Monday, August 10, 2015

మోడీ రాష్ట్రంలోకి బాల కార్మికుల తరలింపు Posted On Mon 10 Aug 23:07:43.60407 2015

మోడీ రాష్ట్రంలోకి బాల కార్మికుల తరలింపు

Posted On Mon 10 Aug 23:07:43.60407 2015
                      భారతంలో మయసభను తలపించేలా గుజరాత్‌ అభివృద్ధిని చూపిన ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం బాల కార్మికులకు నిలయమైంది. ముఖ్యంగా గుజరాత్‌ తీరంలో చేపల వేట పడవల్లో మత్స్యకార పిల్లలను యథేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితి ఉంది. మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాల కార్మికుల తరలింపు మొదలైంది. గుజరాత్‌ మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు విడదీయలేని బంధం ఉంది. జిల్లా నుంచి కొన్ని దశాబ్దాలుగా బతుకుదెరువు కోసం అక్కడకు వెళ్లి, చేపల వేట పడవల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే చదువుతున్న విద్యార్థులనూ బాల కార్మికులుగా మార్చడం మొదలైంది. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాగా, అందులో మత్స్యకారులు సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్నారు. నాటు పడవలతో పాటు 500కు పైగా మరబోట్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీరంలో మత్స్య సంపద తగ్గిపోతూ వస్తోంది. దానికి తోడు సంప్రదాయ వేటకు అలవాటుపడిన మత్స్యకారులు తీరంలో ట్రాలర్ల చొరబాటుతో, మత్స్యకారుల వలలకు చేపల లభ్యత తగ్గిపోయింది. ఉపగ్రహ సహాయంతో వేట సాగించడంతో సంప్రదాయ మత్స్యకారుల వేటకు పెద్ద గండి పడినట్లయింది. వేటతో కుటుంబాల జీవనం సాగించడం కష్టం కావడంతో ఒడ్డునపడ్డ చేపల్లా మత్స్యకారులు జిల్లాలో కడలిని వదులుకోవాల్సి వస్తోంది. ఉపాధిహామీ పథకంతో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునే పరిస్థితి నామమాత్రంగా ఉంది. చివరికి మత్స్యకార మహిళలు భవన నిర్మాణ పనుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో అక్షరాస్యత 67 శాతం ఉండగా, వీరిలో 50 శాతానికి మించి లేదు. ఉద్యోగ కల్పన మరిచిన ప్రభుత్వం, ఉపాధి కల్పనలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సామాజిక కట్టుబాట్లు నడుమ దారిద్య్రం వెంటాడడంతో బడి పిల్లలనూ తల్లిదండ్రులు పనిలో పెట్టేస్తున్నారు.
జిల్లా నుంచి ఏటా గుజరాత్‌కు 20 వేల మందికి పైగా మత్స్యకారులు వెళ్లి వస్తుంటారు. ఇప్పుడు బాల కార్మికులుగా బడి ఈడు పిల్లలు సుమారు మూడు వేల మంది గుజరాత్‌ వెళ్లి వస్తున్నారని ఆయా గ్రామాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రధానంగా 12, 13 ఏళ్ల పిల్లలను బడి మాన్పించి పంపుతున్నారు. తల్లిదండ్రులను ప్రశ్నిస్తే, ఇక్కడ పనుల్లేవని కుటుంబం గడవాలన్నా, ఇతర అవసరాలు తీరాలన్నా పిల్లలను పంపక తప్పదని చెప్తున్నారు. అందువల్ల మత్స్యకారుల పాఠశాలల్లో మగ పిల్లల కంటే ఆడ పిల్లలే ఎక్కువ మంది కనిపిస్తారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఇందుకు ఉదాహరణ. రెండు వేల జనాభా కలిగిన ఆ గ్రామంలో ప్రభుత్వోద్యోగులు మాత్రం ఇద్దరే. ఒకరు ఆర్మీలో ఉండగా, మరొకరు ట్రాన్స్‌కో పనిచేస్తున్నారు. డిగ్రీ చదివిన వారు ఆడపిల్లలతో సహా 30 మంది వరకూ ఉంటారు. పాతతరంతో పాటు కొత్తతరంలోనూ ఎవరికీ ఉద్యోగాల్లేవు. సీమెన్‌లు మాత్రం పది మంది వరకూ ఉంటారు. ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న పిల్లలను బడి మానిపించి గుజరాత్‌ పంపిస్తారు. గ్రామం నుంచి ఏటా కనీసం 40 మంది వరకూ వెళ్లే పరిస్థితి ఉంది. గుజరాత్‌ నుంచి మత్స్యకార గ్రామాలకు ఏజెంట్లు వచ్చి పిల్లలను పట్టుకుపోతారు. మొదటి సంవత్సరమైతే కనీసం రూ.30 వేలు తల్లిదండ్రులకు ముందుగా అందిస్తారు. 15, 16 సంవత్సరాల వయసు, అనుభవం ఉంటే రూ.50 వేల వరకూ ఇస్తారు. అక్కడకు తీసుకెళ్లిన పిల్లలకు నెలకు రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేల వరకూ ఇస్తారు. వారి ఖర్చుల కోసం జీతం నుంచి డబ్బులు చెల్లిస్తారు. దాచుకున్న మిగిలిన సొమ్మును వచ్చేటప్పుడు మొత్తం అందజేస్తారు. ఏటా జులై, ఆగస్టులో వెళ్లి ఏప్రిల్‌, మేలో తిరిగొస్తారు. తీసుకెళ్లిన పిల్లలను పడవుల్లో బండారీలుగా (వంటవాడు) పెట్టుకుంటారు. వంట రాకున్నా రెండు, మూడు రోజుల్లోనే వంట నేర్పిస్తారు. తొమ్మిది నెలల కాలంలో కనీసం రెండు వారాలకు మించి భూమ్మీద జీవనం చేయరు. వారి జీవనయానమంతా సముద్రంలోనే. ఒకసారి పడవ వెళ్లిందంటే మూడు వారాలకు గానీ తిరిగి రాదు. పడవలో తండేల్‌ (డ్రైవర్‌), బండారీతో పాటు ఆరుగురు మత్స్యకార కూలీలు ఉంటారు. చేపలతో వలలు వేసిన తర్వాత బండారీగా ఉన్న బాలుడు వాటిని ఏరి ఐస్‌ బాక్సుల్లో వేస్తారు. అందరితో గ్రామంలో ఉండి చదువుకోవాలని లేదా అని ఎనిమిదో తరగతి మానేసిన బుడగట్లపాలెంకు చెందిన మైలపల్లి సునీల్‌ను ప్రశ్నిస్తే, అమ్మానాన్న పంపిస్తే వెళ్లకపోతే ఎలా? అని ఎదురు ప్రశ్నించాడు. అదే విషయం తల్లిదండ్రులను ప్రశ్నిస్తే, పూర్వంలా చేపలు పడడం లేదు. కష్టపడదామంటే గ్రామాల్లో పనుల్లేని పరిస్థితి ఉందని చెప్తున్నారు.
బడి ఈడు పిల్లలను బాల కార్మికులుగా గుజరాత్‌కు తరలించడంపై హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అసోసియేషన్‌ స్వచ్ఛంద సంస్థ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలీసులతో సహా సంబంధిత అధికార యంత్రాంగం మత్స్యకార గ్రామాలకు తరలింది. పిల్లలను పనిలో పెట్టడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించడం మొదలుపెట్టారు. మత్స్యకారులు తమ బతుకుల గురించి చెప్తుంటే, కనీసం గ్రామాల్లో ఉపాధి పనినైనా కల్పిస్తామన్న భరోసాను అధికారులు ఇవ్వలేకపోతున్నారు. చట్టాలు ఉపదేశించి, బెదిరించి వస్తున్నారు. ఆ ఉపదేశాలు, బెదిరింపులను వారు స్వీకరించే పరిస్థితిలో లేరు. ప్రధాని మోడీ స్వరాష్ట్రం బాల కార్మికుల నిలయంగా మారగా, వారిని అక్కడకు పంపించే బాధ్యతను రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్నట్లుగా జిల్లాలో పరిస్థితి ఉంది. వందలాది మత్స్యకార కుటుంబాలు తమ పిల్లలను ఏజెంట్ల ద్వారా గుజరాత్‌కు పంపే ప్రక్రియ అప్పుడే మొదలైంది. చంద్రబాబు విజన్‌ విధానాలు అందుకు బలాన్నిస్తున్నాయి.
- సత్తారు భాస్కరరావు
Taags :

No comments:

Post a Comment