Tuesday, August 4, 2015

Sampadakeeyam ptrajasakti

రెండు పార్టీలు నాలుగు నాలుకలు

Posted On Tue 04 Aug 00:32:51.387296 2015
          వ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ, కనీస పరిశీలన కానీ కేంద్రం చేయట్లేదని మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ లోక్‌సభలో శుక్రవారం చేసిన ప్రకటనతో టిడిపి, బిజెపిలది డ్రామాలేనని మరోసారి స్పష్టమైంది. హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్‌ ఢిల్లీలో ధర్నా చేస్తానని పేర్కొన్న తరుణంలో మంత్రి ఇందర్‌జిత్‌ వ్యాఖ్యలు అటు బిజెపిని, ఇటు టిడిపిని సంకటంలో పడేశాయి. జగన్‌ ధర్నాకు తతిమ్మా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతుండటంతో అధికార పార్టీలకు గంగవెర్రులెత్తుతోంది. ఒకవైపు నష్ట నివారణకు ఆగమేఘాల మీద తెలుగుదేశం, బిజెపి నేతలు రంగంలోకి దిగి ప్రజలను మభ్య పుచ్చేందుకు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు వారి పార్టీ ఎంపీలు, మంత్రులు నాయకుల ప్రకటనల్లోని గాలి తీసేస్తున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుతో సహా తామందరికీ తెలుసని జెసి దివాకర్‌ రెడ్డి, ఎంపిగా గెలిచి ఎందుకు ఢిల్లీకి వెళ్లానా అని బాధ పడుతున్నానని రాయపాటి లోగుట్టును బయటపెట్టారు. తాము ప్యాకేజీ ఇస్తామన్నామని నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. చంద్రబాబు, యనమల వంటి వారు ప్రత్యేక హోదా కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటామని చెబుతూ దాన్నో నిరంతర వార్తా స్రవంతిలా మార్చేశారు మినహా హోదా సాధిస్తామని కచ్చితంగా చెప్పకపోవడం కొసమెరుపు. మోడీ సర్కారు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తెచ్చినప్పుడే ఎపికి ప్రత్యేక హోదాపై ఆశలు సన్నగిల్లాయి. నీతి ఆయోగ్‌ వచ్చినా హోదాకు ఢోకా లేదని నమ్మబలుకుతూ వచ్చారు టిడిపి, బిజెపి నాయకులు. కేంద్ర మంత్రి వెంకయ్య ఎప్పుడైతే హోదాపై నాలుక మడత పెట్టడం మొదలు పెట్టారో దింపుడు కళ్ళం ఆశా పోయింది. హోదా ఇచ్చేది లేదంటే జనం ఎక్కడ ఛీ కొడతారోనని రెండు పార్టీల నేతలూ ప్రజలను భ్రమలను మభ్యపెడుతున్నారంతే. పైగా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పునర్విభజన చట్టంలో పొందుపర్చకుండా తప్పు చేసిందని వెంకయ్య తూలనాడుతున్నారు. కాంగ్రెస్‌ది తప్పే అనుకుంటే ఆనాడు పార్లమెంటులో ఎందుకు నిలదీయలేదు? రాజ్యసభలో బిజెపి మద్దతు లేకుండా బిల్లు పాస్‌ కాదు. బిల్లులో పెట్టాలని బిజెపి పట్టుబడితే కాంగ్రెస్‌ ఆ పని చేసేది కాదా? రాజ్యసభలో మన్మోహన్‌సింగ్‌ చేత తామే పట్టుబట్టి ఆరు సూత్రాల ప్రకటన చేయించామని బిజెపి, టిడిపి ఎన్నికల్లో ప్రచారం చేశాయి. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఎపిలో కలిపిన బిజెపి సర్కారు, ప్రత్యేక హోదాపై కూడా అలాగే చట్టానికి సవరణ చేస్తానంటే ఎవరన్నా వద్దన్నారా? చిత్తశుద్ధి లోపించింది బిజెపికి కాదా? రాష్ట్రాభివృద్ధిపై నిత్యం గొంతు చించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా బిజెపిని ఎందుకు వెనకేసుకొస్తున్నట్లు?
14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దందని బిజెపి, టిడిపి తప్పించుకోవడం పొసగని వ్యవహారం. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఆమోదించొచ్చు లేదా మార్పులు చేయొచ్చు. మక్కీకిమక్కీ సూచనలన్నింటినీ ఆమోదించేసి నెపం ఆర్థిక సంఘంపై నెట్టడం వంచనే కదా! ఆర్థిక సంఘాన్ని కాంగ్రెస్‌ వేసిందని, ఛైర్మన్‌ వైఎస్‌ కుటుంబానికి బంధువని టిడిపి చేసే ఆరోపణలు ఎంత మాత్రం చెల్లవు. కేంద్రం వద్ద తనకు పలుకుబడి ఉందని గప్పాలుకొట్టే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? నీతి ఆయోగ్‌తో నిధులను కేంద్రీ కరిస్తున్నారు. వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని తేలి పోయింది. ఐదేళ్లపాటు పరిహారం ఇస్తామంటున్నా నమ్మడం కష్టం. ఐదేళ్లలో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా వేయగా ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం ఇచ్చేది చాలా తక్కువ. తొలి ఏడాది లోటు భర్తీకి కాంగ్రెస్‌ రూ.5 వేల కోట్లు ప్రతిపాదిస్తే వెంకయ్య రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా అయిదు కాదు పదేళ్లు కావాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చేసిన బాసలు అధికారంలోకొచ్చాక ఇప్పుడేమయ్యాయో ఆయనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు ఏడాదికి పదో పరకో కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతుందో టిడిపి, బిజెపి చెప్పగలుగుతాయా? ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై బిజెపి, టిడిపి నాటకాలు ఆడుతున్నాయని ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. ఆ రెండు పార్టీల మెడలు వంచైనా హామీలు అమలు చేయించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది.
Taags :

No comments:

Post a Comment