Tuesday, October 11, 2016

భూ బకాసురులు

భూ బకాసురులు
5,400 ఎకరాల ప్రభుత్వ భూమి యథేచ్ఛగా ఆక్రమణ
అత్యధికంగా 'కన్నేగంటి' టిడిపి, వైసిపి నేతలూ ఆక్రమణదారులే
కొలనుకుదురులో అనుమతి లేకుండా రొయ్యల గుంటల
అధికారులకు భారీగా ముడుపులు?
భూమి విలువ రూ. 150 కోట్లు
'ప్రజాశక్తి' పరి'శోధన'
ప్రజాశక్తి-మనుబోలు
కనుచూపు మేర ప్రభుత్వ భూములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. 5,400 ఎకరాలు.. వాటిపై భూ బకాసురుల కన్ను పడింది. అంతే అమాంతంగా ఆక్రమించేశారు.. అధికారులను లోబరుచుకున్నారు... ఎంచెక్కా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు... రొయ్యల గుంట సాగుకు దిగారు.. అధికారులకూ లంచాలను విదిల్చారు.. సుమారు 20 ఏళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఎక్కువ భాగం ముఖ్యమంత్రి పేషీ స్థాయిలో పలుకుబడి ఉన్న కన్నేగంటి సీఫుడ్స్‌ ఆక్రమించింది. తలా పాపం తిలా పిడికెడు అన్నట్టు టిడిపి, వైసిపి నాయకులూ భూములను ఆక్రమించారు. మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామంలో జరుగుతున్న భూబాగోత కథా కమామీషు ఇది...
మండలంలోని కొలనుకుదురు గ్రామంలో ప్రభుత్వ భూములను బడా బాబులు ఆక్రమించారు. గ్రామంలో 521-సిలో 2,400 ఎకరాలు, అదే సర్వే నెంబరులోని సబ్‌ డివిజన్లలో మరో 3,053 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 5,453 ఎకరాలు. 1990 వరకూ ఈ భూములు ఎందుకూ పనికి రాకుండా ఉండేవి. ఉప్పు నేల కావడం, నీటి వసతి లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. 1995లో ఈ భూమిలో 70 మంది మాజీ సైనికులకు 500 ఎకరాలను పంపిణీ చేశారు. రెండు విడతల్లో ఒకసారి 500 ఎకరాలను, మరోసారి వెయ్యి ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. వారికి పట్టాలిచ్చారు. భూములు మాత్రం చూపలేదు. కొలనుకుదురు బంగాళాఖాతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర పరివాహక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో రొయ్యల సాగుకు అనుకూలం. దాంతో బడాబాబుల కన్ను పేదలకిచ్చిన భూములతోపాటు మిగిలినవాటిపైనా పడింది. లీజు పేరుతో పేదల నుంచి భూమిని తీసుకున్నారు. వారికిచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఎకరా మూడు లక్షల రూపాయలు. ఈ లెక్కన ఈ భూముల విలువ రూ. 150 కోట్లు. 1990-95లో గుంటూరు, విజయవాడకు చెందిన వారు, జిల్లాకు చెందిన టిడిపి, కాంగ్రెస్‌ (ప్రస్తుతం వైసిపి) నాయకులు భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. విజయవాడకు చెందిన కన్నేగంటి సీఫుడ్స్‌ వారు ఏకంగా 400 ఎకరాలను దున్నేశారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి, ఈదగాలికి చెందిన బడా బాబులు, ఎన్‌డిసిసి మాజీ ఛైర్మన్‌ అనుచరులు 1000 ఎకరాలను, పూడిపర్తి పెద్దోళ్లు 500 ఎకరాలను ఆక్రమించారు. అల్లూరు మాజీ ఎంఎల్‌ఎ, ప్రస్తుత టిడిపి నాయకుని అనుచరులు మరో 1000 ఎకరాలను కబ్జా చేశారు. కబ్జాదారుల్లో వైసిపికి చెందిన ముఖ్యస్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారంతా రెవెన్యూ అధికారులను లోబరుచుకున్నారు. ఆ భూములకు తమ పేర్లపై పాసుపుస్తకాలు పుట్టించుకున్నారు. ఎంచెక్కా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఫలితంగా అధికారులకు భారీగా ముడుపులు ముట్టచెప్పారు. గూడూరు డివిజన్లో 2002లో పని చేసిన ఓ రెవెన్యూ డివిజన్‌ అధికారి (ప్రస్తుతం విశ్రాంత అధికారి) రూ.5 లక్షలు దండుకుని రొయ్యల సాగుకు అనుమతి ఇచ్చినట్టు అప్పట్లో ఆరోపణలు వెల్తువెత్తాయి. ఆక్రమణదారులు 20 ఏళ్ల నుంచి రొయ్యల సాగు చేస్తున్నారు. సముద్రం నుంచి ఒక కాలువను తవ్వి గుంటలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రొయ్యల సాగుకు ఎవరూ అనుమతి తీసుకోకపోవడం గమనార్హం.ఈ మొత్తం భూములకు సంబంధించిన రికార్డులు మాయమైనట్టు తెలుస్తోంది.
మాజీ సైనికులకు శఠగోపం
గ్రామంలో 521-సిలో 5,453 ఎకరాల్లోని 70 ఎకరాలను 1995లో 70 మంది మాజీ సైనికులకు 500 ఎకరాలను పంపిణీ చేశారు. ఆక్రమణదారులు మాజీ సైనికుల నుంచి ఎకరా రూ. 3 లక్షల వంతున కొనుగోలు చేశారు. వాస్తవానికి డి ఫారం పట్టా అయినందున కొనుగోలు చేయకూడదు. అమ్మకూడదు. అందుకు విరుద్ధంగా ఇక్కడ జరిగింది. ప్రస్తుతం డీ రిజిస్ట్రర్‌ కన్పించడం లేదు. ఆక్రమణదారులు రొయ్యల సాగుకు దిగారు. పనిలో పనిగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు తాము సైనికుల భూమిని కొనుగోలు సాగుచేసుకున్నామంటూ కథలు చెబుతున్నారు. ఇక్కడ సరైన హద్దులు లేకపోవడమే ఇందుక్కారణం.
అడంగల్‌లో పేరు నమోదుకు రూ. 20 వేలు
మండలంలోని కొలనుకుదురు 521-సిలోని భూములకు రెవెన్యూ అధికారులు రూ. పది వేల నుంచి 20 వేలు దండుకుని అడంగల్‌లో పేరు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎకరాలకు ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేసి ఉన్నారు. ప్రభుత్వ భూములకు ఎన్‌ఒసిలు మంజూరు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రభుత్వ భూమికి పట్టా భూమి అని ఇస్తే లక్షల్లో ముడుపులు వసూలు చేస్తున్నారు. సుమారు 300 ఎకరాలు మినహా మిగతా భూములకు ఇలాగే ఇచ్చేశారు.
శిస్తు వసూలు లేదు...అంతా దండకాలే...
వ్యవసాయ భూములకు ఎకరాకు రూ. 200 వంతున శిస్తు వసూలు చేస్తారు. ఆక్వా సాగుకు రూ. 500 వసూలు చేయాలి. కొలనుకుదురు గ్రామంలోని ఆక్వా భూములకు రూ. 500 లెక్కన శిస్తు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఈ విషయమై విఆర్‌ఒ నర్మదను వివరణ కోరగా తాము శిస్తూ వసూలుకు వెళితే ఎవరూ ఇవ్వడం లేదని చెప్పారు. పట్టా భూములున్న వారు కడుతున్నారని తెలిపారు. శిస్తు కొందరు కట్టడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. 
తహశీల్దారు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం 
2011లో తహశీల్దారు వెంకట నారాయణమ్మ కన్నేగంటి సీఫుడ్స్‌ భూములను సర్వే చేశారు. వారు సాగు చేస్తున్న రొయ్యల భూముల్లో సుమారు 54 ఎకరాలు ఆక్రమించినవేనని తేల్చారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. అలా ఫిర్యాదు చేశారని ఆ తహశీల్దారుకు అప్పట్లో ఉన్నతాధికారులు మొట్టికాయలు వేశారని అప్పట్లో చర్చనీయాంశమైంది.
పేదల భూములు 'కన్నేగంటి' పాలు
2000లో సర్వే నెంబరు 862 లో బద్దెవోలుకు చెందిన సలాది సాయి, సాయికృష్ణలకు సుమారు 5 ఎకరాల భూమికి పట్టాలిచ్చారు. మనుబోలుకు చెందిన ఆదిమూలం భవానీ, కన్నవరం మునెమ్మలకు 1995లో రెండున్నర ఎకరాల చొప్పున భూములు ఇచ్చారు. ఆ భూములను కన్నేగంటి సీఫుడ్స్‌ వారు ఆక్రమించారు. సర్వేలో ఆక్రమించారని తేలినా ఆ భూములను పేదలకు చూపలేదు. బాధితులు ప్రతి కలెక్టర్‌కూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని వారు చెప్పారు. ఆ కంపెనీకి ముఖ్యమంత్రి పేషీ స్థాయిలో పలుకుబడి ఉందని తామేమీ చేయలేమని ఉన్నతాధికారులు అంటున్నట్టు సమాచారం.
టిడిపి నాయకుల చేతల్లోనూ..
మండలంలోని 521-సిలో కొలనుకుదురు, బద్దెవోలు, కట్టువపల్లి ఇతర ప్రాంతాలకు చెందిన 500 మందికి భూములు పంచి ఉన్నారు. పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నారు. వారికి భూమిని చూపిన దాఖలాలు లేవు. అధికార పార్టీకి చెందిన బడానాయకులు ఆ భూములను ఆక్రమించి ఉన్నారు. గతంలో ఆ భూములను ఎస్‌బిక్యూ ఫ్యాక్టరీకి ఇచ్చారు. ఆ భూముల్లో రొయ్యల సాగుకు ఇబ్బందిగా మారుతుందని అధికారులపై ఆక్రమణదారులు రాజకీయ ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆ ఫ్యాక్టరీ చిల్లకూరు మండలానికి తరలి వెళ్లింది.
అనుమతి లేకనే ఆక్వా సాగు
మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామంలో 521-సిలోని భూములకు ఆక్వా సాగుకు అనుమతి లేదు. ఆక్వా సాగు చేయాలంటే తప్పని సరిగా అనుమతి ఉండాలని మత్స్యశాఖ జెడి సీతారామరాజు చెప్పారు. ఫ్రెష్‌ వాటర్‌లో సాగు చేయాలంటే ఎటువంటి అనుమతులూ ఉండాల్సిన అవసరం లేదు. కోస్టల్‌ ప్రాంతాల్లో సముద్రపు నీటితో, బ్రాకెట్‌(నిల్వ) నీటితో సాగు చేయాలంటరా ఆ శాఖకు చెందిన జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం వారు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. నివేదికను తయారు చేస్తారు. నివేదికను చెన్నరులోని కోస్టల్‌ ఎగో కల్చర్‌ అథార్టీకి పంపుతారు. వారు పరిశీలించి అనంతరం హెక్టార్‌కు రూ. 500, 5 హెక్టార్లు దాటితే రూ.2 వేల నుండి 3 వేల వరకు నగదు కట్టించుకుని అనుమతి ఇస్తారు. ఇక్కడ ఎలాంటి అనుమతీ లేకపోవడంతో అధికారులు తనిఖీల పేరుతో ముడుపులు దండుకుని అవినీతికి పాల్పడుతున్నారు. గతంలో ఓ ఫిషరీస్‌ అధికారి ఈ ఆక్వా రైతులను బెదిరించి ముడుపులు దండుకున్న సంఘటనలూ ఉన్నాయి.

No comments:

Post a Comment