Wednesday, September 9, 2015

భ్రమ-వాస్తవం Posted On Thu 10 Sep

భ్రమ-వాస్తవం

Posted On Thu 10 Sep 00:04:08.682873 2015
       తెగించి పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామిక వేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అయోమయానికి, గందరగోళానికి అద్దం పడుతోంది. పెట్టుబడిదారులతో పాటు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నష్టాలను భరించే శక్తి ప్రైవేటు రంగానికే ఉంటుందని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ప్రధానమంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు ఆశావహ ధృక్పథాన్ని కాకుండా దానికి భిన్నమైన నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తుండటం గమనార్హం. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో దేశం రూపురేఖలు మారిపోనున్నాయంటూ కొద్దిరోజుల క్రితం వరకూ ఊదరగొట్టిన ప్రచారానికి కూడా తాజా వ్యాఖ్యలు భిన్నం. గతంలో ఏ ప్రధాన మంత్రీ పర్యటించని విధంగా అనేక దేశాలను చుట్టివచ్చిన ఘనత నరేంద్రమోడిది! ఆ పర్యటనలతోనే పెట్టుబడిదారులు భారతదేశానికి క్యూ కట్టేస్తున్నారన్న విధంగా మోడీ, ఆయన వందిమాగాతులు గోబెల్స్‌ను మించిన ప్రచారం సాగించారు. తిమ్మిని బమ్మి చేస్తూ ఏడాదికి పైగా సాగిన ఈ ప్రచారం తరువాత దేశంలో భిన్నమైన వాస్తవం ఆవిష్కృతమైంది. విదేశీ పర్యటనల పేరిట వందల కోట్ల ధనం వృథా కావడం తప్ప సాధించినదేమీ లేదన్న విషయం ప్రజలకు అర్థం కావడం ప్రారంభమైంది. మరోవైపు మోడి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని విధాలా సహకరించిన కార్పొరేట్‌ శక్తులూ అసంతృప్తి రాగాలు ఆలపిస్తుండటంతో ప్రధాని నైరాశ్యంలో పడినట్లుంది. దాని వల్లనే నష్టాలను భరించడానికి సిద్ధ పడాలంటూ పారిశ్రామిక వేత్తలకు ఇచ్చి ఉంటారని భావించాలి.
లాభాలు వస్తాయంటే ఏం చేయడానికైనా, ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధ్దపడే పెట్టుబడి నష్టాలు వస్తాయంటే ఆమడ దూరంలో ఉంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. లాభాల పంట కోసం వ్యాపారాలు చేసే పెట్టుబడిదారులు తెలిసి తెలిసీ నష్టాల ఊబిలో దిగుతారని భావించడం అత్యాశే! వందలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడుల విషయంలో లాభం గురించి కాకుండా మరో విధంగా ఆలోచించాలని చెప్పడం పులిని గడ్డి తిని బతకమని చెప్పినట్లే ఉంటుంది. అయినా ప్రధాని ఈ తరహా ప్రకటన చేశారంటే రానున్న రోజుల్లో మరింతగా ముప్పు ముంచుకు రానుందనే అర్థం. వాస్తవానికి కొంత కాలంగా ఈ దిశలోనే ప్రయాణం చేస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను కమలనాథులు మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవాలను దాచిపెట్టి నేల విడిచి సాము చేస్తూ అవే సత్యాలని దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కార్పొరేట్‌ మీడియా కూడా దీనికి సహకరించింది. అయితే, నిజాలను ఎల్లకాలం దాచి ఉంచడం ఎవరికీ సాధ్యం కాదు. కళ్లముందు కనపడుతున్న అంశాలే వాస్తవాలేమిటో వివరిస్తాయి. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వృద్ధి రేటు 8.5 శాతం దాటడం ఖాయమంటూ మోడి ఆయన మందీ మార్భలం ఊదరగొట్టింది. ఆర్థిక రంగ నిపుణులు అప్పట్లోనే ఇది వాస్తవ దూరమైన అంచనా అని చెప్పినా అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాలేదు. లక్ష్యాన్ని సాధించి చూపుతామంటూ మాటలను కోటలు దాటించారు. కాని గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు మోడి బృందం ఊదుతున్న బుడగల్లోని గాలిని తీసేస్తున్నాయి. తాజాగా యుబిఎస్‌, మూడీస్‌ సంస్థలు భారతదేశ వృద్ధిరేటు 7 లేదా 7.1 శాతానికి మించకపోవచ్చని ప్రకటించాయి. తయారీ రంగ ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా వెనకబాటే పట్టింది. ప్రజల కొనుగోలు శక్తీ నానాటకీి తీసికట్టుగా మారుతుంటే దేశంలో కొనుగోళ్లు ఏ మాత్రం జోరందుకుంటాయి? కొనుగోళ్లు లేకపోవడంతో కార్ఖానాల మూసివేత బిజెపి పాలనలోనూ కొనసాగుతోంది. కొత్త ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టిన మాటలు, ఆచరణలో ఉన్నవి ఊడగొట్టడమేనని తేలిపోయింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అరకొరగా ఉన్న ఇతర ఉత్పత్తుల ఎగుమతులూ మందగించడంతో ఆర్భాటపు వృద్ధి రేటు అసాధ్యమని తేలిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనైనా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సి ఉంది. ఎండమావుల వెంట పరుగులు తీయడం బదులు దేశ ప్రజల కొనుగోలు శక్తిని మెరుగు పరచడానికి తక్షణ కార్యాచరణకు సిద్ధం కావాలి. ఉపాధి హామీ వంటి చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశ పూర్వకంగా నీరు గార్చడం వంటి చర్యలను తక్షణం విడనాడలి. దేశంలోని కార్మికవర్గం సెప్టెంబర్‌ 2వ తేదీన జరిపిన సమ్మె సందర్భంగా ముందుకు తెచ్చిన డిమాండ్లు నెరవేర్చడం కేవలం కార్మికవర్గ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు. ఆ డిమాండ్లు నెరవేరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. దేశమంటే కార్పొరేట్లు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా అన్న విషయం మోడి సర్కారు తలకెక్కితే పరిస్థితి మారుతుంది. లేకుంటే కొద్ది మంది శతకోటీశ్వరుల ఖజానాలు నిండవచ్చునేమోగాని ఎంత మొత్తుకున్నా దేశ ఆర్థిక వ్యవస్థ ఉరకలు వేయడం సాధ్యం కాదు.
Taags :

No comments:

Post a Comment