ఇద్దరూ ఇద్దరే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే వుంది. ప్రస్తుతానికి హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌పై స్వల్ప ఆధిక్యత కలిగివున్నట్లు ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. అమెరికా ఎన్నికల విధానంలో అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని అమెరికన్లు నేరుగా ఎన్నుకోరు. ఎలక్టొరల్ కాలేజీనే వారిని ఎన్నుకుంటుంది. మంగళవారం నాడు జరిగే ఎన్నికల్లో యాభై రాష్ట్రాల నుంచి, అలాగే కొలంబియా డిస్ట్రిక్ట్ నుంచి ఎలక్టొర్లను( ఎలక్టొరల్ కాలేజీ ప్రతినిధులను) పాపులర్ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికల సమయంలోనే తాము ఫలానా అధ్యక్ష అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఎలక్టొరర్లు ప్రతిజ్ఞ చేస్తారు. ఎన్నికైన తరువాత దానికనుగుణంగానే తమ అధ్యక్ష అభ్యర్థికి వారు ఓటు చేస్తారు. ప్రస్తుతం అమెరికా ఎలక్టొరల్ కాలేజీలో మొత్తం 538 స్థానాలు ఉన్నాయి. అధ్యక్ష పదవికి ఎన్నిక కావాలంటే ఎలక్టొరల్ కాలేజీలో కనీసం 270 మంది మద్దతు తప్ప నిసరి. ఇక ఎన్నికల ప్రచార తీరు తెన్నుల విషయానికొస్తే దొందూ దొందే అన్నట్లు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ వ్యవహరించారు. హిల్లరీ, ట్రంప్‌లలో ఎవరు గెలిచినా అమెరికాకు పట్టిన జబ్బును నయం చేస్తారనే విశ్వాసం తమకు లేదని పలువురు ఓటర్లు అభిప్రాయ పడ్డారు. న్యూయార్క్‌టైమ్స్,సిబిఎన్ న్యూస్ తాజాగా నిర్వహించిన ఎన్నికల సర్వేలో ఎన్నికల ప్రచార తీరుపై ఓటర్లు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తేలింది. ప్రచారంలో అమెరికా ప్రజలు నేడు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, నిజవేతనాలు పడిపోవడం, యుద్ధాలు వంటి కీలక సమస్యల ఊసే లేదు. సహజంగానే వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వున్న డెమొక్రాటిక్ పార్టీపై ప్రజల్లో ఆగ్రహం వుంటుంది. ఈ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తుండగా, ట్రంప్‌లోని దుర్లక్షణాలను ఏకరువుపెట్టి ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు హిల్లరీ ప్రయత్నించారు. డెమొక్రాట్ల పట్ల అమెరికన్ ఓటర్లలో వ్యతిరేకత ఇప్పుడే వచ్చింది కాదు. 2014లో అమెరికన్ కాంగ్రెస్ (ప్రతినిధుల సభ)కు జరిగిన ఎన్నికల్లోనే ఇది స్పష్టంగా బయటపడింది. ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లు ఏడు రాష్రాలను కోల్పోయారు. ఆమేరకు రిపబ్లికన్లు బలపడ్డారు. గత రెండు పర్యాయాల్లో ఎన్నికల సందర్భంగా ఒబామా చాలా హామీలు ఇచ్చాడు. వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యాడు. 2008లో మొదలైన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా ఇప్పటికీ కోలుకోలేకపోవడం ఆయన అసమర్థతగానే భావిస్తున్నారు. ఒబామా వారసు రాలిగా అధ్యక్ష బరిలోకి దిగిన హిల్లరీపై ఆ ప్రభావం పడింది. హిల్లరీ ఒబామా ప్రభుత్వంలో మొదటి నాలుగేళ్లు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో ఆమె చేసిన నిర్వాకాలు ఇప్పుడామెకు మైనస్ పాయింట్లయ్యాయి. ఆమె విదేశాంగ మంత్రిగా వున్న కాలంలోనే ఐఎస్‌ఐఎస్ (ఐసిస్) ఇరాక్‌లో పురుడుపోసుకుంది. అమె అధికారంలో వున్నప్పుడే లిబియా రాజధాని బెంఘాజీలో అమెరికన్ రాయబారి హత్యకు గురయ్యాడు. ఆమె హయాంలోనే అమెరికా రష్యా అధ్యక్షుడు పుతిన్ అగ్రరాజ్యం ఆట కట్టించాడు. అప్పుడే మధ్య ప్రాచ్యంలో అరబ్ దేశాలలో అమెరికా తొత్తు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాట్లు వెల్లువలా వచ్చాయి. రెండవ అంశం, హిల్లరీ విదేశాంగ మంత్రిగా వుండగా చేసిన అతిపెద్ద తప్పు అధికారిక సందేశాలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు తన వ్యక్తిగత ఇ-మెయిల్స్ వాడుకోవ డం. అధికారిక సందేశాలు పంపడానికి వ్యక్తిగత ఇ-మెయిల్స్ వాడకుండా అమెరికాలో నిషేధం వున్నది. దీనిని ఆమె బాహాటంగా ఉల్లంఘించారు. దీంతో ఎన్నిక లు మరో వారం రోజుల్లో జరగనున్నాయనగా ఆమె కేసును ఎఫ్‌బిఐ తిరగదోడింది. ఇది ఆమెకు రాజకీ యంగా పెద్ద ఎదురుదెబ్బ. మూడోది, 2008లో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం వల్ల నిజవేతనాలు పడిపోయి కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇది విశాలమైన మధ్య తరగతిలో ఆమెపట్ల వ్యతిరేకత పెంచింది. నాల్గవ అంశం, అమెరికన్ల కలలను నెరవేర్చడంలో హిల్లరీ కన్నా తానే మెరుగని ట్రంప్ విస్తృతంగా సాగిస్తున్న ప్రచారాన్ని డెమొక్రాట్లు దీటుగా తిప్పికొట్టలేకపోవడం. హిల్లరీ గెలిస్తే వాల్‌స్ట్రీట్ బ్యాంకర్ల ఏజెంట్‌గా వ్యవహరిస్తారని, ఆమెకు ఎన్నికల నిధులు వాల్ స్ట్రీట్ నుంచే వస్తున్నాయని ట్రంప్ చేస్తున్న ప్రచారానికి హిల్లరీ నుంచి సమాధానం లేదు. అమెరికాలో మితవాద రాజకీయాలకు ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉగ్రవాదం, మైనార్టీలపై విద్వేషం, శరణార్థుల సమస్య, అబార్షన్లపై నిషేధం, రిటైర్డు సైనికాధికారులకు రక్షణ, వర్ణ వివక్షను రెచ్చగొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ట్రంప్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో డెమొక్రాట్లు సరిగా వ్యవహరించలేకపోయారు. ఇవన్నీ హిల్లరీకి ప్రతికూలాంశాలే. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. రిపబ్లికన్ పార్టీకి వెలుపల వున్న ఒక వ్యక్తి అత్యున్నత స్థానానికి ఆ పార్టీ తరపున నామినేషన్ దక్కించుకోవడం చాలా మందిని ఆశ్చర్యపర చింది. రిపబ్లికన్ పార్టీ దివాళాకోరుతనానికి ఇదొక నిదర్శనం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ మోడల్స్‌తో కలిసి జులాయిగా తిరిగే వ్యక్తి రేపు దేశాధ్యక్షుడైతే అమెరికా ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయం. హిల్లరీ తరపున ఒబామాతో సహా ఆ పార్టీ అగ్ర నేతలు, సెలబ్రిటీలు పలువురు ప్రచారం చేయగా, ట్రంప్‌కు సొంత పార్టీ సీనియర్ల నుంచి మద్దతు కరువైంది. అయినా ఆయన ఒక్కడే ప్రచారం సాగించాడు. వివాదాస్పద ప్రకటనలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండేలా చూసుకున్నాడు. అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ బాగా పాతుకుపోయినందున ఇద్దరూ చెత్త అభ్యర్థులేనని తెలిసినా ఎవరికో ఒకరికి ఓటు వేయకతప్పని పరిస్థితి. ఇదీ ఘనత వహించిన అమెరికాలో ప్రజాస్వామ్యం పరిస్థితి. డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు ఎన్నికల గుర్తులో తేడాలే తప్ప విధానాల్లో పెద్ద తేడా ఏమీ లేదు. హిల్లరీ, ట్రంప్‌లలో ఎవరు గెలిచినా ఆమెరికా సామ్రాజ్యవాద యుద్ధాల్లో మార్పు వుండదు. రెండు పార్టీల వ్యవస్థను కూలదోస్తే తప్ప అమెరికన్లకు నిష్కృతి లేదు.
- కె గడ్డెన్న
No comments:
Post a Comment