Saturday, November 5, 2016

అదనపు వడ్డింపేనా?
Posted On: Saturday,November 5,2016
భారత ప్రజానీకంపై పన్నుల భారాలను అమాంతం తగ్గించేస్తుందంటూ పాలక పెద్దలు ఊదరగొట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధానంతో సామాన్యులకు పెద్దగా ఒరిగేదేమీ కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాల స్వయం నిర్ణయాధికార హక్కును హరించివేసి సమాఖ్య స్ఫూర్తికి హానీ చేస్తుందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్‌ ప్రకటించిన నాలుగు శ్లాబుల జిఎస్‌టి పన్ను రేట్లను విశ్లేషిిస్తే జనానికి పెద్దగా ఒరిగేదేమీలేదని తేటతెల్లమౌతోంది. కొత్త జిఎస్‌టి పన్ను రేట్లను కనీసం 5, 12, 18, 28 శాతాలు చొప్పున నాలుగు శ్లాబులుగా విభజించారు. రెండు రోజులుగా ఢిల్లీలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం ఆద్యంతం సందిగ్ధంతోనే ముగిసింది. అత్యంత కీలకమైన బంగారంపై పన్ను నిర్ణయాన్ని వాయిదా వేయడంతో పాటు, రాష్ట్రాల డిమాండ్లను కూడా పట్టించుకున్న దాఖలు కనిపించడం లేదు. ఏఏ శ్లాబుల్లో ఏఏ వస్తువులు చేర్చాలనే విషయంలోనూ, పన్ను వసూలు విధానంలోనూ సందిగ్ధం నెలకొన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా పాలకవర్గ మీడియాలో మాత్రం అంతా ఏకాభిప్రాయంతో సవ్యంగా సాగిపోయిందంటూ ప్రచారం చేయడం విడ్డూరం. ఆహార ధాన్యాలు వంటి నిత్యావసరాలను పన్ను నుంచి మినహాయింపు కల్పించినట్లు చెబుతూనే 'జీరో' మెలిక పెట్టడం నయవంచనగానే కనిపిస్తోంది. మినహాయింపు అంటే మినహాయింపూ కాదనీ, వాటిని సున్నా రేటులో ఉన్న వస్తువులుగా భావించాలని కేంద్రం చెబుతోంది. దానర్థం నిత్యావసరాలపై కూడా అవసరమైనప్పుడు పన్నులు బాదేందుకు ఐచ్ఛికాన్ని అట్టే ఉంచుకున్నారన్న మాట. అందుకే వీటిని సున్నా శాతం వస్తువులని ముద్దు పేరు పెట్టారు. ఆహార ధాన్యాలుండేది ఇందులోనే. ఇక మధ్యతరగతి ప్రజలు వినయోగించే రిఫ్రిజిరేటర్లు వంటి భారీ స్థాయి వినియోగ వస్తువులపై ప్రస్తుతం 26 శాతంగా ఉన్న పన్ను రేటును అలానే ఉంచాలని వివిధ రాష్ట్రాలు పట్టుబట్టినా చివరికి 28 శాతానికి చేర్చారు. రాష్ట్రాలకు చెల్లించేందుకు ఉద్దేశించిన పరిహార నిధిని పెంచాలా లేదా అనేది తర్వాత చెబుతున్నామన్నారు. అంటే ఆ రూపంలో సెస్‌లేసి భారం మోపే పోటుకత్తినీ కేంద్రం తన వద్దే ఉంచుకుందన్నమాటే. ఐదు శాతం పరిధిలో వంట నూనెలు, నూనెగింజలు, జీడిపప్పు, టీ, కాఫీ, ట్రాక్టర్లు వంటివి చేరే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం వీటిపై ఐదు శాతం వ్యాట్‌ కొనసాగుతోంది. అంటే జిఎస్‌టి విధానంలో ఒరిగిందేమీ లేదు. ఆందోళనంతా ఏమిటంటే వీటిని గనుక 12 శాతం శ్లాబుల్లో చేర్చితే ఏకాఎకిన ఏడు శాతం అదనపు భారం పడుతుంది. వంట నూనెలూ కొండెక్కుతాయి. చాలా రాష్ట్రాల్లో చౌక దుకాణాల్లో వీటిని రాయితీ కింద ఇస్తున్నారు. ఇక మీదట కేంద్రం ఎంత చెబితే అంత రేటుకే వీటిని అందించాల్సివుంటుంది. ఆ మేరకు పేదలపై భారాలు పడతాయి. ద్రవ్యోల్బణం రంకె పెడుతుంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ద్రవ్యోల్బణం తగ్గించేందుకే తీసుకొస్తున్నామన్న జిఎస్‌టి దానికి మరింత ఆజ్యం పోసే వీలుందన్న ఆందోళనలూ మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఔషధాలు, నూలు దుస్తులు, సైకిళ్లు వంటివి, కోటిన్నర లోపు టర్నోవర్‌ కలిగిన రెస్టారెంట్లకు ప్రస్తుతం ఐదు శాతం వ్యాట్‌, 6 శాతం ఎక్సైజ్‌ కలిపి మొత్తం 11 శాతమే పన్ను ఉండగా దీనిని 12 శాతం శ్లాబులో చేరిస్తే అదనంగా ఒక శాతం భారంపడినట్లే. దేశానికి వెన్నెముకగా కీర్తించే రైతన్నకు ధరాఘాతం తప్పేలా లేదు. ఎరువులను 18 శాతం శ్లాబుల్లోకి తీసుకొచ్చే యోచన కూడా ఆందోళన కలిగిస్తోంది. డిజిటల్‌ ఇండియా అంటూ ప్రచార హోరు వినిపిస్తున్న మోడీ సర్కార్‌ మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, వాటి అనుబంధ వస్తువులను 18 శ్లాబుల్లోకి తీసుకొచ్చి అందుబాటులో లేకుండా చేయడం విస్మయకరమే. ఇనుము, ఉక్కు, రెడీమేడ్‌ వస్తువులూ 18 శాతం శ్లాబుల్లోకి తీసుకురానున్నారు. వీటన్నింటిపై ప్రస్తుతం 5% వ్యాట్‌, 12.5% కేంద ఎక్సైజ్‌ సుంకం కలిపి 17.5% పన్ను వసూలవుతోంది. అంటే అదనంగా వినియోగదారులపై అర శాతం భారం పడినట్టే. మోటారు కార్లు, ఏసిలు, టివిలు, వాషింగ్‌ మెషిన్లు, ఫ్రిజ్‌లు, విద్యుత్‌ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, పానీయాలు కూడా 28 శ్లాబుల్లోకి తీసుకురానున్నారు. వీటిపై ప్రస్తుతం వ్యాట్‌ 14.5, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం 12.5 కలిపి 27 శాతం పడుతోంది. అదనంగా ఒక శాతం బాదేయడమే. చిన్నాపెద్దా తేడాలేకుండా అన్ని వర్గాలపైనా పన్ను మోతాదు పెరిగినట్లే కనిపిస్తోంది. వీటిని ప్రామాణిక పన్ను రేటు కింద పెడితే అనవసరంగా వ్యాపారులు లబ్ధిపొందుతారంటూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజెనెస్‌లో ర్యాంకుల గొప్పలు చెప్పుకునే నేతలే వల్లె వేస్తుండటం అశ్చర్యకరమనిపిస్తుంది. భారాల సంగతి అలా వుంచితే సంఘటిత వ్యవస్థగా మారిపోయిన రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌, ఇతర పన్నులు వసూలు చేసే ఉద్యోగుల ఉపాధి భద్రతపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఆందోళనలతోనే జిఎస్‌టికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా వారికి స్పష్టమైన హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడం దుర్మార్గకరం. ఇప్పటి వరకు పన్ను వసూలు చేస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను మదింపు చేస్తామని అరుణ్‌ జైట్లీ ప్రకటించారంటే ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీయడమే. ఒకవైపు ప్రజలపై భారాలు మోపడం, మరోవైపు ఉద్యోగుల భద్రతకు తిలోదకాలివ్వడం, ఇంకోవైపు రాజ్యాంగబద్ధమైన సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టుగా మారిన జిఎస్‌టిపై విస్తృత ప్రజా బాహుళ్య భాగస్వామ్యంతో చర్చలు జరపాల్సిన అవసరమెంతైనావుంది. ఉపాధి భద్రత కోసం ఉద్యమబాట పట్టిన పన్ను వసూలు ఉద్యోగులకు ప్రజలంతా బాసటగా నిలవాలి.

No comments:

Post a Comment