Monday, August 24, 2015

ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి Posted On Mon 24 Aug 23:17:26.733116 2015

ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి

Posted On Mon 24 Aug 23:17:26.733116 2015
           పరిశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందటానికి ప్రత్యేకహోదాను సాధించటం అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఆదాయాన్నిచ్చే రాజధాని నగరం హైదరాబాద్‌ తెలంగాణకు రాజధానిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా లోటులో ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.16,000 కోట్ల లోటు ఉంది. విశాఖపట్నం, తిరుపతి లాంటి చోట్ల మినహా పారిశ్రామికాభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి స్థితిలో రాష్ట్రం ఆభివృద్ధిని సాధించాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించటం తప్పనిసరి. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఐదు సంవత్సరాలు కాదు. పది సంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలని డిమాండు చేసింది. ఆనాడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రత్యేకహోదాతో పాటు రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని డిమాండు చేసింది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికార, ప్రతిపక్షాల స్థానాలు మారాయి. ఆనాడు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టిడిపి ఇప్పుడు అధికారంలో ఉంది. ఆనాడు ప్రత్యేకహోదా ఐదు సంవత్సరాలు చాలదు, పది సంవత్సరాలు కావాలన్న బిజెపి ఇప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని చెబుతున్నది. ప్రత్యేకహోదాతో పాటు ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కోరిన టిడిపి ఆ రెండింటినీ పక్కన పెట్టి ప్యాకేజీ కావాలని అడగటానికి పరిమితమైంది. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వదని స్పష్టమయింది. గతంలో ఒకసారి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని బిజెపి చెప్పింది. తిరిగి జులై 30వ తేదీన స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ సహాయ మంత్రి రావు బీరేంద్రసింగ్‌ ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వటం లేదని పార్లమెంటులో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమైన తర్వాత కూడా టిడిపి ప్రభుత్వం ప్రత్యేకహోదా సాధన కోసం రాష్ట్ర ప్రజానీకాన్ని పోరాటానికి సన్నద్ధం చేయటం కాకుండా ప్రజలను మభ్యపెట్టటానికి పూనుకున్నది. ఒకవైపున ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరి కొద్ది రోజుల్లో ప్రత్యేకహోదాపై ప్రకటన వస్తుందని చెబుతుండగా, మరోవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావని, ప్యాకేజీయే మంచిదని చెబుతున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయటానికి మారుగా, ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసగించటానికి టిడిపి ప్రభుత్వం పూనుకున్నది. ఈ విధంగా ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రాష్ట్ర ప్రజలను కలిసికట్టుగా మోసం చేయటానికి పూనుకున్నాయి.
ప్రత్యేకహోదా సాధన వల్ల ప్రయోజనాలు
ప్రత్యేకహోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తే ఎక్కువ ఉపయోగమని రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్యాకేజీకి ఉండే విలువ ఏమిటి? అది ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. బీహార్‌లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ప్రధాని ఆ రాష్ట్రానికి రూ.1,25,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇది బీహార్‌ ఎన్నికలలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి మోడీ చేసిన వాగ్దానం. పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని దేశ ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారు. అవినీతిని రూపుమాపుతామని, విదేశాలలోని నల్లడబ్బును వెనక్కు తెప్పించి, ఒక్కొక్కరికి లక్షల రూపాయలు బ్యాంకులలో వేస్తామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని, ఆర్థికలోటును భర్తీ చేస్తామని, రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తామని చెప్పారు. వీటిలో ఏ ఒక్కదానికీ బిజెపి కట్టుబడి లేదు. అధికారాన్ని చేపట్టి సంవత్సరం దాటే సరికే అవినీతిలో కాంగ్రెస్‌ను తలదన్నింది. ఆర్థిక నేరస్తుడైన లలిత్‌మోడీ విదేశాలకు తప్పించుకొని వెళ్ళటానికి ఆ పార్టీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరీ రాజే చట్ట విరుద్ధంగా సహకరించినట్లు స్పష్టమైంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భాగస్వామిగా ఉన్నారు. మహారాష్ట్రలో బిజెపి మంత్రులు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. నల్లధనం వెనక్కు తెప్పించటం గురించి మాట్లాడటం లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు దాచుకున్నవారి వివరాలు చెప్పి ఇంతకన్నా చేసేదిలేదని చెబుతున్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడు సాధ్యం కాదంటున్నారు. ఆర్థికలోటు భర్తీ చేస్తామన్నారు. వివిధ రకాల పద్దుల కింద కొంత మొత్తాన్ని సర్దుబాటు చేయటం మినహా లోటు భర్తీ చేయటానికి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తామనేది వట్టిమాటగానే మిగిలింది. వీటితోపాటు ఇంకా అనేక వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలాయి. ఎన్నికల వాగ్దానాలకే బిజెపి కొత్త అర్థం చెబుతున్నది. ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలో నెరవేర్చాలనే దానికి బదులుగా ఎన్నికలలో అధికారాన్ని సాధించటానికి సాధనాలుగా వినియోగించుకొని వదిలివేయటం అనే కొత్త అర్థాన్ని చెబుతున్నది. బీహార్‌కు ప్రకటించిన లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ కూడా ఎన్నికలలో బిజెపి అధికార సాధనకు వినియోగించుకోవటానికి మినహా ఆ రాష్ట్ర అభివృద్ధిపై బిజెపికి ఏ మాత్రం శ్రద్ధలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీహారుకు ఇస్తామని చెబుతున్న ప్యాకేజీకి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన వాగ్దానాలకు పట్టిన గతే పట్టినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా తోడ్పడుతుంది. దాన్ని సాధిస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు గ్రాంటుగా వస్తాయి. రాష్ట్రాలకు కేంద్ర సాయం మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది, సాధారణ కేంద్ర సాయం. రెండవది, అదనపు కేంద్ర సాయం. మూడవది ప్రత్యేక కేంద్ర సాయం. రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సాయం ద్వారానే ఎక్కువ వనరులు వస్తాయి. కేంద్రం ఇచ్చే నిధులలో ప్రత్యేకహోదా పొందిన రాష్ట్రాలకు 90 శాతం గ్రాంటుగానూ, 10 శాతం రుణంగానూ అందజేస్తారు. మిగతా రాష్ట్రాలకు 30 శాతం గ్రాంటుగానూ, 70 శాతం రుణంగానూ అందుతుంది. అందువలన ప్రత్యేకహోదా సాధిస్తే కేంద్ర నిధులు ఎక్కువ భాగం గ్రాంటుగా రావటం వలన రాష్ట్ర రుణభారం తగ్గుతుంది. కష్టమ్స్‌ సుంకాలు, ఎక్సైజ్‌ డ్యూటీలు, ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నులలో రాయితీలు లభిస్తాయి. ఫలితంగా పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఈ రాయితీలను ఉపయోగించుకొని వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయవచ్చు. పెరిగే ప్రభుత్వ ఆదాయాన్ని వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికపై పూర్తి చేయవచ్చు.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా సాధించటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి బదులుగా కేంద్రంతో బేరసారాలు జరపటం, రైతుల భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇవ్వటం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని, రాష్ట్రాభివృద్ధిని సాధిస్తానని చెబుతున్నది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటిస్తే, ప్రత్యేకహోదా సాధిస్తామని చెబుతున్నారు. వాస్తవాలేమిటో ప్రజలకు చెప్పకుండా మభ్యపెడుతున్నారు. కేంద్రంతో ఘర్షణకు దిగే విధంగా ప్రకటనలు చేయవద్దని ముఖ్యమంత్రి మంత్రులను, పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రతికూల వైఖరికి, వాగ్దాన భంగానికి వ్యతిరేకంగా ప్రజలను, రాజకీయపార్టీలను ఏకం చేసి కేంద్రంపై పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించటంలో అర్థమేమిటి? రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు, టిడిపి నాయకులకు రాష్ట్రాభివృద్ధికన్నా తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవటమే ప్రధానంగా ఉంది. పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఉన్నవారి ప్రయోజనాలు కేంద్రంతో ముడిబడి ఉన్నాయి. అందువల్లనే వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేంద్రంతో ఘర్షణ పడటానికి సిద్ధంగా లేరు. కేంద్రంతో ఘర్షణ పడటానికి బదులుగా అభివృద్ధి సాధించటానికనే పేరుతో రైతుల భూములు లాక్కోవటానికి ప్రభుత్వం పూనుకున్నది. రైతులలో భయాందోళనలు రేకెత్తించటం ద్వారా రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించటంతో పాటు, పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రతి జిల్లాలోనూ లక్ష ఎకరాల భూమిని సమీకరిస్తానని చెబుతున్నారు. ఏ పరిశ్రమ ఎప్పుడొస్తుందో తెలియకుండా భూములు సేకరించటం రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. వ్యవసాయరంగానికి వినాశకరంగా పరిణమిస్తుంది. అందువలన రైతుల భూములు లాక్కొని అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి చెప్పేమాట రాష్ట్రాభివృద్ధికి దారితీయదు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ప్రభుత్వంలోని ముఖ్యులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు భూములను, రాష్ట్ర సంపదను తమలో తాము పంచుకోవటానికి ఉపయోగపడుతుంది.
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గం రాష్ట్రాభివృద్ధికి దోహదం చేయదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించటానికి ఈ ప్రభుత్వం కృషి చేయదు. ప్రజలు, రాజకీయ పార్టీలు కదిలి ఐక్యంగా కృషి చేయటం ద్వారానే ప్రత్యేకహోదా సాధించటం సాధ్యమౌతుంది. ఆ విధంగానే రాష్ట్రాభివృద్ధిని సాధించగలం.
- ఎ కోటిరెడ్డి
Taags :

No comments:

Post a Comment