Sunday, November 13, 2016

 గంట ముందే కోటి జమ చేసిన బిజెపి #
*ఆధారాలతో సహా రుజువు చూపిన సిపిఐ(ఎం)
*ఈ నెలలో మొత్తం రూ. 3 కోట్లు డిపాజిట్‌
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ప్రకటించడానికి సరిగ్గా గంట ముందు బిజెపి పెద్ద మొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది. ఈ నెల 8న నరేంద్రమోడీ ప్రకటనకు ముందే బిజెపి బెంగాల్‌ రాష్ట్ర శాఖ ఎకౌంట్‌లో రూ. కోటి డిపాజిట్‌ చేసినట్టు సిపిఐ(ఎం) వెల్లడించింది. ఈ నెలలో మొత్తం రూ. 3 కోట్లను బిజెపి డిపాజిట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సిపిఐ(ఎం) ఎంఎల్‌ఏ, లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేత సుజన్‌ చక్రవర్తి శనివారం మీడియాకు చూపారు. మోడీ ప్రకటనకు ముందు బిజెపి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని వైట్‌ చేసుకుందని చెప్పారు. కోల్‌కతాలోని చిత్తరంజన్‌ అవెన్యూ వద్ద ఇండియన్‌ బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేసినట్టు పేర్కొంది. ముందుగా రూ. 60 లక్షలను బిజెపి డిపాజిట్‌ చేసింది. ఇవి అన్నీ 1000 నోట్లు. తరువాత మరో రూ. 40 లక్షలను డిపాజిట్‌ చేసింది. ఇందులో 500, 1000 నోట్లు ఉన్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం పేరుతో ఉన్న పాన్‌ కార్డు ఈ డిపాజిట్‌్‌ చేయడానికి ఉపయోగించింది. బిజెపి పశ్చిమబెంగాల్‌ శాఖ సేవింగ్‌ ఎకౌంట్‌ నెంబరు 554510034లో ఈ మొత్తం జమ అయినట్టు పేర్కొంది. అంతేకాకుండా ఈ నెలలో మొత్తంగా మూడు కోట్ల రూపాయిలను బిజెపి ఇదే అకౌంట్‌లో డిపాజిట్‌ చేయడం గమనార్హం. ఈ నెల మొదటిన 75 లక్ష రూపాయిలను డిపాజిట్‌ చేసింది. ఇందులో 500, 1000 నోట్లు ఉన్నాయి. తరువాత ఈ నెల 5న ఇదే అకౌంట్‌లో ఒక కోటి 25 లక్షలు రూపాయిలను డిపాజిట్‌ చేసింది. ఇవి కూడా 500, 1000 నోట్లు మాత్రమే. బిజెపితోపాటు దానికి సన్నిహితంగా ఉండేవారందరికీ నోట్ల రద్దు విషయం ముందే తెలిసిందని, వారు తమ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, మార్చుకున్నారని సిపిఐ(ఎం) తెలిపింది. కాగా, ఇది యాదృచ్ఛికంగానే జరిగిందని బిజెపి పేర్కొంటుంది. ఉప ఎన్నికలు ఉన్నందున ఆ మొత్తాన్ని తెచ్చామని, దానిని బ్యాంకులో జమ చేశామని బిజెపి తెలిపింది. అయితే బయటపడింది కోటి మాత్రమేనని, మోడీ ప్రకటనకు గంట ముందు ఇంత పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్‌ చేయడం యాదృచ్చికం ఎలా అవుతుందని సిపిఐ(ఎం) ప్రశ్నించింది. మిగిలిన రాష్ట్రాల్లో బిజెపి అకౌంట్లను కూడా తనిఖీ చేయాలని సిపిఎం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. బిజెపికి పెద్దగా పట్టులేని రాష్ట్రంలోనే మూడు కోట్లు డిపాజిట్‌ చేస్తే, బిజెపి ఆధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ, పట్టు ఉన్న రాష్ట్రాల్లోనూ బిజెపి ఇంకా ఎంతగా అవినీతికి పాల్పడి ఉంటుందో ఊహించుకోవచ్చని సిపిఎం తెలిపింది.

No comments:

Post a Comment