అదనపు గదులుండాలి. సైన్స్‌ ప్రయోగశాలకు 710 చదరపు అడుగుల గది ఉండాలి. హెడ్‌ మాస్టర్‌కు ప్రత్యేకంగా ఒక గది ఉండాలి. ఒక ఆఫీసు గది ఉండాలి. విద్యార్థినులకు ప్రత్యేకంగా గది ఉండాలి. 710 చదరపు అడుగుల విస్తీర్ణం గల కంప్యూటర్‌ గది ఉండాలి. ఇవి కాక అదనంగా రెండు గదులు ఇతర అవసరాలకు ఉండాలి. ఈ నిబంధనలకు తగ్గట్లుగా పాఠశాలలున్నాయా? విద్యాశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం శాంపిల్‌గా తీసుకుందాం. ఎందుకంటే స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రాంతం కాబట్టి, అక్కడ పరిస్థితులు బాగుంటాయని ఆశించవచ్చు. ఆయన నియోజవర్గంలోని సింహాచలంలో ఒక జిల్లా పరిషత్‌ హైస్కూలు ఉంది. అందులో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 11 సెక్షన్లలో 423 మంది విద్యార్థినీవిద్యార్థులున్నారు. ఇంగ్లీషు మీడియం కూడా ఉంది. జాతీయ మిషన్‌ నిబంధనల ప్రకారం ఈ పాఠశాలలో మొత్తం 18 గదులు ఉండాలి. కానీ ఆ స్కూల్లో ఎనిమిది గదులు మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్కగదీ 200 చదరపు అడుగులు మించి ఉండదు. నాలుగు క్లాసులు వరండాలలోనే జరుగు తున్నాయి. నగర పరిధిలో సింహాచలం దివ్యక్షేత్రాన్ని ఆనుకుని బాలుర (బి.సి) రెసిడెన్షియల్‌ స్కూలు వుంది. 800 మంది విద్యార్ధులు 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్నారు. హాస్టల్‌ గదులు చాలా చిన్నవి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంక్షేమ హాస్టళ్ళకు కనీసం మూడు సదుపాయాలుండాలి. అవి ఒకటి సరిపడా గది, రెండవది టాయిలెట్స్‌, మూడవది ప్రహరీగోడ. ఈ మూడూ కాదు కదా వీటిలో కనీసం ఒక్కటి కూడా ఈ హాస్టల్‌కు లేదు. ఇదీ సంక్షేమ హాస్టల్‌ దుస్థితి.
ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రభుత్వ విద్యను ఒక పథకం ప్రకారమే తెలుగుదేశం ప్రభుత్వం నాశనం చేస్తోంది. గత ప్రభుత్వం నియమించిన కంప్యూటర్‌ టీచర్లను తీసివేసింది. కంప్యూటర్లు నిరు పయోగంగా పడివున్నాయి. హైటెక్‌ ముఖ్యమంత్రి పాలనలో ఇలా ఉండడం విశేషం. పాఠశాలల మరమ్మత్తులు చేపట్టడానికి నిధులు విడుదల చేయడం లేదు. విద్యకు కేటాయింపులు కూడా తక్కువే. కొఠారీ కమిషన్‌ సిఫార్సు ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం విద్యకు కేటాయించాలి. ఈ బడ్జెట్‌లో విద్యకు ప్రభుత్వం రూ.18,596 కోట్లు కేటాయించింది. ఇది రాష్ట్ర జిడిపి (రూ.5,20,030 కోట్లు)లో 3.5 శాతం మాత్రమే. ఇది కూడా కేవలం కేటాయింపులు మాత్రమే. అన్ని నిధులూ విడుదల చేస్తారని గ్యారంటీ ఏమీలేదు. జనాభాలో మూడవ వంతు మంది నిరక్షరాస్యులుగా ఉన్న మన రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధన చాలా సుదూరంగా ఉంది. మరి మంత్రి ప్రకటించినట్లు పాఠశాలల రేషనలైజేషన్‌ సంపూర్ణ అక్షరాస్యతకు దారితీస్తుందా?
ఎ అజరుశర్మ
Taags :

No comments:

Post a Comment