Sunday, November 27, 2016



|| రెడ్‌ సెల్యూట్‌ కామ్రేడ్‌ కాస్ట్రో ||
ఒక మహా వృక్షం నేలకొరిగింది. ఒక మహా మనిషి భౌతిక జీవితం నుండి నిష్క్రమించాడు. ఫైడల్‌ కాస్ట్రో అనే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఇకపై ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగానే మిగులుతాడు. 90 ఏళ్ల నిండు జీవితాన్ని అత్యంత ఆదర్శవంతంగా, ప్రయోజనకరంగా గడిపిన కాస్ట్రో మరణించారన్న వార్త ప్రపంచ పీడిత ప్రజలను దిగ్భ్రాంత పరిచింది. దేశాధినేతలే కాదు ప్రపంచమంతటా ప్రజలు ఆ కమ్యూనిస్టు నేత మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కోటిమంది ప్రజలున్న ఒక చిన్న దేశమైన క్యూబా నేత మరణ వార్త ప్రపంచ వ్యాపితంగా ఇంతటి ప్రభావం చూపించడానికి కారణం ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆ సిద్ధాంతం కోసం ఆటుపోట్లనెదుర్కొని ఆయన నిలబడిన తీరు, తను నిలబడడమే కాకుండా ''రానీ రానీ కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌ శాపాల్‌ రానీ'' అని శ్రీశ్రీ రాసినట్లు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు జరిగినా సామ్రాజ్యవాదానికి దాసోహం కాబోము, సోషలిజాన్ని విడనాడబోము అని తన దేశ ప్రజలను నిలబెట్టిన తీరు. మంకాడా తిరుగుబాటు విఫలమైన తరువాత అరెస్టయి కోర్టు విచారణ నెదుర్కొన్న కాస్ట్రో సామ్రాజ్యవాద పదఘట్టనలకింద పడి నలిగిపోతున్న క్యూబన్ల విమోచన కోసం తను చేసిన పని తప్పుకాదనీ, 'చరిత్ర తనను విముక్తి చేస్తుంది'' (ఆరోపణలనుండి) అన్నాడు. కానీ వాస్తవానికి నేడు చరిత్ర కాస్ట్రోకు జేజేలు పలుకుతోంది. అమెరికా మద్దతు గల బాటిష్టా నిరంకుశత్వం నుండి, తన ముఖ్య స్నేహితుడైన చే గువేరాతో కలిసి క్యూబా ప్రజలను విముక్తి చేసినందుకు...సోషలిజం వినా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు మరో ప్రత్యామ్నాయం లేదని నమ్మి క్యూబాలో సోషలిజాన్ని నిర్మించినందుకూ...చిన్న దేశంలోని సోషలిజాన్ని ఎత్తుకు పోడానికి సామ్రాజ్యవాద గద్ద చేసిన ప్రయత్నాలను ప్రజా మద్దతుతో తిప్పి కొట్టినందుకూ...చివరికి అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి దాని 'పెరటి దొడ్డి'లోనే గండి కొట్టినందుకు చరిత్ర కాస్ట్రోను జై కొడుతూనే ఉంటుంది.
90 ఏళ్ల జీవితంలో కాస్ట్రో సాధించిన విజయాలు చిన్నవి కావు. దశాబ్దాల అమెరికా దిగ్బంధాన్ని, సైనిక బెదిరింపులను తట్టుకుని క్యూబాలో సోషలిజాన్ని కాపాడ్డంలో ప్రధాన పాత్ర పోషించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అలీనోద్యమాన్ని నిలపడంలో కీలక భూమిక నిర్వహించాడు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానంతరం ప్రపంచ వ్యాపితంగా సోషలిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకంగా వీచిన హోరుగాలిని అధిగమించి 'సోషలిజమో, మరణమో' అన్న ఒకే నినాదం వెనుక క్యూబా ప్రజలను సమీకరించాడు. ఆ విధంగా 'సామ్రాజ్యవాదం అజేయం కాదు' అని మొట్టమొదటగా చిన్న క్యూబాలో నిరూపించాడు. ఒక వైపు పశ్చిమ దేశాల దిగ్బంధాన్నీ, వేధింపులనూ ఎదుర్కొంటూనే మరోవైపు ప్రపంచంలోని ప్రజా ఉద్యమాలకు ధైర్యంగా మద్దతిచ్చాడు. నమీబియా స్వాతంత్య్ర పోరాటానికీ, అనేక ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల విముక్తి ఉద్యమాలకూ కాస్ట్రో నాయకత్వంలో క్యూబా అందించిన సహకారం ఎనలేనిది. వైద్య రంగంలో క్యూబాను ప్రపంచానికే ఆదర్శంగా, కార్పొరేట్‌ వైద్యానికి నిజమైన ప్రత్యామ్నాయంగా నిలిపిన ఘనత కాస్ట్రోదీ, ఆయన సహచరుడు అమరుడైన చే గువేరాదే. మానవాభివృద్ధిలోనూ, క్రీడల్లోనూ, సాంస్కృతిక రంగంలోనూ సోషలిస్టు క్యూబా ఒక మహా శక్తిగా మారడానికి కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషి కారణం. సామాన్య కుటుంబం నుండి వచ్చి అసమాన్య లక్ష్యాలు సాధించిన కాస్ట్రో నిరాడంబరుడు. గొప్ప కమ్యూనికేటర్‌. మార్క్సిజం-లెనినిజం పట్ల నిబద్దత గల కమ్యూనిస్టు. ఆయన జీవితం, కృషి సోషలిజం సాధన కోసం పోరాడే ప్రజకు నిత్యం స్ఫూర్తి నిస్తుంది.
ఆ మహత్తర విప్లవ యోధునికివే మా జేజేలు!
కమ్యూనిస్టు వీరునికిదే మా రెడ్‌ సెల్యూట్‌!!

No comments:

Post a Comment