Friday, December 4, 2015

Prajasakti

Home / Editorial / PrajaVani బీహర్‌ను చూసి నేర్చుకొండి Posted On Thu 03 Dec 23:59:58.332357 2015                   ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది కుటుంబాలను మద్యం మహమ్మారి పట్టి పీడిస్తోంది. లక్షలాది కుటుంబాలను సర్వనాశనం చేస్తోంది. దీని బారినపడిన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. పాలకుల పుణ్యమా అని తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు దొరకని మారుమూల గ్రామాల్లో సైతం నేడు మద్యం ఏరులై పారుతోంది. బడులు, గుడుల చెంతనే మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. మందు బాబుల ఆగడాలు శతిమించుతున్నాయి. మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో అన్ని వర్గాలకు చెందిన ఆబాలగోపాలం ఈ వ్యసనానికి దాసోహం అవుతున్నారు. విచ్చలవిడిగా మద్యం లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. భారతదేశ, ప్రపంచ భవిష్యత్తు యువతేనని, ప్రపంచంలోని ఏ ప్రభుత్వమైనా వారికే మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పాలకులు ఉద్ఘాటిస్తున్నారు. మరి అలాంటి యువత మద్యానికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నేటి యువత మద్యం సేవించడం ఫ్యాషన్‌గా భావిస్తోంది. పిన్న వయసులోనే యువత వ్యసనాలకు బానిసలుగా మారుతుండటం అత్యంత దురదష్టకరం. మద్యానికి అలవాటు పడ్డ యువత పీకలదాకా తాగి, ఆ మత్తులో ఒంటరి మహిళలను అల్లరి చేస్తున్నారు. వారిపై అకత్యాలకు పాల్పడుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. మరోవైపు దినసరి కూలీలు తమ అల్పాదాయంలో సింహ భాగం మద్యానికే ఖర్చుచేస్తున్నారు. ఫలితంగా వారి కుటుంబాలలోని మహిళలు, పిల్లలు అర్ధాకలితో జీవితాన్ని నెట్టుకు రావాల్సిన పరిస్థితి. ఇలాంటి నీచ పనులకు ప్రభుత్వాలు పూనుకోవడం సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ మద్యం పాలక పార్టీలకు వరంగా మారుతోంది. ఖజానా నింపుకోవడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌ నుంచి ఆ రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధిస్తున్నట్లు ఇటీవలే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా అక్కడి మహిళల జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగించారు. ఆ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ప్రదర్శించాలి. తద్వారా లక్షలాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలి. - బట్టా రామకష్ణ దేవాంగ, సౌత్‌ మోపూరు, నెల్లూరుజిల్లా.

No comments:

Post a Comment