| వీళ్ళు హీరోలా? జీరోలా? ||
*నోట్లరద్దుతో తీవ్ర ఆర్థిక అనిశ్చితి.. మోదీ, జైట్లీ ఆర్థికవేత్తలు కాదు
*ఉర్జిత్ జీ....ఆర్థికవేత్తగా నువ్వేం చేశావ్?..
*మిగతా దేశాల అనుభవాలు తట్టలేదా?
*500కు ముందే 2వేల నోటా?..
*సాధారణ పరిస్థితులకు 12 నుంచి 15నెలలు
— బ్యాంకు అధికారుల సమాఖ్య
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత పటేల్‌పై అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థికంగా తీవ్ర అనిశ్చితి నెలకొందని, నోట్ల మార్పిడి కోసం జనం క్యూ లైన్లలో నిలబడి పిట్టల్లా రాలిపోతున్నారని, పని ఒత్తిడి పెరగడంతో గత 12 రోజుల్లో దేశవ్యాప్తంగా 11మంది బ్యాంకు అధికారులు మరణించారని ఈ విపరిణామాలన్నింటికీ ఉర్జిత పటేల్‌దే బాధ్యత అని తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఇందుకు నైతిక బాధ్యతగా ఆయన సత్వరమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమాఖ్య ఉపాఽధ్యక్షుడు డాక్టర్ థామస్ ఫ్రాంకో ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ ఏమాత్రం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ విషయంలో మిగతా దేశాల అనుభవాలను, లేదంటే స్వయంగా తమ గత అనుభవాలను అయినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. 1978లో అప్పటి ప్రభుత్వం నోట్లరద్దుకు ఉపక్రమించినప్పుడు అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐజీ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారనే సంగతిని ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీగానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీగానీ ఆర్థిక వేత్తలు కారన్నారు. అయితే ఓ ఆర్థికవేత్తగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత పటేల్.. నోట్లరద్దు రూపంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంలో రోడ్‌మ్యాప్ కరువైందని, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ తీవ్ర గందరగోళ పరిస్థితికి, ఆందోళనలకు గురై సంభవిస్తున్న సామాన్య ప్రజల మరణాలకూ ఇదే కారణమని ఆరోపించారు. (ఆంధ్ర జ్యోతి)
No comments:
Post a Comment