Pages

Wednesday, July 15, 2015

vyasam

మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రజాస్వామ్యీకరించాలి

Posted On Wed 15 Jul 22:44:52.204421 2015
               ''స్వామ్యం అంటే పరిపాలన. మన ప్రాచీన రాజనీతి శాస్త్ర గ్రంథాలలో ఈ కారణం చేత రాజుకు ''స్వామి'' అనే పేరు పెట్టబడింది. పరిపాలనలో అధికారాన్ని వహించే మంత్రులను, వివిధ శాఖల అధ్యక్షులను, ఉన్నత ఉద్యోగి వర్గాన్ని అతడు నియమించేవాడు. వారు అతనికి లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూండేవారు. అందుచేత ''స్వామ్యం'' అతనిదిగా ఉండేది. అతనిపై అధికారాన్ని వహించే వారెవరూ ఉండేవారు కారు. ఈ కారణంగా రాజు నిరంకుశుడయ్యాడు. ప్రజలను పీడించుకుతిన్నాడు. అంత్ణపుర కలహాలతో, యుద్ధాలతో, విలాసాలతో ప్రజా సంక్షేమాన్ని మరచి పాలించాడు.
ప్రజాస్వామ్యంలో స్వామ్యం ప్రజలది. పరిపాలనా రంగంలో ప్రధానాధికారాలను వహించేవారిని ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నుకుంటారు. వీరెవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరు. ప్రజల తరఫున వీరు పరిపాలన సాగిస్తారు. ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం తుది అధికారం ప్రజలదే అయినా వారు దానిని చెలాయించలేరు. వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే తుది అధికారాన్ని చెలాయించ గలుగుతున్నారు. రాజరికంలో మాదిరిగానే ఇక్కడ కూడా పాలకులపై నియంత్ర ణాధికారం ఎవరికీ లేకపోవ డం వల్ల రాజులకు మల్లే ఈ ప్రజాప్రతినిధులు కూడా నిరంకుశులై రాజకీ యాన్ని భ్రష్టు పట్టిస్తు న్నారు. ఈ నేపధ్యంలో 'స్వామ్యంపై అపో హలు తలె త్తాయి. వీటిపై శతాబ్దాలుగా చర్చ జరుగు తూనే ఉంది. మంత్రులు, ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, తదితర పాలకులు పాలితులైన ప్రజలకు లోబడి.. ప్రజాభిప్రాయానుసారం వారి దైనందిన వ్యవహారాలు సాగించాలనేది ఉన్న అపోహలలో ఒకటి. ఇది వాంఛనీయం కాదని, సాధ్యం కూడా కాదని ఆచార్య మామిడిపూడి వేంకటరంగయ్య గతంలో బలమైన వాదనలు వినిపించారు. వారి ప్రకారం శాసనాలు చేసి, వాటిని అమలుపరిచి, వాటికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని శిక్షించి, శాంతిభద్రతలను రక్షించి, ప్రజాభ్యుదయానికి కావలసిన చర్యలన్నిటినీ తీసుకోవడం పాలకుల కర్తవ్యం. దీన్ని నిర్వహించడంలో వారు సర్వస్వతంత్రులుగా ఉండడం అవసరం. ఇందులో వారు ప్రజల అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోవచ్చు. కానీ పరిపాలనను సాగించడంలో తుది నిర్ణయాలను తీసుకునే అధికారమూ, బాధ్యతా పాలకులదే గాని పాలితులదికాదు. ఈ నిర్ణయాలు తమకు నచ్చినా నచ్చకపోయినా పాలితులగు ప్రజలు వాటికి లోబడవలసిందే. వాటిని సవరించవలసిందిగా వారు భావిస్తే ఎన్నికలలో వాటిని సవరించడానికి సిద్ధపడే వారిని పాలకునిగా ఎన్నుకోవడమే వారి విధి. అంతవరకు చట్టాలకు లోబడి ఓపికపట్టి ఉండడం వారి కనీస ధర్మం. ప్రతి వ్యక్తికీ వైద్యుని ఎన్నుకునే హక్కు ఉన్నదే. కానీ ఎన్నుకున్న తర్వాత వైద్యుని సలహా మేరకు అతడు ప్రవర్తించితేగాని అతని రోగం కుదరదు. కొంతవరకు పాలకులు, పాలితుల మధ్య ఉండదగిన సంబంధం ఇలాంటిదే. పాలకులను ఎన్నుకొన్న తర్వాత వారి విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని వేంకటరంగయ్య పై విధంగా పేర్కొన్నారు.
కానీ ఆచరణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ నేతా వ్వవహరించడంలేదు. నేతలు శాసనాలు చేయడంలోనూ, వాటిని అమలుచేయడంలోనూ పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. తమకు, తమవారికో న్యాయం, ప్రజలకో న్యాయమన్నట్లు తమ అధికారం, వ్యాపారాలు, సంక్షేమం దెబ్బతినిపోకుండా రాజ్యాంగ యంత్రాన్ని ఉపయోగింకుంటున్నారు. చట్టబద్ధంగా ఎవరైనా తమకు విరుద్ధంగాపోతే, ప్రజాస్వామ్యయతంగా తమ విధానాలను వ్యతిరేకిస్తే అటువాంటివారిని శిక్షిస్తున్నారు. ఇదే వారి కర్తవ్యంగా ఉంటోంది. చట్టపరమైన, రాజ్యాంగపరమైన పరిమితుల్లో ప్రజలు నోరెత్తినా, ఉద్యమించినా లాఠీలతో కుళ్లబొడిపిస్తున్నారు. అవసరమైతే కాల్చిపడేస్తున్నారు. ఒకసారి ఓటేసి ఎన్నుకున్న పాపానికి మధ్యలో చేసేదేమీలేక ఐదేళ్లూ ప్రజలు వారిని భరిస్తూనే వస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టలేక తీవ్రస్థాయిలో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. పాలకులు చేస్తున్న ఈ అన్యాయాలను భరించమనడం ఏం న్యాయం? రోగికి విధిగా మంచి వైద్యం అందించడం వైద్యుని విద్యుక్తధర్మం. రోగికి వైద్యం తెలియక పోయినా తను అనుభవిస్తున్న రోగ లక్షణాలను చెప్పగలడు. రోగికి బాధను చెప్పుకునే అవకాశమిచ్చి రోగ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించిన వైద్యుడే రోగానికి తగిన మందు ఇవ్వగలడు. లేకుంటే ఆ వైద్యుని చికిత్స సత్ఫలితాన్ని ఇవ్వదు. కానీ వైద్యుడు రోగిని నిర్లక్ష్యం చేసినా రోగి ప్రాణాలతో చెలగాటమాడినా రోగి భరించాలనడం న్యాయం కాదు.''నీకు నచ్చని, నీకు ఇచ్చగించని పనిని ప్రభుత్వం నీచేత చేయించాలనుకొన్నప్పుడు నిర్భయంగా నువ్వు దానిని నిరోధించాలి'' అని గాంధీజీ అన్నారు. ''స్వరాజ్యం అంటే కొద్ది మంది చేతుల్లోకి అధికారం రావడం కాదు. అధికార దుర్వినియోగం జరిగినప్పుడు దానిని నిరోధించే శక్తి ప్రతి ఒక్కరికీ రావడం స్వరాజ్యం'' అని కూడా అన్నారు. పౌరుడు తాను ఎన్నుకున్న ప్రతినిధుల ద్వానా పరిపాలనను చేయించే శాసనకర్త కావాలనీ కూడా అన్నారు. అయితే పార్టీతత్వం తలకెక్కిన మన నేతలు చేస్తున్న భ్రష్ట రాజకీయాల వల్ల తమ జీవితాలు కోల్పోతున్నా ప్రజలేమీ చేయలేని దుస్థితి నేడు అంతటా నెలకొని ఉంది. దారితప్పిన నేతలను ఐదేళ్ళకోసారి తప్ప ఎప్పటికప్పుడు నియంత్రించే అవకాశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజలకు ఇవ్వలేదు. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రధానం లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే మార్గాలు వెతకాలి. ప్రజలకు తుది అధికారం కట్టబెట్టే దశగా మనం ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రజాస్వామ్యీకరించుకోవాలి.
(సెంటర్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ సొసైటీ కన్వీనర్‌, విశాఖపట్నం) 
- విఎం ఈశ్వర్‌

No comments:

Post a Comment